వరల్డ్ టి20 : విండీస్ పై పసికూన ఆప్ఘాన్ విజయం

  టోర్నీ అంతా అద్భుతంగా ఆడి ఆకట్టుకున్న ఆప్ఘనిస్థాన్, వెళ్తూ వెళ్తూ ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న విండీస్ కు ఝలక్ ఇచ్చింది. కేవలం 123 పరుగులే చేసిన ఆఫ్ఘాన్, విండీస్ ను 117 పరుగులకు కట్టడి చేసింది. ఆప్ఘాన్ బ్యాటింగ్ లో నజీబుల్లా జడ్రాన్ 48 పరుగులతో రాణించాడు. విండీస్ బౌలింగ్ లో బద్రీకి మూడు వికెట్లు దక్కాయి. నామమాత్రమపు మ్యాచ్ కావడంతో విండీస్ క్రిస్ గేల్ కు రెస్ట్ ఇచ్చింది. బ్యాటింగ్ లో బ్రావో(28) ఒక్కడే కాస్త పోరాడాడు. పసికూనగా ఎంటరైనా, వరల్డ్ కప్ టోర్నీ అంతా పోరాటపటిమతో ఆఫ్ఘాన్ ఆకట్టుకుంది. ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలాంటి పెద్ద టీంలకు కూడా చెమటలు పట్టించింది. టోర్నీనుంచి నిష్క్రమించే ముందు ఇప్పటి వరకూ ఓటమిలేని విండీస్ ను మట్టికరిపించి గర్వంగా దేశానికి వెళ్లబోతోంది ఆప్ఘాన్ టీం.

టీం ఇండియా టార్గెట్ 115 పరుగులు..!

  మొహాలీలో వెస్టిండీస్ తో టి20 లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 114 పరుగులకు ఆలౌటైంది. భారత విజయ లక్ష్యం 115 పరుగులు. ఇదేంటి ఆస్ట్రేలియాతో కదా మ్యాచ్ అనుకుంటున్నారా..? ఆ మ్యాచ్ కంటే ముందు, ఇండియా వెస్టిండీస్ ఉమెన్ మ్యాచ్ ఉంది. ఆ స్కోరే ఇది. టీం ఇండియా అమ్మాయిల్లో అనుజా పాటిల్, హర్మన్ ప్రీత్ కౌర్ మూడు వికెట్లతో రాణించారు. కష్టాల్లో ఉన్న వెస్టిండీస్ బాటింగ్ ను కెప్టెన్ టేలర్ 47 పరుగులు చేసి ఆదుకుంది. భారత ఇన్నింగ్స్ కూడా ప్రస్తుతం కష్టాల్లోనే నడుస్తోంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఇండియా అమ్మాయిలు మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేశారు. ఇంకో 53 బంతుల్లో      62 పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఇండియా విమెన్ ఉన్న గ్రూప్ లో ఇంగ్లాండ్ క్వాలిఫై అయిపోయింది. ఈ మ్యాచ్ ఇండియా నెగ్గితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

ఐసిస్ చెర నుంచి బయటపడ్డ పాల్మైరా

  సిరియాలోని పురాతన నగరం పాల్మైరా ఐసిస్ నుంచి సిరియా చేతిలోకి చేరింది. రష్యా దళాల సాయంతో సిరియా సైన్యం ఈ నగరాన్ని తిరిగి పొందగలిగింది. దీంతో ఐసిస్ పతనమౌతోందన్న అమెరికా వార్తలకు నిజం చేకూరింది. ఇప్పటికే పాల్మైరాలోని పురాతన కట్టడాల్ని ఐసిస్ నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. పురాతన నగరమైన పాల్మైరాను స్వాధీనం చేసుకోవడానికి సిరియా గట్టిగా పోరాడింది. ఈ పోరాటంలో దాదాపు 188 మంది సైనికుల్ని సిరిమా కోల్పోగా, ఐసిస్ లో 400 మంది మరణించారు. కేవలం వారసత్వ కట్టడాలున్న ప్రాంతమే కాక, జనావాసాలున్న ప్రాంతం కూడా పూర్తిగా తమ అధీనంలోకి వచ్చిందని సిరియా ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా ఐసిస్ కిందే ఉన్న మోసూల్ ను కూడా త్వరలోనే విడిపిస్తామని సిరియా ప్రభుత్వం చెబుతోంది.

