మోడీది పిరికిపంద చర్యలు.. కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆఫీస్ పై సీబీఐ దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ఆఫీస్ ను సీజ్ చేసినట్టు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మోడీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే సీబీఐ దాడులు చేయిస్తున్నారు..కక్షపూరితంగానే మోడీ సర్కార్ సీబీఐ దాడులు చేయిస్తోంది..ప్రధాని మోడీది పిరికిపంద చర్యలు అని మండిపడ్డారు.ప్రధాని ఆదేశాల మేరకే సీబీఐ దాడులు చేసింది..ఇలాంటి వాటికి భయపడేది లేదు అని అన్నారు. అయితే సీబీఐ మాత్రం సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేంద్రసింగ్ కార్యాలయంలోనే దాడులు జరిపాం..కొన్ని కంపెనీలకు రాజేంద్రసింగ్ అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వచ్చాయి..కంపెనీల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించాం అంతే..కేజ్రీవాల్ ఆపీసులో కాదు అని చెబుతున్నారు.

ఏపీ.. కాల్ మనీ ప్రకంపనాలు..

ఏపీలో కాల్ మనీ ప్రకంపనాలు మొదలయ్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా కాల్ మనీ, వడ్డీ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలో వడ్డీ వ్యాపారులు, కార్యలయాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో విజయవాడలోని చిట్టినగర్ లో ఉన్న వడ్డీ వ్యాపారుల కార్యలయ్యాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.ఇందులో భాగంగా మాచవరం పోలీసులు ఐదుగురు కాల్ మనీ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక గుంటూరు, శారదాకాలనీ వడ్డి వ్యాపారి శ్రీనివాస్ ఇంట్లో..అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫైనాన్షియర్లపై దాడులు జరిపి పలు కీలకపత్రాలు, ప్రామిసరీ నోట్లు స్వాదీనం చేసుకున్నారు.అలాగే ప్రకాశం జిల్లా, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాలలో పోలీసులు వడ్డీ వ్యాపారుల వివరాలు సేకరిస్తున్నారు.కాల్ మనీ వ్యాపారులపై తనకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.

"కాల్ మనీ"..జగన్ సైలెంట్ అందుకేనా..?

ప్రస్తుతానికి ఏపీలో పొలిటి"కాల్ మనీ" వార్ జరుగుతుంది.దీనికి సంబంధించి ఇప్పటికే ఎంతో మంది నేతల పేర్లు కూడా బయటపడుతున్నాయి.దీనిలో కొంత మంది తెలుగు తమ్ముళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే  ఎప్పుడు అధికార పక్షం తప్పులు దొరుకుతాయా..ఎప్పుడు అధికార పార్టీపై విమర్శలు చేద్దామా అని ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ ఎదురుచూస్తుంటారు.అలాంటిది ఇప్పుడు కాల్ మనీ దందాలో టీడీపీ నేతల పేర్లు వినిపిస్తున్నా జగన్ ఎందుకు ఏమాత్రం నోరు మెదపడంలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే జగన్ కు తమ పార్టీ నేతలపై ఉన్న నమ్మకంతోనే ఈ విషయంలో అధికార పార్టీపై నోరు జారడంలేదట.ఒకవేళ ఇప్పుడు కనుక తను అధికార పార్టీపై విమర్శలు చేసి..తరువాత పొరపాటున విచారణలో వైకాపా పార్టీ నేతల పేర్లు ఏవైనా భయటపడితే అప్పుడు పరువుపోతుందని ఆలోచిస్తున్నారంట.అంతేకాదు ఈ కేసుకు సంబంధించి అటు పోలీసు విచారణలో ఎవరెవరి పేర్లు వస్తున్నాయో చూసుకుంటుండడంతో పాటు తాను స్వయంగా దీనిపై వివరాలు తెప్పించుకునే పనిలోనూ ఉన్నారట.ఇంక రెండు రోజులు ఆగి..తమ నేతల పేర్లు లేని పక్షంలో ఆ తరువాత ప్రభుత్వం పై విమర్శలు చేయోచ్చులే అని భావిస్తున్నారంట.మొత్తానికి జగన్ కు తమ బంగారాల మీద అంత నమ్మకం ఉందన్నమాట.

మల్లాది విష్ణువుకి మరో దెబ్బ.."కాల్ మనీ" లో కూడా..!

