సమైఖ్యాంధ్ర కోసం ఆత్మహత్యలు వద్దు : కావూరి
posted on Dec 27, 2012 3:56AM
సమైఖ్యాంధ్ర కోసం తెలంగాణా విద్యార్దుల్లాగా ఆత్మహత్యలు వద్దని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు ఆంధ్ర ప్రాంత విద్యార్దులకు సూచించారు. తెలంగాణా వాదంతో తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు వ్యాపారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కెసిఆర్ ఉద్యోగులు, విద్యార్దుల ఆత్మహత్యలను పెట్టుబడిగా పెట్టి ఈ వ్యాపారం చేస్తున్నారని సమైఖ్యాంధ్ర ఉద్యమంలో ఈ మధ్య చురుగ్గా పాల్గొంటున్న కావూరి అన్నారు. ఈ రెండు తరహాల వ్యక్తులు లేకపోతే అసలు తెలంగాణా ఉద్యమం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న నెల్లూరులో జరిగిన సమైఖ్యాంధ్ర విద్యార్ది జెఎసి సమావేశంలో మాట్లాడుతూ కావూరి ఈ వ్యాఖ్యలు చేశారు.
పనిలో పనిగా ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై కూడా విమర్శలు చేశారు. కేంద్రంలో సమర్ధవంతమైన ప్రభుత్వం లేక పోవడంవల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని కావూరి అన్నారు. రేపు జరిగే అఖిల పక్ష సమావేశం కేవలం కాలయాపన కోసమేనని, ఈ సమావేశం ఆధారంగా ఎలాంటి నిర్ణయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణా కు అనుకూలంగా కేంద్రం ఎలాంటి ప్రకటన చేసే అవకాశం లేదని, అందువల్ల విద్యార్దులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన వారికి సూచించారు. ఒకవేళ తెలంగాణా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయిస్తే, సమైఖ్యాంధ్ర నేతలు ప్రాణ త్యాగాలకు కూడా సిద్దంగా ఉన్నారని, విద్యార్దులు మాత్రం సంయమనం పాటించాలని కావూరి వారితో అన్నారు.