బ్యాంకులకు డబ్బు కట్టాల్సిన ఎవర్నీ వదలం - మోడీ

  అస్సాంలో సోనిత్ పూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు మోడీ. ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బ్యాంకుల్లో లోన్ తీసుకుని విదేశాలు పారిపోయిన వారెవరినీ వదిలే ప్రస్తకి లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక, ఎవరెవరు అధికారంలో ఉన్నప్పుడు బ్యాంక్ లు ఈ లోన్ లు ఇచ్చాయో వాళ్లని కూడా వదిలే ప్రస్తక్తి లేదంటూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల్ని దోచుకుంటూ 60 ఏళ్ల పాటు పాలన సాగించిందని, కానీ అలాంటి ఆటలు మోడీ ప్రభుత్వంలో సాగవంటూ ఆయన ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం భారతదేశపు అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రపంచమంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తోందన్నారు. తన ప్రసంగంలో ఎక్కువ భాగాన్ని పూర్తిగా కాంగ్రెస్ విమర్శలకే మోడీ కేటాయించడం విశేషం.

ఈరోజు భారత్ ఆస్ట్రేలియా తాడో పేడో..!

  వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో తలపడే మూడు టీంలు ఏవేవో తేలిపోయాయి. ఇక మిగిలింది గ్రూప్ 2 నుంచి వచ్చే సెమీస్ కు వచ్చే రెండో టీం ఏదా అన్న ప్రశ్నే. గ్రూప్ 2 లో న్యూజిలాండ్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోగా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఇంటిబాట పట్టేశాయి. మిగిలింది భారత్, ఆస్ట్రేలియాలు మాత్రమే. అందుకే ఈరోజు ఈ రెండు టీం ల మధ్యా జరగబోయే మ్యాచ్ ను క్వార్టర్ ఫైనల్ గా చెబుతున్నారు విశ్లేషకులు. రెండు టీం లకూ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ ఇది. గెలిస్తే నిలుస్తారు. బంగ్లాదేశ్ పై అతికష్టమ్మీద గెలిచినా, ఆఖరి ఓవర్లలో పది పరుగుల్ని కాపాడుకున్న టీం ఇండియా కాన్ఫిడెన్స్ ఆకాశంలో ఉంటుందనడంలో డౌట్ లేదు.   పైపెచ్చు ఆస్ట్రేలియాలో టి20 సీరీస్ లో ఆ జట్టును ఓడించి వచ్చిన ధోనీ సేనకే సెమీస్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫామ్ లో ఉన్న వాట్సన్ ను, భారత్ అంటే రెచ్చిపోయే స్మిత్ ను, బౌలింగ్ లో ఫాల్క్ నర్ ను భారత్ సమర్ధంగా ఎదుర్కోగలిగితే విజయం టీం ఇండియాదే. ఎప్పటిలాగే, టీం ఇండియాకు విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. బౌలింగ్ లో నెహ్రా, బుమ్రా స్థాయికి తగ్గట్టు రాణిస్తే, సెమీస్ టీం ఇండియా చేతిలోకి వచ్చేసినట్టే. మ్యాచ్ జరిగే మోహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమైనా, మెన్ ఇన్ బ్లూ కంటే ముందు ఇదే పిచ్ పై ఉమెన్ ఇన్ బ్లూ వెస్టిండీస్ తో తలపడుతుండటంతో, పిచ్ బాగా నెమ్మదించే అవకాశం ఉంది.

