అమరావతి శంకుస్థాపన.. ముంబై సంస్థకు టెండర్

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం దసరా రోజు అంటే అక్టోబర్ 22న ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. సింగపూర్ ప్రధాని.. తదితర ఇంకా ముఖ్య అతిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఇంత అంగరంగ వైభవంగా చేపట్టదలచిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ముంబైకు చెందిన విజ్ క్రాఫ్ట్ అనే సంస్థ దక్కించుకుంది. అమరావతి శంకుస్థాపనకు గాను.. భూమి పూజ నిమిత్తంగాను చేపట్టవలసిన కార్యక్రమాలను సీఆర్డీఏ ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టెండర్ ప్రక్రియను నిర్వహించారు. కానీ దీనిలో రెండు సంస్థలే పాల్గొనగా ముంబైకి చెందిన విజ్ క్రాఫ్ట్ సంస్థ రూ 9.5 కోట్లకు బాధ్యత నిర్వహణలను కైవసం చేసుకుంది.

ఎర్రబెల్లిపై హత్యాయత్నం కేసు

టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై కేసు నమోదైంది. చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డు గోదాంల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో టీడీపీనేత ఎర్రబెల్లి దయాకర్ రావు తన అనుచరులు పోలీసులపై టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో ఎర్రబెల్లితో పాటు ఆయన అనుచరులు 17 మందిపై హత్యాయత్నం కేసు నమోదుచేశారు. అడిషినల్ ఎస్పీ, జనగామ ఇన్‌చార్జి డీఎస్పీ సంఘం జాన్‌వెస్లీ ఈ విషయాన్ని తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. యార్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రావాల్సి ఉంది ..కానీ ఆయన రాకముందు ఎర్రబెల్లి శిలాఫలకాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ నేతలు దీనిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వివాదం ఏర్పడి టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడనున్న పోలీసులకు, మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఎర్రబెల్లిపై అతని కార్యకర్తలపై హత్యాయత్నం, దొమ్మి, పోలీసులపై దాడి, కుట్ర కేసులతోపాటు ఇతర కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు ఊరట

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నుండి ముగ్గురు, కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు, వైసీపీ పార్టీనుండి ఒక్కరు పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ నేత ఎర్రబెల్లి.. కాంగ్రెస్ పార్టీ నేత సంపత్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలని అటు తెలంగాణ అధికార పార్టీని.. స్పీకర్ ను ఆయా పార్టీల నేతలు చాలా సార్లు అడిగారు. దీనిలో భాగంగా గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారివల్ల ఎలాంటి ఉపయోగంలేని కారణంగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇది స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని.. స్పీకర్ ను ఆదేశించలేమని తెలిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో ఆలోచన చేయాలని మాత్రమే సూచించింది.

బొత్సనా.. మజాకా..

  ఏపీలో అధికార టీడీపీ పార్టీకి గట్టిపోటీ నిచ్చే ప్రతిపక్షపార్టీ వైకాపా పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉనికి లేని కారణంగా టీడీపీకి ప్రతిపక్ష నేతగా జగన్ గట్టిపోటి ఇవ్వగలరూ అని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే అది రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో.. అప్పుడు పరిస్థితులు బాలేక అధికార పార్టీకి రోజుకో తలనొప్పి తయారయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడింది. పార్టీ రోజు రోజుకు బలపడుతుందనే రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈనేపథ్యంలో జగన్ పై అప్పుడున్న నమ్మకం ఇప్పుడు లేదనే అనిపిస్తుంది. దీనికో తోడు పార్టీలో ఉన్న నేతలు కూడా ఏదో నామమాత్రంగా.. ఏదో ఒక పార్టీలో ఉన్నాం కదా అన్న ధోరణిలో ఉన్నారు తప్ప.. పార్టీని బలోపేతం చేసే ఏవిధమైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అంతేకాదు మరోవైపు జగన్ పై కూడా పార్టీ నేతలు కొంత వరకూ అసంతృప్తికరంగానే ఉన్నారు. పార్టీలో అంతా తానై ఉండటం.. ఏదో పదవి ఆశించినా అది కాస్త తన సన్నిహితులకు ఇవ్వడంపై చాలా మంది నేతలు ఇప్పటికే జగన్ పై అసంతృప్పితో ఉండి పార్టీ నుండి బయటకు కూడా వచ్చేశారు. అయితే అందరి పరిస్థితి ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి జంప్ చేసిన మాజీ మంత్రి - మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్లిన బొత్స కొద్దిరోజులకే పార్టీలో తన దంటూ మార్క్ వేసుకొని.. తన టాలెంట్ తో జగన్ తర్వాత నెం 2 స్థానాన్ని దక్కించుకున్నాడు. బేసిక్ గా బొత్సకు రాజకీయానుభవం ఎక్కువ.. మంచి వాక్చాతుర్యం ఉంది.. రాజకీయాల్లో ఎత్తుగడలు బాగా తెలుసు. వీటివల్లే ఇప్పుడ బొత్స జగన్ కు కుడి భుజంలా తయారయ్యారు. సాధారణంగా ఏదైనా మీడియా సమావేశంలో మాట్లాడాలంటే దానికి జగన్ పర్మిషన్ తీసుకోవాలి.. అంతేకాదు ఎలా మాట్లాడాలి అనే విషయం కూడా జగనే చెపుతారు. అలాంటిది బొత్స మాత్రం తానే జగన్ ను సంప్రదించి.. ఈవిషయంపై మాట్లాడితే బావుంటుంది.. ఈ విషయంపై ప్రెస్ మీట్ పెడదాం మీరేమంటారు అంటూ జగన్ తో ఓకే చెప్పిస్తున్నారంట. దీంతో ఇంతకాలం పార్టీలో ఉన్న నేతలు బొత్స ధైర్యం చూసి ముక్కున వేలేసుకుంటున్నారట. అందుకే జగన్ కు కూడా బొత్సపై నమ్మకం కలిగి పార్టీ బాధ్యతలు దగ్గరుండి మరీ చూసుకోమని చెప్పారు. అయితే బొత్స మాత్రం అధికారాలు ఇచ్చారు కదా అని ఎక్కడా అతిగా ప్రవర్తించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. కేవలం పార్టీ కార్యక్రమాలు.. ప్రతిపక్షపార్టీపై ఎలాంటి ఎత్తుగడలు ఉపయోగించాలి అనే విషయాలు మాత్రమే చూసుకుంటున్నారట. మొత్తానికి బొత్స రాజకీయానుభవం ఏంటో దీనిని బట్టి మనకు అర్ధమైపోతుంది. ఇంత తక్కువ టైంలో అదీ వేరే పార్టీ మారినప్పటికీ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే అన్నీ బానే ఉన్నా ఇప్పుడు వైకాపా పార్టీ నేతలు మాత్రం బొత్స పై కుళ్లుకుంటున్నారట. ఇంతకాలం పార్టీలో ఉన్న కూడా తమకు దక్కని ప్రయారిటీ బొత్సకు దక్కిందని తెగ బాధ పడిపోతున్నారట.

కంటతడి పెట్టిన మోడీ.. టీలు అమ్మేవాడిని

  ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మోడీ ఒక సందర్బంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడంతో అందరూ ఆశ్యర్యపోయారు. జుకర్ బర్గ్.. ప్రధాని మోడీని ప్రశ్నలు వేస్తుండగా అందుకు మోడీ కూడా సమాధానం చెప్పారు. అయితే జుకర్ బర్గ్ కుటుంబాల విషయంలో మీకూ మాకూ ఒకేలాంటి పరిస్థితులు ఉంటాయి కదా అని ప్రశ్నించిన నేపథ్యంలో మోడీ తన బాల్యం గురించి వివరించారు. తమది చాలా పేద కుటుంబమని.. అందరి కుటుంబాలలో మాదిరిగానే మా కుటుంబంలో కూడా మమ్మల్ని పెంచడంలో మా తల్లి దండ్రులు కీలక పాత్ర పోషించారని అన్నారు. అంతేకాదు నేను బాల్యంలో టీలు అమ్మేవాడిని.. నాతల్లి మమ్మల్ని పోషించడానికి పక్క ఇళ్లలో పనులు చేసేదని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టేశారు. ఇప్పటికీ నా తల్లి తన పనులు తానే చేసుకుంటుందని ఇప్పుడు ఆమెకు 90 ఏళ్లు అని చెప్పారు. అయితే వెంటనే తేరుకొని మోడీ జుకర్ బర్గ్ పై ప్రశంసలు కురిపించారు. వేదిక వద్ద ఉన్న తన తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మీ అబ్బాయి ప్రపంచ దృష్టినే మార్చేశాడు’’ అని.. అందరూ కనిపించేలా వారిని లేచి నిలుచోవాలని కోరారు.  

