సేవాపథంలో కంఠంనేని రవిశంకర్

కృష్ణాజిల్లాలో, అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రముఖ తెలుగుదేశం నాయకుడిగా మాత్రమే కాకుండా, ప్రముఖ సంఘ సేవకుడిగా మంచి గుర్తింపు వున్న తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠంనేని రవిశంకర్ సమస్యల్లో వున్నవారిని ఆదుకునే విషయంలో నేనున్నాను అంటూ అండగా నిలుస్తూ వుంటారు. ఆయనకున్న ఈ తత్వమే ఆయన్ని ప్రజల మనిషిగా నిలబెట్టింది. ఆయన సేవానిరతి దివిసీమ ప్రాంతంలో ఆయనను ఒక మంచి నాయకుడినిచేసింది. సమస్యల్లో వున్నవారికి ఒక భరోసా, ఒక ఓదార్పు, ఒక మంచి మాట ధైర్యాన్ని ఇస్తూ వుంటుంది. అలాంటి ధైర్యాన్ని ఇవ్వడంలో, నేనున్నానని అండగా నిలవటంలో కంఠంనేని రవిశంకర్‌ ఎప్పుడూ ముందుంటారు. కృష్ణాజిల్లా  చల్లపల్లిలో యస్.సి.బాలికల హాస్టల్లో ఈనెల 16వ తేదీన కలుషిత ఆహారాన్ని తిన్న ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కంఠంనేని రవిశంకర్ సదరు హాస్టల్‌ని సందర్శించారు. అక్కడి బాలికలకు పండ్లు పంపిణీ చేశారు. హాస్టల్‌లో పరిస్థితులను అక్కడి వార్డెన్‌ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చల్లపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆరుగురు బాలికలను ఆయన పరామర్శించి పండ్లు పండ్లు పంపిణి చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కంఠంనేని శివశంకర్, చల్లపల్లి సర్పంచ్, యార్లగడ్డ శ్రీనివాసరావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కృష్ణాజిల్లా కోడూరు మండలం పెదగుడిమోటు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అబ్దుల్ కలాం  ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు కంఠంనేని రవిశంకర్ అబ్దుల్ కలాం కుమారుడు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇమ్రాన్‌ను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మంచి కార్యకర్తను కోల్పోయినదని ఆవేదన వ్యక్తంచేశారు. కంఠంనేని రవిశంకర్ పెదగుడిమోటు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆ గ్రామంలోని మహిళలు వృద్ధులు తండోప తండాలుగా ఆయనను చూడటానికి వచ్చారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ గ్రామస్తులకు ఏ విధమైన వైద్యపరమైన సహాయం కావలసి వచ్చినా తాను చేయిస్తానని కంఠంనేని రవిశంకర్ వారికి హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటారని ఆయన ఈ సందర్బంగా అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో  కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కంఠంనేని శివశంకర్, కోడూరు జడ్పీటీసీ బండే శ్రీనివాసరావు, బండే నాగరాజు, జరుగు వెంకటేశ్వరరావు, పరిసే నాగమల్లేశ్వరరావు, ఉప్పాల పోతురాజు, కడవకొల్లు నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

అమరావతిని గ్రీన్ క్యాపిటల్ గా చేస్తాం. చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ప్రకాష్ దేవకర్ కొత్తూరు తాడేపల్లిలో వనమహోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్ధులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్టుపై మమకారం పెంచుకోవాలని.. చెట్టుతో మనిషికి అవినాభావ సంబంధం ఉందని.. పర్యావరణంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఏపీ రాజధాని అయిన అమరావతిని గ్రీన్ క్యాపిటల్ గా అభివృద్ది చేస్తామని.. 15 నగర వనాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ జవదేకర్‌ మాట్లాడుతూ కొల్లేరు పక్షులనే కాదు....ప్రజలనూ కాపాడాల్సిన అవసరముందని అన్నారు. చట్టాలను సవరణ చేసైనా ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

