జగన్, అనిల్ ను రక్షించారు..!!

      అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనను ఆసరాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బొత్స తాను బ్రదర్ అనిల్ తప్పు చేస్తే రక్షించానని చెబుతున్నారని, ఆ విషయం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రిగా ఆయన బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ముఖ్యమంత్రి తాను గతంలో జగన్ ను రక్షించానని అన్నారని, అలాగే ఇప్పుడు బొత్స తాను అనిల్ ను రక్షించారని అంటారని, వీరందరిని వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాపాడారని ఆయన మద్దతుదారులు చెబుతారని, కాంగ్రెస్ లో ఇదంతా ఒక చిత్రమైన పరిస్థితి అని ఇవన్ని బయటకు రావలసిన అవసరం ఉందని రావుల వ్యాఖ్యానించారు.   అయితే ఇదిలా ఉంటే ఒక నాయకుడు ఎన్నో మంచి పనులు చేసి ప్రజాసేవకుడై స్వలాభాపేక్షకు గురికానివారు గుర్తింపు సాధించి, ఇప్పడు కష్టాలలో ఉన్నారంటే అతడిని కాపాడడానికి తోటి నాయకులు కష్టపడితే పర్వాలేదు. కాని జనం డబ్బు దోచుకొని రాజభోగాలు అనుభవించే నాయకులను కాపాడడమేంటి ఒక రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడంటే అతని వెనుక ఎన్నో అక్రమాలు ఉంటున్న ఈ రోజుల్లో ఆ రాజకీయ నాయకుడి రక్షించామని చెప్పుకోవడం ఏంటోనని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

పతనావస్థకు చేరుకొంటున్న రాష్ట్ర పరిస్థితులు

  ప్రస్తుతం రాష్ట్రం సందిగ్ధ పరిస్థితుల్లో ఉంది. తెలంగాణా అంశం, మంత్రులపై అవినీతి ఆరోపణలు, ప్రతిపక్షాల కుమ్ములాటలు, ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, బాంబు ప్రేలుళ్ళు, ధర్నాలు, ఆందోళనలు వంటివి ఒక అరాచక పరిస్థితిని సృష్టించాయి. ప్రభుత్వం రోజుకో కొత్తపధకం ప్రవేశపెడుతూ ప్రజశ్రేయస్సుకోసమే తాము పనిచేస్తున్నామని చెప్పుకొంటుంటే, ప్రతిపక్షాలు అందుకు పూర్తి విరుద్ధంగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మీడియా కూడా ఒక్కో రాజకీయ పార్టీకి నిస్సిగ్గుగా కొమ్ము కాస్తున్న కారణంగా చివరికి ప్రజలు దానిని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు కూడా తమ బాధ్యతలు మరిచి, రాష్ట్ర సంక్షేమం గాలికొదిలి వివిధ కారణాలతో ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకొంటూ కాలక్షేపం చేస్తూ, దానినే రాజకీయంగా భావిస్తున్నారు.   అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా నిర్మాణాత్మకమయిన ఆలోచనలు చేయడం ఎన్నడో మరిచిపోయాయి. ఇటువంటి ధోరణి వల్ల రాష్ట్ర పరిస్థితి నానాటికి దిగజారుతున్నపటికీ, ఎటువంటి దిద్దిబాటు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించకపోవడం దారుణం. ఏదయినా సమస్య వచ్చినప్పుడే దాని గురించి ఆలోచించవచ్చుననే నిర్లిప్తత ప్రభుత్వంలో పేర్కొంది.   ఇక తెలంగాణా అంశం పట్టుకొని రెండు ప్రాంతాలకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు తమ భాధ్యతలను నిర్వర్తించకుండా సభలు సమావేశాలు పెట్టుకొని ఒకరినొకరు దూషించుకొంటూ, డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తు కాలక్షేపం చేస్తున్నారు. తత్ఫలితంగా రాష్ట్రంలో పాలన అదుపు తప్పి అక్రమ వ్యాపారులకు, అవినీతి ఉద్యోగులకు, అధిక ధరలకు, దొంగతనాలకు, దోపిడీలకు నేడు రాష్ట్రం నిలయంగా మారింది. ఒకనాడు ఇటువంటి పరిస్థితి వెనుకబడిన బీహార్ రాష్ట్రంలో ఉండేది. కానీ ఇప్పుడు మన రాష్ట్రం కూడా ఆ స్థాయికి చేరుకొంది. ఇందుకు ప్రభుత్వాన్ని , ప్రతిపక్షాలను రెంటినీ తప్పు పట్టక తప్పదు.   అధికార, ప్రతిపక్షాల ఆశయం రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిగా ఉండాలి. కానీ, అవి నేడు కేవలం రాజకీయ చదరంగం ఆడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకోసం ప్రజలని కూడా వివిధ వర్గాలుగా విడదీసి తమ పావులుగా చేసి ఆడుకొంటున్నాయి. ప్రజలు తమకున్న ఏకైక ఆయుధం ఓటుని సక్రమంగా వినియోగించుకొని ఇటువంటి రాజకీయనేతలకి తగిన బుద్ధి చెప్పగలిగిననాడే పరిస్థితులో మార్పు మొదలవుతుంది. లేకుంటే ప్రజలు కూడా ప్రభుత్వాన్ని నిందిస్తూ భారంగా జీవితాలు వెళ్ళదీయక తప్పదు.

