కుక్కపిల్లకి ఘనంగా బారసాల

  ఆ జంటకు పిల్లలు లేరు. పిల్లల్ని కనాలని, వాళ్ళకి ఘనంగా వేడుకలు చేయాలని కోరిక మాత్రం తీరకుండా మిగిలిపోయింది. దాంతో వాళ్ళ పెంపుడు కుక్కకు పుట్టిన పిల్లలకు ఘనంగా బారసాల జరిపి ముచ్చట తీర్చుకున్నారు. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లి గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి ఇంట్లో పెరిగే కుక్క నాలుగు పిల్లలను పెట్టింది. దాంతో రవి దంపతులు తమ ఇంట్లో పుట్టిన కుక్కపిల్లలకు వైభవంగా బారసాల కార్యక్రమాన్ని నిర్వహించారు. బంధుమిత్రుల్ని పిలిచి విందు భోజనాలు వడ్డించారు. వచ్చిన అతిథులు సుష్టుగా తిని కొత్తగా పుట్టిన కుక్కపిల్లల్ని టామీ, పింకీ, బన్నీ, చిన్నీ అని పిలుస్తూ అక్షింతలు చల్లి వెళ్ళారు.

రైతు రుణమాఫీలో తప్పేంలేదు.. హైకోర్టు

  రైతు రుణమాఫీ అనేది సరైన విధానం కాదని అంటూ దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. మనకు అన్నం పెడుతున్న వారి రుణాలను మాఫీ చేస్తే తప్పేంటని పిటిషనర్ని హైకోర్టు ప్రశ్నించింది. రైతులు లేకపోతే మనం ఎవ్వరం లేమని అంటూ, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇకముందు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయవద్దని హెచ్చరించింది.రుణమాఫీ కాకపోవటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ఎందుకు రుణమాఫీ చేయకూడదని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ సమగ్రంగా లేదని, సంపూర్ణ వివరాలతో మరోసారి పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది. రైతులు, చేనేత కార్మికులు, తాపీ పనివారిని ఆదుకోవాల్సిన అవసరం వుందని హైకోర్టు అభిప్రాయపడింది.

మోడీ సార్.. మీరు సూపర్.. రవీనా...

  బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద ప్రశంసలు జల్లు కురిపించింది. మోడీ ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం తనకెంతో నచ్చిందని ఆమె చెబుతూ, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం వుందని చెప్పింది. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే, దేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పౌరులందరిమీదా వుందని ఆమె అన్నారు. అలాగే జమ్ము కాశ్మీర్లో వరదలతో బాధపడుతున్నవారిని ఆదుకోడానికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని కూడా ప్రజలకు రవీనా పిలుపునిచ్చింది. రవీనా వరస చూస్తుంటే ఆమె త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేసే లక్షణాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.

మావోయిస్టుల్ని చంపిన జనం

  మావోయిస్టులంటే గ్రామస్థులు భయంతో వణికిపోతూ వుంటారు. అయితే గ్రామస్థులు తిరగబడి ముగ్గురు మావోయిస్టులను చంపేసిన ఘటన విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం కోరుకొండలో జరిగింది. మావోయిస్టులు ఆదివారం రాత్రి ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో సంజీవరావు అనే యువకుడిని హత్య చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు అకారణంగా తమ గ్రామానికి చెందిన యువకుడిని చంపారంటూ మావోయిస్టులపై పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు. గ్రామస్థుల రాళ్ళ దాడిలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ సీనియర్, డీసీఎం శరత్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

భర్త వేధించాడని దారుణంగా చంపేసింది...

  కట్టుకున్న భర్త వేధింపులను ఒక దశ వరకూ భరించిన భార్య ఇక భరించలేక అతనిని హతమార్చింది. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. దస్తగిరి, చిట్టెమ్మ అనే భార్యాభర్తలు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. అయితే దస్తగిరి ఎంతోకాలంగా భార్యమీద అనుమానంతో వేధిస్తున్నాడు. దీని మీద ఇద్దరూ ప్రతిరోజూ ఇద్దరూ గొడవపడేవారు. భర్త వేధింపులు మితిమీరడంతో చిట్టెమ్మ నిద్రిస్తున్న ఆదివారం అర్థరాత్రి దస్తగిరి తలపై రాయితో మోది దారుణంగా హత్య చేసింది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో ఆదివారం ఆరుగురు రైతుల ఆత్మహత్య

  తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు మరో ఆరుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రైతులందరూ కరెంటు సరఫరా లేక పొలాలు ఎండిపోవడం, పొలం మీద చేసిన అప్పు తీరే అవకాశం లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని రాములు తండాకు చెందిన బానోతు ఈర్యా (42) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎగ్గాం గ్రామానికి చెందిన చిన్న గంగన్న (45), మహబూబ్ నగర్ జిల్లా కొందుర్గు మండలం శ్రీరంగాపూర్‌కి చెందిన చిటికెల నర్సింహులు (30), నల్గొండ జిల్లా గుర్రంపోడుకు మండలం పాశంవానిగూడేనికి చెందిన మారెడ్డి వెంకటరెడ్డి (44) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మిడ్జిల్ మండలం బైరంపల్లికి చెందిన గోపాల్ జీ (60) కరెంటు తీగలను పట్టుకుని చనిపోయాడు. చిన్న ఎల్కిచర్ల పంచాయిగీలోని పుల్లప్పగూడానికి చెందిన గొల్ల నర్సింహులు (30) ఉరి వేసుకుని మరణించారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య నాలుగు వందలకు చేరిందని అంటున్నారు.

హర్యానా పీఠం మీద కాషాయ జెండా రెపరెప

  ఉత్కంఠ భరితంగా సాగిన హర్యానా ఎన్నికల పోరులో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ విజయం సాధించి అధికార పీఠం మీద కాషాయ జెండా ఎగురవేసింది. 90 స్థానాలున్న హర్యానాలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4 సీట్లకే పరిమితమైన స్థితి నుంచి ఏకంగా 47 సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. బీజేపీ గణనీయమైన సీట్లను సాధించడంతోపాటు భారీగా తన ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 9.05 శాతం ఓట్లతో సరిపెట్టుకున్న భారతీయ జనతాపార్టీ తాజా ఎన్నికల్లో 24.15 శాతం ఓట్లను పెంచుకొని మొత్తంమీద 33.2 శాతం ఓట్లు సాధించింది. హర్యానా వ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన సుడిగాలి ప్రచారం విజయాన్ని సాధించిపెట్టింది. హర్యానా ఓటర్లు బీజేపీకి బ్రహ్మరథం పట్టడంతో పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పాలించిన కాంగ్రెస్, ఈసారైనా అధికారం కోసం కలలుగన్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌ఘోర పరాజయం పాలయ్యాయి.

ఓడిపోయాం.. ఒప్పుకుంటాం.. రాహుల్

  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ సుదీర్ఘంగా అధికారంలో వుందని అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారని రాహుల్ గాంధీ తమ ఓటమిని విశ్లేషించారు. మహారాష్ట్రలో పదిహేనేళ్ళు, హర్యానాలో పదేళ్ళు తమను నమ్మిన ప్రజలకు రాహుల్ గాంధీ థాంక్స్ చెబుతూ, రాబోయే రోజుల్లో వారి నమ్మకాన్ని మరోసారి గెలుచుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు. ప్రజలు తమను ప్రతిపక్షంలో వుండాలంటూ ఆదేశించారు కాబట్టి, ఇకపై నిర్మాణాత్మక ప్రతిపక్షం పాత్రను పోషిస్తామని ఆయన తెలిపారు.

మహారాష్ట్రలో ఎంఐఎం బోణీ చేసింది

  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం రెండు స్థానాలను గెలిచి సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకే ఇప్పటి వరకూ పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బోణీ కొట్టింది. ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి జర్నలిస్టు సయ్యద్ ఇంతియాజ్ జలీల్, ముంబై నగరంలోని బైకలా నియోజకవర్గం నుంచి న్యాయవాది వారిస్ యూసుఫ్ పఠాన్‌లు ఎంఐఎం పార్టీ అభ్యర్థులుగా విజయం సాధించారు. ఇంతియాజ్ శివసేన అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రదీప్ జైస్వాల్‌ను 20 వేల ఓట్ల తేడాతో, వారిస్ బీజేపీ అభ్యర్థి మధుకర్ చవాన్‌ను 1,357 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికలలో మహారాష్ట్రలో ఎంఐఎం మొత్తం 24 స్థానాల్లో పోటీ చేసింది.

మళ్లీ చేతులు కలపాలి: అద్వానీ

బీజేపీ, శివసేన మళ్లీ చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారం చేపట్టాలని బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కె అద్వానీ ఆకాంక్షించారు. రెండున్నర దశాబ్దాల స్నేహం విచ్ఛిన్నమైనప్పుడు తానెంతో ఆవేదన చెందానని, ఇప్పుడు మళ్లీ ఇరు పార్టీలు కలిసే అవకాశం వచ్చిందని అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. మైత్రీబంధం తెగిపోకుండా ఉండాల్సిందని తాను మొదటి నుంచి చెబుతున్నాని, తమ పార్టీ నేతలు, శివసేన నేతలు తన ప్రమేయం కోరితే తప్పకుండా సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తానన్నారు. మహారాష్ట్ర లాంటి ప్రాధాన్య రాష్ట్రంలో పాత మైత్రీని పునరుద్ధరించాలని అద్వానీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ కు చావుదెబ్బ..నేతల స్పందన

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలను చూసిన కాంగ్రెస్ శ్రేణులు ఢీలా పడిపోయారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బొక్కా బోర్ల పడడంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం బోసిపోయింది. బీజేపీ నేతలు సంబురాలు చేసుకుంటుంటే కాంగ్రెస్ కార్యాలయంలో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలున్నాయని ఆ పార్టీ నేత రషీద్ ఆల్వీ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయన్ని శిరసావహిస్తామని చెబుతున్నారు. ఫలితాలపై పోస్టుమార్టం చేస్తామని అంటున్నారు.. బీజేపీ సంబరపడాల్సిందేమీ లేదంటున్నారు .. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు దీర్ఘకాలం నుంచి అధికారంలో ఉండటం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్నారు.రెండు రాష్ట్రాల్లో ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమంమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా అభిప్రాయం వ్యక్తం చేశారు.

హర్యానాలో బీజేపీదే పీఠ౦

హర్యానాలో భారతీయ జనతాపార్టీ పూర్తి మెజారిటీ సాధించి సంచలనం సృష్టించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకున్న పార్టీ ఈసారి ఏకంగా 46 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ సాగానికిపైగా స్థానాలు గెలుపొంది మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించింది. సుదీర్ఘ కాలంగా హర్యానాలో ప్రాంతీయ పక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న బీజేపీ ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో ఏడింటిలో గెలుపొందింది. బీజేపీకి స్థానికంగా బలమైన నేతలుగా పేరున్న అభిమన్యు, రామ్‌విలాస్‌ శర్మ, ఎంఎల్‌ ఖాతర్‌ తదితరులు గెలుపొందడమే కాకుండా పార్టీ విజయానికి కూడా కృషి చేశారు.

మహారాష్ట్రలో హంగ్..బీజేపీ మంతనాలు!!

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే బీజేపీ 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. శివసేన 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ అయినా 145 స్థానాలు గెలుపొందాలి. కానీ ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, శివసేన మధ్య మంతనాలు కొనసాగుతోన్నట్లు సమాచారం. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి చేపడుదామని శివసేన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. శివసేన ప్రతిపాదనపై సాయంత్రం జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కమలం నేతలు చర్చించనున్నారు. తమకు శివసేన ప్రత్యర్థ పార్టీ కాదని, కాంగ్రెస్, ఎన్సీపీ మాత్రమే ప్రత్యర్థ పార్టీలు అని మహారాష్ట్ర బీజేపీ ప్రకటించింది.

తుపాను బాధితులకు టిడిపి నేతల విరాళం

  తుపాను బాధితుల సహాయం కోసం ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి తూర్పుగోదావరి జిల్లా చెందిన టీడీపీ నాయకులు విరాళం ప్రకటించారు. ముమ్మిడివరం నియోజవర్గానికి చెందిన నేతలు రూ.10లక్షల విరాళాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. టీడీపీ ఎస్సీ విభాగం సీఎం సహాయనిధికి రూ.11లక్షలు విరాళం ప్రకటించింది. ఏపీ ఎన్జీవోలు రెండు రోజుల సాలరీని హుదూద్ బాధితులకు సహాయంగా ఇచ్చారు. ఈమేరకు ఏపిఎన్జీవో సంఘం నేత అశోక్ బాబు, చంద్రబాబును కలిసి చెక్ ను అందచేశారు. ఈ సందర్భంగా విరాళం ఇచ్చిన ఏపీఎన్జీఓ ఉద్యోగులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. హుదుద్ తుపాను చర్యలపై రెండు రివ్యూలు, ఐదు కాన్ఫరెన్సులు నిర్వహించాల్సి ఉందని చంద్రబాబు వెల్లడించారు.

సిమి మాజీ అధ్యక్షుడు సలావుద్ధీన్ మృతి

నల్గొండ జిల్లాలో ఘోరా రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, సిమి మాజీ అధ్యక్షుడు సలావుద్ధీన్ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తన స్నేహితుడి ఇంట్లో జరిగిన వివాహాన్ని హాజరై తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని సలావుద్దీన్‌ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హయత్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సలావుద్దీన్‌ మృతి చెందాడు. ఇటీవల బెంగుళూరులో జరిగిన సైనిక్‌సెంటర్‌ పేలుళ్ల కేసులో సలావుద్దీన్‌ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి సంవత్సరం కిత్రమే బెయిల్‌పై విడుదలైన సలావుద్దీన్‌ అనంతరం సిమీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటూ అంబర్‌పేటలో ఓ ఫర్నీచర్‌ షాపును నడుపుతున్నట్లు తెలుస్తోంది.