వేం నరేందర్ రెడ్డి డ్రైవర్లని ప్రశ్నిస్తున్న ఏసిబి అధికారులు

  ఓటుకి నోటు కేసులో ఏసిబి అధికారులు తెదేపా నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ వరుసగా రెండు రోజులు ప్రశ్నించిన తరువాత ఈరోజు ఆయన ఇద్దరు డ్రైవర్లని ప్రశ్నిస్తున్నారు. వారిరువురికి కూడా సెక్షన్: 160సి.ఆర్.పి.సి క్రింద నోటీసులు జారీ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే వారివురు వేం నరేందర్ రెడ్డికి డ్రైవర్లుగా పనిచేస్తున్నారు తప్ప వారికి ఈ ఓటుకి నోటు కేసులో నేరుగా ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా సమాచారం లేదు. అంటే ఈ కేసులో వారిరురు కేవలం సాక్షులు మాత్రమేనని అర్ధమవుతోంది. అటువంటప్పుడు వారికి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే వీలు కల్పించే సెక్షన్: 160 క్రింద నోటీసులు జారీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సండ్ర వెంకట వీరయ్యను విడుదల చేసాక మొదట కృష్ణ కీర్తన్ కి, ఆ తరువాత వేం నరేందర్ రెడ్డి యొక్క ఇరువురు కారు డ్రైవర్లకి ఏసిబి అధికారులు నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తున్నారు. బహుశః ఈ కేసును వీలయినంత కాలం కొనసాగిస్తూ తెదేపాని నిరంతర ఒత్తిడికి గురిచేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫోన్ ట్యాపింగ్ పై కోర్టులో వాదనలు

  ఓటుకు నోటు కేసులో ఎన్నో ఊహించని పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే. అసలు ఈ కేసులోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతగా వెలుగుచూసింది. మా ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఒక రాష్ట్రం అంటే.. చేయలేదని ఇంకో రాష్ట్ర అంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ పై రెండు రాష్ట్రాలు చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేసుకున్నాయి. అప్పట్లో ఏపీ పోలీసులు సర్వీసు ప్రొవైడర్లను ప్రశ్నించగా తమ అధికారుల ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేశామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంపై కోర్టులో వాదనలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కాల్‌డేటా ఇవ్వవద్దని మెమో ఫైల్‌ చేసిందని, డేటా ఇస్తే ప్రాసిక్యూట్‌ చేస్తామని హెచ్చరించిందని, అందుకే కాల్‌డేటా ఇవ్వలేమని సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు చెప్పారు. కేంద్రం కూడా సమాచారం ఇవ్వవద్దని ఆదేశించిందని లాయర్లు కోర్టుకు తెలిపారు. కేంద్రం ఉత్తర్వులు కోర్టును నిర్దేశించలేవని ప్రాసిక్యూషన్‌ వాదించింది. దీనిపై తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

యువతిని వేధిస్తున్న ఉడత అరెస్ట్

  సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిలు వేధిస్తున్నారంటూ కంప్లైంటు ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఓ యువతిఓ ఉడత తనను వేధిస్తుందంటూ కంప్లెంట్ ఇచ్చింది. ఈ విచిత్రమైన ఘటన జర్మనీలో జరిగింది. వివరాల ప్రకారం జర్మనీలోని ఓయువతి ఓ ఉడుత తనను వెంబడిస్తోందని, ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తోందని ఆ యువతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయితే మొదట పోలీసులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ఆ యివతి మళ్లీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగి ఉడతను పట్టుకొన్నారట. అయితే తనను బంధించడంతో ఇప్పుడు ఆ ఉడత ఆహారం తీసుకోవడం మానేసిందట. దీంతో బాగా చిక్కిపోవడంతో ఆ ఉడుత కోసం ప్రత్యేకంగా ఓ పోలీసును ఏర్పాటు చేసి పోలీసులు ఆహారం అందిస్తున్నారట.

కే సీఆర్‌ నియంతృత్వ ధోరణి విడనాడాలి

  తమ వేతనాలు పెంచాలని గతవారం రోజులకు పైగా మున్సిపల్ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం వాళ్లు చేస్తున్న సమ్మెను చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే మున్సిపల్ శాఖ ఉన్నా సమస్య పరిష్కారం కాకపోవడం ఆశ్చర్యం. అయితే కార్మిక సంఘాల పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వైఖరిపట్ల పలు పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వామపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కే సీఆర్‌ నియంతృత్వ ధోరణి విడనాడాలని వామపక్షాల కార్యకర్తలు ధర్నా చేపట్టి.. ఆర్టీసీ బస్సులను అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వచ్చి వామపక్షాల కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. అంతేకాక రాష్ట్రంలోని పలు చోట్ల కార్మిక సంఘాల కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కాగా వామపక్షాలు చేస్తున్న బంద్ కు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలు మద్దతు పలికాయి.

ఏపీకి విపత్తు పునరుద్ధరణ..

  విపత్తు పునరుద్దరణ పనులకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రూ 1500 కోట్లకు పైగా రుణంగా ఇవ్వనుంది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వానికి, ప్రపంచ బ్యాంకుకు మద్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. గురువారం కేంద్ర కేంద్రం తరపున ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌ సెల్వకుమార్‌, ప్రపంచ బ్యాంకు తరఫున భారతదేశ డైరెక్టర్‌, ఏపీ తరపున భూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్‌ చందర్‌ శర్మ సమావేశమయిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంకు తరఫున భారతదేశ డైరెక్టర్‌, ఎస్‌ సెల్వకుమార్, జగదీశ్‌ చందర్‌ ఈ ఒప్పందం పై సంతకాలు కూడా చేశారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చే ఈ రుణంతో ఏపీలో ఏర్పడే విపత్తుల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాల పెంపు, ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిచనున్నారు. రానున్న ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వం ఈ నిధుల్ని వినియోగించి విద్యుత్తు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయటం, రహదారుల పునరుద్ధరణ, మొదలైన కార్యక్రమాలను అమలు చేయనుంది. అంతేకాక తుఫాను ప్రమాద ఉపశమన పథకం ఏపి, ఒడిశా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మొదటి దశగా రూ. 1491.71 కోట్లుగా అంచనా వేసింది. అయితే ఇప్పుడు మొదటి దశ అంచనాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. రూ 835 కోట్లు మేర పెంచుతూ... మొత్తాన్ని రూ 2331.71 కి పెంచింది.

పదవి పోయిన వెంటనే పార్టీ మారడం ఖాయం.. జేసీ

  అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో దురదృష్టమశాత్తు జరిగిన ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పార్టీ అధ్యక్ష పదవి ఉన్నంతకాలమే రఘువీరా రెడ్డి పార్టీలో ఉంటారని.. ఆ పదవి పోయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారడం ఖాయమని ఎద్దేవ చేశారు. రాష్ట్ర విభజన వల్లనే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని.. కాంగ్రెస్ పార్టీ వల్ల తాము చాలా లాభపడ్డామని అన్నారు. అంతేకాక హైదరాబాద్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ కు వెళ్లినప్పుడల్లా బాధ కలుగుతుందని.. హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు వస్తుందో తెలియదని, అటువంటి రాజధాని వస్తుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు. తన నియోజక వర్గం అభివృద్ధికి అవసరమైతే దౌర్జన్యానికైనా దిగుతానని వ్యాఖ్యానించారు.

జానాకు రాహుల్ సూటి ప్రశ్న

  ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది నేతలు వేరే పార్టీల్లోకి చేరిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మంది నేతలు ఇతర పార్టీలలోకి దూకడానికి ప్రయత్నాలు కూడా జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న డీఎస్ కూడా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత అయిన జానారెడ్డి కూడా వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారు అన్నారు కానీ ఆతరువాత జానారెడ్డి ఎక్కడికి ఏపార్టీల్లోకి వెళ్లడం లేదని కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశంలో తెలిపారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తం కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్ జానారెడ్డికి నేరుగా ఒక ప్రశ్న వేశారంట. మీరు పార్టీలో ఉంటారా? వెళ్లిపోతారా? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అంటూ ఆయన్ని నేరుగా అడిగారంట. అయితే ఈ వార్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతుంది. అయితే రాహుల్ వేసిన ప్రశ్నకు జానారెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. బయట వచ్చే వార్తలను నమ్మొద్దని సమాధానం చెప్పారంట. అయితే దీనికి రాహుల్ డి.ఎస్ వంటి విశ్వాసపాత్రమైన సీనియర్ నేతలే వెళ్లిపోతుంటే, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మరాదో తెలియడం లేదని రాహుల్ వాపోయారట. చూద్దాం జానారెడ్డి మాట మీద నిలబడతారో లేదో.