సీఎం కిరణ్ ది క్రమశిక్షణారాహిత్య౦

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు లీకులు ఇవ్వడం క్రమశిక్షణా రాహిత్యమని సీనియర్ మంత్రి కె. జానారెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి లీకులపై కాంగ్రెసు అధిష్టానానికి సమాచారం ఉందని ఆయన అన్నారు. మీడియాకు తప్పుడు సమాచారం ఇవ్వడం సరి కాదని ఆయన అన్నారు. ఆయన తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, వి హనుమంతరావుతో శనివారంనాడు సమావేశమయ్యారు.   ఎవరెన్ని చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటేనే నక్సలిజం పెరుగుతుందని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి లీకులు ఇవ్వడం అధిష్టానం దృష్టికి వెళ్లిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేదంటే మూడుగా విభజించాలని రాయలసీమ ప్రాంతానికి చెందిన రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.

అవనిగడ్డ తెదేపా అభ్యర్ధి శ్రీహరిబాబు

  తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ అయిన అవనిగడ్డ నియోజకవర్గానికి, ఆయన కుమారుడయిన అంబటి హరిబాబుని తెదేపా అభ్యర్ధిగా నిలిపి, ఆయన ఏకగ్రీవ ఎన్నిక కోసం తెదేపా నేతలు కృషిచేస్తున్నట్లు సమాచారం.   అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంత అకస్మాత్తుగా ఇటువంటి నిర్ణయం ప్రకటించడం పట్ల రాష్ట్రంలో అన్నిరాజకీయ పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేసాయి. ఎందుకంటే, జూన్ 8న కాంగ్రెస్, తెదేపాలకు చెందిన 15మంది శాసనసభ్యులపై అనర్హత వేటుపడినప్పుడు, ఆయా నియోజక వర్గాలలో ఉపఎన్నికలు నిర్వహించవలసి ఉన్నపటికీ, సాధారణ ఎన్నికలకి ఏడాదికంటే తక్కువ సమయం మిగిలి ఉన్నందున, ఇప్పుడు ఉపఎన్నికలు నిర్వహించవలసిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ స్థానాలను కూడా వచ్చేసాధారణ ఎన్నికలతో బాటు కలిపి నిర్వహిస్తామని చెప్పడం జరిగింది.   కానీ, ఏప్రిల్ 21న బ్రాహ్మణయ్య మరణంతో ఖాళీ అయిన అవనిగడ్డకి మాత్రం ఏడాదికంటే ఎక్కువే సమయం మిగిలి ఉన్నందున ఉపఎన్నికలు నిర్వహించుతున్నామని ఎన్నికల సంఘం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.   బ్రాహ్మణయ్య ఏప్రిల్21న మరణించగా,15మంది శాసనసభ్యులపై జూన్ 8న అనర్హత వేటు పడింది. అంటే కేవలం 17రోజుల తేడా మాత్రమే ఉంది. అయినప్పటికీ, సాంకేతిక అంశాల, నియమ నిబంధనల పేరిట కేవలం అవనిగడ్డకి మాత్రమే ఉపఎన్నికలు నిర్వహిస్తూ, మిగిలిన 15 నియోజక వర్గాలకు నిర్వహించకపోవడాన్నిరాజకీయపార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా 15 స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే, తన సత్తా చాటుకొందామని ఆశపడిన వైకాపా ఎన్నికల సంఘం నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురయింది.   కానీ తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ప్రస్తుత పరిస్థితుల్లో 15 స్థానాలకు ఉపఎన్నికలు కోరుకోవడం లేదు గనుక ఎన్నికల సంఘం నిర్నయంపట్ల ఎవరూ అభ్యంతరాలు చెప్పకపోవచ్చును. ఈనెల 27 న నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 21 న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

అవనిగడ్డలో ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్

      కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. వచ్చే నెల 21న పోలింగ్ కాగా 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 3వ తేదీ చివరి గడువు. వచ్చే నెల 5న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 7వ తేదీ తుది గడువుగా సిఇసి ప్రకటించింది. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బ్రాహ్మణయ్య మృతి చెందిన తేదీకి ఎన్నికలు సంవత్సరానికి పైగా ఉండడం వల్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిబాబును పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. ఆయన ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేయాలని అనుకుంటోంది.

మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కన్నుమూత

      మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు శనివారం ఉదయం కన్నుమూశారు. పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో తన కుమార్తెకు మద్దుతుగా ప్రచారం కోసం పశ్చిమగోదావరి జిల్లా కామవరపు కోట మండలం తూర్పుఎడమపల్లి వచ్చేందుకు ఆయన కారు ఎక్కుతూ గుండె పోటుతో హఠతన్మరణం చెందారు. టిడిపి పార్టీలో చేరిన విద్యాధరరావు పదేళ్లపాటు పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పారు. కొద్దికాలం ఎపిఐఐసి ఛైర్మన్ గా పనిచేశారు.   తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1989-94 మద్య చంద్రబాబు నాయుడుతో కలిసి కాంగ్రెస్ పార్టీపై శాసనసభలో తీవ్ర స్థాయిలో చెలరేగేవారు.1994లో ఎన్.టి ఆర్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండేవారు. తర్వాత తెలుగుదేశం తిరుగుబాటులో విద్యాధరరావు కీలక భూమిక పోషించారు. తదనంతరం చంద్రబాబు క్యాబినెట్ లో భారీ పరిశ్రమలు, పంచాయతీ రాజ్ వంటి శాఖలను ఆయన నిర్వహించారు.రెండువేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి పార్టీ నేత చిరంజీవికి సన్నిహితుడుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం కావడంతో ప్రస్తుతం ఆయన పీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు.

షర్మిలపై రాయి విసరబోతే...

  గౌరవప్రధమయిన పీసీసీ అధ్యక్షపదవిలో బొత్ససత్యనారాయణ వంటి ఒక ‘లిక్కర్ మాఫియా డాన్’ న్ని కాంగ్రెస్ కూర్చోబెట్టిందని షర్మిల విసిరిన బాణం సూటిగా బొత్స గుండెల్లో గుచ్చుకొంది. ఆ దెబ్బకి ఆయన విలవిలలాడేరు. ఆమె చేసిన ఆరోపణలని ఖండించడమో లేకపోతే వాటిని నిరూపించమనో సవాలు విసిరితే పోయేదానికి, ఆయన నేరకపోయి షర్మిల భర్తను ఒక కేసు నుండి తానే కాపాడానని చెప్పడంతో, ఇప్పుడు మరో కొత్త సమస్యలో ఇరుకొన్నాడు పాపం. వైయస్సార్ కుటుంబం అంటే మొదటి నుంచి గిట్టని వీ.హనుమంత రావు, బొత్స బాబుకి వంత పాడుతూ, “వైయస్సార్ కుటుంబం గురించి ఆయనకి ఇంకా చాలా చాలా రహస్యాలు తెలుసు. ఇప్పుడు ఆయన వదిలింది కేవలం చిన్న శాంపిల్ బాణమే. అటువంటివి ఆయన దగ్గర చాలానే ఉన్నాయి” అని సగర్వంగా ప్రకటించడంతో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులోకి లాగబడింది.   తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీల మధ్య అనైతిక రహస్య ఒప్పందాలున్నాయని మొదటి నుండి ఆరోపిస్తున్న తెదేపా, మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు, వారి మాటలను పట్టుకొని, “ఆయన బ్రదర్ అనిల్ కుమార్ ను ఏ కేసు నుండి కాపాడారు? అనిల్ కుమార్ ఏ నేరం చేసాడు? నేరం చేసిన వాడిని ఆయన ఎందుకు కాపాడవలసి వచ్చింది? అసలు వైయస్సార్ గురించి బొత్సకు, హనుమంత రావుకి తెలిసిన రహస్యలేమిటి?” అవన్నీ వెంటనే బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి.   కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లుందీ వ్యవహారం. షర్మిలకు ఘాటుగా జవాబీయబోయిన బొత్సబాబు ఆ ఆత్రంలో తన పార్టీని కూడా మద్యలో ఇరికిస్తే, ఏదో ఉడతా భక్తిగా తనూ ఓ చేయేద్దామనుకొన్న హనుమంతన్నకాంగ్రెస్ పార్టీని ఫిక్స్ చేసేసారు. అయితే ఇటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇరుక్కోవడాలు అన్ని కాంగ్రెస్ లో కామనే. రెండు రోజులు పోతే, మరో కొత్త టాపిక్ వస్తే అంతా దీనిని మరిచిపోతారు.

మృగాళ్ళ ముందు చట్టాలు కూడా చట్టుబండలే

  గతేడాది డిశంబర్ లో డిల్లీలో ఒక యువతిపై జరిగిన అత్యాచారంలో పట్టుబడిన నిందితులను వీలయినంత త్వరగా కటినంగా శిక్షిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ పెద్దలందరూ, ఆందోళన చేస్తున్న ప్రజలకి వాగ్దానం చేసారు. ఆ తరువాత అత్యాచార నిరోధించడానికి ఒక బిల్లు పాస్ చేసారు. ఈ కేసులో త్వరితంగా విచారణ పూర్తిచేసి దోషులకు శిక్షలు వేసేందుకు ప్రత్యేకకోర్టు కూడా నెలకొల్పారు. కేసు విచారణ మొదలయింది. కాగా ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.   కేసు మొదలుపెట్టినప్పుడు ఇది చాల సాధారణమయిన కేసని, విచారణ కేవలం ఒకటి రెండు నెలలో ముగిసి, దోషులకు శిక్షలు పడటం ఖాయమని న్యాయ నిపుణులు ముక్త కంఠంతో చెప్పారు. కానీ ఇంత కాలమయినా అది కొలిక్కి రాలేదు, ఏ ఒక్క దోషి కూడా శిక్షింపబడలేదు. తత్ఫలితంగా ఇటువంటి నేరాలు దేశంలో మరింత పెరిగిపోయాయి.   అత్యంత హేయమయిన ఇటువంటి సంఘటనలు నేటికీ ఇంకా జరుగుతున్నాయంటే అందుకు కారణం చట్టం తమనేమి చేయలేదనే నమ్మకమే. ఇటువంటి నేరాలకి పాల్పడినవారు చట్టంలో లొసుగులను అడ్డంపెట్టుకొని కేసులు ముందుకు కదలకుండా చేయగలుగుతున్నారు. డిల్లీలో సామూహిక అత్యాచారంలో ప్రధమ ముద్దాయిగా పేర్కొనబడుతున్న బాలనేరస్తుడు తరపున వాదిస్తున్న లాయర్, తన క్లయింటు నేరం చేసినట్లు అసలు ఎటువంటి ఆధారాలు లేవని వాదిస్తున్నాడు. మిగిలిన నేరస్తులు కూడా దాదాపు అదే విధంగావాదిస్తున్నట్లు సమాచారం.   బాలనేరస్తుడిపై ప్రధానంగా ఎదుర్కొంటున్న అత్యాచార ఆరోపణలతో బాటు, ఒక కార్పెంటర్ ని దోపిడీ చేసిన కేసు కూడా నమోదయింది. ఈ రెండు కేసులపై బోర్డు ఈనెల 25న తన తుది తీర్పు వెలువరించబోతోంది. కానీ , బాలనేరస్థులకు కేవలం మూడున్నర సం.ల కంటే ఎక్కువ జైలు శిక్ష విదించే అవకాశం లేకపోవడంతో, అంత హేయమయిన నేరానికి పాల్పడినప్పటికీ అతను ఒక చిన్న శిక్షతో తప్పించుకొనే అవకాశం ఏర్పడింది.   సమాజంలో వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా చట్టాలు రూపొందించకొనకపోతే తీర్పులు, సమాజంలో నేరాలు ఇదే విధంగా ఉంటాయి.

మళ్ళీ తెలంగాణపై కొత్త రాగాలు

  రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, హోంమంత్రి షిండే ఇద్దరూ తెలంగాణపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని ఎంత గట్టిగా చెపుతున్నాకూడా మీడియాలో మాత్రం రోజుకో కధనం వండి వడ్డించబడుతూనే ఉంది.   ఈ రోజు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఇక తెలంగాణా వచ్చేసినట్లే అంతా ఖాయమయి పోయింది’ అంటూ తెలంగాణావాదులకు మంచి కమ్మటి వార్త అందిస్తే, మరో పత్రిక ‘వర్కింగ్ కమిటీ తరువాత అఖిలపక్ష సమావేశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2వ యసార్సీ గురించి కూడా ఆలోచిస్తోంది’ అంటూ ఒక వార్త మోసుకు వచ్చింది. మరి ఈ విధంగా రకరకాల వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఎవరు ఇటువంటి కబుర్లు వారికి అందజేస్తున్నారు? అసలు వాటిలో నిజమెంత అబద్దమెంత? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.   మీడియాలో నిత్యం వండి వడ్డించే ఇటువంటి వార్తల వలన ప్రజలలో ఆందోళన మరింత పెరుగుతుంది. గనుకనే దిగ్విజయ్ సింగ్, షిండే ఇద్దరూ కూడా పదేపదే రాష్ట్ర విభజన అంశంపై ప్రకటనలు చేయక తప్పడం లేదు.   మరి ఈ వార్తలపై వెంటనే స్పందించకపోతే ఏమి జరుగుతుంది అందరికీ తెలిసిందే గనుక కాంగ్రెస్ నేత అహ్మద్‌పటేల్ మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణపై మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించే ప్రసక్తి లేదు. అవన్నీ ఒట్టి వదంతులే”నని తేల్చిపారేసారు. అందువల్ల ప్రజలు కూడా త్వరలో జరుగబోయే వర్కింగ్ కమిటీ కోసమే ఓపికగా ఎదురుచూడటం మంచిది.

