సమగ్ర సర్వే... జూనియర్ ఎన్టీఆర్... లగడపాటి...

  సినీ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్లో తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్కు తమ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు అందచేశారు. జూనియర్ ఎన్టీఆర్ కుమారుడికి సోమవారం నాడే పేరు పెట్టారు. సర్వేలో జూనియర్ కుమారుడు అభయ్ రామ్ పేరు కూడా నమోదు చేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంట్లో లేకపోవటంతో ఎన్యుమరేటర్ వివరాలు నమోదు చేసుకోకుండానే వెనుతిరిగారు. కుందన్బాగ్ ఆఫీసర్స్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తన వివరాలు నమోదు చేయించుకున్నారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ రాజేంద్ర నగర్లో ఎన్యుమరేటర్లకు వివరాలు వెల్లడించారు.

సర్వే ఎఫెక్ట్... గర్భిణికి సమస్య...

  సమగ్ర కుటుంబ సర్వే ఫలితంగా మెదక్ జిల్లాలో ఓ మహిళ పురిటినొప్పులతో ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంది. మెదక్ జిల్లా శివంపేటకి చెందిన జ్యోతి అనే గర్భిణి పురిటి నొప్పులతో మంగళవారం ఉదయం ఏడు గంటలకు నరసాపూర్ ఆస్ప్తత్రికి అయితే డాక్టర్లు లేరంటూ సిబ్బంది ఆమెను తిప్పి పంపారు. సమగ్ర కుటుంబ సర్వే ఉండటం వల్ల సిబ్బంది ఎవరూ రారని చెప్పారు. వాస్తవానికి వైద్యసేవల లాంటి అత్యవసర సేవలకు సర్వే నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినా వైద్యులు సర్వే పేరు చెప్పి విధులకు హాజరు కాలేదు. కనీసం ఆస్పత్రిలో నర్సులు, హెడ్ నర్సు ఉండాల్సి ఉన్నా, సర్వే కోసం వాళ్లు తమ తమ ఇళ్లకు వెళ్లినట్లు చెబుతున్నారు. కనీసం ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఏవీ తెరవకపోవడంతో పురిటినొప్పులతో బాధపడుతున్న జ్యోతి నడిరోడ్డుమీదే ఉండిపోవాల్సి వచ్చింది.

యు.పి.లో వరదలు... 49 మంది మృతి

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల్లో మరణించిన వారి సంఖ్య 49కి చేరింది. తొమ్మిది జిల్లాలో ఇంకా వరద ఉధృతి తీవ్రంగా ఉంది. బహరైచ్ జిల్లాలో 22మంది, శ్రవస్తి జిల్లాలో 10మంది, బలరామ్పూర్ జిల్లాలో ఇద్దరు, లఖింపూర్ జిల్లాలో 11మంది, సితాపూర్ జిల్లాలో నలుగురు వ్యక్తులు వరద కారణంగా మరణించారు. ఇప్పటికీ 15 వందల గ్రామాలు నీట మునిగి వున్నాయి. వరద సహాయం నిమిత్తం రాష్ట్రప్రభుత్వం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు, పోలీసులు, జాతీయ విపత్తు సహాయక సిబ్బంది....సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా రాప్తీ, సరయు, ఘాఘ్ర, శారద తదితర నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

దొంగనోట్ల ఎల్లంగౌడ్ లొంగిపోయాడా?

  హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్ అరెస్టయ్యాడు. ఎల్లంగౌడ్‌ని ఎస్ఓటీ పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం ఒక పోలీసు కానిస్టేబుల్ మీద కాల్పులు జరిపిన కేసులో ఎల్లం గౌడ్ నిందితుడు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి పరారీలో వున్న ఎల్లంగౌడ్‌ని ఎంతో పరిశోధించి అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఎల్లం గౌడ్ తన భార్యకు ఫోన్ చేస్తూ వుండటంతో అతని ఫోన్‌ని ట్రేస్ చేసి మహారాష్ట్రలో అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఎల్లంగౌడ్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, అతనే లొంగిపోయాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎల్లంగౌడ్ పట్టుబడటంలో పోలీసుల గొప్ప ఏమీ లేకపోయినా ఆ క్రెడిట్‌ని తమ ఖాతాలో వేసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తు్న్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఊతకర్ర సహాయంతో బాలకృష్ణ....

  నందమూరి బాలకృష్ణ ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో బైక్ మీద నుంచి జారి పడి గాయపడిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తొలిరోజు సమావేశాలకు బాలకృష్ణ ఊతకర్ర సాయంతో వచ్చారు. బాలకృష్ణని టీడీపీ, వైసీపీలకు చెందిన శాసనసభ్యులు ఆయనను పరామర్శించారు. ఆయనకు గాయం ఎలా అయ్యిందో... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అడిగిన వారందరికీ సమాధానం చెబుతూ బాలకృష్ణ చాలా ఉత్సాహంగా కనిపించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బాలకృష్ణ, నటి రోజాలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ బయటకు రావడం విశేషం. రోజా టీడీపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో బాలకృష్ణ, రోజా ఇలా ముచ్చటించుకోవడం ఆసక్తికరంగా మారింది.

ప్రేమించలేదని గొంతుకోసింది..

  సాధారణంగా ప్రేమించని పాపానికి యువతుల మీద దాడులు జరుగుతూ వుంటాయి. అందుకు పూర్తిగా రివర్స్‌గా వున్న సంఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. రమణి అనే యువతి తనకు అన్న వరస అయ్యే యువకుడి మీద మనసుపడింది. ప్రేమించానని చెప్పింది. అయితే రాము మాత్రం తప్పు అన్నాడు. అయినా రమణి వినలేదు. వెంటపడి వేధించడం మొదలుపెట్టిది. అయితే రాము మాత్రం ఆమె ప్రేమకు ససేమిరా అంటూ వచ్చాడు. మొన్నీమధ్యే రాము తన మేనకోడలిని పెళ్ళి చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన రమణి సోమవారం సాయంత్రం ఆమె నీతో మాట్లాడాలి, పని ఉందంటూ అతడిని వేదాద్రి వద్దకు పిలిపించింది. అక్కడే అతడిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. అక్కడినుంచి నేరుగా ఆస్పత్రికి వచ్చిన రాము.. చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్లు ఏం జరిగిందని అడిగినా ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. అయితే మరింత గట్టిగా అడగడంతో అప్పుడు అసలు విషయం చెప్పాడు. దాంతో కుటుంబ సభ్యులు అతడిని వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కోదండరాం?

  మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నారా? ఈ ఆలోచన కోదండరాంకి వుందోలేదో గానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిశీలిస్తోంది. సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు ఆర్‌సీ కుంతియా సమక్షంలో గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఈ ప్రతిపాదన వచ్చింది.మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాంను నిలబెడితే బాగుంటుందని పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రతిపాదించారు. గత ఎన్నికల్లో ఉద్యోగులంతా టీఆర్‌ఎస్ పక్షాన నిలిచి గెలిపిస్తే కేసీఆర్ మాత్రం కోదండరాంను పక్కనపెట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. చిన్నారెడ్డి ప్రతిపాదన పట్ల పలువురు నేతలు సానుకూలంగా స్పందించారు.

ఆటోని ఢీకొన్న రైలు... 20 మంది మృతి

  బీహార్‌లో దారుణం జరిగింది. మెదక్ జిల్లా మాసాయిపేట తరహా ఘోర ప్రమాదం జరిగింది. రాప్తి గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఆటో రిక్షాను ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఎనిమిది మంది చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు చంపారన్ జిల్లాలోని సెమ్రా, సుగౌలి రైల్వే స్టేషన్ల మధ్య ఆటోరిక్షా రైల్వే గేట్‌ను దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా చినౌతా గ్రామానికి చెందిన వారు. ఓ ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. గేట్ మెన్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ జరపనుంది. ఆటోని ఢీకొన్న రైలు సుమారు 50 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకుపోయింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయి. బీహార్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంతాపం తెలిపారు.

