జూనియర్ డాక్టర్ల మీద కఠిన చర్యలు: టీ సర్కార్

  గ్రామీణ ప్రాంతాలలో ఒక సంవత్సరం డాక్టర్లు వైద్య సేవలు అందించాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించకుంటే వారి మీద కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా వుందని డీఎంఇ ప్రకటించింది. జూడాలు ఇలాగే వ్యవహరిస్తే వారిమీద ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని, జూడాలు చర్చలకు ముందుకు రాకపోవడం సరికాదని, గ్రామీణ సర్వీసుల నిబంధన న్యాయస్థానాల్లో వుందని, దాని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని డీఎంఇ ప్రకటించింది. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని డీఎంఇ పేర్కొంది.

ఎమ్మెల్యే రేవంత్ మీద కేసు

  తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ఆశ్రిత పక్షపాత ధోరణితో తమ బంధువులకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక న్యాయవాది రేవంత్ రెడ్డి మీద నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.

బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలని అర్థమా?

  బంగారు తెలంగాణ సాధించడం అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేయడమా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌‌రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో కరెంటు కోతలను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కరెంటు కోతలకు నిరసనగా భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. ‘‘విద్యుత్ సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. కరెంటు కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’’ అన్నారు. కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కిషన్రెడ్డి, ఇంద్రసేనారెడ్డిలతోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆశీష్ విద్యార్థికి తప్పిన ప్రాణగండం

  ప్రముఖ బాలీవుడ్ నటుడు.. అనేక తెలుగు చిత్రాల్లో నటించిన ఆశిష్ విద్యార్థికి త్రుటిలో ప్రాణగండం తప్పింది. భిలాయి సమీపంలో జరుగుతున్న ‘బాలీవుడ్ డైరీ’ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు. నది మధ్యలో ఒక రాయి మీద నిలబడి ప్రార్థిస్తున్నట్టుగా సన్నివేశం చిత్రీకరిస్తుండగా మొన్నామధ్య హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో తెలుగు విద్యార్థులు కొట్టుకుపోయినట్టుగా నది నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. దాంతో ఆశిష్ విద్యార్థి నీళ్ళలో కొట్టుకుపోయారు. ఆయనకు ఈత రాదు. అయితే సమయానికి అక్కడే వున్న వికాస్ సింగ్ అనే ఓ పోలీసు కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై నదిలోకి దూకారు. అశీష్ను రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ, ఈ సంఘటన తనకు జీవితంలో ఒక గుణపాఠం నేర్పిందని, ఇలాంటి సందర్భాలలో అందరూ జాగ్రత్తగా వుండాలని అన్నారు.

హర్యానా ముఖ్యమంత్రిగా ఖత్తార్

  హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ నాయకుడు మనోహర్‌లాల్ ఖత్తార్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.  ఖత్తార్‌ను తమ నాయకుడిగా హర్యానా బీజేపీ శాసనసభ్యులు ఎన్నుకున్నారు. ఇక ఖత్తార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం లాంఛనమే. ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు పుష్కలంగా వున్న ఖత్తార్ ప్రధాని నరేంద్ర మోడీకి స్నేహితుడు. ఈ రెండు అంశాలతోపాటు నిజాయితీపరుడుగా, పార్టీలో సీనియర్‌గా, సమర్థుడిగా మనోహర్ లాల్ ఖత్తార్‌కి గుర్తింపు వుంది. 1980 నుంచి 1994 వరకు ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయిలో పనిచేసిన  ఖత్తార్, ఆ తర్వాత బీజేపీలో చేరారు. 60 ఏళ్ల వయసున్న  ఖత్తార్.. ఇప్పటికీ బ్రహ్మచారే. ఖత్తార్ బుధవారం హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం వుందని తెలుస్తోంది.

ఎన్సీపీ మద్దతు ప్రకటన.. ఉద్ధవ్ ఉలికిపాటు...