ముగిసిన కోర్ కమిటీ భేటి

      ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ నివాసంలో సాయంత్రం జరిగిన కోర్ కమిటీ ముగిసింది. ప్రత్యేక తెలంగాణ సమస్యపై సిడబ్ల్యూసీ సమావేశం త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్య సంతరించుకుంది. తెలంగాణ సమస్య పరిష్కారంపై మంతనాలు జరిపారు. రెండో ఎస్సార్సీయా లేక అఖిలపక్షమా అన్న దానిపై చర్చలు జరిపారు. అలాగే యుపీఏ భాగస్వామ్య పార్టీలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి యుపిఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్‌నాథ్, అహ్మద్ పటేల్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ అంశంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌కూడా మహారాష్ట్రలో ఈరోజు మధ్యాహ్నాం ఓ ప్రటకన చేశారు. తెలంగాణ విషయంలో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి అయిందని, అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని త్వరలో ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు.

భారతరత్నకు సచిన్ కాదని ధ్యాన్‌చంద్

      భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు నిరాశే ఎదురైంది. క్రీడా మంత్రిత్వ శాఖ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి క్రికెట్ దిగ్దజం సచిన్ టెండూల్కర్ పేరును కాదని ధ్యాన్ చంద్ పేరును సిఫార్సు చేసింది. ధ్యాన్ చంద్ మరణించిన 25 ఏళ్ల తర్వాత ఆయన పేరును భారత రత్న అవార్డుకు సిఫార్సు చేశారు. క్రీడారంగం నుంచి దేశంలో భారతరత్నకు సిఫార్సు అయిన మొదటి పేరు ధ్యాన్ చంద్‌దే కావడం విశేషం.   సచిన్ టెండూల్కర్ పేరును కాదని ధ్యాన్ చంద్ పేరును సిఫార్సు చేయడాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ సమర్ధించుకుంది. సచిన్ పట్ల తమకు గౌరవం ఉందని, కాని ధ్యాన్ చంద్ దేశ క్రీడాచరిత్రలో ఉత్తమ స్థానంలో ఉండదగినవారని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీప్ దేవ్ అన్నారు. ప్రధాని కార్యాలయానికి ఒక్క పేరును మాత్రమే సిఫార్సు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ధ్యాన్ చంద్ 1928, 1932, 1936 సంవత్సరాల్లో వరుసగా ఒలింపిక్స్‌లో భారతదేశానికి హాకీలో స్వర్ణపతకాలు సాధించి పెట్టాడు. భారత హాకీ చరిత్రకు ఇది చాలా గర్వకారణమని, ధ్యాన్ చంద్‌కు ఈ అవార్డు వస్తుందని తాము ఆశిస్తున్నామని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రా అన్నారు.  

అక్బరుద్దీన్ కు హైకోర్టులో ఊరట

      హిందువులు, హిందూ దేవతల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసికి హైకోర్టులో ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేయవద్దని అక్బరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు కోర్టు దానిపై తీర్పు ఇచ్చింది. ఒక నేరానికి సంబంధించి వేర్వేరుగా ఎప్ఐఆర్‌లు దాఖలైనా, ఒకే సంస్థ దర్యాఫ్తు చేస్తుందని న్యాయస్థానం తెలిపింది. కేసులన్నీ ఒకటిగా చేసి సిఐడితో విచారణ జరిపించాలని ఆదేశించింది.   అక్బరుద్దీన్ ఓవైసీ అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకుగాను గత జనవరిలో అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను కొన్నాళ్లు జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటి నుండి పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో పలువురు అక్బరుద్దీన్ పైన ఫిర్యాదు చేశారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు.