పుష్కరఘాట్ లో మొసలి!!!

  కరీంనగర్ జిల్లాలో ఇబ్రహీం మండలం వేములకుర్తి వద్ద బాలమ్మ పుష్కర ఘాట్ లో స్నానాలు చేస్తున్న భక్తులకి నీళ్ళలో మొసలి కనిపించడంతో తుళ్ళిపడి భయంతో ఒడ్డుకి పరుగులు తీసారు. ఈ విషయం తెలుసుకొన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మొసలిని పట్టుకొన్నారు. ఒడ్డుకి వచ్చిన మొసలి చాలా చిన్నది కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మళ్ళీ కాసేపు విరామం తరువాత భక్తులు యధావిధిగా నదిలోకి దిగి స్నానాలు చేయడం మొదలుపెట్టారు. నదిలో ఒక మొసలి కనబడిందంటే లోన ఇంకా మొసళ్ళు ఉండే అవకాశం ఉంది. ఈరోజు భక్తుల అదృష్టం కొద్దీ సకాలంలో మొసలిని చూసి ప్రాణాలు రక్షించుకోగలిగారు. కానీ మళ్ళీ మరొక మొసలి రాదని నమ్మకం ఏమిటి? కనుక ప్రభుత్వం అక్కడ పుష్కర స్నానాలు నిషేధించి ఉంటే బాగుండేది. ప్రమాదం జరిగిన తరువాత బాధపడటం కంటే జరగకుండా ముందే జాగ్రత్త పడితే మంచిది కదా?

రాజమండ్రి ఘటన దురదృష్టకరం... చంద్రబాబు

  మూడోరోజు కూడా గోదావరి మహాపుష్కర స్నానాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కొవ్వూరు లోని గోష్పాదక్షేత్రాన్ని పరిశీలించారు. పుష్కర ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజే రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్త చేశారు. రాష్ట్రంలో పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయని.. భక్తులను అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని... భక్తులు సైతం క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ మహా పుష్కరాలకు ఒక్క మన రాష్ట్ర నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారని తెలిపారు.

చర్చ పై రచ్చ

  పాలమూరు ప్రాజెక్టుపై టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి.. టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావుల మధ్య మాటాల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మొదట ప్రాజెక్టు పై చర్చించేందుకు జూపల్లి ఎన్టీఆర్ భవన్ కు వస్తానని సవాల్ విసిరారు. అయితే తాను చర్చకు వెళ్లలేదు.. ఆతరువాత దానిపై రావుల స్పందించి జూపల్లి ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జూపల్లి కోసం మూడు గంటలు ఎన్టీఆర్ భవన్ లో వేచి ఉన్నానని.. అయినా జూపల్లి రాలేదని.. సవాల్ విసిరి మొహం చాటేసారని ఎద్దేవ చేశారు. అయితే రావుల చేసిన వ్యాఖ్యలకు జూపల్లి స్పందించి చర్చకు నేను సిద్ధంగానే ఉన్నాను.. టైం మీరు ఫిక్స్ చేసినా పర్వాలేదు అని డైలాగులు విసిరారు.. అక్కడితో ఆగకుండా మళ్లీ టీడీపీ నేతలు తోక ముడిచారు.. చర్చకు రాలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రావుల జూపల్లి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చర్చకు తామేప్పుడూ సిద్దమేనని.. కానీ చర్చ ఎప్పుడు, ఎక్కడ అనేది జూపల్లి ఏకపక్షంగా నిర్ణయిస్తే కుదరదని అన్నారు. ఆయన దారి తప్పిన, గతి తప్పిన విధంగా మాట్లాడుతున్నారని, ఇంతకు మించి తాను స్పందిస్తే తనకు సభ్యత అడ్డు వస్తుందన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని.. ఈ పథకం పూర్తి కావాలని తామూ కొరుకుంటున్నామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వద్దని చంద్రబాబు లేఖ రాయలేదని, వైసీపీ అధినేత జగన్‌ రాశారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున జూపల్లి ముందుగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆ తర్వాత ఎన్ని రోజులైన చర్చ పెట్టుకోవచ్చన్నారు.