  మహారాష్ట్ర ఎన్నికల ముందు బీజేపీ నుంచి విడిపోయిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఇప్పుడు ఎన్నికల ఫలితాల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థితికి రావడంతో మళ్ళీ బీజేపీతో స్నేహం చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే శివసేన బ్లాక్ మెయిలింగ్ గురించి తెలిసిన బీజేపీ మద్దతు తీసుకునే విషయాన్ని ఆలోచిస్తోంది. శివసేనని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకుంటే బావుండని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే తాము బయటనుంచి మద్దతు ఇస్తామంటూ ఎన్సీపీ ప్రకటించడంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఉలిక్కిపడ్డాడు. ఎన్సీపీ నాయకులు తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, అవినీతిపరులైన తమ పార్టీ నాయకులను కాపాడుకోడానికే బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తామంటున్నారని మండిపడ్డారు.

గుజరాతీ పిల్లలకు పి.టి.ఉష శిక్షణ

  పరుగు పందెంలో సియోల్ ఒలింపిక్స్ పతక విజేత పి.టి. ఉష గుజరాత్‌లోని పిల్లలకు పరుగు పందెంలో శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ విజ్ఞప్తి మేరకు ఈ బాధ్యతను స్వీకరించినట్టు ఉష తెలిపారు. గుజరాత్‌లోని ప్రతిభావంతులైన బాల బాలికలను ఎంపిక చేసి, వారికి చైనా దేశంలో అనుసరించే తరహాలో సుదీర్ఘ శిక్షణ ఇవ్వనున్నానని ఆమె చెప్పారు. అక్కడ 10 - 11 ఏళ్ల వయసున్న 30 మంది పిల్లలను ఎంపిక చేసి, వారికి ప్రాథమిక శిక్షణ ఇచ్చి. ఆ తర్వాత వాళ్లు ఏయే విభాగాలకు సరిపోతారో అంచనా వేసి ఆ ప్రకారం వాళ్లను తీర్చిదిద్దడం ఈ దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యం.

ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి వుంది

  పండుగల సమయంలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం వుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలను తాము అప్రమత్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు. పండుగల సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశంలోని పలు నగరాలపై ఐఎస్ఐఎస్, అల్ కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉందంటూ ఇటీవల ఎన్ఎస్జీ చీఫ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఈ విషయాన్ని నిర్ధారించి హెచ్చరించడంతో నిఘావర్గాలతోపాటు  రాష్ట్రాల పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు.

‘కత్తి’కి తుప్పు వదిలింది

  తమిళ హీరో విజయ్ నటించిన ‘తలైవా’ చిత్రం విడుదలకు గతంలో అనేక సమస్యలు వచ్చిన విషయం తెలిసిందే. ‘అమ్మ’కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆ సినిమా విడుదల సందర్భంగా సమస్యలు ఏర్పడ్డాయి. తమిళంలో కంటే తెలుగులో ముందు విడుదలైంది. ఈ గందరగోళం పుణ్యమా అని ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే విజయ్ మరోసారి ఎదుర్కొంటున్నారు. విజయ్, సమంత హీరో హీరోయిన్లుగా మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘కత్తి’ సినిమా బుధవారం నాడు విడుదల కావలసి వుంది. అయితే ఈ సినిమాతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షేకి సంబంధాలున్నాయన్న వార్తలు రావడంతో ఈ సినిమాని తమిళనాడులో విడుదల కానివ్వమని కొంతమంది తమిళ ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. శ్రీలంకలో తమిళల ఊచకోతకు, ఎల్టీటీఇ నామరూపాల్లేకుండా పోవడానికి కారణమైన రాజపక్షేతో సంబంధం వున్న సినిమాని తమిళనాడులో విడుదల కానిచ్చే ప్రసక్తే లేదని అంటున్నారు. నిర్మాతలు మాత్రం ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తామని చెబుతున్నారు. అలా విడుదల చేస్తే థియేటర్లలో పెట్రోల్ బాంబులు విసురుతామని ఉద్యమకారులు బెదిరిస్తున్నారు. శాంపిల్‌గా సోమవారం నాడు చెన్నైలోని రెండు థియేటర్ల మీదకి రాళ్ళు రువ్వి, పెట్రోల్ బాంబులు విసిరి గందరగోళం సృష్టించారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈసినిమా నిర్మాణ సంస్థ పేరులో వున్న ‘లైకా’ అనే మాటను తొలగించడానికి నిర్మాతలు అంగీకరించడంతో ‘కత్తి’ విడుదలకు మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది.

కేబుల్ ఆపరేటర్ల వెరైటీ వాదన

  దాదాపు నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారం జరగడం లేదు. ఈ విషయంలో ఆ రెండు ఛానెళ్ళ జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ , ‘‘ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం లేదు. ఆ రెండు ఛానెళ్ళ ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్‌ఓల పాత్రగానీ ఏమీ లేదు. న్యాయస్థానాలు కూడా మాకు అనుకూలంగానే తీర్పు ఇచ్చాయి. మాతో వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు టీవీ ఛానళ్ళ యాజమాన్యాలకు ఎంతమాత్రం లేదు’’ అన్నారు.

రాజపక్షేకి భారతరత్న.. సుబ్రహ్మణ్యస్వామి వెటకారం

  సంచలనాలకు మారుపేరుగా వుండే భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలనం సృష్టించారు. ఎల్టీటీఇని సమర్థవంతంగా మట్టుబెట్టినందుకు శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్షేకి భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నరేంద్రమోడీకి ఆయన ఒక లేఖ రాశారు. సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఈ విజ్ఞప్తి ఎల్టీటీఇని అభిమానించే తమిళులకు ఆగ్రహం తెప్పించే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. మొన్నామధ్య తమిళ జాలర్లను, వారి బోట్లను శ్రీలంక రక్షణ సిబ్బంది నిర్బంధించిన నేపథ్యంలో జాలర్లను విడిచిపెట్టండి గానీ, వారికి బోట్లు ఇవ్వొద్దంటూ స్వామి వ్యాఖ్యానించారు. దీనిమీద తమిళ రాజకీయాలు సుబ్రహ్మణ్య స్వామి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే జయలలిత జైలుకి వెళ్ళడానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి కారణం కావడంతో అన్నా డీఎంకే వర్గాలు కూడా ఆయన మీద ఆగ్రహంగా వున్నాయి. ఇప్పుడు రాజపక్షే విషయంలో ఆయన తాజాగా చేసిన విజ్ఞప్తి విషయంలో పార్టీలన్నీ ఒక్కటై తమిళనాడులో రాజకీయంగా దుమారం రేపే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.

బాణాసంచా పేలుడు... మరో ముగ్గురు మృతి

  తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప ఎస్సీ కాలనీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన బాణసంచా పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. సోమవారం నాడు 12 మంది మృతి చెందగా, కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు మంగళవారం నాడు మరణించారు. మరణించిన వారిలో 11 మంది మహిళలు వున్నారు. గాయపడిన వారిలో మరో నలుగురు ప్రాణాపాయ స్థితిలో వున్నట్టు తెలుస్తోంది. అనధికారికంగా బాణాసంచా తయారు చేస్తున్న ఈ కేంద్రంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. దీపావళికి మూడు రోజుల సమయమే వుండటంతో ఈలోపే ఎక్కువ మొత్తంలో బాణాసంచా తయారు చేయాలన్న ఉద్దేశంతో చాలామంది కూలీలను తయారీలో పెట్టారు. అందువల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది.

ఆళ్ళగడ్డలో పోటీ చేయం.. టీడీపీ

  ఒక సస్పెన్స్‌కి తెరపడింది. వైసీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ వైసీపీ తరఫున బరిలో నిలిచారు. అయితే ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే సందేహాలు ఇప్పటి వరకూ వున్నాయి. అయితే ఆ సస్పెన్స్‌కి తెరపడింది. ఆళ్ళగడ్డ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టదని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ప్రకటించారు. వైసీపీకి చెందిన మైసూరారెడ్డి తదితరులు తమను కలసి ఆళ్ళగడ్డలో అభ్యర్థిని పోటీకి నిలపరాదని అభ్యర్థించారని, అందుకే అక్కడి నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించామని  తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన

  తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తుగ్లక్ పాలన నడుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చడానికి తపిస్తున్నారే తప్ప రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి కృషి చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా లబ్దిదారుల జాబితా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల కోసం మళ్లీ దరఖాస్తులు కోరడం ఏమిటని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కేసీఆర్ శాడిజంతో ప్రజలను హింసించడానికే ప్రభుత్వ పథకాల కోసం, పెన్షన్ల కోసం, కుల ధ్రువీకరణ పత్రాల కోసం జనాన్ని క్యూలో నిలబెడుతున్నారని విమర్శించారు.