సిరిసిల్లలో సర్వేకి అభ్యంతరాలు

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకి కేసీఆర్ తనయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సిరిసిల్లలోని సంజీవయ్య నగర్ కాలనీకి సర్వే చేయడం కోసం అధికారులు వెళ్ళారు. అక్కడ కాలనీ ప్రజలు అధికారులను అడ్డుకున్నారు. సర్వే కోసం ఇచ్చిన ప్రశ్నలు అసమగ్రంగా వున్నాయని వారు ఈ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే ప్రశ్నావళిలో ఆస్తులకు సంబంధించిన ప్రశ్నలు వున్నాయిగానీ, అప్పులకు సంబంధించిన ప్రశ్నలు లేవేమిటని, ఆస్తుల గురించి అడుగుతారు తప్ప అప్పుల గురించి అడగరా అని వారు ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు తమ దగ్గర సమాధానం లేకపోవడంతో అధికారులు నీళ్ళు నమిలారు.

దొంగనోట్ల ఎల్లంగౌడ్ అరెస్ట్

  హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్ అరెస్టయ్యాడు. ఎల్లంగౌడ్‌ని ఎస్ఓటీ పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఈ నెల నాలుగో తేదీన హైదరాబాద్ శివార్లలోని శామీర్పేట ప్రాంతంలో ఎల్లంగౌడ్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అప్పుడు ఎల్లంగౌడ్ పోలీసుల మీద జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఎల్లంగౌడ్ అనుచరుడు మరణించాడు. అప్పటి నుంచి ఎల్లం గౌడ్ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు అతణ్ణి మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఎల్లంగౌడ్ తరచు తన భార్యకు ఫోన్ చేస్తుండటంతో ఆమె కాల్ డేటా ఆధారంగా అతడున్న ప్రాంతం వివరాలు సేకరించి అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు.

సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారు....

  తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ సమగ్ర సర్వేపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడమే ఈ సర్వే ఉద్దేశమని రాజయ్య స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నామని వివరించారు. గతంలో విచ్చలవిడిగా జరిగిన అవకతవకల కారణంగా అర్హులకు అందవలసిన ప్రయోజనాలు వారికి అందలేదని చెప్పారు. అందుకే అర్హత కలిగిన ప్రతి గడప, గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేర్చే ఉద్ధేశ్యంతో సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. గత సర్వేలకు భిన్నంగా, పారదర్శకంగా ఈ సర్వే జరుగుతుందని, ప్రజలు అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశాభావ వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మాని అర్థవంతమైన సలహాలు, సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

గుర్తుపట్టలేని విధంగా జగ్గారెడ్డి...

  సంగారెడ్డి మాజీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఎంతమాత్రం గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. బారెడు గడ్డంతో తన మార్కు గెటప్‌తో అందరికీ పరిచితుడైన ఆయన లేటెస్ట్‌గా క్లీన్ షేవ్‌తో గుర్తించలేని విధంగా మారిపోయారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రమే కాదు.. సాక్షాత్తూ సంగారెడ్డి ప్రజలు కూడా ఇప్పుడు ఆయన్ని గుర్తుపట్టలేరు. సోమవారం నాడు జగ్గారెడ్డి తిరుమలకు వెళ్ళి నీలాలు సమర్పించారు.దాంతో ఇప్పుడు జగ్గారెడ్డిని చూస్తే ఎవరో కొత్త మనిషిని చూసిన విధంగానే వుంది. జగ్గారెడ్డి రాజకీయ రంగప్రవేశం చేసినప్పటి నుంచి గడ్డంతోనే కనిపించారు. ఆయన గడ్డం మీద, జుట్టు బాగా పెరిగిపోయిన ఆయన గెటప్ మీద ఎవరు ఎన్నిరకాలుగా విమర్శలు చేసినప్పటికీ ఆయన తన గెటప్ మార్చుకోలేదు. తాజాగా ఏడుకొండల వెంకన్నకి తన నీలాలు సమర్పించారు. తన గడ్డం వెనుక ఎలాంటి మొక్కూ లేదని జగ్గారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

