రేవంత్ రెడ్డి ప్రసంగానికి ఫిదా అయిపోయిన కేంద్రమంత్రి
posted on Nov 27, 2015 @ 3:50PM
టీ టీడీపీ రేవంత్ రెడ్డి తన వాగ్ధాటికే ఫైర్ బ్రాండ్ అని పేరు సంపాదించుకున్నాడు. ప్రత్యర్ధులకు ధీటుగా సమాధానం చెప్పి.. వారిని అంతే ధీటుగా విమర్శించగల నైపుణ్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. అందుకే అందరినీ ఏకిపారేసే కేసీఆర్ సైతం కాస్తో, కూస్తో రేవంత్ రెడ్డికి భయపడతారనే చెప్పుకోవచ్చు. ఆయన చేసే ప్రసంగానికి ప్రజలు సైతం చాలా ముగ్ధులైపోతారు. ఇప్పుడు ఏకంగా ఆయన చేసిన ప్రసంగానికి ఓ కేంద్రమంత్రే ముగ్ధుడైపోయాడు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ-బీజేపీ మిత్రపక్షం కాబట్టి ఆ అభ్యర్ధి తరపున ప్రచారంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సాధారణంగా రేవంత్ రెడ్డి ప్రసంగానికి ప్రజలు ఫిదా అయిపోయి.. ఈలలు, చప్పట్లతో హడావుడి చేయడం కామన్. అయితే ఈ ప్రచారంలో కూడా అదే జరిగింది. ఇదిలా ఉండగా ఈ ప్రచారానికి బీజేపీ కేంద్రమంత్రి హన్సరాజ్ గంగరామ్ కూడా హాజరయ్యారు. ఈయన రేవంత్ రెడ్డి ప్రసంగానికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఒక్కసారిగా షాకయిపోయారంట. అంతేకాదు ప్రసంగం అయిపోయిన తరువాత రేవంత్ రెడ్డి దగ్గరకి వెళ్లి "వెల్‌డన్" అంటూ అభినందనులు కూడా తెలిపారట.
అక్కడితో ఆగకుండా తాను రేవంత్ రెడ్డికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారంట. మీలాంటి వాళ్లు బీజేపీలో ఉండాలని.. పార్టీలో చేరండి.. పార్టీలో చేరితే కనుక బీజేపీ తరపున మీరే అంటూ పెద్ద ఆఫర్‌ను ముందుంచారట. కానీ రేవంత్ రెడ్డి అంతే సునితంగా దానిని తిరస్కరించి.. తను పార్టీ మారే ప్రసక్తే లేదు అని చెప్పారంట. మొత్తానికి రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో సామాన్య ప్రజలనే కాదు.. కేంద్రమంత్రులను కూడా ఆకర్షిస్తున్నాడు.