పీకపై కత్తి పెట్టినా ఆ మాట అనను... అయితే పాకిస్థాన్ వెళ్లిపో..శివసేన

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్స్) చీఫ్ మోహన్ భగవత్ జెఎన్ యూ వివాదం నేపథ్యంలో భావి తరాలకు ‘భారత్ మాతా కీ జై’ అన్న నినాదాన్ని నేర్పాల్సి ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ‘పీకపై కత్తి పెట్టినా... భారత్ మాతా కీ జై అనమంటే అనను’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు అసదుద్దీన్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతుంది. దీనిపై శివసేన పార్టీ ఘాటుగా స్పందిస్తూ..  ‘భారత్ మాతా కీ జై’ అని ఉచ్చరించకపోతే... తక్షణమే ఓవైసీ పాకిస్థాన్ వెళ్లిపోవాలని మండిపడింది. మరి శివసేన వ్యాఖ్యలకి అసదుద్దీన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

జగన్ అవిశ్వాస తీర్మానం.. మూజువాణి ఓటుతో ఓటమి..

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానాన్నిఓడించింది ప్రభుత్వం. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించి, బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. దీంతో ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఆందోళన చేపట్టడంతో సభను వాయిదా వేశారు. అయితే  న్యాయమూర్తులను కించపరిచే విధంగా జగన్ వ్యాఖ్యలు చేశారని, తాను క్షమాపణ చెప్పాలా..వద్దా అనేది తనకే వదిలేస్తున్నామని అధికార పక్ష నేతలు స్పీకర్ కు తెలిపారు.

జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఏం తమాషాగా ఉందా.. తోలు తీస్తా..

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఫుల్ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో రూ.7వేల కోట్ల అవినీతి జరిగిందని, ఎన్టీపీసీ, కృష్ణపట్నంలో అవినీతి జరిగింది జగన్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు జగన్ నిప్పులు చెరిగారు. మొన్న కూడా జగన్ భూదందాపై ఆరోపణలు చేశారు.. వాటిని నిరూపించాలని సవాల్ చేశాం..ఇప్పుడు మళ్లీ పోలవరం ప్రాజెక్టుపై చేసిన ఆరోపణల చేసిన నేపథ్యంలో.. జగన్ ఆరోపణలు నిరూపించాల్సిందేనని.. అప్పుడే సభ జరుగుతుందని అన్నారు. ఇది సభ అనుకున్నారా.. ఇంకేమన్నా అనుకున్నారా.. ఇది పవిత్రమైన దేవాలయం..ఏం తమాషాగా ఉందా హౌస్ అంటే అని విరుచుకుపడ్డారు. దమ్ముంటే పోలవరం, విటిపిఎస్, కృష్ణపట్నంలో అవినీతి జరిగిందని నిరూపించగలరా.. లేకపోతే జగన్ పైన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీయిజం చేస్తే తోలు తీస్తామని, వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు క్షమాపణ మాత్రం చెప్పి ఊరుకుంటే ఊరుకునేది లేదన్నారు. తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి ఇలాగే తప్పుడు ఆరోపణలు చేసి, క్షమాపణ కోరితే ఎలా అన్నారు.

జగన్ రూట్ లోనే తెలంగాణ కాంగ్రెస్..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. తమ పార్టీ నుండి 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ 8మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయించి, ఉప ఎన్నికలకు జరిగేలా చూడడానికి తాము చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినట్లు జగనే స్వయంగా చెప్పారు. అయితే ఇప్పుడు జగన్ పంథాలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తెలంగాణ అధికార పార్టీలోకి ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ నుండి.. టీడీపీ నుండి పలువురు వలసలు వెళ్లిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినా.. స్పీకర్ సరిగ్గా స్పందించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.   దీనిలో భాగంగానే కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత కె జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ ఏకపక్షంగా సాగుతోందని నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ప్రభుత్వంపై కాంగ్రెసు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే ఆలోచన చేస్తోంది.

గంటాకు చంద్రబాబు క్లాస్.. 'యూజ్ లెస్ ఫెలో' అంటుంటే ఏం మాట్లాడరా..?