ఇండియాలోకి ఎంటరైన పాకిస్థాన్ ఇన్వెస్టిగేషన్ టీం

  పఠాన్ కోట్ అటాక్స్ పై దర్యాప్తు చేయడానికి పాకిస్థాన్ నియమించిన ఐదుగురు సభ్యుల ఇన్వెస్టిగేషన్ టీం, ఈరోజు భారత్ కు చేరుకుంది. పాకిస్థాన్ కు చెందిన జైషే ఈ మహ్మద్ తీవ్రవాద సంస్థ ఈ అటాక్ ను చేసిందని ప్రూవ్ చేస్తూ భారత్ సాక్ష్యాధారాలతో సహా పాకిస్థాన్ కు ఇచ్చింది. కానీ పాకిస్థాన్ మాత్రం, అందుకు సమగ్ర దర్యాప్తు చేస్తామని చెబుతూ, ఐదుగురు టీంను ఇండియాకు పంపించింది. వీరిలో పాకిస్థాన్ సీక్రెట్ ఏజన్సీ ఐఎస్ఐ సభ్యుడు కూడా ఉన్నాడు. మరో వైపు భారత ప్రభుత్వం మాత్రం, ఈ టీం కు పఠాన్ కోట్ లో అన్ని ప్రాంతాలకు అనుమతినివ్వమని, కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే వారికి అనుమతి లభిస్తుందని తెలిపింది. కేవలం దర్యాప్తు కోసమే కాక, భారత మిలిటరీ బలగాల్ని పరిశీలించడానికి కూడా పాక్ ఈ బృందాన్ని నియమించిందని భారత గూఢచార సంస్థ రా అభిప్రాయపడుతోంది.

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనకు అమోదముద్ర

  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో, రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీ కి చెందిన 9 మంది తిరుగుబాటు చేసి, బిజేపీకి సపోర్ట్ ఇవ్వడంతో, ఉత్తరాఖండ్ లో హరీష్ రావత్ సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలతో బిజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉండటంతో, కాంగ్రెస్ బీజేపీల మధ్య వివాదం ముదిరిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి ఏర్పడటంతో, రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్స్ చేయగా, దానికి ప్రెసిడెంట్ ఆమోదముద్ర వేశారు.

విజయ్‌కాంత్‌కు 500 కోట్లు ఆశచూపారు- వైగో

  ప్రతి రాష్ట్ర రాజకీయాలలోనూ సంచలన ప్రకటనలు చేసేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. తమిళనాట అలాంటి కోవలోకే వస్తారు వైగో. ఎండీఎంకే అధ్యక్షుడైన వైగో, ఈసారి చేసిన ప్రకటనతో మాత్రం చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం విజయ్‌కాంత్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్న వైగో ఆ సంబరంలో ఏదేదో మాట్లాడేశారు. ఎన్నికలలో తమతో పొత్తు పెట్టుకుంటే విజయ్‌కాంత్‌కు 500 కోట్ల రూపాయలు, 80 సీట్లు ఇస్తామంటూ కరుణానిధి ఆఫర్‌ చేశారంటూ విమర్శించారు. ఇక బీజేపీ కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చిందట. డబ్బులు, కేంద్రమంత్రి పదవి, రాజ్యసభలో సీటు... ఇలా బీజేపీ కూడా విజయ్‌కాంత్‌ను లోబర్చుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అసలే విజయ్‌కాంత్‌తో పొత్తు చెడిన కరుణానిధికి ఈ మాటలు వినగానే ఒళ్లుమండిపోయింది. దాంతో ఆయన వైగోకు ఒక లీగల్ నోటీసు పంపారు. వైగో తన మాటలను కనుక వెనక్కి తోసుకోకపోతే న్యాయపరమైన విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని అందులో స్పష్టం చేశారు. వైగో మాత్రం తన మాటలని వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా లేరు. తాను మీడియాలో విన్న మాటలనే తిరిగి అన్నానని చేతులు దులిపేసుకుంటున్నారు! మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో!

స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికేసిన ఉత్తరాఖండ్ సీఎం..!

  ఉత్తరాఖండ్‌లోని రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుని ప్రకటించడంతో, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. తమ ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టడం వల్లే వారు గోడ దూకారంటూ మండి పడుతున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలతో చేతులు కలిపిన బాబా రాందేవ్, ఈ కుట్రకు కారణమని ఆరోపిస్తున్నారు. దీనికి తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఘాటుగానే జవాబిస్తున్నారు. ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ స్వయంగా తమకు డబ్బుని ముట్ట చూపారంటున్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు వాళ్లు ఒక సీడీని కూడా బయటకు తీశారు. ఈ సీడీలో హరీష్‌ రావత్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు డబ్బులను, మంత్రి పదవులను ఎర చూపారన్నది ఆరోపణ. అయితే హరీష్‌ రావత్‌ ఈ ఆరోపణలను స్పష్టంగా కొట్టివేస్తున్నారు. సీడీ నిజమైంది కాదనీ, మోసపూరిత ఉద్దేశంతో దాన్ని రూపొందించారని మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం ముఖ్యమంత్రి బాగానే ఇరుక్కున్నారంటూ సంబరపడుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రే అవినీతి పాల్పడుతూ దొరికిపోవడంతో తమ రాష్ట్రం పరువు పోయిందనీ, ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు బర్తరఫ్‌ చేయాలని వారు కోరుతున్నారు.

భారత్ నుంచి కేజ్రీవాల్ మాత్రమే ఎంపికయ్యారు..!

  ప్రపంచవ్యాప్తంగా, తమ తమ రంగాల్లో ప్రభావం చూపించిన 50 మంది గ్రేట్ లీడర్స్ జాబితాలో, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చోటు దక్కించుకున్నారు. ఫ్యామస్ మ్యాగజీన్ ఫ్యార్చ్యూన్ రూపొందించిన ఈ జాబితాలో ఇండియా నుంచి కేవలం అరవింద్ కేజ్రీవాల్ కు మాత్రమే చోటు దక్కడం విశేషం. పాశ్చాత్య దేశాల్లో బాగానే ఫ్యామస్ అయిన ప్రధాని మోడికి ఇందుల్లో చోటే దక్కలేదు. ప్రభుత్వ, స్వచ్ఛంద సేవా రంగాల్లో స్ఫూర్తిని కలిగిస్తున్న వారు, విశేషంగా రాణిస్తూ చుట్టూ ఉన్న వారిపై ప్రభావాన్ని చూపిస్తున్న వారిని ఈ సర్వే కోసం ఎంపిక చేసినట్టు ఫార్చ్యూన్ చెబుతోంది. ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో వెబ్ సైట్ కంపెనీ అమెజాన్ సిఇవో జెఫ్ బెజోవ్ అగ్రస్థానంలో నిలిస్తే, కేజ్రీవాల్ 42వ స్థానాన్ని సంపాదించారు. ఇండియాలో అత్యంత కాలుష్యం కలిగిన నగరంగా ఉన్న ఢిల్లీని, అందులోంచి బయట పడేయడానికి, సరి బేసి విధానాన్ని ఎంచుకున్న కేజ్రీవాల్ కాలుష్యాన్ని తగ్గించగలిగారని, అదే ఆయన ఈ లిస్ట్ లో చేరడం వెనుక ప్రధానపాత్ర పోషించిందని ఫార్చ్యూన్ వెల్లడించింది. ఈ లిస్ట్ లో రెండో స్థానంలో జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్, మూడో స్థానంలో మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ ఉన్నారు.

రోహిత్ వేముల మృతిపై స్పందించిన కేసీఆర్

  హైదరాబాద్ యూనివర్సిటీల్లో జరుగుతున్న ఘటనలపై తెలంగాణా సిఎం కేసీఆర్ స్పందించారు. ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సటీల్లో జరుగుతున్న ఘటనలు బాధాకరమన్నారాయన. ఈరోజు శాసనసభలో ఆయన ఈ ఘటనలపై మాట్లాడారు. ఓయూలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కారుపై జరిగిన దాడిని సిఎం కేసీఆర్ ఖండించారు. ఈ సమస్యలపై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, సమగ్ర విచారణ జరిపిస్తామని సభకు హామీ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడుతుండగా కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు నినాదాలతో అడ్డుకునే ప్రయత్నం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పక్క వాయిదా తీర్మానం చేపట్టాలని కాంగ్రెస్ ఆందోళన చేస్తుండటంతో, శాసనసభ రెండుసార్లు వాయిదా పడింది.

ఫ్రీడం 251/- ఫోన్ పై మరో కేసు నమోదైంది..!

