మోడీ క్యాబినెట్‌లో ప్రధానశాఖలపై బాబు దృష్టి..!
posted on May 24, 2014 @ 2:53PM
మోడీ క్యాబినెట్‌లో ప్రాధాన్యమున్న శాఖలను సంపాదించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు బాబు శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ టూర్‌ను సద్వినియోగం చేసుకుని మంచి మంత్రిత్వ శాఖలను దక్కించుకోవాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారు. ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు ఇస్తామని టీడీపీ అధినేతకు బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే తెలియజేసింది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా ఎక్కువగా ఉండడంతో కనీసం రెండు క్యాబినెట్ మూడు సహాయ మంత్రి పదవులు తీసుకోవాలన్న ఆలోచనలో బాబు ఉన్నారు. ఈ మేరకు ఆదివారం మోడీతో టీడీపీ అధినేత చర్చలు జరుపనున్నారు. సీమాంధ్రలో టీడీపీ 15 ఎంపీ సీట్లు, తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలుచుకున్నది. అలాగే పార్టీకి ఆరుగురు రాజ్యసభ సభ్యులున్నారు. మంత్రి పదవుల కోసం సీనియర్లంతా ప్రయత్నాలు చేస్తున్నారు.