బాబు నిద్రపోవడం లేదు..!

అక్టోబర్‌ 12న హుద్‌హుద్‌ తుపాను ఉత్తరాంధ్రతోపాటు, తూర్పుగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాల్ని అతలాకుతలం చేసిన విషయం విదితమే. హుద్‌హుద్‌ తుపాను దెబ్బకి విశాఖ మహానగరం విలవిల్లాడి౦ది. అయితే వీలయినంత త్వరగా విశాఖ నగరం మామూలు స్థితికి తెచ్చేందుకు ఆంధ్రప్రభుత్వం రేయింబవళ్ళు కష్టపడుతోంది. విశాఖలో పరిస్థితి చక్కబడే వరకు వదిలేదని కరాఖండీగా చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు విశాఖలో అదే చేస్తున్నారు. నగరంలో చెట్ల తొలగింపు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను ముందుండీ మరీ జరిపిస్తున్నారు. అలాగే అర్థరాత్రి వెళ్లి సిబ్బంది పనులను ఎలా చేస్తున్నారని తనీఖీలు కూడా చేస్తున్నారు. బాబు జోరుచూస్తుంటే అనుకున్న సమయంకంటే ముందుగానే విశాఖ మామూలు స్థితికి చేరుకుంటుందని అంటున్నారు.

అజ్ఞాతంలో వైకాపా ఎమ్మెల్యే

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎమ్మెల్యే సెల్ ఫోన్ గత రెండు రోజులుగా పనిచేయడం లేదు. వ్యక్తిగత సిబ్బందికి తెలియకుండానే ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. చెన్నాయపాలెం సరస్వతీ సిమెంట్ ఫ్యాక్టరీ భూమల వివాదంలో పిన్నెల్లి ఏ-2 నిందితుడు. ఏ-1 నిందితుడిగా ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామిరెడ్డి ఉన్నారు. అయితే వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం చేసుకున్నారు. దీంతో రామకృష్ణరెడ్డి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్ లభించక పోవడంతో ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు.

బెయిల్ వచ్చినా జైల్లోనే జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసిన ఆమె ఇంకా జైల్లోనే వున్నారు. బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రత్యేక కోర్టుకు శుక్రవారం చేరలేదు. దీంతో ఆమె శుక్రవారం అంతా జైల్లోనే వుండాల్సి వచ్చింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే జయలలితను విడుదల చేస్తామని కర్ణాటక డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ జయసింహ చెప్పారు. సుప్రీంకోర్టు తనకు బెయిల్ ఇచ్చిన విషయం జయలలితకు తెలిసిన, అధికారికంగా ఆ విషయాన్ని జైలు అధికారులు తెలియజేయలేదు. కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత జయలలితకు ఆ విషయం తెలిజేస్తామని జయసింహ అన్నారు. శనివారం సాయంత్రం ఆమె విడుదలకు అవకాశాలున్నట్లు తెలిపారు. గతనెల 27 నుంచి జయలలిత బెంగుళూరు జైల్లో వున్నారు. జయలలితతోపాటు ఆమె సన్నిహితులు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌కి కూడా బెయిల్ లభించింది.

లారీ, కారు ఢీ... ఐదుగురి మృతి... ఒకే కుటుంబం

  చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. కడప నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారును రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద ఒక లారీ ఢీకొనడంతో కారులో వున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కారు నంబర్ ఎపి 22 ఎఎం 0250. ఈ ఘోర ప్రమాదంలో మరణించినవారు మహబూబ్ నగర్‌ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని సుజుకీ మోటార్స్‌ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబమని తెలుస్తోంది. వీరు హైదరాబాద్ నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మిలటరీ అధికారులతో మోడీ భేటీ

  భారత ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం నాడు త్రివిధ దళాలకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులను కలిశారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మోడీ మిలటరీ కమాండర్లతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత త్రివిధ దళాలకు చెందిన అధికారులతో సమావేశం కావడం ఇది మొదటిసారి. ఢిల్లీలోని రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో కూడా మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో ఆయన సరిహద్దు భద్రత గురించి చర్చించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొన్నారు.

నలుగురు విద్యార్థుల కిడ్నాప్?

  కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు కిడ్నాప్‌కి గురైనట్టు తెలుస్తోంది. జిల్లాలోని మంత్రాలయం మండలం సాతూరు గ్రామానికి చెందిన వీరేష్‌(13), రఘు(10), దేవన్న(12), అన్వర్‌(12) గురువారం ఉదయం స్కూలు వెళ్లిన తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అదృశ్యమైన విద్యార్థుల్లో ఒక విద్యార్థి దగ్గరున్న సెల్ ఫోన్ నుంచి అతని తల్లిదండ్రులకు తాము కిడ్నాప్ అయ్యామన్న మెసేజ్ వచ్చింది. తమను కొంతమంది కిడ్నాప్ చేసి బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బంధించి హింసిస్తున్నారని కూడా ఆ మెసేజ్‌లో వుంది. దాంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

పవన్ కళ్యాణ్ కారుకు స్వల్ప ప్రమాదం

  పవన్ కళ్యాణ్ కారుకు ప్రమాదం జరిగింది. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు తగల్లేదు. ఖమ్మంలో ప్రాణాంతక వ్యాధితో చికిత్స పొందుతున్న తన అభిమాని శ్రీజను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ కారులో వెళ్తూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి ఖమ్మం బయల్దేరిన పవన్ కళ్యాణ్ వెంట ఆయన సహచరులు కొంతమంది కూడా కార్లలో బయల్దేరారు. దారిలో తన వెంట వస్తున్న కార్లలో ఒక కారుతో పవన్ కళ్యాణ్ కారు ఢీకొంది. పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ పవన కళ్యాణ్ కారు స్వల్వంగా డ్యామేజ్ అయింది. దాంతో పవన్ కళ్యాణ్ తన కారులోంచి కిందకి దిగి మరో కారు ఎక్కి ఖమ్మం బయల్దేరారు.

షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ: ఒక లైలా కోసం

  నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ దర్శకుడు విజయ్ కుమార్ కొండా రూపొందించిన ‘ఒక లైలా కోసం’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమా ఎలా వుందో క్లుప్తంగా చూద్దాం. కార్తీక్ (నాగ‌చైత‌న్య‌) కి ఫ్రీడ‌మ్ అంటే చాలా ఇష్టం. కానీ చ‌దువుల వ‌ల్ల కోల్పోయిన ఫ్రీడ‌మ్ తిరిగి పొందాల‌నుకొంటాడు. ఓ ఏడాదిపాటు న‌న్ను వ‌దిలేయండి, జీవితం గురించి తెలుసుకొస్తా.. అంటాడు. ఇంట్లోవాళ్లు కూడా (సుమ‌న్‌, సుధ‌) స‌రే అంటారు. దాంతో లైఫ్‌ని ఎంజాయ్ చేయ‌డం మొద‌లెడ‌తాడు. ఈ ప్రయాణంలోనందు (పూజా హెగ్డే) క‌నిపిస్తుంది. నందుకి నాన్న (షాయాజీ షిండే) అంటే చాలా ఇష్టం. ఇద్దరి అభిప్రాయాలూ ఇంచుమించూ ఒక‌టే. నందు మంచిత‌నం చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు కార్తి. అయితే ఆమె పేరేంటో, అడ్రసేంటో తెలీదు. ఆ అమ్మాయిని ఊహించుకొంటూ ఓ పుస్తకం రాయ‌డం మొద‌లెడ‌తాడు. అదే ఒక లైలా కోసం. చివరికి ఏదోలా నందుని ప‌ట్టుకొంటాడు. ఐ ల‌వ్ యూ చెబుతాడు. అయితే కార్తీక్‌పై నందుకు మంచి అభిప్రాయం ఉండ‌దు. అందుకే నందు కార్తీక్‌ని రిజ‌క్ట్ చేస్తుంటుంది. ఇంట్లోనూ, ఇటు కార్తీక్ ఇంట్లోనూ పెళ్లి సంబంధాలు వెదుకుతుంటారు. అనుకోకుండా కార్తీక్‌, నందూల పెళ్లి కుదురుతుంది. ఇంట్లో వాళ్లే ఈ సంబంధం సెట్ చేస్తారు. కార్తీక్ అంటే ఇష్టం లేద‌ని చెబుదామ‌నుకొనేలోగా . నిశ్చితార్థం కూడా జ‌రిగిపోతుంది. నాన్న చూసిన సంబంధం కాబ‌ట్టి.. నందు మౌనంగా ఉండిపోతుంది. ఆ త‌ర‌వాత ఏమైంది?? నందు మ‌న‌సులో కార్తీక్ ఎలా చో టు సంపాదించుకున్నాడు?? తెలుసుకోవాలంటే ‘ఒక లైలా కోసం’ సినిమా చూడాలి.

