రాహుల్ వినతిని మోడీ మన్నిస్తారా?

జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. అత్యవసరంగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఎల్లప్పుడూ కలిసి నిలబడతామని చూపించాలని  ఆ లేఖలో రాహుల్ కోరారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత పార్లమెంటు సాక్షిగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని లేఖలో తెలిపారు. పహల్గామ్ దాడి జరిగిన వెంటనే తర్వాతి రోజు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం కూడా చేశారు. భారత ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు తాము మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత జరిగిన అఖిల పక్ష సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు అన్ని పార్టీల నేత లు హాజరయ్యారు. ఆ సమావేశంలో భారత ప్రభుత్వం చేపట్టే చర్యలన్నింటికీ మద్దతుగా ఉంటామని, వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అయితే ఆ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరుకాకపోవడాన్ని మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. ఇటువంటి ముఖ్యమైన సమావేశానికి ప్రధాని మోడీ వచ్చి అక్కడ జరిగిన సంఘటనలను వివరించి ఉంటే బాగుండేదని.. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రధాని మోడీ పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు తాజాగా ఖర్గే, రాహుల్ రాసిన లేఖపై ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు

వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు, ఆర్థిక అరాచకత్వం, కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. ముఖ్యంగా నేరాలను అరికట్టాల్సిన పోలీసు అధికారులే నేరాలకు పాల్పడి జగన్ అండ చూసుకుని అక్రమాలు, అవకతవకలకు తెగడిన సంఘటనలు నివ్వెర పరుస్తున్నాయి. అటువంటి వారిలో జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా, ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన పీఎస్సార్ ఆంజనేయులు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఇప్పటికే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్టై, విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఆయన ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకణలో అవకతవకలు జరిగాయనీ, ఏపీపీఎస్సీలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎస్సార్ ఆంజనేయులు హయాంలో జరిగిన అవకతవకలపై అందిన నివేదిక ఆధారంగా  కేసు నమోదు చేసి విచారణ జరపాలని డీజీపీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పీఎస్ఆర్‌పై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో తాజాగా మోసం, నిధుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయని, ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.   

కాశ్మీర్ లో మరిన్ని ఉగ్రదాడులు.. నిఘా వర్గాల హెచ్చరికతో కేంద్రం అప్రమత్తం

కాశ్మీర్ లోని పహల్గాంలో గత వారం జరిగిన ఉగ్ర దాడి ఉద్రిక్తతలు ఇంకా చల్లారక ముందే.. అదే కాశ్మీర్ లో మరిన్ని ఉగ్రవాదులకు ముష్కరులు ప్రణాళికలు రచిస్తున్నారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. కాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతాలలో స్థానికేతరులు, భద్రతా దళాలు టార్గెట్ గా  మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. పహల్గాం దాడి తరువాత కేంద్రం కాశ్మీర్ లోయలోని ఉగ్రవాదుల గృహాలను ధ్వసం చేయడానికి ప్రతీకారంగా మరిన్ని దాడులకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు నిఘావర్గాల నుంచి అందిన సమాచారంతో కేంద్రం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా కాశ్మీర్ లోని 84 పర్యాటక ప్రాంతాలలో 48 ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది.   ప్రస్తుతం సమస్యాత్మక ప్రాంతాల్లోకి టూరిస్టులను అనుమతించడం లేదు. ఈ 48 చోట్ల సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని తిరిగి పర్యాటకుల కోసం తెరుస్తామని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.  ప్రస్తుతం అనుమతి ఇస్తున్న పర్యాటక ప్రాంతాలలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. భ‌ద్ర‌త క‌ల్పించిన ప్రాంతాల‌లోకి ప‌ర్యాట‌కుల ఎటువంటి భ‌యం లేకుండా సంచ‌రించ‌వ‌చ్చ‌ని భరోసా ఇచ్చింది.  ప్ర‌తి ప‌ర్యాట‌కుడికి ఆయా ప్రాంతాల‌లో ప్ర‌త్యేక ర‌క్ష‌ణ క‌ల్పించే విధంగా భ‌ద్ర‌తా సిబ్బందిని నియమించింది.  

ఏబీవీ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.. బెజవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఏబీవీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం (ఏప్రిల్ 28) విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు రిజర్వ్ చేస్తూ తుది తీర్పు వెలువడే వరకూ   విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించింది. ఇంతకీ అప్పట్లో ఏబీవీపై నమోదైన కేసు ఏమిటంటే భద్రతా పరికరాల కొనుగోలు టెండర్ వ్యవహారంలో ఏబీవీ అవకతవకలకు పాల్పడ్డారని. అప్పటి జగన్ సర్కార్ 2001 మార్చిలో ఏబీవీపై కేసు నమోదు చేసింది. ఆ ఆరోపణలతోనే ఏబీవీని అప్పటి జగన్ సర్కార్ విధుల నుంచి సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ పై ఏబీవీ అలుపెరుగని న్యాయపోరాటం చేశారు.   తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులతో అప్పటి జగన్ సర్కార్ కు ఏబీవీ సస్పెన్షన్ ను ఎత్తివేయడం వినా మరో గ్యతంతరం లేకపోయింది. అయితే ఆయనను సర్వీసులోకి తీసుకున్నట్లే తీసుకుని ఆ మరుసటి రోజే మళ్లీ జగన్ సర్కార్ ఆయనను అవే అభి యోగాలతో సస్పెండ్ చేసింది.  దీంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులను క్యాట్ రద్దు చేయడంతో నాటి ప్రభుత్వం ఆయన పదవీ విరమణకు ఒక్క రోజు ముందు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయన మరలా ప్రింటింగ్ అండ్ స్పేషనరీ విభాగం అడిషనల్ డీజీగా బాధ్యతలు చేపట్టి అదే రోజు పదవీ విరమణ చేశారు. అదలా ఉంటే తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ ఏబీవీ 2022లో హైకోర్టులో  క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి.. విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించింది. 

యుద్దానికి ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్?

పహల్గాం ఉగ్రదాడి నేపధ్యంలో   పాకిస్థాన్ తో మరో యుద్ధం తధ్యమనే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా మీడియాలో అయితే.. యుద్ధం వచ్చినట్లే కథనాలు వస్తున్నాయి. అయితే  ఇలా  యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి అంటూ వస్తున్న మీడియా కథనాల్లో ఆధారాలకంటే, ఊహాగానలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరో వంక పాకిస్థాన్  ఉలికి పాటు చూస్తుంటే.. పాక్ నేతల్లో యుద్ద భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే  పాక్  మీడియాలో వస్తున్న కథనాలు గమనిస్తే..  యుద్ధానికి ముందే పాక్  నేతలు పలాయన మంత్రం జపిస్తున్నట్లు అనిపిస్తోందని  అంటున్నారు. నిజానికి  ఇప్పటికే ఆర్థికంగా అన్ని విధాల చితికి పోయిన పాకిస్థాన్  యుద్ధంచేసే స్థితిలో   లేదని  అంటున్నారు.  నిజానికి  పాకిస్థాన్  ఆర్థిక పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉన్నదో  ఆ దేశ ప్రధాని షేహబాబ్ షరీఫ్ స్వయంగా చెప్పుకున్నారు. అవును ప్రపంచ  దేశాలు తమను బిచ్చగాళ్ళను చుసినట్లు చూస్తున్నాయని  షరీఫ్  చెప్పుకున్నారు. ప్రధాని చెప్పిందే నిజం అయితే  ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత భయంకరంగా, బాధాకరంగా వుందో వేరే చెప్పవలసిన అవసరం లేదు. అలాగే  పాక్ లో బ్రెడ్ ముక్క, రొట్టె ముక్క రేట్లు, పాలు, పెరుగు ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి.  ద్రవ్యోల్బణం ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోందని అంటున్నారు. అందుకే  పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి  అణ్వాయుధ  బూచిని చూపించి అయినా యుద్ధం రాకుండా అడ్డుకునే విఫల ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.  సరే  పాక్  ప్రగల్బాలు ఎలా ఉన్నా.. భారత దేశం, మోదీ ప్రభుత్వం నిజంగా యుద్ధానికి సిద్ధంగా వుందా  అంటే ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు రోజులకు బీహార్ మధుబనిలో చేసిన ప్రసంగంలో  ఉగ్రదాడులకు తెగబడిన ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా.. వెతికి వెంటాడి శిక్షిస్తామని గట్టి హెచ్చరిక చేయడంతో పాటుగా ఉగ్రవాదులకు సహకరించిన వారినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.   ముఖ్యంగా  ప్రధాని మోదీ  ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి, ఆఖరి మజిలీగా మిగిలిన కొద్ది పాటి భూ భాగాన్ని మట్టిలో కలిపేస్తాం అని చేసిన హెచ్చరిక పాకిస్థాన్ ను ఉద్దేశించి చేసినదే అంటున్నారు. అంటే  మోదీ యుద్ద భేరి మొగించినట్లే అనుకోవచ్చని అంటున్నారు.  అదలా ఉంచితే..  తాజాగా ఆర్ఎస్ఎస్  అధినేత మోహన్ భగవత్    చేసిన వ్యాఖ్య కూడా యుద్దానికి గ్రీన్ సిగ్నల్ గానే భావించవలసి ఉంటుందని అంటున్నారు. మోహన్ భగవత్   ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమలో ప్రసంగిస్తూ.. భారత దేశం పొరుగే వారికి అపాయం చేయదు. హానీ తలపెట్టదు. కానీ  రాక్షసత్వం ప్రబలితే మాత్రం భారత్‌కు ప్రతిస్పందించడం మినహా మరో మార్గం ఉండదు. శతృవును  వదిలి పెట్టదు  అని స్పష్టం చేశారు. అంతే కాదు ప్రజలకు రక్షణ కల్పించడం పాలకుల ప్రధాన కర్తవ్యం.  పాలకులు ఆ బాధ్యతను నిర్వహించాలంటూ మోదీ ప్రభుత్వానికి కర్తవ్య బోధ చేశారు.  హిందూమతం మూల సూత్రాల్లో అహింసే ప్రధానమైనదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, స్వీయరక్షణ కోసం దుర్మార్గులను దీటుగా ఎదుర్కోవాలనేది కూడా హిందూ ధర్మంలో ఓ కీలక అంశమని వివరించారు. దుర్మాగులకు గుణపాఠం చెప్పడం కూడా ఇందులో భాగమేనని అన్నారు. ముఖ్యంగా అమాయకులను మతం అడిగి మరీ కాల్చి చంపారు.  ద్వేషం, హింస,పగలకు పాల్పడడమే కాదు.. ఇతరుల ద్వేషాన్ని, పగను, హింసను  మౌనంగా భరించరాదు..  అదే హిందూ ధర్మం అని  అని పేర్కొన్నారు. కాగా..  ప్రధాని మోదీ మధుబని ( బీహార్) లో చేసిన  వ్యాఖ్యలు, ఢిల్హిలో మోహన్ భగవత్   చేసిన వ్యాఖ్యలు ఒకే అర్థం ఇస్తున్నాయని అంటున్నారు.  యుద్దానికి  మోదీ ప్రభుత్వం సిద్దంగా వుంది.. అందుకు ఆర్ఎస్ఎస్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. అయితే.. అదే అంతిమ  నిర్ణయమా, అంటే కాదని అంటున్నారు.

తెలుగుదేశం మహిళా నేత గాయత్రి సస్పెన్షన్

తెలుగుదేశంమహిళా విభాగం నేత గాయత్రిని పార్టీ సస్పెండ్ చేసింది. భారత్, పాక్ మధ్య సంబంధాలు, ప్రస్తుత పరిస్థితులపై ఆమె ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు, ప్రసంగలే కారణమని చెబుతున్నారు. పార్టీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందున గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరచూరి అశోక్ బాబు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.   గాయత్రిపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలే ఇందుకు కారణమని అంటున్నారు.   విజయవాడకు సందిరెడ్డి గాయత్రి గతంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలోవైసీపీ నేతలు, కార్యకర్తల విమర్శలకు కౌంటరిస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ టీడీపీ వాదనను బలంగా వినిపించారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఆమెపై వెల్లువెత్తిన విమర్శల కారణంగానే గాయత్రి సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పాకిస్థాన్, భారత్ సంబంధాలపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్, బీజేపీలు తీవ్ర అభ్యంతరం తెలపడమే గాయత్ని సస్పెన్షన్ కు కారణంగా చెబుతున్నారు.  ముఖ్యంగా ఆమె భారత ఇతిహాసాలు మహాభారతం, రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గాయత్రిని సస్పెండ్ చేయడమే కాకుండా దర్యాప్తునకు కూడా తెలుగుదేశం ఆదేశించింది.   గాయత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ  హిందూ ఐటీ సెల్, బిజెపి ఆర్ఎస్ఎస్ ల డిమాండ్ మేరకే గాయత్రిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.  ఈ సస్పెన్షన్ పై గాయత్రి స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది. 