మన ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో అప్పుడప్పుడు తిట్లు తినిపించుకోవడం అలవాటుగా మారిపోయింది. ప్రతిపక్షాలకు సరైన సమాధానాలు చెప్పలేకపోవడం.. దానికి మీరు ఏం చేస్తున్నారు.. మాట్లాడరా అని చంద్రబాబు వారికి క్లాస్ పీకడం.. క్లాస్ పీకించుకున్న తరువాత వారు అప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అప్పుడు ప్రతిపక్షమంపై విరుచుకుపడటం పరిపాటైపోయింది.. తాజాగా ఇప్పుడు గంటా మరోసారి చంద్రబాబుతో క్లాస్ పీకించుకున్నట్టు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లలో భాగంగా చంద్రబాబుపై.. ప్రభుత్వ వైఖరిపై మాటల తూటాలు పేల్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై గంటా నోరు మొదపలేదు. దీంతో అప్పుడే చంద్రబాబు గంటాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ తరువాత ఎలాగొలా ముద్రగడ నోరు కట్టడి చేశారు.   అయితే ఇంతలో  కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. చంద్రబాబును ఏకంగా 'యూజ్ లెస్ ఫెలో' అంటూ తీవ్రమైన పదజాలం వాడారు. దీనికి చంద్రబాబు ఆగ్రహించి.. ''రామ చంద్రయ్య ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మీరు కడప జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఇలాగైతే ఎలా? ఇది పద్ధతిగా లేదు'' అని గంటాకు క్లాస్ తీసుకున్నారట. మరి ఇప్పుడైనా  గంటా స్పందిస్తారో లేదో చూడాలి.

నన్ను విలన్‌ను చేయొద్దు.. మీ శ్రమను వృథా చేసుకోకండి.. మాల్యా..

ప్రస్తుతం విజయ్ మాల్యా లండన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఈనెల 18న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది..  మరోవైపు చెక్‌ బౌన్సు కేసులో భాగంగా నాంపల్లి కోర్టు ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంటును జారీ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితులపై విజయ్ మాల్యా స్పందిస్తూ.. ‘ద సండే గార్డియన్‌’ వార్త పత్రిక అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. ఏదో స్నేహితులను కలవడానికి వస్తే పారిపోయాడు అన్న ముద్ర వేశారు.. అని అన్నాడు. అంతేకాదు ఆ పత్రిక వాళ్లు మీరు భారత్‌కు ఎప్పుడు తిరిగి వెళ్లనున్నారని ప్రశ్నించగా, ఆయన ఆ ప్రశ్నకు.. ప్రస్తుతం నా వాదనను వినే పరిస్థితులు అక్కడ లేవు.. ఇప్పటికే నామీద క్రిమినల్‌ అనే ముద్ర వేశారు.. గతేడాది నాకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. కాని నేను పారిపోలేదు. మరి ఇప్పుడెందుకు నన్ను క్రిమినల్‌గా చిత్రికరిస్తున్నారు అని ప్రశ్నించారు. అంతేకాదు ‘నన్ను విలన్‌ను చేయొద్దు. నాకు మంచి ఉద్దేశాలే ఉన్నాయి అని అన్నారు.   అంతేకాదు.. బ్రిటన్‌లో మీడియా నా కోసం వెతుకులాడుతోంది. విచారకరమైన విషయమేమిటంటే.. ఇప్పటికీ వారు సరైన ప్రాంతాన్ని కనుగొనలేదు. అయినా నేను మీడియాతో మాట్లాడను. అందువల్ల మీ శ్రమను వృథా చేసుకోకండి’ అని ట్విటర్‌లో తెలిపారు.

గత బడ్జెట్‌ కంటే పెరిగిన గ్రామీణాభివృద్ది కేటాయింపులు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. ఇప్పుడు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా గ్రామీణాభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కవే కేటాయించారు. గత బడ్జెట్‌లో.. రూ.6,583 కోట్లు కేటాయించిన ప్రభుత్వం .. ఈసారి 10,731 కోట్లు కేటాయించింది. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ది లక్ష్యంగానే 2015లో గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టామని..  మన వూరు- మన ప్రణాళికలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా గ్రామాభివృద్ధికి ప్రణాళిక తయారుచేయడమే గ్రామజ్యోతి ఉద్దేశమన్నారు. 2016-17లో రోడ్ల అభివృద్ధి, నిర్వహణ పనుల కోసం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.10,713 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

ఆర్‌ఎస్‌ఎస్ ను ఐసిస్ తో పోల్చిన ఆజాద్.. రాజ్యసభలో దుమారం..