5వేల కోట్లివ్వండి...అప్పులు తీర్చుకుంటాం..

  రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధికంగా చాలా నష్టం చాలా నష్టం జరిగిందన్నది తెలిసిందే. ఉన్నకష్టాల్లోనే ఎలాగొలా అప్పులుతెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఆర్జీ పెట్టుకుంది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ అప్పులపాలైపోయింది.. అప్పులు తీరాలంటే ఇప్పటికి ఇప్పుడు 5 వేల కోట్లు అవసరం.. తక్షణమే ఆ మొత్తాన్ని విడుదల చేసి ఆదుకోండి అంటూ కేంద్రానికి ఆర్జీ పెట్టింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తాం.. స్పెషల్ ప్యాకేజీలు ఇస్తాం.. రాష్ట అభివృద్ధికి చేయూతనిస్తాం అని తెలిపిన కేంద్ర ప్రభత్వం ఇప్పుడు చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. ఏపీకీ ఉన్న ఆర్ధిక లోటు గురించి ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఏపీ ప్రభుత్వం గతేడాదే రెవెన్యూ లోటు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రత్యేక ప్యాకేజీ, సీఎస్టీ బకాయిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 24,500 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరింది కానీ కేంద్రం మాత్రం .. కేవలం రూ.350 కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొంది. అప్పటి నుండి 350 కోట్లు మినహా ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వలేదు. మరోవైపు కాగ్ నివేదిక వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు ఉన్న రెవెన్యూలోటు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పింది. అయితే ఏపీకి ఉన్న ఆర్ధికలోటు 17 వేల కోట్లు అని కాగ్ రెండు నెలలు క్రితమే నివేదికను ఇచ్చింది. కానీ కేంద్రం మాత్రం ఆవిషయంపై నోరు విప్పడంలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం ఎలాగోలా అప్పులు తెచ్చి నెట్టుకొస్తుంది. అలా తెచ్చిన అప్పులే ఇప్పటికి 5వేల కోట్లు అయిపోయింది. దీంతో ఏపీ సర్కారు కేంద్రానికి రెవెన్యూ లోటు కింద 5 వేల కోట్లు ఇవ్వాలని.. అప్పులు తీర్చుకుంటామని కోరింది. కనీసం కేంద్రం కనుకు 5వేల కోట్లు మంజూరు చేసినట్టయితే కనీసం అప్పులు తీర్చి కాస్తంత ఒడ్డున పడొచ్చు అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మాకూ సగం ఇవ్వండి.. టీ సర్కార్

  తెలంగాణ ప్రభుత్వానికి.. ఏపీ ప్రభుత్వానికి ఏదో విషయంలో పేచీలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే అనేక వివాదాలతో రెండు ప్రభుత్వాలు ఎప్పుడూ గొడవపడుతూనే ఉన్నాయి. ఒక పక్క ఆంధ్రా, తెలంగాణ విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపుల్లో కొంచెం వివాదస్పద సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ విషయంపై ఇప్పటికే ఇరు రాష్టాల ఉద్యోగులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఏపీకిచ్చిన బొగ్గు గనుల్లో మాకూ సగం ఇవ్వండంటూ తెలంగాణ ఇంధన శాఖ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో నిర్మించే 6,000 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుకు బొగ్గు అవసరముందంటూ... ఒడిసా లోని సర్పాల్‌-నౌపార్‌ గనుల్లోని బొగ్గును సగం తమకు కేటాయించాలని తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి అరవింద కుమార్‌ కేంద్రానికి లేఖ రాశారు. అయితే గతంలో రాష్ట్ర విభజన ముందు ఒడిసాలోని సర్పాల్‌-నౌపార్‌ గనుల ను ఏపీకి కేటాయిస్తూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 25ను జారీ చేసింది. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత సర్పాల్‌-నౌపార్‌ బొగ్గు గనులను ఆంధ్రప్రదేశ్ జెన్‌కోకు కేటాయిస్తూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ రెండు నెలల క్రితమే ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపింది. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం విభజన ముందు బొగ్గు గనులను ఏపీకీ కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది... ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి అవే గనుల్లో మాకూ 50 శాతం కేటాయించాలని పట్టుబడుతోంది. మరి దీనికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటుందో లేదో.. ఒకవేళ ఒప్పుకోకపోతే మళ్లీ దీనిపై వివాదం మొదలవుతుంది.