14 ఏళ్లు.. 35 బంతులు.. 100.. ప‌రుగులు.. వాహ్ వైభవ్ సూర్యవంశి

13 ఏళ్ల వ‌య‌సులో బీహార్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ అండర్ 19 యూత్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై 58 బాల్స్ లో సెంచెరీ ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్  టీ20 క్రికెట్ లో హాఫ్ సంచెరీ చేసిన యంగెస్ట్ ప్లేయ‌ర్ (14 సం. 32 రో.)  సీనియ‌ర్ క్రికెట్ లో సెంచ‌రీ చేసిన యంగెస్ట్ ప్లేయ‌ర్   హెచ్చ‌రిక మీరు ఈ విన్యాసాలు ద‌య చేసి ట్రై చేయ‌వ‌ద్దు.. ఇది నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన‌ది అంటూ ఒక్కో యాడ్ లో మ‌నం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇది  క్రికెట్ హెచ్చ‌రికః మీకు కూడా 14 ఏళ్లు వ‌చ్చాయి క‌దాని ఇలాంటి బీభ‌త్స‌మైన ఇన్నింగ్స్ ఆడ‌కండి. మీక‌న్నా వ‌య‌సులో పెద్ద‌వారైన క్రికెట‌ర్లు వెంట‌నే రిటైర్మెంట్ తీసుకుంటార‌ని ఈ హెచ్చ‌రిక‌ను మార్చి రాయాల్సి ఉంటుంది. ఒక చిన్న కుర్రాడు.. కాదు కాదు 14 ఏళ్ల చిచ్చ‌ర పిడుగు.. చేసిన విధ్వంసానికి కొత్త పేరు క‌నిపెట్టాలేమో. అవేం సిక్సులు.. ఒళ్లంతా తిరిగిపోతూ ఏకంగా 11 సిక్సులు బాద‌డంతో..  ఒక్కొక్క‌రికీ దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించింద‌ని చెప్పాల్సి ఉంటుంది. టాప్ ఫోర్ లో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ కి చెందిన బౌల‌ర్ల‌ను ఎక్క‌డో చిట్ట చివ‌రున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కి యంగ్ కిడ్ వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌చ్చి వారికి నైట్ మేర్ చూపించాడు.  విచిత్ర‌మేంటంటే సూప‌ర్ స్ట్రైక‌ర్, హ‌య్య‌స్ట్ సిక్స‌ర్స్ వంటి వాటితో పాటు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అంటూ మొత్తం నాలుగు అవార్డులు తీసుకున్న సూర్య‌వంశీతో పాటు ఇత‌డికి బౌలింగ్ వేసి ప‌ది డాట్ బాల్స్ వేసిన ర‌షీద్ ఖాన్ కి హ‌య్య‌స్ట్ డాట్ బాల్స్ అవార్డు తీస్కోవ‌డం. ఇదెలా విచిత్ర‌మంటే.. ఇంత విధ్వంసంలో ఆ మాత్రం డాట్ బాల్స్ వేసిన ఒకే ఒక్క‌డు ర‌షీద్.  ఇక గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ ని ర‌వి శాస్త్రీ ఎంత గుచ్చి గుచ్చి అడుగుతుంటే సిగ్గుతో ఆ బాలుడి గురించి ఏం మాట్లాడ‌డే.  ఇదిలా ఉంటే.. ఇట్స్ హిజ్ ప్లే గ్రౌండ్.. అంటూ డిజిట‌ల్ స్క్రీన్ పై ప‌డ్డం ఎంత‌టి సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉండాలో క‌దా అనిపించింది. నేను బౌల‌ర్ని చూడ‌ను బాల్ ని మాత్ర‌మే చూస్తా అంటూ పెద్ద పెద్ద బౌల‌ర్ల‌ను ఊచ కోత కోసిన‌ ఈ కుర్రాడికి ఐపీఎల్ మొత్తం పెట్టిన పేరు బాస్ బేబీ.  