బీహార్‌లో శవరాజకీయాలు

      చాప్రా జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి 27 మంది చిన్నారులు చనిపోయిన ఘటనను కూడా రాజకీయం చేస్తున్నాయి ఆ రాష్ట్ర పార్టీలు..బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బీహార్‌ విద్యాశాఖ మంత్రి పీకే షాహి ఘటనలో కుట్ర ఉందని ఆరోపించారు. సర్కారు మీద ఎలాంటి ఆరోపణలు రాకుండా తప్పంతా ప్రిన్స్‌ పాల్‌దే అని తేల్చేశారు.. వంటనూనె కల్తీవల్లే దుర్ఘటన జరిగిందని... వంట నూనెలో ఆర్గానిక్‌ పాస్ఫరస్‌ కలిసినట్లు వైద్యులు ధృవీకరించారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌ మీనాకుమారి దృష్టికి తీసుకెళ్లినా ఆమె నిర్లక్షం వహించింది అని చెప్పారు. ఈ క్రమంలో మంత్రి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఖండించింది. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర సర్కారు ఇలాంటి ఆరోపణలు చేస్తుందని విమర్శించింది.. ప్రభుత్వ అసమర్థతే దుర్ఘటనకు కారణమని ఆరోపించింది. బాధితులు సైతం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పాఠశాల యాజమాన్యం సక్రమంగా పనిచేస్తే ఘోరం జరిగేది కాదని మండిపడ్డారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్  చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం నితీశ్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్  చేశారు.చాప్రా కలెక్టర్  నివాసం ముందు ఆందోళనకు దిగారు. అటు చాప్రా ఘటన నుంచి తేరుకోకముందే.. బీహార్‌లో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. మధుబని జిల్లాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 22 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. భోజనంలో బల్లి పడటంవల్లే ఘటన జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.

సీఎం కిరణ్‌ చిన్నపిల్లాడు

      కోర్‌ కమిటీలో తెలంగాణ విషయమై కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇచ్చిన రోడ్‌మ్యాప్‌ పై టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్యాకేజి ఇవ్వాలన్న సీఎం మాటలతోనే తెలంగాణ వెనుకపడిందన్న విషయం ప్రభుత్వం అంగీకరించిందన్నారు ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌ కేశవరావు.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నక్సల్స్‌ సమస్య వస్తుందనటం సియం అజ్ఞానం అన్నారు..   రాష్ట్రన్ని విడదీస్తే జలవివాదాలు వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటలు చిన్నపిల్లాడిలా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు కేకే. తెలంగాణ ఉద్యమం ప్యాకేజీలు సాదించటానికి కాదని స్వరాష్ట్ర సాదించే వారకు ఉద్యమాన్ని కోనసాగిస్తామన్నారు.. సియం తెలంగాణకు వ్యతిరేకంగా రోడ్‌మ్యాప్‌ ఇచ్చినప్పటికీ నోరు మెదపని టికాంగ్రెస్‌ నేతలపై కూడా కేకె విరుచుపడ్డారు.. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు సియం ఎందుకు నిలదీయటం లేదంటూ ప్రశ్నించారు.. తెలంగాణ పై కాంగ్రెస్‌కి ముందునుంచి సానుకూల వైఖరి లేదని... కాంగ్రెస్‌కు ప్రత్యేకరాష్ట్ర అంశాన్ని తేల్చే ఉద్దేశం లేదన్నారు.

