కేంద్రం మాటే తన మాటగా కాంగ్రెస్ ?

 

 

 

 

తెలంగాణాఫై ఇంకో మూడు రోజుల్లో ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశంలో ‘తెలంగాణాఫై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా దానికి కట్టుబడి ఉంటాం’ అనే ఏక వాక్య ప్రకటనను కాంగ్రెస్ వినిపిస్తుందని సమాచారం. దీనితో తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ నాన్చివేత ధోరణి అవలంబిస్తుందనే విషయం దాదాపు తెలిసిపోయింది.

 

ఈ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై గత శనివారం ఢిల్లీలో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ అధిష్టానంతో చర్చించి ఈ వ్యూహాన్ని సిద్దం చేసినట్లు సమాచారం. అయితే, ఈ తాజా వ్యూహం అసలు తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలకే మింగుడు పడడంలేదని తెలుస్తోంది.

 

ఈ వైఖరి అనుసరించే పరిస్థితి ఉంటే, అసలు హోం శాఖ ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వారికి ఢిల్లీ నుండి ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా రానందున తమ స్పందన చెప్పడానికి వెనుకాడుతున్నారు.

 

మరోవైపు ఈ సమావేశం గురించి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రతినిధుల పేర్లను ముందు రోజు మాత్రమే ప్రకటిస్తామని అన్నారు. తమ అభిప్రాయాన్ని సమావేశంలో మాత్రమే చెబుతామని ఆయన స్పష్టం చేశారు.