స‌చిన్ టెండూల్క‌ర్ పై అయినా పాకిస్థాన్ వెళ్లిన‌పుడు చిన్న పిల్లాడికి ఎలా బౌలింగ్ వేయాలా అని జాలి చూపిస్తే.. ఇంత చిన్న పిల్లాడి చేత ఇంత‌టి ఇంట‌ర్నేష‌న‌ల్ బౌల‌ర్ల‌యిన మాకు ఎంతటి ఘోర ప‌రాభ‌వంరా నాయ‌నా! అంటూ సిరాజ్, ఇషాంత్ శ‌ర్మ‌, ర‌షీద్ ఖాన్, ప్ర‌సిధ్ కృష్ణ ప‌డ్డ బాధ వ‌ర్ణ‌నాతీతం. వీరంద‌రిలోకీ ప్ర‌సిద్ ఒకింత అదృష్ట‌వంతుడు.. 35 బాల్స్ కి వ‌న్నాట్ వ‌న్ బాదిన ఈ టోర్న‌డో, ఈ తుఫాన్ ని ఇలాగైనా నేను కంట్రోల్ చేశాన‌న్న సంతృప్తిని మిగుల్చకున్నాడు ప్ర‌సిద్.. ఇప్పుడు స‌మ‌స్య ఏంటంటే ఇంత చిన్న వ‌య‌సులో ఇత‌డు సెట్ చేసిన రికార్డులు ఈ వ‌య‌సులో క్రికెట్ ప్రాక్టీస్ చేసే కుర్రాళ్ల‌పై చాలా చాలా ప్రెష‌ర్ ప‌డుతుందంటున్నారు కామెంట‌రేట‌ర్లు.  ఈ కుర్రాడ్ని పిక్ చేసిన రాహుల్ ద్రావిడ్ కి ఎంత చెడ్డ పేరంటే.. ఇంత భీక‌ర బౌల‌ర్ల‌కు ఈ వ‌య‌సు పిల్లాడ్ని వ‌దిలి బ‌లి  పెడ‌తారా ఎక్క‌డైనా? అంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సోమవారం (ఏప్రిల్ 28) వైభవ్ సూర్యవంశి ఆనందానికి ఒక హద్దంటూ లేదు..  తన తండ్రి  క్రికెటర్ కావాల‌నుకున్నారు. కానీ ఆయ‌న కాలేక పోయారు. అందుకే ఆ క‌సి కొద్దీ బ్రియాన్ లారా ఇన్ స్పిరేష‌న్ తో తాను క్రికెట్ ని చిన్న నాడే సీరియ‌స్ గా తీసుకున్నాననీ,  2 ఏళ్ల పాటు ఇంట్లోనే ఆడి, ఆ త‌ర్వాత స‌మ‌స్తిపూర్.. ఆపై పాట్నాలో ట్రైనింగ్ తీసుకుని..  ఆ త‌ర్వాత‌ బోర్డుకు ఆడాననీ చెప్పిన సూర్యవంశీ.. ఆపై ఐపీఎల్ లో అడుగు పెట్టి ఇదిగో బ్రయన్ లారా ఇన్సిపిరేషన్ తో ఇలా విధ్వంస ర‌చ‌న‌లో వంద మంది సెహ్వాగ్ ల‌ను, వేయి మంది రిష‌భ్ పంత్ ల‌నీ దాటేశాడు.. ఆల్ ఫార్మాట్ క్రికెట్ లో కొత్త చ‌రిత్ర లిఖించాడు.  16 ఏళ్ల‌కే క్రికెట్ లో అడుగు పెట్టాన‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ విర్ర‌వీగుతూ వ‌చ్చిన స‌చిన్ ని అయితే ఎప్పుడో వెన‌క్కు నెట్టేశాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. తాను ఇండియ‌న్ క్రికెట్ కి రెప్ర‌జెంట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆశిస్తున్న వైభ‌వ్ త్వ‌ర‌లోనే ఆ ఫీట్ కూడా షురూ చేసి.. ఎంద‌రు బౌల‌ర్లకు నిద్ర లేకుండా  చేస్తాడో చెప్ప‌లేం.  మూడో మ్యాచ్ కే త‌న ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టి.. మూడు చెరువుల నీరు తాగించిన.. వైభ‌వ్  ఫ్యూచ‌ర్ లో మ‌రిన్ని విధ్వంసాలు సృష్టించి కొత్త క్రికెట్ చ‌రిత్ర‌ను రాయాల‌ని ఆశిస్తూ... బేబీ బాస్  ద వ‌ర‌ల్డ్ క్రికెట్ ఈజ్  యూవ‌ర్ ప్లే గ్రౌండ్.. రా క‌న్నా.. ప్లే కిడ్.. బిగ్ క్రికెట్.. హ్యాపీ క్రికెట్ జ‌ర్నీ

