పవన్ తెలుగుజాతికి స్ఫూర్తా? అబ్బఛా! ఏరకంగా?
posted on Apr 23, 2014 @ 3:36PM
ఈ ఎన్నికల తర్వాత దేశానికి ప్రధానమంత్రి అయిపోవాలన్న తహతహ నరేంద్రమోడీలో బాగా పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. దేశమంతా మోడీ మోడీ అంటున్నా ఆయనకి ఇంకా తాను ప్రధానమంత్రిని కానేమో అనే టెన్షన్ పట్టుకున్నట్టుంది. అందుకే అప్పుడప్పుడు నోటికొచ్చిన స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నాడు. పైగా ఎన్నికల ప్రచారంలో ఆ ఊరూ ఈ ఊరూ ఎండలో తిరుగుతున్నాడేమో తల తిరిగి తనకి తెలియకుండానే ఏదేదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది.
తాజాగా మోడీ ఇచ్చిన అత్యంత కామెడీ ప్రకటనని తలచుకుని రాష్ట్రంలో రాజకీయ వర్గాలు నవ్వుకుంటున్నాయి. ఇంతకీ ఆ కామెడీ ప్రకటన ఏంటంటే, పవన్ కళ్యాణ్ తెలుగుజాతికి స్ఫూర్తి అట.. తెలుగుతల్లిని సజీవంగా వుంచే శక్తి పవన్ కళ్యాణ్‌కి వుందట. పవన్ కళ్యాణ్ మాటలు తన హృదయానికి హత్తుకున్నాయట. అయ్యా మోడీ, ఏంటయ్యా ఈ కామెడీ. పవన్ కళ్యాణ్ ఏంటి? తెలుగు జాతికి స్ఫూర్తి ఏంటి? పుట్టి బుద్ధెరిగిన దగ్గర్నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనే ఏడుస్తూ, తెలుగు మాట్లాడుతూ తగలడుతున్న మాకు తెలియని ఈ రహస్యం ఎక్కడో గుజరాత్‌లో వున్న నీకెలా తెలిసిందయ్యా?
పాతికేళ్ళు సంసారం చేసిన మొగుడూ పెళ్ళాలకే ఒక్కసారి ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలియదు. కానీ నీకు మాత్రం నిన్నగాక మొన్న నిన్ను కలిసిన పవన్ కళ్యాణ్ గురించి అంత బాగా తెలిపోయిందా? నువ్వు పవన్ కళ్యాణ్‌ని ఆరకంగా పొగుడుతూ వుంటే నీ మనస్సాక్షి నిన్ను తిట్టిపోయలేదా? ఓకే.. నువ్వు ప్రధానమంత్రి కావాలి. స్టేజీమీదకి ఎక్కితే ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని పవన్ కళ్యాణ్ మద్దతు నీకు కావాలి. దానికోసం నీ పాట్లేవో నువ్వు ఒక పద్ధతిగా పడు తప్పేం లేదు. కానీ, తెలుగువారి కర్ణభేరి పగిలిపోయే రేంజ్ డైలాగ్స్ మాత్రం కొట్టకయ్యా నీకు దణ్ణంపెడతాం.