ఓటు వేసిన సూపర్ స్టార్ రజనీకాంత్‌

      ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌ తన ఓటుహక్కుని చెన్నయ్‌లో వినియోగించుకున్నారు. పోయెస్ గార్డెన్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ లో రజనీ ఓటు వేశారు. సినీ నటి విద్యాబాలన్‌ కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఓటు హక్కుని వినియోగించుకోవడమే కాక, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ నినాదిస్తున్నారు.   సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 117 లోకసభ స్థానాలలో ఆరోదశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 2076 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది. తమిళనాడులో 39, మహారాష్ట్ర 19, ఉత్తరప్రదేశ్ 12, మధ్యప్రదేశ్ 10, బీహార్లో 7, ఛత్తీస్ గఢ్ 7, పశ్చిమబెంగాల్ 6, అస్సాం 6, రాజస్థాన్ 5, జార్ఖండ్ 4, జమ్మూకాశ్మీర్ 1, పుదుచ్చెరి 1 స్థానాల్లో పోలింగ్ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటేనట

  తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటేనని చిరంజీవి మరొకమారు తేల్చి చెప్పారు. తామిదరం వేర్వేరు పార్టీలలో ఉన్నందున ఎవరి ప్రచారం వారిదేనని, ఇద్దరూ సోదరులే అయినప్పటికీ, రాజకీయంగా మాత్రం ప్రత్యర్దులమేనని అన్నారు.   ఈరోజు తూర్పు గోదావరి జిల్లా తునిలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఒక జీవనది వంటిది. దానిని ప్రవహించకుండా అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు.కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తామని గతంలో చాలామంది బయలుదేరారు, కానీ చివరికి వారే కనబడకుండా పోయారు. రాష్ట్ర విభజనకు కేవలం కాంగ్రెస్ పార్టీనే నిందించడం తగదు. అన్ని పార్టీల అంగీకరించిన తరువాతనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించింది. కాంగ్రెస్ పట్ల సీమాంధ్ర ప్రజలలో వ్యతిరేఖత ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం తప్పని ప్రజలే నిరూపించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించబోతోంది. దానిని ప్రతిపక్షాలే స్వయంగా చూడబోతున్నాయి."   "చంద్రబాబుకి ఈ ఎన్నికలు ఆఖరిపోరాటం వంటివి. ఈ ఎన్నికల తరువాత ఆయన మరిక కనబడక పోవచ్చును. అదేవిధంగా ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి తన కేసుల నుండి బయటపడేందుకు చేస్తున్న రక్షణ పోరాటం వంటివి. ఆయన చెపుతున్న సంక్షేమ కబుర్లు, చేస్తున్న వాగ్దానాలు అన్నీ అబ్బదం. ఆయన అధికారంలోకి వచ్చి తన కేసుల నుండి బయటపడాలని తాపత్రయ పడుతున్నారు. నరేంద్ర మోడీ హిట్లర్ అని నేనన్న మాటకి కట్టుబడిఉన్నాను. ఆయనకు మహిళలలంటే ఎంత చులకన భావమో అయన ప్రియాంకా గాంధీని ఉద్దేశించి అన్న మాటలు వింటే అర్ధమవుతుంది. ఆయన మాటలను కనీసం బీజేపీ మహిళా నేతలు కూడా సమర్ధించరని ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.

వైకాపా నేత శోభా నాగిరెడ్డి కన్నుమూత

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైకాపా కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజక వర్గం అభ్యర్ధి శోభా నాగిరెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశారు. బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా... గూబగుండం మిట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట నంద్యాలలో ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స నిర్వహించిన తరువాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రి తీసుకొనివచ్చారు. ఐసియులో చికిత్స పొందుతున్న ఆమె ఉదయం 11.05గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

