పార్టీ నేతలను కట్టడి చేసిన చంద్రబాబు
posted on Jul 13, 2013 @ 2:53PM
తెలంగాణా అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇరుకునపడిన కాంగ్రెస్ పార్టీని తెరాస, టీ-జేయేసీ నేతలు ఎండగడుతుంటే, ఉస్మానియా విద్యార్ధులు ఏకంగా గాంధీ భవన్ ముట్టడికి పూనుకొని, ఈ రోజు తెలంగాణాలో విద్యాసంస్థల బంద్ కి పిలుపు కూడా ఇచ్చారు. అయితే, తెరాస, తెదేపా అధ్యక్షులు కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ కూడా ఇంతవరకు నోరు విప్పలేదు. కేసీఆర్ తన పార్టీ నేతలు కాంగ్రెస్ పై దాడి చేస్తుంటే చూసి చూడనట్లు ఊరుకొంటే, చంద్రబాబు మాత్రం తన పార్టీ నేతలని ఈ విషయంపై ఎవరూ కూడా మీడియాకెక్కి అనవసరమయిన రాద్ధాంతం చేసి పార్టీకి కొత్త తల నొప్పులు తేవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అందుకే తెదేపా తరపున కేవలం రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి తప్ప ఇతర నేతలెవరూ కూడా ఈ వ్యవహారంపై ఇంత వరకు స్పందించలేదు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీకి వదిలిపెట్టి, పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టమని చంద్రబాబు తన నేతలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేపు వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా తెలంగాణా సమస్య తేల్చలేకపోయినట్లయితే, అప్పుడు తగిన రీతిలో స్పందించడం మేలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక, వైకాపా కూడా ఈవిషయంలో తెలుగుదేశం పార్టీనే సింపుల్ గా ఫాలో అయిపోతూ పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది.