సోనియా, రాహుల్ గాంధీ లకు బెయిలు మంజూరు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిలతో సహా మిగిలిన అందరికీ డిల్లీ పాటియాలా హౌస్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసు గురించి గత రెండు మూడు వారాలుగా చర్చ జరుగుతోంది. దీని కోసమే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుని కూడా స్తంభింపజేస్తోంది. కానీ కేవలం ఇదు నిమిషాలలోనే ఈ కేసు విచారణ ముగిసిపోయింది. సోనియా, రాహుల్ తరపున కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ కేంద్రమంత్రులు మరియు ప్రముఖ లాయర్లు అయిన కపిల్ సిబాల్ మరియు అభిషేక్ సింఘ్వీ వాదించారు. ఈ పిటిషన్ వేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వారికి బెయిల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వారికి బెయిలు ఇచ్చినట్లయితే దేశం విడిచి పారిపోవచ్చని వాదించారు. కానీ కోర్టు ఆయన వాదనలను తిరస్కరించి ఈ కేసులో నిందితులుగా ఉన్న సోనియా, రాహుల్, మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబేలు ఒక్కొకరికీ రూ. 50,000 విలువ గల వ్యక్తిగత పూచికత్తుపై బెయిలు మంజూరు చేసి ఈ కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.
సోనియా గాంధీకి మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పూచీకత్తు ఇవ్వగా, రాహుల్ గాంధీకి ఆయన సోదరి ప్రియాంకా వద్రా, ఆస్కార్ ఫెర్నాండెజ్ కి గులాం నబీ ఆజాద్ పూచీకత్తు సమర్పించారు. మొదట ఈ కేసులో బెయిలు తీసుకోకుండా జైలుకి వెళ్లాలని రాహుల్ గాంధి భావించారు. కానీ పార్టీలో సీనియర్ నేతలు మరియు తమ తరపునవాదిస్తున్న కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీల సలహాల మేరకు ఆ ఆలోచన విరమించుకొన్నారు.