ఇందిరాసాగర్ ప్రాజెక్టు పేరు మార్చిన ప్రభుత్వం
posted on Jun 26, 2015 9:15AM
సుమారు రెండు దశాబ్దాలుగా ఇందిరాసాగర్ (పోలవరం ప్రాజెక్టు) నిర్మాణం కొనసాగుతూనే ఉంది. వేల కోట్లు నిధులు దానిపై ఖర్చు చేసారు. కానీ నేటి వరకు అది పూర్తి కాలేదు. రాష్ర్ట విభజన సందర్భంలో దానిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానిని పూర్తి చేసే బాధ్యత కేంద్రమే స్వీకరించింది. కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమా భారతి ఆ ప్రాజెక్టుని వచ్చే అరేడేళ్ళలో తప్పకుండా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. వీలయితే ఇంకా ముందుగానే దానిని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఆ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయినా దాని చుట్టూ ఏదో ఒక సరికొత్త వివాదం అల్లుకొంటోంది. మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టగానే మొట్టమొదట ఆ ప్రాజెక్టు క్రింద ముంపుకి గురయ్యే తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసినప్పుడు తెలంగాణా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఇదివరకు వైయస్స్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుకి ఇందిరా సాగర్ బహుళార్ధ సాధక నీటిపారుదల ప్రాజెక్టు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం దానిలో ఇందిర(గాంధీ) పేరుని తొలగించి పోలవరం సాగునీటి ప్రాజెక్టుగా మార్చుతూ నిన్న ఒక జి.ఓ. విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతలు దానిని తీవ్రంగా ఖండిస్తున్నారు.