  251 రూపాయలకే స్మార్ట ఫోన్ అంటూ ఊరించిన రింగింగ్‌ బెల్స్ కంపెనీ మీద ఇప్పుడు నోయిడాలో ఒక కేసు నమోదైంది. కిరీట్‌ సోమయా అనే ఓ బీజేపీ నేత, ఈ కేసుని నమోదు చేశారు. రింగింగ్‌ బెల్స్ కంపెనీ నమ్మశక్యం కాని కబుర్లు చెబుతోందన్నది ఫిర్యాది ఆరోపణ. కేవలం 251 రూపాయలకి 4 అంగుళాల డిస్‌ప్లే, 1జిబి రామ్‌, 8జిబి మెమరీ ఎలా సాధ్యమంటూ కిరీట్ ప్రశ్నిస్తున్నారు. కిరీటి ఫిర్యాదుని పరిశీలించిన నోయిడా పోలీసులు సెక్షన్‌ 420 కింద కేసుని నమోదు చేశారు. ఇందులో నిందితులుగా రింగింగ్ బెల్స్‌ యజమాని ‘మొహిత్ గోయల్‌’, సంస్థ అధ్యక్షుడు ‘అశోక్ ఛద్దా’లను పేర్కొన్నారు. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ‘ఫోనుని ఇంత చవగ్గా ఎలా అమ్మగలుగుతున్నారంటూ’ రింగింగ్ బెల్స్ అధికారులని ప్రశ్నించారు. ఇక ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్‌ కూడా ఈ ఫోనులో ఏదో మతలబు ఉందంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ కేసు కూడా తోడవడంతో ఇక ఫ్రీడం 251/- తన ఖచ్చితత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంస్థ అధికారులు మాత్రం ఏ ప్రభుత్వ సంస్థ చేసే ఎలాంటి విచారణకైనా తాము సిద్ధం అంటున్నారు.  

ప్రేమించలేదని వాలీబాల్ ప్లేయర్ దారుణ హత్య..!

  మనం ప్రేమించిన వాళ్లు సుఖంగా ఉండాలని కోరుకునేది నిజమైన ప్రేమ. మనల్ని ప్రేమించలేదని చంపేస్తే అది రాక్షసత్వమే గానీ ప్రేమ కాదు. ఈ మధ్య బాగా ఈ రాక్షసత్వపు హత్యలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా, తనను ప్రేమించలేదని ఒక ఉన్మాది ఒక జాతీయ వాలీబాల్ క్రీడాకారిణిని హత్య చేశాడు. ఈ భయంకర సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. సంగీతా అయిచ్ అలియాస్ టీనా (15) ను ప్రేమించమని గత కొంతకాలంగా వెంటపడుతూ వేధిస్తున్నాడు ఉన్మాది సుబ్రతా సింహా(20). ఆమె ఒప్పుకోలేదన్న కసితో, ఆమె వాలీబాల్ ఆడుతున్న చోటికి వచ్చి పట్టపగలు దారుణంగా పొడిచి హత్య చేశాడు. దాదాపు 25 మంది వాలీబాల్ ప్లేయర్లు, ముగ్గురు కోచ్ లు ఆ సమయంలో అక్కడే ఉన్నా, ఏమీ చేయలేకపోయారు. ఒక కోచ్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కత్తితో అతని చేతిమీద గాయం చేశాడు. హత్య చేసి నిందితుడు పారిపోయిన తర్వాత గానీ, మిగిలిన వారెవరికీ మెదడు పనిచేయలేదు. వెంటనే టీనా ను హాస్పటల్లో జాయిన్ చేసినా, ఫలితం లేకపోయింది. మార్గ మధ్యంలోనే ఆమె అసువులు బాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు.

తెలంగాణా స్పీకర్ కు వడదెబ్బ తగిలింది

  రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బ ప్రభావానికి ఇప్పటికే 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే, మే వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు బేంబేలెత్తుతున్నారు. తాజాగా తెలంగాణా స్పీకర్ మధుసూదనాచారిని కూడా ఈ వడదెబ్బ ప్రభావం తాకింది. గత రెండు రోజులుగా, ఆయన తన సొంత నియోజకవర్గం భూపాలపల్లిలో అనేక పనుల్లో పాల్గొంటున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా పనులు చేసుకుంటూ వెళ్తున్న ఆయన కళ్లుతిరుగుతున్నాయని చెప్పడంతో హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు బీపీ షుగర్ చెక్ చేసి వడదెబ్బ తగిలిందని గుర్తించారు. విఐపీల పరిస్థితే ఇలా ఉంటే, ఇక ఎండనకా, వాననకా పనిచేసే సామాన్య ప్రజల పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందన్నది వాస్తవం. ఎండ బారిన పడకుండా ప్రజలంతా, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