తెలంగాణాలో సంకీర్ణ ప్రభుత్వమే

  తెలంగాణాలో ఎన్నికలకు ఇంకా కేవలం 6రోజులే మిగిలున్నాయి. ప్రధాన ప్రత్యర్దులయిన కాంగ్రెస్, తెరాస, తెదేపా-బీజేపీలు చాలా గట్టిగా ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నాయి. కాంగ్రెస్ తరపున సోనియా, రాహుల్ గాంధీ ఇద్దరూ వచ్చి ప్రచారం చేసారు. ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఎన్నడూ రాష్ట్రం మొహం చూడని కేంద్రమంత్రి జైరామ్ రమేష్ గత నెల రోజులుగా తెలంగాణాలోనే తిష్టవేసి టీ-కాంగ్రెస్ నేతలకంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. చంద్రబాబు అందరికంటే ముందుగా తెలంగాణాలో ప్రచారం మొదలుపెట్టడమే కాకుండా ఆర్. క్రిష్ణయ్యని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు రోజుల క్రితమే నరేంద్రమోడీ కూడా వచ్చి తెదేపా-బీజేపీ కూటమికి ప్రచారం చేసి వెళ్ళారు. వీరందరినీ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఒక్కరే బలంగా డ్డీకొంటూ, పది జిల్లాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.   ముగ్గురు ప్రధాన ప్రత్యర్ధులు దీటుగా ప్రచారం చేసుకొంటున్నందున, ఇంతవరకు తెరాస తన ప్రత్యర్ధులపై చూపుతున్న ఆధిక్యతను కోల్పోగా కాంగ్రెస్ రేసులో ముందుకు దూసుకుపోతున్నట్లు తాజా సర్వేలు చెపుతున్నాయి. అయితే అది పూర్తి మెజార్టీ సాధించేత మాత్రం కాదని సర్వేలే స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, తెరసలతో పోలిస్తే, తెదేపా-బీజేపీ కూటమి పోటీలో వెనుకబడిపోయిందని, కానీ వారి కూటమి కూడా గౌరవనీయమయిన స్థానాలనే దక్కించుకోవచ్చని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.    తాజా నివేదిక ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిక్యత కనబరుస్తూ 35-45 సీట్లు సాధించుకొనే అవకాశం ఉందని సమాచారం. తెరాస-25-30, తెదేపా-బీజేపీ కూటమి-20-30, మజ్లిస్-4 to 6 మరియు ఇతరులు 8 సీట్లు సాధించవచ్చని సమాచారం.   కాంగ్రెస్ తరపున తెలంగాణాలో ప్రచారం చేస్తున్న జైరామ్ రమేష్ “ఎన్నికల తరువాత తెరాస మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దుస్థితి తమకు రాదని, తమ పార్టీయే స్వయంగా మెజార్టీ సీట్లు సాధించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని” విశ్వాసం వ్యక్తం చేసారు.   కేసీఆర్ మొన్న ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తమ పార్టీకే గనుక పూర్తి మెజార్టీ రానట్లయితే, కాంగ్రెస్ మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం కంటే ఫారం హౌస్ లో వ్యవసాయం చేసుకోవడానికే ఇష్టపడతానని అన్నారు. అంటే ఎవరికీ పూర్తి మెజార్టీ రాదని వారు కూడా అప్పుడే గ్రహించినట్లు అర్ధమవుతోంది. అందుకే వారిరువురూ మద్దతు తీసుకోవడం గురించి మాట్లాడుతున్నారిప్పుడు.   అయితే, కేంద్రంలో, రాష్ట్రంలో కూడా చక్రం తిప్పాలని, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తహతహలాడిపోతున్న కేసీఆర్ నిజంగానే ఆ పరిస్థితి వస్తే, నిజంగా ఫారం హౌస్ కి వెళ్లిపోతారని అనుకోవడం అవివేకమే. అవసరమయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చో, పుచ్చుకోనయినాసరే ముఖ్యమంత్రి పదవి లేకపోతే కనీసం ఆర్ధిక శాఖ, హోంశాఖనో పుచ్చుకొని సంతృప్తి పడవచ్చును. అంటే ఎన్నికల తరువాత అధికారం చేజిక్కించుకొనేందుకు కాంగ్రెస్-తెరాసలు తప్పనిసరిగా మళ్ళీ చేతులు కలుపుతాయని అర్ధమవుతోంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే మాటయితే తెరాస-కాంగ్రెస్ పార్టీకి బదులు బీజేపీ మద్దతు తీసుకొనే అవకాశం ఉంది. అంటే తెలంగాణాలో సంకీర్ణ ప్రభుత్వమేర్పడే అవకాశాలే ఎక్కువని అర్ధమవుతోంది.

శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమం

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైకాపా కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజక వర్గం అభ్యర్ధి శోభా నాగిరెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. గుండె వైపు పక్కటేముకలు విరగడంతో ఆమెకు శ్వాస తీసుకోలేకపోతున్నట్లు వైద్యులు తెలిపారు.    బుధవారం నంద్యాలలో షర్మిల పర్యటించారు. ఆమెతోపాటు శోభానాగిరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో షర్మిలకు వీడ్కోలు పలికి... తన మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ వాహనంలో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డకు బయలుదేరారు. దూబగుంట గ్రామం సమీపంలో రోడ్డు పక్కన పోసి ఉన్న ధాన్యం కుప్పపైకి ఆమె పయనిస్తున్న కారు ఎక్కడంతో, కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె పక్కటెముకలు విరిగి, తలకు తీవ్ర గాయాలయినట్లు సమాచారం. ఆమెతో బాటు కారు డ్రైవర్ మరియు ఆమె గన్-మెన్ క్కూడా తీవ్ర గాయాలయ్యాయి.

కారు ప్రమాదంలో శోభా నాగిరెడ్డికి తీవ్ర గాయాలు

  వైకాపా కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజక వర్గం అభ్యర్ధి శోభా నాగిరెడ్డి నిన్న రాత్రి జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఆళ్లగడ్డలో ప్రచారం ముగించుకొని తిరిగి వెళ్తుండగా రాత్రి 11గంటల సమయంలో దూబగుంట గ్రామం సమీపంలో రోడ్డు పక్కన పోసి ఉన్న ధాన్యం కుప్పపైకి ఆమె పయనిస్తున్న కారు ఎక్కడంతో, కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె పక్కటెముకలు విరిగి, తలకు తీవ్ర గాయాలయినట్లు సమాచారం. ఆమెతో బాటు కారు డ్రైవర్ మరియు ఆమె గన్-మెన్ క్కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నపటికీ, ఆమె శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నందున, ఐ.సీ.యూ.లో ఉంచి కృత్రిమ శ్వాస అందిస్తూ వైద్యం చేస్తున్నారు.

తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధి కృష్ణయ్య

  ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో తెదేపా నిర్వహించిన ప్రజా గర్జన సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణా మూట మొదటి ముఖ్యమంత్రిగా బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రిగా చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు. కృష్ణయ్యే తమ ముఖ్యమంత్రి అభ్యర్దని కుండబ్రద్దలు కొట్టినట్లు ప్రకటించారు. దానితో ఇంతవరకు కృష్ణయ్య అభ్యర్ధిత్వంపై పార్టీలో, బయటా కూడా జరుగుతున్న చర్చకు తెర దించినట్లయింది.   కొద్ది రోజుల క్రితం చంద్రబాబు కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపికచేశారనే మీడియాలో వచ్చిన వార్తలపై సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ, ‘ఆయనకు కేవలం పార్టీ ప్రచార భాద్యతలు మాత్రమే అప్పగించారు తప్ప ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాదు’ అని ఆ వార్తలను ఖండించారు. కానీ ఈరోజు చంద్రబాబు స్వయంగా క్రుష్ణయ్యే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించడంతో పార్టీలో మరో అంతర్యుద్దానికి తెరతీసినట్లయింది.   పార్టీ కీలకమయిన ఎన్నికలకు సన్నదమవుతున్న ఈ తరుణంలో చంద్రబాబు ఈ విధంగా ప్రకటించి, తెలంగాణాలో అత్యధిక శాతం ఉన్న బీసీలను ఆక్కట్టుకోవాలని ఆశిస్తుండవచ్చును. కానీ పార్టీలో ఉన్న అనేక మంది సీనియర్లను కాదని, ఎటువంటి రాజకీయ, పరిపాలనానుభవమూ లేని, రెండు మూడు వారాల క్రితం కొత్తగా పార్టీలో చేరిన కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన ప్రకటిస్తే పార్టీలో మళ్ళీ సంక్షోభం ఏర్పడదా? దానినాయన ఏవిధంగా పరిష్కరించబోతున్నారు? అనేది చాలా ఆసక్తికరంగా మారింది.   అయితే ఇటీవల ఒక ప్రముఖ టీవీ చానల్ వారు మల్కాజ్ గిరీలో వివిధ పార్టీ నేతలను ప్రజాదర్బారు కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కృష్ణయ్య పక్కనే కూర్చొన్న కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ అన్న మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. “తెలంగాణాలో తెదేపా మునిగిపోయే నావ వంటిదని చంద్రబాబుకి తెలుసు గనుకనే ఆ నావకు క్రుష్ణయ్యను కెప్టెన్ చేసారు. చంద్రబాబుకి నిజంగానే బీసీలను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకొంటే, తేదేపాకు విజయావకాశాలున్న సీమాంద్రాలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేవారు. కానీ అక్కడ తను ముఖ్యమంత్రి పదవి తీసుకొని, ఓడిపోయే ప్రాంతంలో కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేస్తానని ఆయనను బకరా చేసారు,” అని కృష్ణయ్య సమక్షంలోనే అన్నారు.   ఆయన వాదన నిజమనుకొన్నపటికీ, ఒకవేళ తెదేపా-బీజేపీ కూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే, అప్పుడు చంద్రబాబు తన మాటను వెనక్కు తీసుకోలేరు కదా! ఒకవేళ తీసుకోదలిస్తే, ఆ నెపం బీజేపీ మీద వేస్తారా? కాలమే దీనికి సమాధానం చెపుతుంది.

కాంగ్రెస్, వైకాపాలకు కేవీపీ ఎఫెక్ట్

  సరిగ్గా రెండు వారాల క్రితం అమెరికా దర్యాప్తు సంస్థ రాజ్యసభ సభ్యుడు కే.వీ.పీ. రామచంద్రరావుపై టైటానియం కుంభకోణంలో మోపిన అభియోగాలను చికాగో కోర్టు దృవీకరించినప్పుడు, రాష్ట్ర రాజకీయ వర్గాలలో కలకలం చెలరేగింది. అయితే షరా మామూలుగానే అప్పుడు కేవీపీ తనపై అటువంటి నిరాధారమయిన ఆరోపణలు రావడం దురదృష్టకరమని, చికాగో కోర్టు, సదరు దర్యాప్తు సంస్థ వెంటనే తమ నివేదికలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఆ నివేదిక చూసిన తరువాతనే తాను స్పందిస్తానని అప్పటికి తప్పుకోగలిగారు.   అయితే కధ అక్కడితో ముగిసిపోలేదు. ఆ తరువాత కొద్ది రోజులకే, అమెరికా సంస్థ కేవీపీ అరెస్టు కోరుతూ, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఆయనను తమకు అప్పగించమని భారత ప్రభుత్వానికి కూడా కోరింది. ఇదంతా జరిగి అప్పుడే పది రోజులయింది. కానీ ఆ సంగతి ఈరోజే బయట పడింది. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయిన కేవీపీ ఈరోజే ప్రమాణ స్వీకారం చేసారు. బహుశః అందుకొరకే ఇంతకాలం ఈ విషయాన్ని ప్రభుత్వం త్రొక్కిపెట్టి ఉండి ఉండవచ్చును. తమకు పది రోజుల క్రితం అందిన రెడ్ కార్నర్ నోటీసును సీబీఐ, ఈరోజు రాష్ట్ర సీఐడీ పోలీసు శాఖకు పంపినట్లు సమాచారం.   భారత పార్లమెంటు సభ్యుడయిన ఆయనను అమెరికా దర్యాప్తు సంస్థ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ద్వారా అరెస్టు చేయడం సాధ్యమా కాదా? అనేది న్యాయ నిపుణులు తేల్చవలసిన విషయం గనుక అది అప్రస్తుతం. ఈ నోటీసు వలన ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా? ఆయన తనకున్న అపారమయిన రాజకీయ పలుకుబడి, పరపతిని వినియోగించి అరెస్టు నుండి తప్పించుకొంటారా? లేక ఆయన కూడా తెలివిగా కోర్టును ఆశ్రయించి తప్పుకుంటారా? అనేవి కూడా అప్రస్తుత విషయాలే.   కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు బయటపడిన ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం ఉన్న కాంగ్రెస్, వైకాపాలపై అది ఏవిధంగా ప్రభావం చూపబోతోంది? దాని నుండి ఆ రెండు పార్టీలు ఏవిధంగా తప్పుకొనే ప్రయత్నాలు చేస్తాయి? వంటివే ప్రధానంగా చర్చకు రానున్నాయి.

టిడిపికి ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్న జూనియర్ ఎన్.టి.ఆర్.

      తెలుగుదేశం పార్టీకి సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ మద్దతు పలికిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారం చేయడానికి రంగంలోకి దిగితున్నట్లు సమాచారం. ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ, నారా లోకేష్ టిడిపికి ప్రచారం చేస్తుండగా...ప్రిన్స్ మహేష్ బాబు కూడా తన బావ టిడిపి గుంటూరు లోక్‌సభకు అభ్యర్ధి గల్లా జయదేవ్‌కు మద్దతుగా ఆన్ లైన్ ప్రచారం మొదలుపెట్టారు. టాలీవుడ్ పెద్ద హీరోలంతా టిడిపికే మద్దతు తెలుపుతుండడంతో..తాను మాత్రమే పార్టీకి దూరంగా వుంటే నందమూరి అభిమానుల్లో రాంగ్ మెస్సేజ్ వెళ్లే ప్రమాదం వుందని భావించిన ఎన్టీఆర్ ప్రచారానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ తరఫున ఏయే నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తారు... రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలన్న అంశంపై రేపే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

కేవీపీ అరెస్ట్ కు రంగం సిద్దం..!!

      కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు అరెస్టుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది . టైటానియం స్కాం మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేవీపీని అరెస్టు చేయడానికి తమకు సహకరించాలని ఇంటర్‌పోల్ ద్వారా అమెరికా పంపిన రెడ్ కార్నర్ నోటీసులు సీబీఐ స్వీకరించింది. సీబీఐ రెడ్ కార్నర్ నోటీసులను హైదరాబాద్ సీఐడీ ఏడీఐకు పంపించినట్లు సమాచారం. సీఐడీకి పంపిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోసం సీబీఐ అధికారాలు ఎదురుచుస్తున్నారు. కేవీపీ అరెస్టు త్వరలోనే జరుగుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

చావుబతుకుల్లో వున్న ఛోటారాజన్

      అంతర్జాతీయ మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం చిరకాల ప్రత్యర్థి అయిన ఛోటా రాజన్ చావుబతుకుల్లో. మాఫియా కార్యకలాపాలతో ఎంతోమందిని చంపేసిన ఛోటారాజన్ ఇప్పుడు తానే చావుబతుకుల్లో వున్నాడు. ఈ మాఫియా లీడర్‌కి మరో మాఫియా లీడర్ అయిన దావూద్ ఇబ్రహీం అంటే అస్సలు పడదు. దావూద్ ఇండియాలో ఉన్నంతకాలం వీళ్ళ మనుషులు కొట్టుకు చస్తూ వుండేవాళ్ళు. ప్రస్తుతం వయసు బాగా పైబడిన ఛోటారాజన్ ఆరోగ్య పరిస్థితి చెయ్యి దాటిపోయినట్టు తెలుస్తోంది.   ప్రస్తుతం ఇతగాడు మలేసియాలోని ఓ ఆస్పత్రికో కిడ్నీకి సంబంధించిన చికిత్స చేయించుకుంటున్నాడు. ఆ కిడ్నీ సమస్య కూడా దావూద్ ఇబ్రహీం వల్లే వచ్చింది. 2001లో దావూద్ కాల్చిన తుపాకీ గుండు ఛోటా రాజన్ కిడ్నీలోకి దూసుకుపోయింది. అప్పటి నుంచి రాజన్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ముంబైలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముకుంటూ జీవితాన్ని ప్రారంభించిన రాజన్ క్రమంగా మాఫియా లీడర్‌గా ఎదిగాడు. 1993లో ముంబై పేలుళ్ళ తర్వాత దావూద్ ఇబ్రహీంతో ఇతని శత్రుత్వం మరింత పెరిగిందని అంటారు. ప్రస్తుతం రేపోమాపో అన్నట్టుగా వున్న ఛోటా రాజన్ ఈ దశలో కూడా దావూద్ మీద పగ వదిలిపెట్టలేదు. దావూద్ ఇబ్రహీంని చంపకుండా నేను చావనుగాక చావనని అంటున్నాడట. ఛోటా రాజన్ ఆరోగ్యం విషయంలో మలేసియా డాక్టర్లు చేతులెత్తేశారట. ఎంతోమంది చావుకి కారణమైన ఈ మాఫియా డాన్ కథ త్వరలో ముగియబోతోంది.