మోడీ స్టేట్‌మెంట్స్‌పై బిజెపిలో దుమారం

      గోద్రా అల్లర్లపై మోడీ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రుపుతూనే ఉన్నాయి.. మోడీ వ్యాఖ్యలను సమర్థించినందుకు బీఎస్పీ ఎంపీపై ఆ పార్టీ వేటు వేసింది. గోద్రా అల్లర్లకు సంబంధించి మోడీ చేసిన కుక్కపిల్ల వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని... కావాలనే ఆయన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని బీఎస్పీకి చెందిన ఎంపీ విజయ్‌ బహదూర్‌సింగ్‌ మీడియాకు తెలిపారు. అయితే తన ప్రత్యర్ధికి సపోర్ట్‌ చేయటం పై మాయావతి తీవ్రంగా స్పందించింది.. విజయ్‌ కామెంట్‌లను ఆమే తీవ్రంగా పరిగణించింది. అంతేకాదు మరెవరు అలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇవ్వకుండా విజయ్‌ బహుదూర్‌ సింగ్‌ను  పార్టీ నుంచే సస్పెండ్‌ చేసేసింది. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంభందం లేదని బహిరంగ ప్రకటన విడుదల చేసింది. మొదదటి నుంచి బీఎస్పీ మొదటి నుంచి మోడీని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మోడీని సమర్థిస్తే పార్టీ ఇమేజ్‌ దెబ్బతింటుందని భావించిన మాయావతి.. ఎలాంటి వివరణ తీసుకోకుండానే ఎంపీ విజయ్‌ బహదూర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇదిలా ఉంటే మోడికి సొంతం పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది.. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీ బిజెపి ఉపాధ్యక్షుడు ఆమీర్‌ రాజా హుస్సేన్‌ పార్టీకి రాజీనామా చేశారు.. పైగా 2002 గోద్రా అల్లర్ల పాపం నుంచి మోడీ తప్పించుకోలేరని విమర్శించారు.

తెలంగాణాలో వైకాపా సెల్ఫ్ గోల్

  అన్ని పార్టీలు తెలంగాణా అంశంపై అనర్గళంగా మాట్లాడుతుంటే, తాము మాత్రం ఇంత కాలం ఈ అంశంపై మాట్లాడకుండా ఉండి రాజకీయంగా నష్టపోయామనే ఆలోచన రావడం వలననో, లేక కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న రాయల తెలంగాణా ఆలోచన వద్దని హెచ్చరించాలనే ఆలోచనో మరి తెలియదు కానీ వైకాపా తెలంగాణా అంశంపై కాంగ్రెస్ ఒంట్టెత్తు పోకడలకు పోతోందని విమర్శిస్తూ ఒక లేఖ వ్రాసింది. అయితే అది కాస్తా ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయబోయి చివరికి పేడలో కాలు వేసినట్లయింది.   ఇంత కాలం తెలంగాణా అంశంపై ఏమి మాట్లాడితే ఏమవుతుందో అనే భయంతో నోరుమెదపకుండా నెట్టుకొచ్చిన వైకాపా, ఇక నేడో రేపో కాంగ్రెస్ తెలంగాణా అంశం తెల్చేసేందుకు సిద్దపడుతుంటే, ఇప్పుడు ఆఖరి నిమిషంలో లేఖ వ్రాయడంతో తెలంగాణావాదులు ఆ పార్టీపై భగ్గుమన్నారు.   కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ “క్రిందటి సం. జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకొన్నాతమకి ఎటువంటి అభ్యంతరం లేదని పదిమంది ముందు చెప్పివచ్చిన వైకాపా, ఆ సంగతి మరిచిపోయి నేడు కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా తెలంగాణా అంశం ఏదో ప్రైవేట్ వ్యవహారంలా చేసుకుపోతోందని విమర్శించడం ఆ పార్టీ రాజకీయ అజ్ఞానమయినా అయి ఉండాలి లేదా తెలంగాణా అడ్డుకొనేందుకు కుట్ర అయిన అయ్యి ఉండాలి. సీమంద్రాకు చెందిన మైసూరా రెడ్డి, తమ పార్టీ వ్రాసిన లేఖను ఖండించలేకపోవచ్చును. కానీ, స్వయంగా అఖిలపక్షానికి కూడా హాజరయ్యి, ‘కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకొన్నాతమకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలుపుతూ’ ఆపార్టీ వ్రాసిన లేఖని తన స్వహస్తాలతో హోంమంత్రికి ఇచ్చిన తెలంగాణకు చెందిన ఆ పార్టీనేత మహేంద్ర రెడ్డి తమ పార్టీ కాంగ్రెస్ కు వ్రాసిన లేఖను ఎందుకు ఖండించట్లేదు?” అని ప్రశ్నించారు. వైకాపా ఏదో ఆశించి తెలంగాణా అంశం గురించి ప్రస్తావించబోతే అదికాస్తా చివరికి ఇలా బెడిసికొట్టింది.

