సిక్కోలులో చాప చుట్టేస్తున్న కాంగ్రెస్
posted on Mar 11, 2014 7:43AM
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చాపచుట్టే పరిస్థితికి వచ్చింది. ఇది కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి మింగుడు పడటంలేదు. పార్టీలో ఉన్న కొద్ది మంది నాయకులు ఎక్కువ మంది టీడీపీలోకి, ఒకరిద్దరు జగన్ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. పార్టీని నిలబెట్టేందుకు కిల్లి కృపారాణి చేసిన మంతనాలు పారడంలేదు. నిన్నమొన్నటి వరకు ఆమెకు దాదాపు కుడిభుజంగా వ్యవహరించిన 16వ వార్డు మాజీ కౌన్సిలరు గోళ్ల చంద్రరావు సోమవారం తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. మున్సిపల్ మాజీ చైరపర్సన్ లక్ష్మి భర్త దుర్గాప్రసాద్ కూడా పార్టీ మారే ఉద్దేశంలోనే ఉన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోవడం కంటే స్వతంత్రులుగా పోటీచేసి, గెలిచిన తరువాత అధికారంలోకి వచ్చే పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనలో కొందరు బలమైన అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం. ఇటీవల వరుసగా 5 సార్లు పలాస పట్టణానికి కృపారాణి వచ్చి పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లతో సమావేశాలు జరిపారు. మున్సిపాలిటీలో చుట్టరికాలు చేస్తూ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి పార్టీకి అండగా నిలవమని ప్రాధేయపడినా ఫలితం మాత్రం ఉండట్లేదు.