పొన్నాలకు కోడలి గండం
posted on Mar 11, 2014 7:29AM
కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు ఇంటిపోరు మొదలైంది. జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్యకు, ఆయన కోడలు వైశాలికి మధ్య విభేదాలు తలెత్తాయి. నిజానికి వైశాలి గతంలోనే పోటీ చేయాలని భావించినా, అప్పట్లో డీలిమిటేషన్ కారణంగా కుదరలేదు. దాంతో ఇప్పుడు తాను పోటీ చేసి తీరాల్సిందేనని ఆమె గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ లక్ష్మయ్య ఆలోచన వేరేలా ఉంది. జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇప్పుడు జనరల్ మహిళకు కేటాయించారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ పదవిని తీసుకుని... వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందని లక్ష్మయ్య వర్గం నుంచి వైశాలికి ప్రతిపాదనలు వెళ్లాయి. దీనికి ఆమె ససేమిరా అంటున్నారు. మహిళా కాంగ్రెస్ పార్టీకి వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైతే లక్ష్మయ్య భువనగిరి లోక్‌సభకు పోటీ చేయాలని... తాను మాత్రం ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని చెబుతున్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉంటానని.. సీనియర్ నేతగా అన్ని అర్హతలు ఉన్నాయని లక్ష్మయ్య భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటి నుంచే పోరు మొదలవడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.