నల్లసూరీడి పుట్టిన రోజు

      నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా తన 95 వ పుట్టినరోజును ఈ సారి హాస్పిటల్‌లోనే జరుపుకుంటున్నారు.. 67 సంవత్సరాల పాటు నల్లజాతి హక్కుల పోరాడిన ఈ పోరాట మోదుడి జన్మదినాన్ని దక్షిణాఫ్రికా ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తుంది..   ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కారణం జూన్‌ 8 న హాస్పిటల్‌లో చేరిన మండేలా అప్పటి నుంచి ట్రీట్‌మెంట్‌లోనే ఉన్నారు.. ఇంతకు వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక పోయినా నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు.. ఆఫ్రికాలో అనగారి వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలకు గుర్తుగా నోబల్‌ ప్రైజ్‌న్‌ కూడా అందుకున్నారు మండేలా.. అంతేకాదు ఆయన చేసిన సేవలకు గాను ఆయన పుట్టిన రోజును ఇంటర్‌నేషనల్‌ మండేలా డేగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి.. ప్రస్థుతం సీరియస్‌ కండిషన్‌లో హాస్పిటల్‌లో ఉన్న మండేలా కోసం ఆ దేశ ప్రజలు ఆయన అభిమానులు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు..

దట్ ఈజ్ బొత్స

  ఇంతకాలం రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం చెప్పకుండా ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెప్పుకొస్తూ రోజులు దొర్లించేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మొన్న కోర్ కమిటీ సమావేశంలో సమైక్యాంధ్రకి అనుకూలంగా గట్టిగా వాదించడంతో, ఇంతవరకు ఆయన చుట్టూ తిరిగిన పార్టీలోని తెలంగాణా నేతలు ఇప్పుడు తెరాస, టీ-జేయేసీల విమర్శలకు జడిసి ఆయనతో కలిసి మీడియా ముందుకి రావడానికి కూడా భయపడుతున్నారు.   ఇటువంటి సమయంలో చాలా తెలివిగా మసులుకొనే బొత్స సత్యనారాయణ, బహుశః తెలంగాణా వాదుల దాడి నుండి తప్పించుకోవడానికి రాష్ట్రం విభజిస్తే నక్సలిజం పెరిగిపోతుందని ముఖ్యమంత్రి అభిప్రాయంతో తానూ విభేదిస్తున్నానని మీడియాకు చెప్పుకొన్నారు. తద్వారా తాను కూడా తెలంగాణా వాదుల వాదనలతో ఏకీభవిస్తున్నానని చెప్పకనే చెపుతూ వారు తనమీదకు అస్త్రాలు ఎక్కుపెట్టకుండా జాగ్రత్తపడ్డారు.   పనిలోపనిగా సమైక్యవాదులను కూడా మంచి జేసుకోవడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కేవలం హైదరాబాదులోనే స్థాపించబడటం వలన రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఏమాత్రం అభివృద్దికి నోచుకోకుండా చాలా వెనుకబడిపోయాయని, అయితే పరిస్థితులు ఇంతవరకు వచ్చిన తరువాత ఇప్పుడు దీని గురించి ఆలోచించడం వల్ల ఏ ఉపయోగమూ ఉండదని, అందువల్ల రాష్ట్ర విభజన అనివార్యమయితే, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, సీమంధ్రకు రాజధాని ఏర్పాటు చేసుకొని, కొత్త రాష్ట్రం అన్నివిధాల స్థిరపడేవరకు అంటే కనీసం ఓ 20సం.ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని కోరినట్లు ఆయన చెప్పుతున్నారు.   బొత్స రాజకీయంగా చాలా చక్కగా వ్యవహరిస్తున్నారని అంగీకరించక తప్పదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వంలో, పార్టీలో గత నాలుగేళ్ళుగా కీలకమయిన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన మరి ఈ నాలుగేళ్ళ కాలంలోతన విజయనగరం జిల్లా అభివృద్దికి ఎన్ని కొత్త పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, మౌలిక వసతులు తీసుకు వచ్చారని ప్రశ్నిస్తే అందుకు సమాధానం ఉండదు. కానీ ఆయన కూడా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు వెనుకబడిపోయాయని బాధపడటం విడ్డూరం.