కాంగ్రెస్ లో కన్ ఫ్యూజన్

  ఏనుగు చచ్చినా బ్రతికినా దాని విలువ ఒక్కటే నన్నట్లు, కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన రాజశేఖర్ రెడ్డి చనిపోయి చాలా కాలం అయినప్పటికీ ఆయనని తలుచుకొని కాంగ్రేసోడు లేడు. కొందరు “ఆయనంత మంచోడు ఈ భూప్రపంచం మీదనే పుట్టలేదు, మరి పుట్టడు కూడా!” అని వాదిస్తుంటే, “నిజమే అటువంటి అవినీతిపరుడు పుట్టలేదు. ఇక ముందు కూడా పుట్టబోడు” అని వారినే సమర్దిస్తూ అడ్డుగా వాదిస్తుంటారు. మళ్ళీ చూస్తే అందరూ కాంగ్రెసోళ్ళే! ఇంతకీ ఆయనని వదిలించుకోవాలో లేక ఇంకా భుజానికెత్తుకొని తిరగాలో తెలియక పాపం! నేటికీ ఇంకా తికమకపడుతూ డిల్లీ వైపు చూస్తుంటారు ఆదేశాలకోసం. “ఆయన చాలా మంచివాడని” “వాళ్ళది మనదీ డీ.యన్.యే. సేంసేం” అని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ అంతటివాడు చెప్పినా కూడా ఈ కాంగ్రెస్సోళ్ళకు కనఫ్యుస్ పోలేదు.   పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబు “ఆయన (రాజశేఖర్ రెడ్డి) పెద్దమందు బాబు గొంతు తడపుకోనిదే పాపం! ఆయనకి నిద్రపట్టదని” శలవిస్తుంటే, “ఓస్! అందులో తప్పేముంది? నేను కూడా ఓ పెగ్గు వేస్తుంటానని” గండ్ర నిలకడగా నిలబడి మరీ చెప్పారు. “అసలు బొత్స చెప్పింది ఆవగింజలో అరవయ్యో వంతే, వైయస్సార్ జాతక చక్రమంత ఔపోసన పట్టిన ఘనాపాటి మా బొత్స బాబు. ఆయన నోరు విప్పితే వైయస్ కుటుంబం మరిక చుట్టుపక్కల కనబడకుండా పారిపోకతప్పదు. అయినా రాజశేఖర్ రెడ్డి అదృష్టం బాగుంది గాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మా అదృష్టం బాగోలేదు గాబట్టి మేము కాలేకపోయాము” అని హనుమంతన్న బరువుగా నిట్టూర్చారు.   ఇక ఉండవల్లి “పాపం పెద్దాయన చాలా అమాయకుడు. వెనుక నుండి కొడుకు నొక్కేస్తుంటే సరిగ్గా చూసుకోలేకపోయాడు. ఆయన మహా నిఖార్సయిన మనిషి, కానీ కొడుకే ప్చ్!” అని బాధపడ్డారు. “వాళ్లిద్దరూ కూడా ఒక గూటి చిలుకలే కదా! మరి అందుకే ఆయన అలా పలుకుతారు. రాజశేఖర్ రెడ్డి గురించి మమ్మల్ని అడగండి, ఆయన మా తెలంగాణా నీళ్ళని, గనులని, భూములని, ఎట్లా దోచుకోన్నాడో చెపుతాము” అని టీ-కాంగ్రెస్ నేతలు గర్జిస్తున్నారు. ఇంతకీ ఈ కాంగ్రెస్సోళ్ళకు ఈ  కన్ ఫ్యూజన్  ఎప్పుడుపోతుందో? అసలు పోతుందో లేదో కూడా తెలియదు.

ఉండవల్లి ఓ ఊసరవెల్లి

      రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌ తెలంగాణపై మరోసారి విషం చిమ్ముతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు మండిపడ్డారు. విశాఖ వెనుకబడిందని ఆయన చెబుతున్నారని కానీ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో విశాఖ ఉందన్నారు. 1972లోనే విభజన జరిగితే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందేవన్నారు.   విభజన ద్వారా తెలంగాణే కాకుండా సీమాంధ్ర కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణపై విస్తృత చర్చ జరగాలని ఉండవల్లి అంటున్నారని, అరవై ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉందని, ఎప్పుడు చర్చ జరగలేదో చెప్పాలన్నారు. విభజన జరగకపోవడం వల్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు యాభై ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. ఉండవల్లి అనవసర రాద్ధాంతం చేయవద్దన్నారు. ఉండవల్లి సమైక్యవాది కాదు, వేర్పాటువాది కాదని, అవకాశవాది అన్నారు. ఒకవేళ విశాఖ అభివృద్ధి చెందలేదంటే అది సీమాంధ్ర నేతల వల్లే అన్నారు. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని మండిపడ్డారు. 1973లో సినీ హీరోలు కృష్ణ, కృష్ణం రాజులు కూడా విభజననే కోరుకున్నారన్నారు.

బొత్స దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి

        దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చాలా తెలుసునని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత్‌రావు పేర్కొన్నారు. బొత్స ప్రస్తుతం ఒక్క బాణం మాత్రమే వదిలారని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నారు. వైఎస్ కష్టంతో ప్రభుత్వం ఏర్పడిందనడం సరికాదని అన్నారు. అలాగైతే 2009లో 156 సీట్లే ఎందుకు వచ్చాయని వీహెచ్ ప్రశ్నించారు. తన అన్న పులి బోనులో ఉన్నాడని, బయటకు వస్తారని, రామరాజ్యం తెస్తారని షర్మిల ప్రచారం చేస్తున్నారు. ప్రజలను చంపుకు తినే పులి జైలులోనే ఉంటే మంచిదని వీహెచ్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకు వస్తే రాష్ట్రాన్ని దోచేస్తాడని వీహెచ్ అన్నారు. ఏమీ లేనప్పుడే రాష్ట్రాన్ని దోచుకున్నాడు, ఇప్పుడు బయటకు వస్తే అందరినీ తినేస్తాడని వీహెచ్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకు వస్తే రామరాజ్యం అయితే తాను చూడలేనని, ఏం జరుగుతుందో మాత్రం రాష్ట్ర ప్రజలకు తెలుసునని హనుమంతరావు పేర్కొన్నారు.