దొంగతో మూడు డజన్ల అరటిపళ్లు తినిపించిన పోలీసులు

  ముంబైలో జరిగిన సంఘటన ఇది. ముంబైలో వోలీ ఏరియాలో ఓ పెద్దావిడ మెళ్లో చైన్ కొట్టేసి దొరికిపోయాడు సక్పాల్ అనే దొంగ. ఆవిడ గట్టిగా అరిచేసరికి పబ్లిక్ పట్టుకుని దొంగశ్రీ గారిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల వచ్చేలోపే ఆ చైన్ ను మింగేసి, తనకేమీ తెలీదని బుకాయించాడు. చాలా సేపు అడిగి విసిగిపోయిన పోలీసులు తమదైన స్ట్రైల్లో ఇంటరాగేట్ చేస్తే, చైన్ మింగేశానని నిజం కక్కాడు దొంగగారు. నిజం కక్కాడు గానీ, చైన్ మాత్రం ఇంకా పొట్టలోనే ఉండిపోయింది. దాంతో మనోడ్ని హాస్పిటల్లో చేర్పించి, మూడు డజన్ల అరటిపళ్లు తినిపించారు పోలీసులు. దాదాపు రెండు రోజుల పాటు ఇలా అరటిపళ్లు తినిపించిన తర్వాత గానీ, చైన్ రికవర్ అవలేదు. సక్పాల్ తో పాటు, దొంగతనం చేయమని ఉసికొల్పిన అతని భార్య కోలీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 392, సెక్షన్ 34 కింద కేసు బుక్ చేశామని, త్వరలోనే దొంగగారిని కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు చెబుతున్నారు.

పిల్లల్ని బాగా చదివించేందుకు నేరస్తులుగా మారాము!

తిరుపతికి దగ్గరలోని శేషాచలం అడవులు అనగానే ఎర్రచందనం దొంగలు గుర్తుకువస్తారు. ఇక్కడి ఎన్నిసార్లు పోలీసులు దాడిచేసినా, పోలీసుల కాల్పుల్లో ఎందరు చనిపోయినా... ఒకరి తరువాత ఒకరు చెట్లను నరికేందుకు ముందుకు వస్తూనే ఉన్నారు. సాధారణంగా పోలీసులకు పట్టుబడిన వెంటనే ‘తమకే పాపం తెలియదనీ, ఏవో ప్రాజెక్టు కోసం చెట్లని కొట్టాలని చెబితే వచ్చామని’ చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించేవారు. కానీ నిన్న పోలీసుల చేతికి దొరికిపోయిన ఇద్దరు ఎర్రచందనం దొంగలు అసలు విషయాన్ని వెల్లడించారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చెందిన చెల్లప్ప అనే నిందితుడు- తన కూతరు ఇంటర్మీడియట్‌ చదువుతోందనీ, ఆమె కాలేజి ఫీజు కోసం 30,000 రూపాయలను చెల్లించాల్సి ఉందని చెప్పుకొచ్చాడు.   తన రెండో సంతానాన్ని కూడా ప్రైవేటు బడిలో చేర్పించాలని... ఈ ఖర్చులన్నింటిని భరించేందుకు తాను నేరస్తునిగా మారానని వాపోయాడు. ప్రభుత్వ బడిలో చదివిస్తే వాళ్లెందుకూ పనికిరాకుండా పోతారని అన్నాడు. ఇక కుమార్‌ అనే రెండో నేరస్తుడి మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. తన పిల్లల్ని ఇంగ్లీష్‌ మీడియంలో చేర్పించడం తండ్రిగా తన బాధ్యత అనీ, ఆ మాత్రం కూడా చేయకపోతే, తన భార్యకి మొహాన్ని చూపించలేనని వాపోయాడు. ప్రభుత్వ పాఠశాలలే సవ్యంగా పనిచేస్తే ఇలాంటి వార్తలు వినాల్సిన అగత్యం వచ్చేది కాదు కదా!