బీజేపీ నేత గిరిరాజ్ సింగ్‌కి కోర్డు అరెస్ట్ వారెంట్ జారీ

      ఎన్నికల సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారి మీద చట్టం దృష్టిని కేంద్రీకరిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతాపార్టీ నాయకుడు  గిరిరాజ్ సింగ్‌కు బొకారో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ అరెస్ట్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కు బొకారో సబ్ డివిజనల్ జుడీషియల్ కోర్టు మేజిస్ట్రేట్ అమిత్ శేఖర్ స్పందించి అరెస్ట్ కు ఆదేశించారు. జార్ఖండ్ లో గిరిరాజ్‌కు వ్యతిరేకంగా రెండు ఎఫ్ఐఆర్ లు దాఖలు చేశారు. తొలుత బొకారో, ఆతర్వాత దియోఘర్ జిల్లాలో కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం జార్ఖండ్‌లోని రాంచీలో ఎన్నికల ప్రసంగం చేసిన ఆయన నరేంద్ర మోడీకి ఓటు వేయనివాళ్ళు పాకిస్థాన్‌కి వెళ్ళిపోవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశంలో సంచలనం కలిగింది. ఈ విషయంపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఇప్పటికే గిరిరాజ్ ఎన్నికల ప్రసంగాలు చేయకూడదని నిషేధించింది.  

తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థి కృష్ణయ్య: చంద్రబాబు

      తెలంగాణ టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్య పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న మాటకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి వుందని, తెలంగాణలో సంపూర్ణ మెజారిటీ వస్తే ఆర్.కృష్ణయ్యని ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్‌లాగా తాను మాట తప్పే వ్యక్తిని కాదని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటి వరకూ తెలుగుదేశంలో తెలంగాణకు బీసీని సీఎం చేస్తామన్న చర్చే జరిగింది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే కృష్ణయ్యే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీలో, బయట జరిగింది. కృష్ణయ్య కూడా తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడి నోటివెంట అధికారికంగా కృష్ణయ్య పేరు రావడంతో కృష్ణయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఖరారైనట్టు అయింది. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బీసీల ఓట్లు పెంచే అవకాశం వుందని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు.

పవన్ తెలుగుజాతికి స్ఫూర్తా? అబ్బఛా! ఏరకంగా?

      ఈ ఎన్నికల తర్వాత దేశానికి ప్రధానమంత్రి అయిపోవాలన్న తహతహ నరేంద్రమోడీలో బాగా పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. దేశమంతా మోడీ మోడీ అంటున్నా ఆయనకి ఇంకా తాను ప్రధానమంత్రిని కానేమో అనే టెన్షన్ పట్టుకున్నట్టుంది. అందుకే అప్పుడప్పుడు నోటికొచ్చిన స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నాడు. పైగా ఎన్నికల ప్రచారంలో ఆ ఊరూ ఈ ఊరూ ఎండలో తిరుగుతున్నాడేమో తల తిరిగి తనకి తెలియకుండానే ఏదేదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది.   తాజాగా మోడీ ఇచ్చిన అత్యంత కామెడీ ప్రకటనని తలచుకుని రాష్ట్రంలో రాజకీయ వర్గాలు నవ్వుకుంటున్నాయి. ఇంతకీ ఆ కామెడీ ప్రకటన ఏంటంటే, పవన్ కళ్యాణ్ తెలుగుజాతికి స్ఫూర్తి అట.. తెలుగుతల్లిని సజీవంగా వుంచే శక్తి పవన్ కళ్యాణ్‌కి వుందట. పవన్ కళ్యాణ్ మాటలు తన హృదయానికి హత్తుకున్నాయట. అయ్యా మోడీ, ఏంటయ్యా ఈ కామెడీ. పవన్ కళ్యాణ్ ఏంటి? తెలుగు జాతికి స్ఫూర్తి ఏంటి? పుట్టి బుద్ధెరిగిన దగ్గర్నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనే ఏడుస్తూ, తెలుగు మాట్లాడుతూ తగలడుతున్న మాకు తెలియని ఈ రహస్యం ఎక్కడో గుజరాత్‌లో వున్న నీకెలా తెలిసిందయ్యా? పాతికేళ్ళు సంసారం చేసిన మొగుడూ పెళ్ళాలకే ఒక్కసారి ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలియదు. కానీ నీకు మాత్రం నిన్నగాక మొన్న నిన్ను కలిసిన పవన్ కళ్యాణ్‌ గురించి అంత బాగా తెలిపోయిందా?  నువ్వు పవన్ కళ్యాణ్‌ని ఆరకంగా పొగుడుతూ వుంటే నీ మనస్సాక్షి నిన్ను తిట్టిపోయలేదా? ఓకే.. నువ్వు ప్రధానమంత్రి కావాలి. స్టేజీమీదకి ఎక్కితే ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని పవన్ కళ్యాణ్ మద్దతు నీకు కావాలి. దానికోసం నీ పాట్లేవో నువ్వు ఒక పద్ధతిగా పడు తప్పేం లేదు. కానీ, తెలుగువారి కర్ణభేరి పగిలిపోయే రేంజ్ డైలాగ్స్ మాత్రం కొట్టకయ్యా నీకు దణ్ణంపెడతాం.

