అదే మా విజయ రహస్యం- ధోని
టి-20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో ఇండియా కీలక పోరు. ఇందులో ఓడినవారు ఇంటిబాట పట్టక తప్పదు. గణాంకాలన్నీ ఇండియాకు అనుకూలంగా ఉన్నా, అప్పుడప్పుడూ అద్భుతాలు సాధించే సత్తా బంగ్లాకు ఉంది. అనుకున్నట్లే ఆట సాగుతుండగా బంగ్లాది పైచేయిగా కనిపిస్తోంది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేస్తే చాలు, మ్యాచ్ బంగ్లా కైవసం అవుతుంది. అలాంటప్పుడే ధోని చకచకా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇటు సింగిల్ కానీ, అటు భారీ షాట్ కానీ ఆడేందుకు అవకాశం లేకుండా ఫీల్డర్లను మోహరించాడు. ఇలాంటి సమయంలో బ్యాట్స్‌మెన్ కంగారుపడి బాల్‌ని కొట్టకపోయినా, పరుగు కోసం బయల్దేరతాడని ధోనీ అనుభవం చెబుతోంది. అందుకే బ్యాట్స్‌మెన్‌ను రనౌట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ధోనీ ఊహించినట్లే జరిగింది. లేని పరుగు కోసం పరుగులెత్తి రనౌట్ అయ్యాడు బంగ్లా ఆటగాడు. ఒక్క పరుగుతో ఇండియా విజయాన్ని దక్కించుకుంది.
‘క్లాసులో ఉన్నవాడు ఎవ్వడైనా ఆన్సర్ చెబుతాడు, కానీ ఎగ్జామ్‌లో రాసేవాడే టాపర్ అవుతాడు’- జులాయి సినిమా క్లైమాక్సులో అల్లు అర్జున్ డైలాగుని విన్నాడో లేదో కానీ, బంగ్లా మ్యాచ్ తరువాత ధోనీ ఇలాంటి మాటలే అన్నాడు. ‘పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఆడగలిగితే ఫలితం దక్కుతుందని’ అంటున్నాడు. తన దగ్గరకు వచ్చి చాలామంది చాలా సలహాలు ఇస్తూ ఉంటారనీ... అవన్నీ దృష్టిలో ఉంచుకుని చివరికీ తాను నిర్ణయం తీసుకుంటాననీ చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు జోరు మీద ఉన్నప్పుడే తాను ఆఖరి ఓవరు ఎవరితో ఎలా వేయించాలో నిర్ణయించుకున్నాని వెల్లడించాడు. మొత్తానికి ధోనిని మిస్టర్ కూల్‌గా ఎందుకు పిలుస్తారో, ప్రపంచానికి అర్థమైపోయి ఉంటుంది.