పి.ఎస్.ఎల్.వి సి-30 శాటిలైట్ విజయవంతం

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈరోజు ఉదయం 10 గంటలకి శ్రీహరికోట నుండి ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి సి-30 విజయవంతం అయ్యింది. భారత్ కి చెందిన ఆస్ట్రో శాట్ తో బాటు విదేశాలకు చెందినా మరో ఆరు ఉపగ్రహాలను కూడా పి.ఎస్.ఎల్.వి సి-30 ద్వారా  ఇస్రో శాస్త్రజ్ఞులు నిరేశిత కక్ష్యలోకి విజవంతంగా ప్రవేశపెట్టగలిగారు.     ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రజ్ఞులు సుమారు పదేళ్ళపాటు నిర్విరామంగా శ్రమించారు. 1513 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహం కేవలం ఖగోళ పరిశోధనలు మాత్రమే వినియోగిస్తారు. అందుకోసం ఈ ఉపగ్రహంలో అత్యాధునిక అల్ట్రా వయొలెట్ టెలిస్కోపులు, ఇమేజేర్స్, మానిటర్ వంటి పరికరాలను అమర్చారు. బ్లాక్ హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాలు, అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం, నక్షత్రాల ఆవిర్భావం వంటి వాటి గురించి ఈ ఉపగ్రహం ద్వారా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం ఐదేళ్ళపాటు సేవలు అందిస్తుంది.    ఇది ఖగోళ పరిశోధనలకే పరిమితమయిన ప్రయోగం అయినప్పటికీ, ఇండోనేషియా, కెనడా, అమెరికా లకు చెందిన మొత్తం ఆరు విదేశీ ఉపగ్రహాలను కూడా పి.ఎస్.ఎల్.వి సి-30 ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెడుతున్నారు. ఆయా దేశాల నుండి ఫీజు రూపేణా చాలా భారీ మొత్తం అందుతుంది కనుక ఈ ప్రయోగం కోసం చేసిన కొంత ఖర్చును భారత్ తిరిగి రాబట్టుకొన్నయింది. ఇంతవరకు ఇస్రో మొత్తం 50 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెట్టింది. ఇంతకు ముందు కూడా భారత్ ఒకేసారి ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది మళ్ళీ మూడవసారి.

మా మీదే కేసులున్నాయి.. నాయిని

తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలకు బలిగొని అమరులైన కుటుంబాలకు ఇప్పుడు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఐదుగురి కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేస్తుందని.. రూ. 10 లక్షల చెక్కులు అందజేశారు. ఉద్యమంలో పాల్గొన్న సమయంలో చాలామందిపై అప్పటి ప్రభుత్వం చాలా కేసులు పెట్టిందని.. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుమారు వెయ్యిమందికి పైగా కేసులు రద్దు చేశామని తెలిపారు. అయితే రైల్వే పోలీసులు పెట్టిన కేసులు ఇంకా రద్దు కాలేదని.. నా మీదే ఐదు కేసులు ఉన్నాయి.. వాటిలో మూడు కేసులను కోర్టు కొట్టివేయగా మిగిలిన రెండు కేసుల్లో భాగంగా ఇప్పటికీ కోర్టుకు హాజరవుతూనే ఉన్నానని అన్నారు. అంతేకాదు 1969 సంవత్సరంలో మరణించిన వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామని తెలిపారు.