బిజెపి తెలంగాణ ఇవ్వలేదు: ఉండవల్లి

      తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని రాజమండ్రి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ పైన ఉన్న ప్రేమతో సీమాంధ్రులు విశాఖను విస్మరించారన్నారు. దేశ ప్రజలు ఒప్పుకుంటేనే రాష్ట్ర విభజన ఆపలేమన్నారు. రాష్ట్రం విడిపోయినా వచ్చే ప్రమాదమేమీ లేదని అన్నారు. దేశానికి మేలు జరిగే ఏ అభిప్రాయమైన తెలంగాణ, సీమాంద్ర నేతలు అంగీకరించాలని చెప్పారు.   టీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలకు అవాస్తవాలను చెప్పి, సీమాంధ్రులను దోపీడీ దొంగలుగా ముద్ర వేస్తున్నారని అన్నారు.  తెరాస నేతలు ఇరుప్రాంతాల మద్య విద్వేషాలు రగిలించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇవ్వలేదని అంటున్నారు. బిజెపి ఇచ్చిన మాటపై నిలబడలేదన్నారు. కాకినాడ ఒక వోటు రెండు రాష్ట్రాల తీర్మానం ఏమైందని ప్రశ్నించారు.  

తెలంగాణ పై ఆజాద్‌తో కిరణ్ భేటి!

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బెంగళూరులో కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో రహస్యంగా భేటి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆజాద్‌తో సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటి లో తెలంగాణాపై ఆజాద్‌తో కిరణ్ అరగంట పాటు చర్చించినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదాన్ని బలపరుస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కిరణ్ కలవాల్సి ఉన్నా.. ఆజాద్‌తో భేటీ అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణపై త్వరలో సీడబ్యూసీ కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో ఆజాద్‌తో కిరణ్ సమావేశం కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

చంద్రబాబు రికార్డ్ బ్రేక్ చేసిన షర్మిల

      వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల చేప్పటిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇదివరకు చంద్రబాబు 208 రోజుల్లో 2817 కి.మీ. చేసిన తన పాదయాత్రని విశాఖలో ముగించారు. ఆమె చంద్రబాబు నెలకొల్పిన ఈ రికార్డుని అధిగమించి నిర్విరామంగా ముందుకు సాగిపోతున్నారు. నిన్నటితో విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో కోమటిపల్లి వద్ద 2818కి.మీ. మైలురాయి దాటింది. ఆమె ఈ దూరాన్ని కేవలం 211 రోజుల్లో పూర్తిచేసారు.   ఆమె ఇంత వరకు 13జిల్లాలకు చెందిన 40 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్‌లు, 108 నియోజకవర్గాలు, 184 మండలాలు, 1,784 గ్రామాలను తన పాదయాత్రలో సందర్శించారు. షర్మిల తన పాదయాత్ర మొదలుపెట్టిన నాటినుండి ఇంతవరకు 155 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆమె తన పాదయాత్రను తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముగించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించనున్నారు. ఇంత సుదీర్గమయిన పాదయాత్ర చేసిన దేశంలో మొట్ట మొదటి మహిళగా ఒక సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆమె తన పాదయాత్రను ప్రధానంగా తన పార్టీని బలపరిచి ప్రజలలో వ్యాపింప జేయడానికి, తన తండ్రి, సోదరుల పట్ల ప్రజలలో ఉన్న సానుభూతిని సజీవంగా ఉంచడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, తమకు ప్రధాన శత్రువయిన తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించేందుకు ఉపయోగించుకొంటున్నారు.

జడ్చర్ల టిడిపి ఎమ్మెల్యే సోదరుడు హత్య

      మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల టిడిపి ఎమ్మెల్యే చంద్రశేఖర్ సోదరుడు పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో క్కడికక్కడే మృతి చెందారు. బుధవారం దేవరకద్ర పాత బస్టాండు వద్ద ఓ కారులో జగన్‌మోహన్ ఉన్న సమయంలో కొందరు హఠాత్తుగా వచ్చి కాల్పులు జరిపారు. దీంతో అతను కారులోనే మృతి చెందాడు.దుండగులు ద్విచక్ర వాహనం పైన వచ్చి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు దుండగులు స్కార్పియోలో వచ్చి కాల్పులు జరిపి పరారయ్యారనే వాదన కూడా వినిపిస్తుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. హత్య జరిగిన స్థలంలో పడిన రెండు బుల్లెట్లను, రెండు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