14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. ఆపై సెంచరీ.. వైభవ్ సూర్యవంశి ఓ అద్భుతం

రాజస్థాన్ రాయల్స్ అద్భుతం చేసింది. 209 పరుగులను ఇంకా 4.1 ఓవర్లు ఉండగానే ఛేదించింది. వరుస పరాజయాలతో కునారిల్లి ఉన్న జట్టు ఇంత వరకూ ఛేదనలో తడబడుతూ వచ్చింది. అయితే సోమవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కొండంత లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేశింది. అయితే ఈ ఛేదన ఇంత సునాయాసం కావడానికి కారణం మాత్రం వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. వైభవ్ సూర్య వంశీ కూడా 14 ఏళ్ల పిన్న వయస్సులోనే ఐపీఎల్ లో అరంగేట్రం చేశారు. అలా ఐపీఎల్ లో ఆడిన  అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అయతే అక్కడితో ఆగిపోలేదు. ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ బాది ఔరా అనిపించాడు. ఇప్పుడు సోమవారం ( ఏప్రిల్ 29) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టి ఐపీఎల్ లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతేనా ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. వైభవ్ సూర్యవంశి 35 బంతుల్లో 11 సిక్స్ లు, 7 ఫోర్లతో సెంచరీ చేశాడు.  సరే ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 201 పరుగుల విజయలక్ష్యాన్ని 14.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించేసి విజయాన్ని అందుకుంది. ఆర్ ఆర్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశి 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లలో 70 నాటౌట్ చెలరేగి ఆడారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది.  

రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంటకసత్యనారాయణ.. విధేయత, సీనియారిటీకే పెద్దపీట

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన సీనియర్ నేత పాక వెంకటసత్యనారాయణ ఖరారయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. బీజేపీతో పాకా సత్యనారాయణకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది.ఆర్ఎ్ఎస్ నేపథ్యం ఉన్న పాక సత్యనారాయణ బీజేపీలో వివిధ స్థాయిలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నేపథ్యం కలిగిన ఆయన, పార్టీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.  గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి, ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిత్వం కోసం పార్టీ సీరియస్ గా పరిశీలనకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.   పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం చెందిన బిజెపి సీనియర్ నాయకుడైన పాక వెంకటసత్యనారాయణ  ప్రస్తుతం ఆయన బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పాక్ వెంకటసత్యనారాయణ గోదావరి జిల్లాల్లో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ కేంద్ర మంత్రి అరుణా ఇరానీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే బీజేపీ సోమవారం అధికారికంగా పాక వెంకటసత్యనారాయణ పేరు ప్రకటించడంతో ఆ వార్తలన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పాక వెంకటసత్యనారాయణ బీసీ వర్గానికి చెందిన నాయకుడు. మంచి వక్త. వివాదరహితుడు. పార్టీకి నాలుగు దశాబ్దాలుగా అంకిత భావంతో పని చేస్తున్నారు. వెంకటసత్యనారాయణను  రాజ్యసభ సభ్యత్వం దక్కడం పట్ల బీజేపీ రాష్ట్రనాయకులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  బీజేపీ ఏపీ కోర్ కమిటీ సోమవారం (ఏప్రిల్ 28) సమావేశమై బీజేపీ అభ్యర్థిపై చర్చించింది. పలువురి పేర్లను పరిశీలించిన తరువాత పాక వెంకటసత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసి అధిష్ఠానానికి పంపింది.  ఈ కోర్ కమిటీ సమావేశంలో యూరప్ పర్యటనలో ఉన్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ పాక్ వెంకటసత్యనారాయణ పేరును అధిష్ఠానానికి పంపింది. మరో ఆలోచన లేకుండా పార్టీ హైకమాండ్ కూడా ఆ పేరునే ఖరారు చేసి ప్రకటించింది. పాక్ వెంకటసత్యనారాయణ మంగళవారం (ఏప్రిల్ 29)న నామినేషన్ దాఖలు చేయనున్నారు.  వాస్తవానికి, ఈ రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వంటి పలువురి పేర్లు గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలన్నింటినీ పక్కన పెట్టి, పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తున్న రాష్ట్ర నేతకే అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. అత్యంత సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో పనిచేసిన పాకా సత్యనారాయణకు అనూహ్యంగా రాజ్యసభ అవకాశం దక్కడంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. అధిష్ఠానం నిర్ణయం వెలువడిన వెంటనే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయను న్నారు.