జగన్ కు సవాల్ విసిరిన లోకేశ్..!

  టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ ప్రతి పక్షనేతలకు సవాల్ విసిరారు. నారా లోకేశ్ మీడియా సమావేశంలో తమ ఆస్తి వివరాలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన మేము ప్రతిఏటా ఆస్తి వివరాలు తెలియజేస్తూనే ఉన్నాం.. మేము తెలియజేసినట్టు ప్రతిపక్ష పార్టీ నేతలు తెలియజేయగలరా అని సవాల్ విసిరారు. మేము చూపించిన ఆస్తుల కంటే ఇంకా ఏమైనా చూపించినట్టయితే అవి వారికే రాసి ఇచ్చేస్తామని చెప్పారు. తమ సంస్థలపై వచ్చిన ఆరోపణలను రుజువుచేయలేక పోయారని.. దీనికి తాము పారదర్శకంగా పనిచేయడమే కారణమని తెలియజేశారు. అంతేకాదు తాము ఆస్తి వివరాలు తెలియజేసినట్టు తమను ఆదర్శంగా తీసుకొని ఇతర నేతలు కూడా ఆస్తి వివరాలు తెలియజేయాలి అని సూచించారు. మరి లోకేశ్ చేసిన సవాల్ కు జగన్ సమాధానం చెప్తారో లేదో?

వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి

  తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎవరిని నియనిస్తారు అనే విషయంపై ఎప్పటినుండో చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ విషయంపై టీటీడీపీలో నేతల మధ్య కోల్డ్ వార్ కూడా నడుస్తోంది. అధ్యక్ష పదవి రేసులో రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి ఉండగా తరువాత మోత్కుపల్లి కూడా దళిత కార్డు చూపించి తాను కూడా అధ్యక్షపదవి పోటీలో నిలబడ్డాడు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ తెలంగాణ టీడీపీ పార్టీ వ్యవహారాలు చూసిన ఎల్.రమణనే ఇప్పుడు కూడా కొనసాగించాలని.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని నియమించాలని యోచిస్తున్నట్టు తెలస్తోంది. అయితే ఇప్పటివరకూ ఎర్రబెల్లి దయాకర్ ఫ్లోర్ లీడర్ గా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనను ఫ్లోర్ లీడర్ గానే ఉంచి.. రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించాలని.. ఇలా చేయడం వలన నేతలందరూ ఎలాంటి విభేదాలు లేకుండా పని చేసుకుంటారని బాబు భావిస్తున్నారు. ఈ నెలాఖరులో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పట్టిసీమ వల్ల ఉపయోగంలేదు.. పురంధేశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురుంధరేశ్వరి చంద్రబాబు చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీటికొరత తీరుతుందని.. ఈప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు అందిస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి..కృష్ణా జలాలను అనుసంధానం చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. ఎందుకంటే పట్టిసీమ ప్రాజెక్టు తాత్కాలిక ప్రాజెక్టు మాత్రమే.. దీనివలన ఉపయోగం ఏం లేదని అన్నారు. మూడేళ్ల తరువాత ప్రాజెక్టు ఉండదు.. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్లో సర్కారే ఈవిషయాన్ని పేర్కొందని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు.. అది పూర్తయితేనే రాయలసీమకు నీళ్ల కరువు తీరుతుందని.. కాబట్టి ఈ ప్రాజెక్టుపై దృష్టిసారించాలని సూచించారు. కేంద్రం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో 100 కోట్లు నిధులు మంజూరు చేసింది.. అది ఏం చేశారో తెలియదు.. ఇప్పుడు మళ్లీ రూ 350 కోట్లు మంజూరు చేసింది.. ఇప్పుడైనా ఈ నిధులను సద్వినియోగం చేస్తారో లేదో చూడాలి అని వ్యాఖ్యానించారు.