వైయస్ హయాంలో ఉద్యమంలా ఫీజు పథకం

      వైయస్ హయాంలో ఉద్యమంలా ఫీజు పథకం ఉండేదని, అదో విప్లవమని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మండిపడ్డారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి విద్యార్థి చదువుకు భరోసా ఇచ్చారని, వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా చెల్లించారని అన్నారు.ఆయన చనిపోయాక అసలు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులకు చెల్లించే ఫీజు ఎగ్గొట్టటానికి సర్కారే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.కళాశాలల యాజమాన్యాలు వేధింపుల వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. అందుకే తాము ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ దీక్షలకు ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.  సమస్యలకు జవాబు చెప్పలేని ప్రభుత్వం, ప్రజలకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోందని విమర్శించారు.  

పదవీ విరమణకు ముందు భంగపడిన చీఫ్ జస్టిస్ కబీర్

పలు సంచలనాత్మకమయిన తీర్పులు వెలువరించి భారత న్యాయ వ్యవస్థకే వన్నెతెచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ పీ.సదాశివం ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్ది వారల క్రిందటే ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.   ఆయన రెండు వారల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ తనతో సహా హెచ్.యల్.దత్తు, ఆర్.యం.లోదా, పీ.సదాశివం, జీ.యస్.సంగ్వీలతో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కలేజియంను హాజరుపరచి, ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న ఒకరిని సుప్రీంకోర్టు జడ్జీగా నియమించాలని కోరారు.అయితే అప్పటికీ, రాష్ట్రపతి పీ.సదాశివంను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో, వారు అల్తమాస్ కబీర్ కోరికను సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ ఆయన నలుగురు సభ్యులని తన ప్రతిపాదనపై విడివిడిగా అభిప్రాయలు తెలుపవలసినదిగా కోరడంతో వారు నిర్ద్వందంగా అయన ప్రతిపాదన తిరస్కరించారు. త్వరలో పదవీ విరమణ చేయబోతున్న ఆయన అటువంటి కోరిక కోరడం అనుచితమని, చట్టవిరుద్దమని వారు తేల్చి చెప్పడంతో వారిపట్ల అల్తమాస్ కబీర్ ఆగ్రహంతో ఉన్నారు.   ఏదిఎమయినప్పటికీ, అత్యంత హుందాగా, సమర్ధంగా తన పదవీ బాధ్యతలను నిర్వర్తించిన ఆయనకి కొద్ది రోజులలో పదవీ విరమణ చేయనున్న తరుణంలో ఇటువంటి కోరిక కోరడం వలన భంగపాటు తప్పలేదు. కానీ, అది చంద్రునికి మచ్చవంటిదే.

వైఎస్, బొత్సల గుట్టు బయటపడింది

      దివంగత వైఎస్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలపై టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వైఎస్ బతికున్న రోజుల్లో ఒకరి తప్పును మరొకరు కాపాడుకుంటూ వచ్చారని, ఇప్పుడు బొత్స విమర్శలతో అసలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విభేదాలు చోటుచేసుకోనంతవరకూ వైఎస్, బొత్స చేసిన అక్రమాలు, దోపిడీల్లో ఇరుకుటుంబాలూ భాగస్వాములయ్యాయని ఆరోపించారు. వైఎస్ అల్లుడు అనిల్ చేసిన తప్పులు, దోపిడీల గురించి ఇప్పటికైనా వెల్లడించాలని బొత్సను.. తన తప్పులు, అక్రమాలను బొత్స ఎలా కప్పిపుచ్చారో చెప్పాలని అనిల్‌ను డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రాన్ని మరెంతగా దోపిడీ చేసేవారోనని ఆందోళన వ్యక్తం చేశారు. బయ్యారం గనులను వైఎస్ తన అల్లుడు అనిల్‌కు కట్టబెట్టినప్పుడు బొత్సకు మాట ఎందుకు పెగల్లేదని నిలదీశారు.

