ములాయంతో చేతులు కలిపేదే లేదు.. మాయావతి
posted on Aug 13, 2014 @ 3:00PM
మొన్నామధ్య జరిగిన ఎన్నికలలో నరేంద్రమోడీ ధాటికి కకావికలు అయిపోయిన కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ ఇప్పుడు షాక్ నుంచి తేరుకుని కర్తవ్యం గురించి ఆలోచిస్తున్నాయి. మొన్నటి వరకు నోటికొచ్చినట్టు తిట్టుకున్న పార్టీలన్నీ బీజేపీ హవా పుణ్యమా అని ఇప్పుడు ముక్తకంఠంతో స్నేహగీతం పాడుతున్నాయి. మొన్నటి ఎన్నికలలో బీహార్‌లో తన్నుకుని తలకలు పోసుకున్న నితిష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్ పార్టీలకి బీజేపీ ధాటికి జాయింట్‌గా బ్యాండ్ పడింది. దాంతో త్వరలో బీహార్‌లో జరగబోతున్న శాసనసభ స్థానాల ఉప ఎన్నికల కోసం ఈ రెండు పార్టీలు జట్టుకట్టాయి. పనిలోపనిగా చావుతప్పి కన్ను లొట్టపోయిన కాంగ్రెస్‌ని కూడా కలుపుకున్నాయి. అత్యంత కృత్రిమంగా వున్న ఈ మూడు పార్టీల కూటమిని చూసి బీహార్ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇది ఒక ‘దుష్ట గ్రహ కూటమి’ అని బాహాటంగానే అంటున్నారు.
ఇదిలా వుంటే, మొన్నటివరకూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకున్న ఈ మూడు పార్టీలూ భుజాల మీద చేతులు వేసుకోవడం చూసి ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్‌కి కూడా ఇలాంటి ఐడియానే వచ్చింది. తను, తన పార్టీ మొన్నటి వరకూ తిట్టిపోసిన మాయవతి పార్టీతో దోస్తీ చేయాలన్న ఆలోచన ములాయం సింగ్‌కి వచ్చింది. ములాయం సింగ్ ఏ దుర్ముహూర్తంలో తన పుత్రరత్రం అఖిలేష్ యాదవ్‌కి ముఖ్యమంత్రి సీటు ఇచ్చారోగానీ, అప్పటి నుంచి కష్టాలే కష్టాలు.. ఎవరికీ? ములాయం ఫ్యామిలీకి కాదు.. ఉత్తర ప్రదేశ్ ప్రజలకి! అయ్యగారు అఖిలేష్ యాదవ్ గద్దెని ఎక్కినప్పటి నుంచి యు.పి.లో నేరాలే నేరాలు, ఘోరాలే ఘోరాలు. ఈసారి వచ్చే ఎన్నికలలో అఖిలేష్‌కి, ములాయంకి గుండుకొట్టాలన్న ఉద్దేశంలో ఉత్తర ప్రదేశ్ ప్రజలు వున్నారు. ఆల్రెడీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో వీరికి అరగుండు కొట్టేశారు. దాంతో భయపడిపోయిన ములాయం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాయావతి పార్టీతో కలసి పోటీ చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. అందుకే మాయవతి పార్టీతో చేతులు కలపడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే తమ స్నేహానికి మధ్యవర్తిగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వుండాలని షరతు విధించారు.
అయితే యు.పి.కి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటున్న మాయావతి ములాయం ప్రతిపాదనకు ఛీ కొట్టారు. నీ పార్టీతో స్నేహం చేసే ఛాన్సే లేదని చెప్పేశారు. దాంతో ములాయం ఆశల మీద నీళ్ళు కురిశాయి. అయినప్పటికీ ములాయం తన స్నేహహస్తాన్ని వెనక్కి తీసుకోలేదు. ములాయం పార్టీ గుర్తు సైకిల్, మాయావతి పార్టీ గుర్తు ఏనుగు.. సైకిల్ వెళ్ళి ఏనుగుకి డ్యాష్ ఇచ్చినా, ఏనుగు వచ్చి సైకిల్‌కి కిక్ ఇచ్చినా రిపేరు వచ్చేది సైకిల్‌కే! ఈ విషయాన్ని ములాయం సింగ్ ఆలోచించుకుంటే మంచిదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.