రాజమౌళి పద్మశ్రీ పై రచ్చ.. కర్ణాటక పుణ్యమా..?
posted on Jan 26, 2016 @ 2:41PM
ఒక్క సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన దర్శకుడు ఎవరంటే రాజమౌళి అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అలాంటి దర్శకుడి ప్రతిభకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇక్కడి వరకూ బానే ఉన్నా..ఇప్పుడు ఆ పద్మశ్రీ పై పలువురు పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు రాజమౌళికి పద్మశ్రీ వచ్చిందని సంతోషిస్తుంటే.. అంతలోనే అది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యం కాదని.. కర్ణాటక రాష్ట్రం కారణంగా ఆ పురస్కారం లభించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజమౌళికి ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం వార్తలో బ్రాకెట్ లో కర్ణాటక అని ఉంది. దీంతోనే అసలు రచ్చ మొదలైంది.
రాజమౌళికి వచ్చిన పద్మశ్రీ అవార్డు కర్ణాటక ప్రభుత్వం సిఫార్సు చేస్తే వచ్చిందని.. తెలుగు రాష్ట్రాలు మరిచిపోయిన ఈ విషయాన్ని పక్కనున్న కర్ణాటక ప్రభుత్వం పట్టించుకొని ఇప్పించిందని అంటున్నారు. దీనిపై తెలుగు సినీ అభిమానులు కూడా అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు దీనిపై రాజమౌళి స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం గత ఏడాదే తమ పేరును ప్రతిపాదించిందని.. కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చిందని అన్నారు. అయినా నేను నాలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డని.. నేను పుట్టింది కర్ణాటకలో.. చదువుకుంది ఏపీలో.. పని చేసింది తమిళనాడులో.. స్థిరపడింది తెలంగాణలో అంటూ చెప్పుకొచ్చారు.