ఇప్పటికే కల్తీ మందు వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ కేసు విషయంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మల్లాది విష్ణు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లారు.ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.ఇప్పుడు మళ్లీ ఏపీలో సంచలనమైన కాల్ మనీ కేసులో కూడా ఈయన చేయి ఉన్నట్టు తెలుస్తోంది.ఈ వ్యవహారంలో సులోచన అనే మహిళ.. మల్లాది విష్ణు అనుచరుడు గణేశ్ తమకు రూ.లక్ష అప్పుగా ఇచ్చి బదులుగా రూ.4లక్షలు వసూలు చేశారని..తన ఇంటిని కూడా లాక్కున్నారంటూ మలాది విష్ణు..అతని అనుచరుడు గణేష్ పై ఫిర్యాదు చేసింది.దీంతో ఈ వ్యవహారంలో కూడా మల్లాది విష్ణువు పేరు బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ఏపీ సీఎం చంద్రబాబు కాల్ మనీ దందాపై జులుం విసిరారు.కాల్ మనీ బాధితులు ఎవరూ డబ్బులు తిరిగి చెల్లించొద్దంటూ..ఇలాంటి అవినీతి,అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.ఏది ఏమైనా కల్తీ మద్యం విషయంలో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లాది విష్ణువుకి కాల్ మనీ వ్యవహారంతో మరో ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కాల్ మనీ కేసులో ఏపీ సీఎస్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది.ఈవ్యవహారంపై జనవరి 18 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

టీ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం క్లాస్.. జానారెడ్డికి స్పెషల్ గా

తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకుగాను జరగాల్సిన పోటీ కాస్త టీఆర్ఎస్ వల్ల ఆరు స్థానాలకే జరగనుంది.ఉన్న 12 స్థానాల్లో ఏకంగా ఆరు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది టీఆర్ఎస్.అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇప్పుడు టీఆర్ఎస్ ఏకంగా ఆరు స్థానాలు.. అది కూడా ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో..కాంగ్రెస్ పార్టీ నేతలకు అధిష్టానం క్లాస్ పీకనున్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే.. టీఆర్ఎస్ పార్టీ ఆరు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్లు పొందిన నేతలు కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవడం.. టీఆర్ఎస్ తో బప్పందాలు కుదుర్చోవడం.. వంటివి జరగడం..ఇదంతా కాంగ్రెస్ నేతల వైఫల్యమే అని గ్రహించి కాంగ్రెస్ పార్టీ వారికి తలంటనున్నట్టు తెసుస్తోంది.ఇందులో భాగంగానే వారిని అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకున్న్టట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.దీంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీఎల్ పీ నేత జానారెడ్డి - వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క - మాజీ మంత్రులు దానం నాగేందర్ - సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పార్టీ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. అయితే అందరి సంగతేమో కాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన జానారెడ్డికి మాత్రం స్పెషల్ క్లాస్ ఉన్నట్టు చెబుతున్నారు.ఇప్పటికే జానారెడ్డి పై అధిష్టానానికి పలు ఫిర్యాదులు అందాయి.టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నట్టు గతంలో వాదనలు కూడా వినిపించాయి.దీంతో జానారెడ్డికి మిగితా వారికంటే కాస్త ఎక్కువ క్లాస్ ఉండొచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

చంద్రబాబుని కలిసిన కేసీఆర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు.ప్రధాన ద్వారం వద్దకు వచ్చి చంద్రబాబు కేసీఆర్ కు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తాను నిర్వహించనున్న ఆయుత చండీయాగానికి కుటుంబ సమేతంగా రావాలని కేసీఆర్ చంద్రబాబుని ఆహ్వానించారు.దీంతో చంద్రబాబు తాను తప్పకుండా యాగానికి వస్తానని కేసీఆర్ కి చెప్పినట్టు తెలస్తోంది.కేసీఆర్ వెంట ఈటెల,ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు కేసీఆర్ కోసం పదిహేను రకాల వంటకాలు సిద్ధం చేయించినట్టు తెలుస్తోంది.అందులో నాటుకోడి, చేపల పులుసు, గోంగూర, ముద్దపప్పు, కాకినాడ ఖాజా, ఉలవచారు, టమోటా పప్పు, మునక్కాయ సాంబారు, బిర్యానీ, గడ్డ పెరుగు, పూతరేకులు వంటి మిఠాయిలు, వివిధ రకాల పండ్లు సిద్ధం చేసినట్టు సమాచారం.  