కాంగ్రెస్ గోత్రాలు కాంగ్రెస్ వాళ్ళకే ఎరుక

  గొర్రెల గోత్రాలు కాపరుల కెరుక, గొప్ప వాళ్ళ గోత్రాలు ఇంట్లో పని మనుషులకు కెరుక అన్నట్లు, కాంగ్రెస్ గోత్రాలు కాంగ్రెస్ వారికి తెలిసినంత బాగా మరొకరికి తెలిసే అవకాశం లేదని వారు అప్పుడప్పుడు నిరూపిస్తుంటారు. వాళ్ళు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకొంటున్నపుడు అవి విని ఆశ్చర్యపోవడం ప్రజలవంతవుతుంది. మొన్నబొత్స బాబుగారి విజయనగర సామ్రాజ్యంలో అడుగుపెట్టిన షర్మిల, ఆయనని ‘గుమ్మడి కాయలదొంగ’ అని ఉంటే ఈ కధ అంతా బయటకి వచ్చేదే కాదు. కానీ, ఆమె నేరుగా ఆయనకి ‘లిక్కర్ మాఫియా డాన్’ అనే బిరుదు ప్రకటించేయడంతో, ఆయన కంగు తిన్నారు.   ఇదివరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా ఒకసారి ఏసీబీ అధికారులని తనపైకి ఇలాగే ‘ఉస్కోఉస్కో..’అని పంపిస్తే, అందులోంచి బయటపడేందుకు తలప్రాణం తోక్కకి వచ్చినంత పనయింది. అందువల్ల ఇప్పుడు ఇంకా భుజాలు తడుముకొంటూ కూర్చొంటే దెబ్బయిపోతామని భావించిన బొత్సబాబు వెంటనే తన దగ్గర ఉన్న వైయస్ కుటుంబ జాతక చక్రం బయటకి తీసి అందులోఉన్నకొన్ని వివరాలను గడగడా చదివి వినిపించేసరికి జనాలు ఔరా! అని నోటి మీద వెళ్ళేసుకోక తప్పలేదు.   రాష్ట్రానికి దైవపాలన అందజేసిన వైయస్ రోజూ ఒక పెగ్గు బిగిస్తే గానీ మంచం ఎక్కేవారు కాదని ఆయన ప్రజలకి తెలియజేసారు. అయితే, ఈ రోజుల్లో ఇదంతా కామన్ అంటూ, అదేమంత గొప్ప పట్టించుకోవలసిన విషయం కాదని జనాలు కొట్టి పడేస్తారనుకొన్నారో ఏమో గానీ, ఆయన మరో గొప్ప రహస్యం కూడా బయటపెట్టారు. తన అద్భుతమయిన మహత్తులతో ప్రజలందరినీ కాపాడిపడేస్తున్న అనిల్ ఏదో కేసులో ఇర్రుకొంటే సతీసావిత్రిలా నా భర్తని కాపాడమని ఆ రోజు నువ్వు నా చుట్టూ తిరిగిన రోజులు గుర్తులేవా? అంటూ ప్రశ్నించడంతో రాష్ట్ర ప్రజలు “ఔరా! వీళ్ళ మధ్య ఇంత మంచి అండర్ స్టాండింగ్ ఉందా?” అనుకొంటూ ఆశ్చర్యపోయారు మరోసారి.   “పాపం చిన్నపిల్ల షర్మిల ఏదో ముచ్చటపడి ఆయనకి చిన్న బిరుదు ఇస్తే దానికే ఇంతగా ఆవేశపడిపోవాలా?” అని రాజకీయ నేతలందరూ ముసిముసినవ్వులు నవ్వుకొంటుంటే, అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకే మండిందన్నట్లు, బొత్స మరింత ఆవేశపడిపోతూ “అసలు విజయమ్మ ఫీజుపోరు దీక్ష అంతా దొంగ దీక్ష, ఆమె కార్పోరేట్ కాలేజీలకి మద్దతుగా వారికి లాభాలు తెచ్చిపెట్టేందుకు ఇప్పుడు సిట్టింగ్ వేసారు,” అంటూ పాపం దీక్షలో ఉన్న విజయమ్మనుకూడా అదే నోటితో ఏకిపారేశారాయన.   దీని వల్ల పామర జనాలకి అర్ధమయింది ఏమిటంటే సీబీఐ, ఏసీబీ,సీఐడీ మొదలయిన గూడచారి సంస్థలన్నీకలిసిగట్టుగా శోధించినా కనిపెట్టలేని ఇటువంటి బ్రహ్మ రహస్యాలను కేవలం కాంగ్రెస్ వాళ్ళు తలచుకొంటేనే బయటపడతాయి, లేకుంటే అవి వాళ్ళు ధరిస్తున్న టోపీల క్రిందనే శాశ్వితంగా పడిఉంటాయని, అప్పుడు వారందరూ కూడా వారు ధరించి తిరుగుతున్నతెల్ల ఖద్దరు చొక్కాలంత స్వచ్చంగా కనిపిస్తారని జ్ఞానోదయం కలిగింది.   ప్రజలు కూడా “హాట్స్ ఆఫ్ టూ కాంగ్రెస్” అనుకొన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం “వద్దులే! ఆ హ్యాట్స్ తీస్తే మీరు తట్టుకోలేరని నెత్తిమీద ఖద్దరు టోపీలను సర్దుకొన్నారు.