కాంగ్రెస్ ఎంపీ గులామ్ నబీ ఆజాద్ ఆర్‌ఎస్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగుతోంది. ఆర్ఎస్ఎస్ ను ఐసిస్ ను పోలుస్తూ ఆజాద్  వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎలాగైతే ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకిస్తామో, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను కూడా వ్యతిరేకిస్తాం. ఇస్లాం మతస్తులు తప్పు చేస్తే.. అది ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు తప్పు చేసినట్లే అని ఆజాద్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీంతో ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది. దీనిపై కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ ఆజాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మరో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఐసిస్‌తో పోల్చి ఆజాద్ నోరు జారారని..  ఈ రకంగా ఆయన ఐసిస్ ను గౌరవించారని.. దీన్ని బట్టి వారి మనస్థత్వాలు ఏంటో అర్దమయిందని అన్నారు.   అయితే దీనికి ఆజాద్ మాత్రం తాను ఆర్‌ఎస్‌ఎస్‌ ను.. ఐసిస్ ను పోల్చి వ్యాఖ్యలు చేయలేదని.. కావాలంటే ఆ ప్రసంగానికి సంబంధించిన సీడీలను పరిశీలించాలని కోరారు.

పచ్చిమిరపకాయ ప్రాణాలు తీసింది

పచ్చిమిరపకాయని కొరకడం వల్ల ఓ రెండేళ్ల పాప తన ప్రాణాలనే కోల్పోయింది. దిల్లీలో జరిగిన ఈ సంఘటన ద్వారా పిల్లల ఉసురు తీసేందుకు ఎన్నిరకాలైన ప్రమాదాలు వేచిఉంటాయో మరోసారి తెలుస్తోంది. డా॥ చిత్తరజంన్ బెహరా అనే వైద్యుడు అందిస్తున్న సమాచారం ప్రకారం... మిరపకాయను తిన్న తరువాత విపరీతంగా వాంతులు చేసుకున్న ఆ పాప తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది. జీర్ణాశయంలో ఉండే ద్రవాలు ఊపిరితిత్తులలోకి చేరుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా ఊపిరితిత్తులలోకి ఇలాంటి ద్రవాలు చేరుకున్నప్పుడు, అవి శ్వాసకు అడ్డుపడకుండా మన శరీరం ప్రయత్నిస్తుందనీ.... వాంతులు చేసుకోవడం, దగ్గడం ద్వారా మనిషి శ్వాసనాళంలో ఉన్న ద్రవాలు వెలుపలికి వెళ్లిపోతాయనీ చెబుతున్నారు. అయితే రోగి స్పృహ కోల్పోయినప్పుడు, రోగికి తెలియకుండానే ఊపిరితిత్తులు ద్రవాలతో నిండిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు శ్వాస ఆడక రోగి చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

జగన్ రికార్డ్ సృష్టించాడు.. ఉమా.. కుక్కలు మొరిగాయ్

  ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈసందర్బంగా అధికార పక్ష, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ చర్చలో భాగంగా ఎమ్మెల్యే బోండ ఉమ మాట్లాడుతూ.. జగన్ వైఖరి నచ్చకే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని.. అధికార కాంక్షతో అవిశ్వాస తీర్మానం పెట్టారని.. వైసిపి ఎమ్మెల్యేలే దీనిని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అంతేకాదు.. ఏపీ అభివృద్ది ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుతోనే సాధ్యమని.. ప్రజలు కూడా ఆ విషయాన్ని గమనించే టీడీపీని గెలిపించారని అన్నారు. కానీ జగన్ మాత్రం అధికార దాహంతో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాదు తనపై ఉన్న కేసుల గురించి కూడా ఉమ ప్రస్తావించారు. 420 కేసులు, 11 ఛార్జీషీట్లు, 16 నెలలు జైలులో ఉన్న ముఖ్యమంత్రి కొడుకుగా జగన్ రికార్డ్ సృష్టించాడని బోండ ఉమ ఎద్దేవా చేశారు.   దీనికి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ.. గజరాజు నడుస్తుంటే కుక్కలు మొరుగుతాయని టీడీపీ నేతలను కుక్కలతో పోలుస్తూ ఎద్దేవ చేశారు.

సింహం ముందు మతాధికారి మహిమ... పనిచేయలేదు!