వారి తాట తీస్తాం..చంద్రబాబు

కాల్ మనీ దందాపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆయన బాధితులకు  భరోసా ఇచ్చారు.కాల్ మనీ వద్ద అప్పులు తీసుకున్న బాధితులు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించవద్దని సూచించారు.కాల్ మనీ దందా పేరుతే అక్రమాలకు పాల్పడిన వారి తాట తీస్తాం అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి పనలకు పాల్పడేవారిని  ప్రాథమిక దశలోనే అణచివేయాలని..తప్పుడు పనులు చేసేవారు భయపడేలా విద్రోహ చర్యలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.అవినీతిపరలను ఎట్టిపరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదు..కాల్ మనీ నిందితులు ఇప్పటికైనా బాధితులను వేధించడం ఆపకపోతే నిర్భయ చట్టం కింది కేసులు పెడతామని అన్నారు.అంతేకాదు కల్తీ మద్యం నిందితులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.కాల్ మనీ, కల్తీ మధ్యం ఘటనలు ఏపీ రాజధాని అమరావతి ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయని అన్నారు.

సినీ రచయిత సత్యమూర్తి కన్నుమూత

  ప్రముఖ సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి కన్నుమూశారు. సోమవారం తెల్లవారుఝామున చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో ఆయన ప్రాణాలు విడిచారు.ఆయన దాదాపు వంద చిత్రాలకు రచయితగా పనిచేశారు. ‘దేవత’, ‘చంటి’, ‘ఛాలెంజ్’, ‘భలేదొంగ’ వంటి సినిమాలకు సత్యమూర్తే రచయిత. తన కుమారుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా రాణించడానికి సత్యమూర్తి ప్రోత్సాహం ఎంతో వుంది. కొద్ది సంవత్సరాల క్రితం పక్షవాతానికి గురైన సత్యమూర్తిని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సత్యమూర్తి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. తన కుమారుడిని సినీ హీరోగా చూడాలన్నది సత్యమూర్తి కోరిక. ఆ కోరిక నెరవేరబోయే తరుణంలో సత్యమూర్తి కన్నుమూశారు.

సివిల్స్ పరీక్షను వాయిదా వేయండి

  ఈనెల 18 నుంచి 23 వరకు జరగనున్న యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. ఇటీవలి భారీ వరదలకు తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇప్పుడున్న పరిస్థితులలో తమిళనాడుకు చెందిన అనేక మంది విద్యార్థులు పరీక్షలు రాసే పరిస్థితిలో లేరని ఆమె తెలిపారు. ఈ పరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేసి తమ రాష్ట్ర అభ్యర్థులకు సహకరించాని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

పెళ్ళి కాదు... రేప్!

  ఒక యువతిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన ఆ వ్యక్తి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అతను అక్కడ తన స్నేహితులతో కలసి ఆమె మీద సామూహిత అత్యాచారం జరిపాడు. ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ ప్రాంతానికి చెందిన ఒక యువతికి మీరట్‌కి చెందిన నకుల్ అనే వ్యక్తితో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆమెని పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ప్రేమ మైకంలో వున్న ఆమె అతనితో కలసి డెహ్రాడూన్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళింది. ఆ ప్రదేశంలో పెళ్ళి చేసుకుందామని అతను చెప్పడంతో ఆమె అక్కడకి వెళ్ళింది. అక్కడే ఆమె ఊహించనిది జరిగింది. నకుల్ అతని ఇద్దరు స్నేహితులతో కలసి ఆ యువతి మీద సామూహిత అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితులు పరారీలో వున్నారు.

జీతాలు పెరగబోతున్నాయ్!

  గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు నిరంతరం పెరుగుతూనే వుంటాయి. మరి ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితేంటి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని పలు సర్వే సంస్థలు ఇస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగులకు వచ్చే ఏడాది భారీ స్థాయిలో పెరిగే అవకాశం వుందని సదరు సంస్థలు చెబుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో సగటున 10 నుంచి 30 శాతం వరకు జీతాలు పెరిగే ఛాన్సుందని సర్వేల సారాంశం. ప్రైవేటు ఉద్యోగుల జీతాలు పెంచాలని ఏడో వేతన సంఘం సూచించడంతోపాటు ఈ కామర్స్, మేక్ ఇన్ ఇండియా అంశాలు జీతాల పెరుగులకు కారణం కానున్నాయని సదరు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఉద్యోగాల్లో కొత్తవారిని చేర్చుకునే అంశం 2015 సంవత్సరంలో 10 శాతం పెరిగిందని, వచ్చే ఏడాది ఈ శాతం మరింత పెరిగే అవకాశం వుందని చెబుతున్నారు. అత్యుత్తమ పనితీరును ప్రదర్శించేవారికి గరిష్టంగా 30 శాతం వేతనాలు పెరిగే అవకాశం వుందట.

ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

  కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పొట్యాల వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆటోలో పెట్రోల్ తరలిస్తూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ఆటోలోనిపెట్రోలు చెల్లాచెదురై మంటలు వ్యాపించాయి. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా వున్నారు. మృతులు బెల్లంపల్లి, సోమన్‌పల్లి, పొట్యాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.