హిందూపురం ప్రచారం: బాలకృష్ణ చైతన్యరథం ఎక్కాలి

      అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ రంగంలో నిలవటం తెలుగుదేశం వర్గాలకు సంతోషాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మురిసిపోతున్నారు. నందమూరి తారక రామారావు ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పోటీలో నిలబడటం అంత సంతోషాన్ని కలిగిస్తోందని అంటున్నారు.   ఈ సందర్భంగా హిందూపురం తెలుగుదేశం వర్గాలు బాలకృష్ణని చిన్న కోరిక కోరుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం రామకృష్ణ హార్టీ కల్చర్ స్టూడియోస్‌ షెడ్‌లో వున్న చైతన్యరథాన్ని మళ్ళీ బయటకి తీసి హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ ప్రచారం చేసే సమయంలో చైతన్యరథాన్ని ఎక్కి ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు. చైతన్య రథాన్ని ఎక్కి నందమూరి అన్నగారు సృష్టించిన సంచలనాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలని అనుకుంటున్నారు. అన్నగారి స్థానంలో బాలయ్యని చూసుకోవాలని ముచ్చటపడుతున్నారు. మరి బాలకృష్ణ అభిమానుల ఈ చిన్న కోరిక తీరుస్తారో లేదో చూడాలి.

జగన్ పార్టీ నాయకుడి భూమిలో మందు బాటిళ్ళ పంట

      కాయకష్టం చేసి భూమిలోంచి బంగారం లాంటి పంటను బయటకి తీసుకురావచ్చు. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఒక వైకాపా నాయకుడి భూమిలోంచి మద్యం సీసాలు బయటపడుతున్నాయి. నెల్లూరు జిలాలా ముత్తుకూరు మండలం పల్లిపాడు దిబ్బ దగ్గర జగన్ పార్టీ నేత చిన్నపురెడ్డి పొలం దగ్గరకి పోలీసులు పెద్ద పొక్లెయిన్‌తో సహా దిగిపోయారు. స్థానికులు ఏం జరిగిందా అని ఆశ్చర్యంగా చూస్తూ వుండగానే పోలీసుల పొక్లెయిన్ చిన్నపురెడ్డి పొలంలోనుంచి మద్యం బాటిళ్ళని తవ్వి తీయడం ప్రారంభించింది. ఈ తవ్వకాల్లో ఏ వంద బాటిళ్ళో, రెండు వందల బాటిళ్ళో దొరికి వుంటాయని భావిస్తున్నారా? కాదు.. మొత్తం ఐదు వేలకి పైగా మందు బాటిళ్ళు బయటపడ్డాయి. ఈ ఎన్నికలలో పంపిణీ చేయడానికి ముందు జాగ్రత్తగా జగన్ పార్టీ నాయకుడు వాటిని తన భూమిలో పాతిపెట్టాడు. మంచి నిఖార్సయిన సరుకనుకుంటా.. వాసనొచ్చి దొరికిపోయింది.

పవన్ ఇంటికి బాబు వెళ్ళకుండా వుండాల్సిందా?

      పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్ళడాన్ని పలువురు తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు లాంటి జాతీయ స్థాయి నాయకుడు అవసరమైతే పవన్ కళ్యాణ్‌నే తన దగ్గరకి పిలిపించుకోవాలే తప్ప తాను పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడమేంటని బాధపడుతున్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌తో ఎంత అవసరం వుంటేమాత్రం ఇలా మెట్టు దిగడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని కలవటానికి గుజరాత్ వరకు వెళ్ళాడు. అలాంటిది చంద్రబాబు నాయుడిని కలవటానికి హైదరాబాద్‌లో చంద్రబాబు ఉన్నచోటికి రాలేడా అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏరకంగా చూసినా నరేంద్రమోడీ కంటే ఎక్కువ స్థాయి నాయకుడన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.