బస్సులో బాలయ్య ..లోకేష్

  వచ్చేనెల 24నుండి చంద్రబాబు మళ్ళీ రాష్ట్ర పర్యటనకి బయలుదేరబోతున్నారు. అయితే ఆరోగ్యరీత్యా ఈసారి బస్సులో పర్యటించాలని నిర్ణయించుకొన్నారు. ఆయన పాదయాత్రకి వచ్చిన అపూర్వ స్పందన చూసిన తరువాత బాలయ్య బాబు, లోకేష్ ఇద్దరూ కూడా అటువంటి యాత్రలపట్ల మనసు పారేసుకొన్నట్లు తెలుస్తోంది.అయితే, చంద్రబాబులా వారు పాదయత్రకి సిద్దపడకపోయినా బస్సుయాత్ర మాత్రం తప్పనిసరిగా చేయాలని నిర్ణయించుకొన్నారు.   లోకేష్ వీలయితే తన తండ్రితో కలిసి లేదా త్వరలోనే వేరే బస్సులో తన పర్యటన మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఇక, బాలకృష్ణ కూడా తను ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో మొదలుపెట్టిన సినిమా పూర్తవగానే బస్సు యాత్ర మొదలుపెడతానని చెప్పారు. ఈ సినిమా పూర్తవడానికి కనీసం మూడు లేదా నాలుగు నెలలు పట్టవచ్చును. అంటే నవంబర్ నాటికి బాలకృష్ణ ఖాళీ అవుతారు. అప్పటికి సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడినా వెలువడవచ్చును. లేకున్నపటికీ, ఇక అప్పటి నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకు పూర్తిగా పార్టీ కోసమే తన సమయం కేటాయించాలని ఆయన భావిస్తున్నారు.   ఈసారి ఆయన కృష్ణా జిల్లా నుండి పోటీ చేయబోతున్నారు గనుక, ముందుగా శ్రీకాకుళం లేదా అనంతపురం నుండి యాత్ర మొదలుపెట్టి ఆఖరుగా కృష్ణా జిల్లాలో యాత్ర చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన బస్సు యాత్ర చేయడం దాదాపు ఖరారయినప్పటికీ, రోడ్డు మ్యాప్ మాత్రం అప్పుడే ఖరారు చేయవచ్చును.   ఇక మరో ఆసక్తి కరమయిన వార్త ఏమిటంటే, త్వరలోనే తెదేపా కూడా ఒక స్వంత చానెల్ ఏర్పాటు చేసుకోబోతున్నట్లు సమాచారం. లోకేష్ ఆ పని మీదనే ఇటీవల డిల్లీ కూడా వెళ్లి వచ్చాడని సమాచారం. అయితే, ఈ విషయం తెదేపాలో ఎవరూ ధృవీకరించలేదు.

శంకర్ రావు కేసులో కొత్త మలుపు

      మాజీ మంత్రి శంకర్ రావు పై పెట్టిన కేసులను ఆయన కోడలు వంశీ ప్రియ ఉపసంహరించుకున్నారు. శంకర్ రావు, ఆయన కుటుంబ సభ్యులపైన పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె హైకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. ఇటీవల ఈ కేసుపై శంకర్ రావును పోలీసులు అరెస్ట్ చేసి, అనారోగ్యం కారణంగా ఆయనను కేర్ ఆస్పత్రికి తరలించారు. శంకర రావు ఆరోగ్యం దృష్ట్యా కేసులు ఉపసంహరించుకోవాలని కుటుంబ పెద్దలు మధ్యవర్తిత్వం నెరపడంతో వంశీప్రియ వెనక్కి తగ్గిందని అంటున్నారు. వంశీప్రియ పిటిషన్ ఉపసంహరించుకోవడంతో సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు కూడా విత్ డ్రా చేసుకోనున్నారు. కాగా శంకర రావు ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పలు కేసులు వెంటాడుతున్నాయి.ఆ కేసులలో శంకరరావును అరెస్టు చేస్తారా?లేక వదిలేస్తారో చూడాలి