ఆవుకీ ఎద్దుకీ పెళ్లి- 500 అతిథులు- 18 లక్షల ఖర్చు

ఆవుని ఇంటి మహాలక్ష్మిగా భావించి పూజించేవారి గురించి వింటూనే ఉంటాం. గోమాతని పెంచుకునేవారి సంఖ్యా తక్కువేమీ కాదు. కానీ అహ్మదాబాద్‌కి చెందిన విజయ్ పర్సానా మరో అడుగు ముందుకు వేశారు. తను పెంచుకుంటున్నా పూనమ్‌ అనే గోమాతను ఒక ఎద్దయ్య చేతిలో పెట్టాలనుకున్నారు. తన గోవు కోసం తగిన ఎద్దు ఎక్కడి దొరుకుతుందా అని వెతకగా వెతకగా, దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని భావ్‌నగర్‌ జిల్లాలో అర్జున్‌ అనే మంచి ఎద్దు ఉన్నట్లు తేలింది. అక్కడి దత్తాత్రేయ ఆశ్రమంలో పెరుగుతున్న అర్జున్‌తో పూనమ్‌కి వివాహాన్ని నిశ్చయించారు.   అలాగని ఈ పెళ్లి ఏదో తూతూమంత్రంగా జరిగిపోయిందని అనుకోవడానికి లేదు. పెళ్లికి లగ్న పత్రికలను ముద్రించి పంచిపెట్టారు. వరుడిని, వధువుని... పట్టుబట్టలతో, బంగారు ఆభరణాలతో అలంకరించారు. పూనమ్‌ను పల్లకీ మీద కూర్చోపెట్టి, ఒక ట్రక్కుతో ఆ పల్లకీని మోయించారు. వేదమంత్రాల సాక్షిగా విజయ్ పర్సానా కన్యాదాన క్రతువుని నిర్వహించారు. ఆరోగ్యపరంగా, ఆధ్మాత్మిక పరంగా గోవుకి ఉన్న ప్రాధాన్యం అసాధారణమనీ... ఆ ప్రాధాన్యతని ప్రచారం చేసేందుకు ఈ వివాహాన్ని తలపెట్టానని చెప్పుకొస్తున్నారు విజయ్ పర్సానా!

ఆనంద గజపతి రాజు కన్నుమూత

  మాజీ ఎంపీ, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు సోదరుడైన ఆనంద గజపతిరాజు కన్నుమూశారు. విజయనగర రాజ వంశానికి చెందిన ఆనంద గజపతి రాజు 1983లో తొలిసారి భీముని పట్నం ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మణిపాల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. రెండు సార్లు రాష్ట్రమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకు సొంతం. ఆయన మరణం పట్ల, ఏపీ సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోదరుడి మరణవార్త తెలుసుకున్న కేంద్రమంత్రి అశోక గజపతి రాజు, ప్రత్యేకవిమానంలో వైజాగ్ బయలుదేరారు. ఆధ్యాత్మిక చింతనలో ఉండే ఆనంద గజపతిరాజు దాదాపు 108 దేవాలయాలకు పైగా ధర్మకర్తగా ఉన్నారు. ఆయన మరణంతో విశాఖ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ మధ్య మాటల యుద్ధం

ఆన్‌లైన్‌ వ్యాపారంలో దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ మధ్య చిత్రమైన మాటల యుద్ధం మొదలైంది. ఒకరి మీద ఒకరు మాటలు విసరుకోవడానికి ఇప్పుడు ట్విట్టర్‌లో కూడా అవకాశం ఉండటంతో, ట్విట్టర్ వేదికగా ఈ గొడవ సాగింది. అంతర్జాతీయ ఆన్‌లైన్ దిగ్గజం ‘ఆలీబాబా’ త్వరలోనే భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘మన దేశంలో ఆలీబాబా అందించిన పెట్టుబడుల మీద వారికి నమ్మకాలు సన్నగిల్లినట్లున్నాయి.   అందుకే వాళ్లు స్వయంగా రంగంలోకి దిగినట్లున్నారు’ అంటూ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇంతకీ సదరు ఆలీబాబా పెట్టుబడులు అందించింది ఎవరికో కాదు. స్నాప్‌డీల్‌ సంస్థకే. ఈ ట్వీట్‌ను చదువుకున్న స్నాప్‌డీల్‌ యాజమాన్యానికి ఒళ్లు మండింది. ‘ఏ మీరు మాత్రం మోర్గాన్‌ స్టాన్లీ నుంచి తీసుకున్న నిధులను డ్రైనేజిలోకి పంపించలేదా’ అంటూ ఆ సంస్థ యజమాని కునాల్‌ బెహల్‌ ట్వీటారు. మొత్తానికి వీరిద్దరి ట్వీట్లతో గుట్టుగా ఉండాల్సిన వ్యాపార నష్టాలు కాస్తా రోడ్డున పడ్డట్లున్నాయి.