జయలలితకు బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు

  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానాను ఎదుర్కొన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. జయలలిత బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు తిరస్కరించింది. అయితే ఆ తర్వాత జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు జయలలితకు బెయిల్ మంజూరు చేసింది. కర్నాటక హైకోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్‌ మీద ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించారు. దాంతో ఆయన లాయర్‌గా విఫలం అయ్యారని భావించిన జయలలిత వేరే లాయర్‌ ద్వారా సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు జయలలితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తమిళనాడులోని ఆమె అభిమానులు, అన్నా డీఎంకే కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు. గతనెల 27 నుంచి జయలలిత బెంగుళూరు జైల్లో వున్నారు. జయలలితతోపాటు ఆమె సన్నిహితులు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌కి కూడా బెయిల్ లభించింది.

భారతీయ నగరాలకు ఉగ్రదాడుల ప్రమాదం

  అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలు కలిసి భారతదేశంలోని నగరాలపై దాడి చేసే ప్రమాదం ఉందని నేషనల్ సెక్యూరిటి గార్డ్స్ (ఎన్‌ఎస్‌జి) హెచ్చరించింది. అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని నగరాలపై సంయుక్తంగా దాడికి దిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ‘‘భారతదేశం మీద దాడి చేయాలన్న తమ ఉద్దేశాన్ని వారు (అల్‌ఖైదా) ఇప్పుడు బయటపెట్టారు. వారు లష్కర్ ఎ తోయిబా, ఐఎస్‌ఐఎస్, ఇండియన్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి దాడికి దిగే అవకాశాలు ఉన్నాయి’’ అని ఎన్ఎస్‌జి డైరెక్టర్ జనరల్ జయంత్ చౌదరి పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు ఉమ్మడి ఆపరేషన్లకు దిగితే మన నగరాలలో, ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గోవా, బెంగళూరు, అమృత్‌సర్ వంటి భారత నగరాలపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని జయంత్ చౌదరి వివరించారు.

తెలంగాణలో ఒకేరోజున ఏడుగురు రైతుల ఆత్మహత్య

  తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గురువారం నాడు తెలంగాణలో మొత్తం ఏడుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం నాడు నిజామాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మొత్తం ఏడుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ గ్రామానికి చెందిన రైతు పట్లోల త్రిశూల్ రెడ్డి (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండకు చెందిన రైతు ఎడమ సాంబరాజు (27), నర్మెట మండలం తరిగొప్పుల గ్రామానికి చెందిన రైతు పాలబోయిన పోషయ్య (45), మెదక్ జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లికి చెందిన రైతు లేళ్ళ నరసింహులు (40), చిన్న శంకరంపేట మండలం జప్తి శివనూర్ గ్రామానికి చెందిన ఎం.ఆశయ్య (45), జగదేవపూర్ మండలం చేబర్తి నర్సన్నపేటకు చెందిన రైతు బుకల కొండయ్య (40), కరీంనగర్ జిల్లా రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎడవెల్లి సంపత్ (22) ఆత్మహత్యలు చేసుకున్నవారిలో వున్నారు. కరెంటు కోతల వల్ల పంట దిగుబడులు రాకపోవడం, అప్పులు పెరిగిపోవడం వల్ల ఈ ఏడుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

విశాఖ ఆర్థిక రాజధానిగా నిలబడుతుంది: చంద్రబాబు

  విశాఖ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. విశాఖపట్నం మళ్ళీ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా నిలబడుతుందన్న నమ్మకాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ‘‘తుఫాను బాధితులకు రేషన్ దుకాణాలలో ఆరు రకాల సరుకులు అందుబాటులో వుంచాం. ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో చక్కెర, కిలో ఉప్పు, లీడర్ పామాయిల్, అరకిలో కారం పంపిణీ చేయనున్నాం. సాయంత్రంలోగా అన్ని రేషన్ దుకాణాలకు బియ్యం చేరాలని ఆదేశించాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందుతుంది. తుఫాను వీడియోలను, ఫొటోలను తీసిన వ్యక్తులు హుదుద్ పేరిట ఏర్పాటు చేసిన పోర్టల్‌కు పంపించాలి. విశాఖ ప్రజలు చాలా మంచివారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సుహృద్భావంతో స్వీకరించి సహకరిస్తున్నారు. టెలికం కంపెనీలు బాధితులకు 50 రూపాయల టాక్‌టైమ్‌తోపాటు ఉచిత రోమింగ్ టైమ్ సేవలు అందించాయి. నష్టపోయిన పరిశ్రమలకు బీమా కంపెనీలు వెంటనే పరిహారం అందించాలి. ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలను అభినందించాల్సిన ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేయడం దారుణం. సహాయ కార్యక్రమాల్లో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయనున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.