గాయకుడు రామకృష్ణ కన్నుమూత

  ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. జూబిలీ హిల్స్ వెంకటగిరిలోని తన నివాసంలో రామకృష్ణ తుదిశ్వాస విడిచారు. రామకృష్ణ 1947, ఆగస్టు 20వ తేదీన విజయనగరంలో జన్మించారు. ప్రముఖ గాయని పి.సుశీల రామకృష్ణకు పిన్ని. రామకృష్ణ నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజు నటించిన అనేక చిత్రాలకు ఆయన పాటలు పాడారు. భక్తి గీతాలను పాడటంలో రామకృష్ణది ప్రత్యేక శైలి. మహాకవి క్షేత్రయ్య, దాన వీర శూర కర్ణ, అమరదీపం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం, బలిపీఠం, గుణవంతుడు, అందాల రాముడు, తాత-మనవడు, భక్త తుకారాం, శారద, భక్త కన్నప్ప, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, కరుణామయుడు వంటి అనేక చిత్రాల్లో ఆయన పాడిన పాటలు చిరస్థాయిగా నిలిచాయి. దాదాపు 200 చిత్రాలలో ఐదు వేలకు పైగా పాటలు పాడారు. ఎన్నో భక్తి గీతాల ఆల్బమ్స్‌లో కూడా ఆయన పాటలు పాడారు. ప్రముఖ నటుడు సాయికిరణ్ రామకృష్ణ తనయుడు. రామకృష్ణ కన్నుమూత పట్ల సినిమా రంగానికి చెందిన పలువురు దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఏసీబీ కార్యలయం వద్ద తెరాస ఎమ్మేల్యే.. సర్వత్రా ఆసక్తి

    నోటుకు ఓటు కేసులో తెరాస ఎమ్మెల్యేకు కూడా తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేయనున్నదని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి ఈ రోజు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయాలనుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభాకర్ రెడ్డి మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తమే తాను ఏసీబీ కార్యాలయానికి వచ్చానని అన్నారు. కాగా మీడియా ప్రతినిధులు మరిన్ని ప్రశ్నలు అడుగుతుండగా జవాబు చెప్పేందుకు నిరాకరించారు. అయితే ఈ కేసు వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేయగా తాజాగా తెదేపా నేత వేం నరేందర్ రెడ్డి కొడుకు కృష్ణ కీర్తన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా కృష్ణ కీర్తన్ ఈ రోజు ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు.

వాళ్లేమి టెర్రరిస్టులు కాదు అణచివేయడానికి.. రాఘవులు

  మున్సిపల్ కార్మికులు వారం రోజుల నుండి సమ్మె చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఒక పక్క కార్మికుల సమ్మెతో రోడ్లు మొత్తం చెత్తతో నిండిపోయిన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తుంది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు సమ్మె ప్రభుత్వం వారిని పట్టించుకోకపోగా వారి సమ్మెను పోలీసుల సాయంతో భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై సీపీఎం నేత బివి రాఘవులు స్పందించి కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏం బాలేదని.. వాళ్లేమి టెర్రరిస్టులు కాదు పోలీలుసు, సైన్యాన్ని దించి అణచివేయడానికి అని అన్నారు. మున్సిపల్ శాఖ కేసీఆర్ హయాంలో ఉన్నా కాని సమస్య పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. అన్ని శాఖలకు వేతనం పెంచిన కేసీఆర్ మున్సిపల్ కార్మికులు అడిగిన వేతనం ఇవ్వడానికి ఏమైందని.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే వాళ్లు వేతనం డిమాండ్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. కార్మికుల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి క‌మ్యూ‌నిస్టు పార్టీ‌ల నాయ‌కులు సిధ్దంగా ఉంటార‌ని తెలిపారు.