‘ఫ్లూటు జింక ముందు ఊదు.... సింహం ముందర కాదు’ అని మన బాలయ్యబాబు చెప్పిన డైలాగుని సదరు మతాధికారి విన్నాడో లేదో కానీ, సింహాల ముందు తన మహిమను చూపించబోయాడు. ఎలెక్‌ డివానే అనే ఆయన దక్షిణాఫ్రికాలోని ఓ క్రైస్తవ మతాధికారి. గత వారం ఎలెక్‌, చర్చిలోని తన సహచరులతో కలిసి, క్రూగెర్‌ అనే నేషనల్‌ పార్కుకి చేరకున్నాడు. అక్కడ తిరుగుతున్న సింహాలను చూడగానే ఎలెక్‌కు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఒక్కసారిగా పూనకం పూనినవాడిలా వాహనం తలుపు తీసుకుని సింహాల దగ్గరకి పరిగెత్తాడు. మొదట్లో ఏదో ఆహారాన్ని తింటున్న సింహాలు అతడిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎలెక్‌ అరుపులు విన్న సింహాలు అతడి మీదకి వెళ్లడం మొదలుపెట్టాయి. తన మహిమ పనిచేయడం లేదని అనుమానం రావడంతో ఎలెక్‌ వెనక్కి తిరిగి పరుగు లంకించుకున్నాడు. కానీ సింహాలు వదుల్తాయా! ఒక సింహం అతని వెంటపడి ఎలెక్‌ పిరుదులను కొరికి పారేసింది. ఇంతలో అటవీశాఖ అధికారులు గాల్లోకి తుపాకులను పేల్చడంతో, సింహాలు పారిపోయాయి. ఎలెక్‌ ఊపిరి దక్కించుకున్నాడు. ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎలెక్‌ను ‘మీరెందుకలా చేశారని’ అడిగితే.... ‘భగవంతుడు నా ద్వారా తన మహిమను చూపిస్తాడనుకున్నాడు. ఈ భూలోకంలోని జీవులందరి మీదా మనిషికే కదా అధికారం ఉంది’ అని వాపోయాడట ఎలెక్‌! పాపం ఎలెక్ నమ్మకం గురించి సింహాలకు తెలియదేమో! లేకపోతే సదరు మతాధికారికి కాస్త దూరంగా ఉండేవి కదా!

ఏపీ అసెంబ్లీ.. అవిశ్వాసం తీర్మానంపై చర్చ.. తీర్మానం ఎందుకు పెట్టారు..?

  ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది.. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది అని అన్నారు. ఇంకా పలువురు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ఒక్క సభ్యుడైన పెట్టొచ్చు.. పేపరు మీద సంతకం చేసిన వాళ్లే మాట్లాడాలనుడం సరికాదు.. రాష్ట్రంలో కుళ్లు, కుతంత్ర రాజకీయాలు నడుస్తున్నాయని.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు.. ఈ రోజే అవిశ్వాసంపై చర్చకు ఎందుకు అనుమతించారు అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానాన్ని మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తున్నానని.. అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్ష నేతకు అవగాహన లేదని అన్నారు. జగన్ పై విశ్వాసం లేకే వైసీపీ నేతలు టీడీపీలో చేరారని వ్యాఖ్యానించారు. ఎందుకు అవిశ్వాసం పెట్టారో వైసీపీ చెప్పాలి అంటూ.. పోలవరానికి అడ్డంకులు తొలగించాం అందుకా.. పెన్షన్లను ఐదు రెట్లు పెంచినందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారా అంటూ ప్రశ్నించారు.  

ప్రజల ఆరోగ్యంపై దృష్టి.. వైద్య సదుపాయలకు ప్రోత్సాహకాలు..

2016-17 సంవత్సరానికి గాను ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వైద్య సదుపాయల పట్ల బాగానే దృష్టి సారించారు. ఈ సందర్బంగా ఈటెల మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి అని ఈటల పేర్కొన్నారు. అన్నట్టుగానే గతేడాది కంటే ఈ ఏడాది రూ.1036 కోట్లు అదనంగా ఆరోగ్య శాఖకు కేటాయించారు.   * పీహెచ్‌సీల నుంచి నిమ్స్‌ వరకు అన్ని ఆసుపత్రుల్లో సమూల మార్పులు * ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు * గ్రామాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహం * రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తాం * 40 చోట్ల డయాలసిస్‌, 40 చోట్ల డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు * హైదరాబాద్‌లో పెరిగిన ప్రజల అవసరాల దృష్ట్యా మరో 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు