తెలంగాణా నేతల చెవుల్లో బొత్స పూలు పెడుతున్నడా?

 

పిసిసి అధ్యక్షులవారు బొత్ససత్యనారాయణగారు ఈమద్యన ఎందుకో మాటిమాటికీ నాలిక్కరుచుకోవలసివస్తోంది. మొన్న “అలాగా ఆడోల్లు అర్దారాతిరి, అపరాతిరీ అని సూడకుండా రోడ్డేకేస్తే అలా కాక మరేటవుద్దీ?” అని మహిళలకు హితబోదచేయబోతే, వాళ్లతోబాటు ప్రజలందరూ కూడా కోర్రుగాల్చి వాతపెట్టినంత పనిచేసాక “నా ఉద్దేశ్యం అది కాదూ...” అంటూ మళ్ళీ ఏదో సంజాయిషీ చెప్పుకోక తప్పలేదు వాళ్ళందరికీ.

 

ఆయన నిన్నమొన్నటి వరకు కూడా “హిందీ మాట్లాడే వాళ్ళకి పదిరాష్ట్రాలుంటే తప్పు లేనిది మనకి రెండుంటే తప్పేలా అవుతుంది?” అని అడిగినవారిని, అడగనివారినీ కూడా ప్రశ్నిస్తూ ‘ఓల్ సీమంధ్ర’ మొత్తానికి తానొక్కడే తెలంగాణా మద్దతుదారునని డప్పేసుకొని మరీచాటించుకొంటూ, తెల్లరిలేస్తే కాంగ్రెస్ ని బండబూతులు తిట్టే కేసిర్ వంటి శత్రువుల చేతకూడా సాహ్బాష్! అనిపించుకొంటూ పిసిసి అద్యక్షపదవిలో నల్లేరు మీద నావలా ఎవరివల్లా ఇబ్బంది పడకుండా ఇంతకాలం హాయిగా కాలక్షేపం చేసేసారు.

 

అయితే, మరో రెండు రోజుల్లో అఖిలపక్ష సమావేశం ఉండగా ఆకస్మాతుగా జ్ఞానోదయం అయినట్లుగా, “అసలు రాష్ట్రం విడిపోవడం కన్నా కలిసి ఉండటమే మంచిదని నా అభిప్రాయం,” అని పత్రికలవారికి పిలిచి మరీ శలవిచ్చేరు. అది తెలిసిన తోటి తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు తదితరులు ఆయన మీద కలిసికట్టుగా దండెత్తేసరికి మళ్ళీ మాటమారుస్తూ “అది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే తప్ప మరోటి కాదు. మా అమ్మ సోనియమ్మా ఎలాచెపితే అలానే నడుచుకొంటాము. నాకేమీ అభ్యoతరాలు ఉండవు.”అని అన్నారు.

 

అది సరే, నిన్నమొన్నటి వరకు తెలంగాణా ఇస్తే తప్పేమిటీ? అన్న మనిషి ఇప్పుడు ‘కలిసి ఉంటె కలదు సుఖమూ’ అని కొత్తపల్లవి ఎందుకు అందుకొన్నట్లో? అంటే, ఇంతకాలం తానూ పిసిసి అద్యక్షపదవిలో ఉండగా తన తెలంగాణానేతల వల్ల ఏఇబ్బందీ రాకూడదనే దురాలోచనతో అలా వాళ్ళ చెవుల్లో పూలు పెట్టుకొంటూ పోయారా? లేక అధిష్టానం మనసులో మాటని తన నోటితో పలుకుతున్నారా? ఆయనే చెప్పాలి మరి.