అనంత కాంగ్రెస్ లో మిగిలింది ముగ్గురే!
posted on Mar 11, 2014 7:39AM
అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోతోంది. సీనియర్ నాయకులు అందరూ ఒక్కొక్కరూ జారుకుంటున్నారు. దాంతో ఇక జూనియర్లకు పండగే పండగ. ఈసారి అడిగినవాళ్లకు లేదనకుండా టికెట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శివరామిరెడ్డి మాత్రమే కొనసాగుతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జగన్ పార్టీలో చేరిపోయారు. తాడిపత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి టీడీపీలోకి దాదాపు వెళ్లిపోయినట్లే. గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదనగుప్తా కాంగ్రెస్‌ను వీడి ఏదో ఒక పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
శింగనమల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పెట్టే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి జగన్ పార్టీకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్సీ పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా ఆయన ఈ సారి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్లు ఎలా కేటాయిస్తారో చూడాల్సిందే మరి!