చంద్రబాబు యాత్రపై ఎర్రబెల్లి అసంతృప్తి
posted on Sep 4, 2013 @ 3:53PM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల రోజులు వేచి చూసి తప్పని సరి పరిస్థితులలో సీమాంధ్ర యాత్రకు బయలు దేరాడు. గుంటూరులో తెలుగుజాతి ఆత్మగౌరవయాత్ర మొదలు పెట్టిన చంద్రబాబు నాయుడు అసలు తెలంగాణను అడ్డుకున్నది తానేనని ప్రకటించారు. అయినా తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నారు. విడిపోతున్నామన్న బాధలో ఉన్న సీమాంధ్రులను ఓదార్చేందుకే చంద్రబాబు యాత్ర అని సరిపెట్టారు.
అయితే చంద్రబాబు మెల్లమెల్లగా సమైక్యవాదాన్ని తెరమీదకు తెచ్చారు. తెలుగుజాతిని విడదీస్తే ఒప్పుకోనని, పార్లమెంటులో మా పార్టీ ఎంపీలు తీవ్రంగా పోరాడుతున్నారని అన్నారు. ఈ పరిణామాలు మెల్లగా తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు. తెలంగాణకు చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడితే తాను కొత్త పార్టీ పెడతానని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పకుండానే చంద్రబాబు సమైక్య వాదం అందుకోవడం మీద తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. అయితే ఎర్రబెల్లి పార్టీ పెడితే వెళ్లే పరిస్థితి లేకున్నా చంద్రబాబు వ్యాఖ్యలు మాత్రం భరించలేకుండా ఉన్నాయని వారు అంటున్నారు.