మజ్లిస్ మళ్ళీ కాంగ్రెస్ పంచన జేరబోతోందా

  కొంత కాలం క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తో గిల్లి కజ్జాలు పెట్టుకొని, కుంటిసాకులు చూపి కాంగ్రెస్ పార్టీకి తలాకులు చెప్పుకొని బయటపడిన మజ్లిస్ పార్టీ అధినేతలు ఓవైసీ సోదరులు ఆ తరువాత జరిగిన పరిణామాలతో వాపు, బలుపు రెండు వేర్వేరని బాగా అర్ధం చేసుకోవడంతో పూర్తిగా చల్లబడిపోయారు. ‘కిరణ్ కంటే జగన్ బెటర్’ అని వారు జగన్ మోహన్ రెడ్డి కి ఒక కాండక్ట్ సర్టిఫికేట్ జారీ చేసినప్పటికీ, వారి నోటి దురద ఏనాటికయినా తనకు ప్రమాదం తెచ్చిపెడుతుందని భయపడిన జగన్ కూడా వారిపట్ల సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు ఓవైసీ సోదరులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిగ్నల్స్ ప్రసారం చేసినప్పటికీ వాటిని అటువైపు నుండి ఎవరూ రిసీవ్ చేసుకోకపోవడంతో వారు అయోమయంలో పడ్డారు. ఇక వారు గతంలో కబ్జా చేసిన ఓవైసీ ఆసుపత్రికి ఆనుకొని ఉన్నరెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలంను ఇప్పుడు స్వాదీనం చేసుకోవడానికి కిరణ్ ఆదేశించడంతో, ఇక లాభంలేదని భావించిన మజ్లిస్ అధినేత సోదరుడు అక్బరుద్దీన్ నేరుగా ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహను నిన్న కలిసారు.   దాదాపు అర్ధగంట సేపు సాగిన వారి సమావేశం తరువాత మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర విభజనను మేము వ్యతిరేఖిస్తున్నాము. గానీ తప్పనిసరి అయితే కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న రాయల తెలంగాణా అయితే మేము మద్దతు ఇస్తామని తెలియజెప్పడానికే వచ్చాము” అని చెప్పారు. ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఆమోదం తెలుపనంత మాత్రాన్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజనపై నిర్ణయం తీసుకోకుండా ఆగిపోదు. ఆ విషయం తెలిసి ఉన్నపటికీ పనికట్టుకొని మరీ వెళ్ళింది తమ అమూల్యమయిన అభిప్రాయం తెలియజేయడానికి కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మళ్ళీ కాంగ్రెస్ తో ముందుగానే పొత్తుల సంగతి మాట్లాడుకోకపోతే, ఆనక డిల్లీలో టికెట్స్ ఖరారు అయిపోతే అప్పుడు చేయగలిగేదేమీ ఉండదని గ్రహించడం వలనే ఓవైసీ సోదరులు ఓమెట్టు దిగివచ్చి దామోదరుడిని ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. పనిలోపనిగా తాము కబ్జా చేసిన రెండెకరాల భూమిని తమకే వదిలిపెట్టమని అడిగినా అడిగి ఉండవచ్చును.   కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేఖించే ఆయనను కలవడం ద్వారా తమ పని సానుకూలం అవుతుందని వారు మళ్ళీ దురాలోచన చేసినట్లు కనబడుతోంది. కానీ, దానివల్ల వెళ్ళిన పని సానుకూలం కాకపోగా మరింత క్లిష్టం అయ్యే అవకాశం ఉంది. అంతకంటే నేరుగా పీసీసీ అధ్యక్షుడు బొత్సని కలిసినా వెళ్ళిన పని అయ్యేదేమో!

విద్యార్థుల మరణాలపై నీచ రాజకీయాలు చేస్తున్నబీజేపీ

  బీహార్ లో నిన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో 20మంది చిన్నారులు చనిపోగా, మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. హృదయవిదారకమయిన ఈ సంఘటనకి ఎటువంటి వ్యక్తులయినా చలించకమానరు. కానీ, ఈ ఘోర దుర్ఘటనకు మానవత్వంతో స్పందించవలసిన రాజకీయ పార్టీలు మాత్రం ఇదే అదునుగా తీసుకొనినితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి.    (యు)పార్టీ నితీష్ కుమార్ ఒత్తిడి కారణంగా ఎన్డీయే నుండి విడిపోయిన తరువాత ఇప్పుడు క్రమంగా కాంగ్రెస్ పార్టీకి చేరువవుతుండటంతో రగిలిపోతున్న బీజేపీ ఇదే అదునుగా భావించి శరన్ జిల్లా బందుకు పిలుపునిచ్చింది. అదేవిధంగా నితీష్ చేతిలో ఓడిపోయి అధికారం కోల్పోయిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కూడా చిరకాలంగా ఇటువంటి అవకాశం కోసమే ఓపికగా ఎదురు చూస్తున్నాడు. ఆతని ఆర్.జే.డీ. పార్టీ కూడా ఈ రోజు చప్రా మరియు శరన్ జిల్లాల బంద్ కు పిలుపునిచ్చింది.   లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ రెండూ కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడుతూ ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

