సబ్బం హరి కూడా జంప్
posted on May 6, 2014 @ 1:50PM
జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డికి మొన్నటి నుండి వరుసపెట్టి షాకులు తగులుతున్నాయి. రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ ఆయనతో సహా మరో 24మంది వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మొన్న తిరస్కరించింది. ఆ తరువాత నిన్న గుంటూరు జిల్లాలో జైసపా అభ్యర్ధులు నలుగురు పోటీ నుండి తప్పుకోవడమే కాకుండా రాయపాటి సమక్షంలో తెదేపాలో చేరిపోయారు. ఈరోజు ఆ పార్టీ టికెట్ పై వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న సబ్బం హరి కూడా పార్టీకి రాజీనామా చేసి,బీజేపీ అభ్యర్ధి కంబంపాటి హరిబాబుకి మద్దతుగా పోటీ నుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
ఈసందర్భంగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే అన్నివిధాల అభివృద్ధి చెందిన విశాఖ నేటికీ ఒక ప్రశాంత నగరంగా ఉంది. కానీ, వైకాపా అభ్యర్ధి విజయమ్మ గనుక ఇక్కడి నుండి గెలిచినట్లయితే, ఇక విశాఖలో కూడా అరాచక శక్తులు తిష్టవేసి నగరాన్ని అల్లకల్లోలం చేసే ప్రమాదం ఉంది. అందుకే నేను వైజాగ్ నుండి పోటీలోకి దిగాను. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నా మూలంగా ఓట్లు చీలి వైకాపా అభ్యర్ధి విజయమ్మకు లబ్ది కలగకూడదనే ఆలోచనతోనే నేను పోటీ నుండి తప్పుకొంటున్నాను. నా నిర్ణయం కొందరికి నచ్చవచ్చు, మరికొందరికి ఆగ్రహం తెప్పించవచ్చును. కానీ, నా జిల్లా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా నేను ఇటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.