జగన్ పై ప్రసరిస్తున్న రామోజీ ‘ఉషాకిరణాలు‘

  రామోజీ, జగన్ భేటీ అలా జరిగిందో లేదో అప్పుడే జగతిపై ఉషాకిరణాలు ప్రసరించడం మొదలెట్టేశాయి. రామో-ఛీ అన్న నోటితోనే రామో-జీ అనడంతో ఈనాడు,ఈటీవీల్లో జగన్ పై వ్యతిరేక వార్తలు ఆగిపోయాయట, ఈ మేరకు ఈనాడు సిబ్బందికి రామోజీ నుంచి ఆదేశాలు వెళ్లిపోయాయట,  అందుకే గతంలో ఎప్పుడూ జగన్ అవినీతి, కేసులపైనే తప్ప పాజిటివ్ వార్తలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఈటీవీలో జగన్ దీక్ష పరిణామాలు, వైసీపీ లీడర్స్ బైట్స్ ను బాగానే ఇస్తోంది. తెలుగుదేశం అధికారంలో ఉంటే ప్రతిపక్షాన్ని కూరలో కరివేపాకులా తీసిపారేసే ఈనాడు గ్రూప్ లో ఈ కొత్త వింతను చూసి జనం ముక్కున వేలేసుకుంటుంటే, భవిష్యత్ లో ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలోనని  పొలిటికల్ లీడర్స్ గుసగుసలాడుకుంటున్నారు. టైమ్ బాబూ టైమ్ అంటూ మాట్లాడుకుంటున్నారు

చెత్త సర్వీసుల్లో రాంచరణ్ ఫస్ట్

హీరో రాంచరణ్ తేజ్ ట్రూజెట్ విమాన సంస్థలో భాగస్వామిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ట్రూజెట్ విమానాలకు మాత్రం ఎక్కడాలేని పేరు ప్రతిష్టతలు వచ్చిపడుతున్నాయి. అవి  పాజిటివ్ అని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అదేంటంటే ట్రూజెట్ విమానాల రంగంలోకి రాంచరణ్ తేజ్ అడుగుపెట్టి ఏడాది కూడా గడవలేదు. అప్పుడే ప్రయాణికుల చేత నానా మాటలు పడే పరిస్థితికి వచ్చింది. ట్రూజెట్ విమాన సర్వీసులు ఏమాత్రం బాలేదని ప్రయాణికుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంతేకాదు ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ప్రయాణికుల ఆగ్రహానికి గురైన సంస్థగా ట్రూజెట్ సినిమా ఫస్ట్ ప్లేస్ లో నిలిచి చరిత్రలో నిలిచింది. ఆతరువాత స్థానాన్ని ఎయిర్ ఇండియా దక్కించుకుంది. అంతేకాదు ఇంకో ఘనత కూడా ట్రూజెట్ కు దక్కింది. ఆగష్ట్ నెలలో సర్వీసుల రద్దు విషయంలో ట్రూజెట్ ద్వితియ స్థానంలో నిలిచింది. మొత్తానికి ఎంత తక్కువ సమయంలో పాపులర్ అయిందో అంత తక్కువ సమయంలోనే విమర్శలు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యమంత్రి ఇంటిపై సీఐడీ దాడి

ఆదాయానికి మించి ఆస్తుల ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణల కింద హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఇంటిమీద సీబీఐ, ఈడీ అధికారులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో వీరభద్ర సింగ్ (80), ఆయన భార్య ప్రతిభా సింగ్, కొడుకు విక్రమాదిత్య, కుమార్తె అపరాజితల మీద సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. వీరభద్ర సింగ్ 2009 నుండి 2011 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈనేపథ్యంలోనే ఆయన అనేక అవినీతి ఆరోపణలకు పాల్పడి రూ. 6.1 కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నారని దీనికి సంబంధించిన ఆధారాలు మాదగ్గర ఉన్నాయని అధికారులు తెలిపారు. అంతేకాదు వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లంచాలు తీసుకున్నారని.. మనీ లాండరింగ్, ఫోర్జరీ తదితర ఆరోపణలు కూడా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు న్యూఢిల్లీ లోని 11 ప్రాంతాలలో సోదాలు జరిపి విలువైన డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