సం'గ్రామం'లో టిడిపి టాప్

      రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో పోలింగ్ కి ముందే టిడిపి పార్టీ దూసుకెళ్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి పార్టీ బలపరిచిన అభ్యర్ధులు ప్రస్తుతానికి మెజార్టీ స్థానాల్లో పాగా వేశారు. టిడిపి బలపరిచిన అభ్యర్ధులే అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవం కావడంతో తెలుగు తమ్ముళ్ళ ముఖాల్లో ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి.   మంగళవారం నాటికి 1219 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 457 టీడీపీ మద్దతుదారులకు దక్కడంతో ఆ పార్టీ ముందంజ వేసింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం సేకరించిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 240, వైసీపీ 142తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీఆర్ఎస్‌కు 36, న్యూ డెమోక్రసీకి 12, సీపీఎంకు 6, సీపీఐకి 2, బీజేపీకి 2 పంచాయతీలు లభించాయి.   జిల్లాలవారీగా... చిత్తూరు-80, గుంటూరు-43, ప్రకాశం-39, నెల్లూరు-36, శ్రీకాకుళం-34, కృష్ణా-29, ఆదిలాబాద్-28, పశ్చిమ గోదావరి-23, విజయనగరం-22, మహబూబ్‌నగర్-21 వంతున టీడీపీకి దక్కాయి. చిత్తూరు-28, శ్రీకాకుళం-20 వంతున కాంగ్రెస్‌కు లభించాయి. వైసీపీకి చిత్తూరు-27, కడప-24 చొప్పున వచ్చాయి. టీఆర్ఎస్‌కు నిజామాబాద్ జిల్లాలో 23 వచ్చాయి.

తెలంగాణాపై సోనియా మాటే ఆలస్యం!

      తెలంగాణాపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేయడానికి కేంద్ర హోం శాఖ సిద్దంగా ఉందని కేంద్ర హోం మంత్రిసుశీల్ కుమార్ షిండే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సోనియాగాంధీ అన్నింటికంటే ఎక్కువగా తెలంగాణకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరలో స్పష్టమైన పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశించారని షిండే చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై సీడబ్ల్యూసీలో నిర్ణయం ప్రకటించవచ్చునని అంటున్నారు. తెలంగాణతో సీమకు చెందిన 2 జిల్లాలు కలిపి హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించడమా, లేక హైదరాబాద్‌ను 'యూటీ'గా కొనసాగించడమా, లేక మరో ప్రతిపత్తి కలిగించడమా అన్న అంశంపై తర్జన భర్జనలు జరిగాయని, ఈ విషయంలో ఒక స్పష్టత రాలేదని ఈ వర్గాలు అంటున్నాయి.

బీహార్ లో 20మంది చిన్నారులు మృతి

  బీహార్‌లోని శరణ్ జిల్లా మష్రాఖ్ బ్లాక్ గందావన్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆరగించిన 20మంది విద్యార్థులు మరణించారు. మరో 21 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 22ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడినప్పటికీ తీవ్ర అస్వస్థతో ఉన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే బాధిత విద్యార్ధులను సమీపంలో ఉన్న చాప్రా సదర్ ఆస్పత్రికి తరలిస్తుండగానే పదకొండు మంది దారిలోనే మరణించిగా మరి కొందరు ఆసుపత్రిలో మరణించారు. నిన్నమధ్యాహ్నం విద్యార్ధులకు వడ్డించిన భోజనంలో క్రిమిసంహరక మందు ఆర్గానో పాస్పరస్ కలసి ఉండవచ్చని బీహార్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అమర్ జీత్ సిన్హా అనుమానిస్తున్నారు. బాధిత విధ్యార్ధులకు పాట్నామెడికల్ కాలేజీలో చికిత్సఅందిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. చనిపోయిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.2లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