మూడుసార్లు వెల్‌లోకి వైసీపీ

  ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశం మీద చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు మూడుసార్లు వెల్‌లోకి దూసుకు వెళ్ళడంతో అసెంబ్లీ మూడుసార్లు వాయిదా పడింది. రెండుసార్లు కొద్ది సమయం వాయిదా పడిన అసెంబ్లీ మూడోసారి మాత్రం ఏకంగా మంగళవారానికి వాయిదా పడింది. దాంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటిరోజు ఎలాంటి చర్చా జరగకుండానే ముగిసింది. శాంతి భద్రతలపై మాట్లాడే హక్కు వైకాపాకు లేదంటూ తెలుగుదేశం సభ్యులు, శాంతి భద్రతలను కాపాడాలంటూ వైకాపా సభ్యులు ప్లకార్డుల ప్రదర్శనలకు దిగడంతో సభలో గందరగోళం తలెత్తింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. 11మంది వైకాపా కార్యకర్తలు గత మూడు నెలల్లో హత్యకు గురయ్యారని, ఈ అంశంపై చర్చించాలంటూ స్పీకర్‌ను కోరారు. 

ఇండియా హిందూ దేశమే... భగవత్...

  ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఇండియా హిందూ దేశమేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లౌకిక రాజ్యమైన భారతదేశాన్ని హిందూ దేశంగా మోహన్ భగవత్ అభివర్ణించడం వివాదాస్పదమవుతోంది. ‘‘భారతదేశం హిందూ రాజ్యం.. హిందుత్వమనేది దాని గుర్తింపు. హిందుత్వం అన్ని మతాలను తనలోనే ఇముడ్చుకుంది’’ మోహన్ భగవత్ పేర్కొన్నారు. శ్రీకష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడంతో పాటు విశ్వ హిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ముంబైకు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓసారి ఇండియాలో ఉండేవారందరూ హిందూవులేనంటూ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే.

జాకీచాన్‌ కుమారుడు జేసీ చాన్ అరెస్ట్

  సూపర్‌స్టార్ జాకీచాన్‌కి సన్ స్ట్రోక్ తగిలింది. సన్ స్ట్రోక్ అంటే ఎస్ యు ఎన్ కాదు.. ఎస్ ఎ ఎ... అంటే, జాకీచాన్ పరువు ఆయనగారి ముద్దుల కొడుకు జేసీ చాన్ కారణంగా మంటగలిసిపోయిందన్నమాట. కుమారుడు జేసీ చాన్ ను చైనా పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న నేరం మీద అతన్నిపోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న జేసీ చాన్, అతని స్నేహితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్‌తో కలిసి వస్తుండగా వారిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఈ హీరో కామెంట్లు గత మంగళవారం నుంచి వెలుగుచూడలేదు. దాంతో జాయ్ సీ చాన్ ఎక్కడకి వెళ్ళాడా అన్న సందేహాలు అభిమానులలో కలిగాయి. అయితే తాజాగా గత మంగళవారం నుంచి అతను పోలీసుల అదుపులో వున్న విషయం తాజాగా వెల్లడయింది.

విశాఖ బీచ్... గోవా స్టైల్

  విశాఖపట్నం బీచ్‌ను గోవా తరహాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. కొద్ది రోజుల క్రితమే టెక్నికల్ కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించిందని అయ్యన్న తెలిపారు. అచ్యుతాపురంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై నేవీ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారన్నారు. ఒకవేళ అచ్యుతాపురంలో వీలుకాకుంటే భీమిలిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. భీమిలిలో ఉన్న ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమకు కేటాయిస్తామని వెల్లడించారు.