బెయిలెనుక బెయిలు బెట్టి పదహారు బెయిళ్ళు పెట్టీ....కసేరీల సుట్టూ తిరగాడినా

 

బండెనుక బండి గట్టీ పదహారు బళ్ళు గట్టీ....అని ఒకనాడు జనం తన్మయత్వంగా పాడుకొనేవారు. గానీ, చంచల్ గూడా జైల్లో ఈ మద్యనే రెండు శతదినోత్సవాలు, ఒక పుట్టిన రోజు ఘనంగా జరుపుకొన్న జగన్నన్న మాత్రం ‘బెయిలెనుక బెయిలు బెట్టి పదహారు బెయిళ్ళు పెట్టీ....కసేరీల సుట్టూ తిరగాడినా బెయిలు రాదేటన్నా...ఇదేటి నాయమో...ఓరన్నా’ అని చిన్నగా పాడుకొంటూ, ఏ తోడూలేని చోట నీనీడే నీకుతోడూ అని తనకి తానూ సర్ది జెప్పుకొంటూ, తనని తానే ఒదార్చుకొంటూ మరో బెయిలు దరఖాస్తు కోర్టులో పడేసాడు.

 

హైకోర్టు మాత్రం వద్దంటే వినడేమి ఈ కడప జగమొండి అని పల్లవి ఎత్తుకొని మళ్ళీ మరోమారు ఆతని బెయిలు దరఖాస్తుని పరిశీలించడానికి సైతం పనికి రాదనీ నేడు కొట్టిపారేసింది.

 

జయిలెరిగిన జగనన్న, పరీక్షల్లో మార్చి తరువాత సెప్టెంబర్ ఆప్షను ఉన్నట్లే తనకీ రేపు బుదవారం కోర్టు విచారణకి రానున్న మరో బెయిలు పిటిషను ఉందన్న దీమాతో ఎదురు చూడసాగాడు.

 

అయితే, కాంగ్రేసు ‘చేతి’వాటానికి గురయి నాబ్రతుకు ఇలాగ తెల్లారి పోయిందని ఒక వైపు బాధ పడుతూనే, తన లాగే సి.బి.ఐ.కూడా కాంగ్రెస్ కబంధ ‘హస్తం’లో ఇర్రుకుపోయిందని దానిమీద జాలిపడాడు కూడా. కాంగ్రేసు, సిబి.ఐ. కవల పిల్లల మాదిరిగా ‘చేతిలో చేయి వేసుకొని’ తన వంటి అమాయకులూ, కష్టపడి కోట్లు సంపాదించుకొన్న మేధావులను అన్యాయంగా చంచల్ గూడా లో ఫ్రీ మీల్స్ తినిపించడం ఏమి న్యాయమని ప్రశ్నిస్తున్నాడు. గానీ, ఎన్నికలు వచ్చే వరకూ అతనిది అరణ్య రోదనగానే కాదు... కాదు... చంచల్ గూడా రోదనే అనుకోక తప్పదు. అప్పుడయినా, రాహుల్ బాబు తన స్నేహ ‘హస్తం’ అందించితేనే జగనన్న లోటస్ పాండ్ గాలి పీల్చుకోగలడు.