ఆగస్టు 24 నుండి బాబు బస్సు యాత్ర

      తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 7 నెలలు పైగా రాష్ట్రంలో పలు జిల్లాలలో పాదయాత్ర చేసి పార్టీ శ్రేణులలోఉత్సాహం నింపారు. అదే సమయంలో ఆయన కూడా పాదయాత్ర తరువాత మరింత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో బస్సుయాత్రకు సిద్దం అవుతున్నారు. ఆయన చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను మాత్రం తన పాదయాత్రలో పర్యటించలేకపోయారు. అందువల్ల వచ్చేనెలలో బస్సుయాత్ర చేప్పట్టి ఆ జిల్లాలను కూడా పర్యటించాలని ఆయన సిద్దపడుతున్నారు. ఒకవేళ పంచాయితీ ఎన్నికల ఫలితాలు పార్టీకి సానుకూలంగా వస్తే అది తన యాత్రకు మంచి ఊపునిస్తుందని, అప్పుడు తన బస్సు యాత్ర ద్వారా ఆ తరువాత జరగనున్నమునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నధం చేయవచ్చునని చంద్రబాబు ఆలోచన. ఆగస్టు 24 నుండి ఈ యాత్ర మొదలు కానుంది. ఈ మేరకు ఇంతకుముందే పార్టీ వర్గాలు ప్రకటన చేశాయి. వచ్చే సాధారణ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండి వారికి దగ్గరగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు.

కాంగ్రెస్ నేతలు ప్రజలను ఏమార్చడానికే తిట్టుకొంటున్నారా?

  తెలంగాణా, రాష్ట్ర విభజన అంశాల మీద రోజుకొక వార్తని మీడియాకి లీక్ చేయడం మళ్ళీ దానిని ఆ మరునాడు ఖండించడం, లేకుంటే రోజుకొక వ్యాఖ్య చేయడం దానిని పట్టుకొని అటు మీడియాలో తీవ్రంగా చర్చలు, ఇటు కాంగ్రెస్ నేతలు మాటలు రువ్వుకోవడం, గత రెండు మూడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా ఈ తంతు నడిపిస్తూ రోజులు దొర్లించేస్తోంది.   త్వరలో రాష్ట్ర విభజన అంశంపై ఖచ్చితమయిన నిర్ణయం ప్రకటిస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పినప్పుడు, రెండు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలను నియంత్రించి ఉండాలి. కానీ, చేయలేదు. వారు రెండు గ్రూపులుగా విడిపోయి బద్ధ శత్రువులవలే కత్తులు దూసుకొంటూ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంటే, కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తోంది. అసలు ఇదంతా ప్రజలను, ప్రతిపక్షాలను ఏమార్చడానికి కాంగ్రెస్ ఆడుతున్ననాటకంలో భాగమేనేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు కీచులడుకొంటూ ప్రజల దృష్టిని మళ్ళిస్తుంటే, అక్కడ డిల్లీ పెద్దలు రకరకాల వ్యాక్యాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారేమోనని అనుమానం కలుగుతుంది.   ఇక నేడో రేపో తెలంగాణా అంశాన్ని తేల్చేస్తామని ఒక పక్క చెపుతూనే, ‘తెలంగాణా ప్యాకేజి’, ‘రాయల తెలంగాణా’ వంటి లీకులు ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. ఈ రోజు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ “హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ఆలోచన ఏమీ లేదని, మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాజనిత వార్తలేనని” చెప్పడం చూస్తే, ఆయన మళ్ళీ మరో కొత్త చర్చకు అవసరమయిన ముడిసరుకు అందజేస్తునట్లు భావించాలి. ఆయన ఆవిధంగా అన్నారు గనుక, ‘బహుశః హైదరాబాదుతో కూడిన తెలంగాణా ఏర్పాటు చేయవచ్చునేమో’, లేకపోతే ‘హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచి రాష్ట్ర విభజన చేయవచ్చునేమో’, లేకపోతే ‘అసలు రాష్ట్ర విభజన చేసే ఆలోచన లేనందునే ఆయన ఆవిధంగా అన్నారేమో’ అంటూ ఆయన తాజా వ్యాఖ్యలపై అనేక కోణాలలో చర్చలు మొదలవుతాయి.   అదే అంశం పట్టుకొని రేపటి నుండి ఉభయ ప్రాంతాలకి చెందిన కాంగ్రెస్ కూడా ఎవరికి అనుకూలమయిన వాదనలు వినిపించవచ్చును. అసలు ఒక సమస్యని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే మంచి పద్ధతి లేదా? లేక ఈ సమస్యను మరింత కాలం సాగదీసేందుకు కోరుండే ఈ విధంగా ప్రవర్తిస్తోందా? అత్యంత సున్నితమయిన అంశాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వలననే సమస్య ఇంతవరకు వచ్చింది. కనీసం ఇప్పటికయినా ఆ పార్టీ మేల్కొందా అంటే లేదనే అనిపిస్తోంది.