ఎర్రబెల్లి లేఖ.. మొదటిసారేం కాదు.. ఏం జరుగుతుందో..?
posted on Feb 13, 2016 @ 5:30PM
తెలంగాణ టీడీపీ నుండి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 10 మంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ తమ పది మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్ మధుసూధనాచారికి లేఖ రాశారు. అయితే అది జరగదని.. విలీనం సాధ్యం కాదని.. ఈ విషయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పడంతో ఈ విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విలీనం ప్రక్రియ అనేది కొత్తేమి కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో రెండు సార్లు కూడా ఇలానే జరిగింది అని అంటున్నారు.
మొదటి సారి బిఎస్‌పికి చెందిన ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప తమ పార్టీ శాసనసభాపక్షాన్ని టిఆర్‌ఎస్‌లోవిలీనం చేస్తున్నట్టు తీర్మానం చేసి స్పీకర్‌కు అందించారు... ఆ తరవాత శాసన మండలిలో టిడిపి సభ్యులు విలీనం అయ్యారు. ఇప్పుడు ఇది ముచ్చటగా మూడోసారి. అంతేకాదు శాసనసభకు..శాసన మండలికి నిబంధనల విషయంలో పెద్ద తేడా ఉండదు కాబట్టి వీరు కూడా విలీనమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో స్పీకర్ మధుసూదనా చారి న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. ఎర్రబెల్లి ఇచ్చిన లేఖపై ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.