నేరగాళ్లకు టికెట్లు ఇస్తున్నారు.. ఎంపీ ఫైర్

బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ పార్టీ విధానంపై మండిపడ్డారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆర్కే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్క పార్టీ వాళ్లు అనుసరించినట్టు డబ్బులు తీసుకొని టికెట్లు కేటాయిస్తున్నారని.. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మంచి పేరు ఉన్న వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా నేరగాళ్లకు టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల పక్క పార్టీ వాళ్లకి మనకి తేడా ఏముందని ప్రశ్నించారు. ఈ విషయంపై బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు సుశీల్ మోదీతో ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాత్రం అస్సలు స్పందించడంలేదని అన్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు కూడా చాలా కోపంగా ఉన్నారని.. ఇలాంటివి జరగకుండా ఎంత తొందరగా చర్యలు తీసుకుంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కోసం కొత్త క్యాంపు కార్యాలయం

తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనందరికి తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత తన క్యాంపు కార్యాలయాన్ని బేగంపేట షిప్ట్ చేశారు. అయితే అక్కడ సీఎం క్యాంపు కార్యాలయంలో కూడా కొన్ని దోషాలు ఉన్న నేపథ్యంలో చాలా మార్పులు చేశారు. అయినా కూడా వాస్తు నిపుణులు ఇంకా చాలా మార్పులు చేయాలని నిర్ణయించారు. దీంతో వాస్తు ప్రకారం ఇప్పుడు కేసీఆర్ కు కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేసీఆర్ కూడా అధికారులను ఆదేశించగా వారు కూడా దానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించడం జరిగిందట. ఈ కొత్త క్యాంపు కార్యాలయాన్ని ప్రస్తుతం సీఎం ఉంటున్న కార్యాలయానికి ఆనుకొని ఉన్న ఐఏఎస్ క్వార్టర్  స్థలంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ క్వార్ట్రర్ ను కూల్చివేయడానికి ఉత్తర్వులు జారీ చేస్తూ.. కార్టర్ల కూల్చివేతకు రూ. 63 లక్షలను కూడా మంజూరు చేసింది. కాగా కొత్తగా నిర్మించే సీఎం క్యాంపు కార్యాలయం అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకోవడమే కాకుండా సీఎం కేసీఆర్ రక్షణకు సంబంధించి అన్ని చర్యలను తీసుకుంటున్నారు.

సోమిరెడ్డి ఆరోపణ నిజమే... రామోజీ అరెస్ట్ కు ప్రయత్నించారు?

  రామోజీరావును ఒక్కరోజైనా జైల్లో ఉంచాలని ఆనాడు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనంటున్నారు టీడీపీ వర్గాలు, జగన్ కు రామోజీ అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని జీర్జించుకోలేకపోతున్న తెలుగుదేశం అభిమానులు...వైఎస్ హయాంలో రామోజీ అరెస్ట్ కు ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేసుకుంటున్నారు. రామోజీ అరెస్ట్ కు వైఎస్ ప్రయత్నించారని, తెల్లవారితే అరెస్ట్ జరుగుతుందనగా రామోజీ ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకుని దాన్ని ఆపుకోగలిగారని చెబుతున్నారు, ఎంతో పొలిటికల్ అండ్ మీడియా నెట్ వర్క్ ఉన్న రామోజీకి ఈ విషయం ముందుగా తెలియలేదని, ఓ వ్యక్తి అర్థరాత్రి  పూట చేసిన ఫోన్ కాల్ తో అప్రమత్తయ్యారని, తెల్లారితే అరెస్ట్ చేస్తారనే విషయాన్ని ఆ వ్యక్తి చెప్పినా మొదట నమ్మకలేదని, ఆ తర్వాత తనకున్న పలుకుబడితో ఫోన్లు మీద ఫోన్లు చేసి ఆరా తీస్తే నిజమని తేలిందని, దాంతో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి వైఎస్ పై ఒత్తిడి తెచ్చి అరెస్ట్ ను ఆపుకున్నారని అంటున్నారు