హుదుద్ వల్ల విశాఖకు అపార నష్టం: బాలయ్య

  హుదుద్ తుఫాను కారణంగా విశాఖకు అపార నష్టం వాటిల్లిందని సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తుఫాను బాధితులను పరామర్శించడానికి విశాఖ వచ్చిన బాలకృష్ణ బాధితులను ఆదుకోవడం కోసం తనవంతు సాయంగా 35 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ‘‘అందమైన పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందిన విశాఖలో పచ్చదనం పూర్తిగా కనుమరుగైంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలకు అంచనాలకు అందని భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదు రోజులుగా ఈ ప్రాంతంలోనే వుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, తుఫాను బాధితులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు’’ అన్నారు.

ప్రభుత్వం పనితీరు బహు బాగుంది: పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్ గురువారం నాడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ పనితీరును ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. విపత్తు సమయంలో బాధితులకు అండగా నిలవాలని ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే తాను విజయనగరం, శ్రీకాకుళంలో పర్యటించలేదని ఆయన చెప్పారు. సినీస్టార్స్‌ ఈవెంట్‌ నిర్వహించడం ద్వారా తుఫాను బాధితులకు సహాయపడాలని సూచించారు. ఖమ్మం పట్టణంలో బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న శ్రీజను పరామర్శించేందుకు తాను నేడు ఖమ్మం వెళ్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

ముషారఫ్ ముదనష్టపు వ్యాఖ్యలు

  పాకిస్థాన్‌లో నిర్బంధ జీవితం గడుపుతూ, రేపో మాపో మరణశిక్ష పడే అవకాశం వున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కి ఇంకా పొగరు తగ్గినట్టు లేదు. అందుకే కాశ్మీర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్‌లో హింసను ప్రేరేపించే శక్తి తమ దేశానికి వుందని, ఏదో ఒకరోజున కాశ్మీర్‌లో హింసని రేపుతామని పర్వేజ్ ముషారఫ్ అన్నాడు. భారత్ - పాకిస్థాన్‌ల మధ్య మరో యుద్ధం జరగడం ఖాయమని ముషారఫ్ హెచ్చరించాడు. కాశ్మీర్ కోసం పోరాడటానికి లక్షలాది మంది పాకిస్థాన్ సైనికులు సిద్ధంగా ఉన్నారని అన్నాడు. మిస్టర్ ముషారఫ్.. కాశ్మీర్‌లో హింసను రేపే సంగతి తర్వాత.. నిన్ను పాకిస్థాన్‌ పాలకులు ఎప్పుడు చంపేస్తారో అది చూసుకో ముందు...

షిర్డీ - కాకినాడ రైల్లో దోపిడీ

  షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్రవారం తెల్లవారుఝామున దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని రొట్టేగావ్ రైల్వే స్టేషన్ సమీపంలో దోపిడి దొంగలు ఎస్ 3, ఎస్ బోగీలలోని ప్రయాణికులపై దాడి చేసి, వారికి మారణాయుధాలతో బెదిరించి పది తులాల బంగారు నగలు, పెద్ద మొత్తంలో నగదును, పలు విలువైన వస్తువులను దోచుకున్నారు. దోపిడీ తర్వాత చైన్లాగి దొంగలు రైలు దిగి పరారైయ్యారు. ప్రయాణికులు దోపిడీ దొంగల బీభత్సంపై రైల్వే గార్డుకు సమాచారం అందించారు. అనంతరం రోట్టేగావ్ రైల్వే స్టేషన్ పోలీసులకు దోపిడీ బాధితులు ఫిర్యాదు చేశారు. రైలులో భద్రతా సిబ్బంది లేకపోవడంతో ఈ దోపిడీ దొంగలు చొరబడ్డారని ప్రయాణికులు ఆరోపించారు.