కేటీఆర్‌కు వెన్ను పూసలో గాయం.. కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరం

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జిమ్ వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ఎక్స్ వేదికగా అభిమానులకు, బీఆర్‌ఎస్ శ్రేయోభిలాషులకు తెలియజేశారు. అంతేగాక త్వరలోనే తన పాదాలపై తాను నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో.. జిమ్ లో వర్కౌట్  చేస్తుండగా వెన్నుపూసలో సమస్య తలెత్తిందని తెలిపారు. దీంతో వైద్యులను సంప్రదించగా.. కోలుకునేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందని, అప్పటివరకు బెడ్ రెస్ట్  అవసరం అని సూచించినట్లు చెప్పారు. నిన్న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్ శ్రేణులు కామెంట్లు చేస్తున్నారు  

బాలకృష్ణకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

  ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.‘‘గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న ప్రముఖ సినీనటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నా అభినందనలు. కళా, సేవా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయనపై సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినందనలు చెబుతున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్నారు.

ఏపీ రాజ్యసభ ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకటసత్యనారాయణ

    ఏపీలో ఖాళీ అయిన  రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. భీమవరం బీజెపి క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పాక వెంకట సత్యనారాయణ పేరును కమలం పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పాక గతంలో భీమవరం కౌన్సిలర్ గా పని చేశారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్నారు. ఈ స్థానం నుంచి అన్నామలై, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అనూహ్యంగా పాక పేరును ప్రకటించారు.  ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి తిరుగుపయనంలో దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ స్థానానికి ఎస్సీ వర్గీకరణలో కీలకంగా వ్యవహరించిన నేత, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  తమిళనాడుకు చెందిన అన్నామలై, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయ్యింది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉపఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైంది  

పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ

    టాలీవుడ్ ప్రముఖ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన  పౌర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సంప్రదాయ తెలుగు వస్త్రధారణ అయిన పంచెకట్టులో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బాలయ్య పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. భారతీయ సినిమా రంగానికి, సమాజానికి బాలకృష్ణ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ పద్మ భూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. హీరోగా సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా అందిస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ, తన సుదీర్ఘ కెరీర్‌లో వందకు పైగా చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. గతేడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్‌ ఫిక్షన్‌, బయోపిక్‌.. ఇలా అన్ని పాత్రలను చేసిన ఏకైక అగ్ర నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకుల మనుసు దోచుకున్నారు. క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఎంతో మందికి పేదలు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.. గతంలో కూడా ఆయన అనేక ఫిలింఫేర్, నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు.

ఏపీలో 10 జిల్లాలకు డీసీఎంఎస్‌ ఛైర్మన్ల నియామకం

  ఏపీలోని 10 జిల్లాల సహకార బ్యాంకు సంఘాల చైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘాల (డీసీఎంఎస్‌) ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ (టీడీపీ), విశాఖ డీసీసీబీ ఛైర్మన్‌గా కోన తాతారావు (జనసేన) నియమితులయ్యారు. విజయనగరం డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత కమిడి నాగార్జునను నియమించారు. గుంటూరు డీసీసీబీ చైర్మన్‌గా మాకినేని మల్లికార్జునరావు(టీడీపీ), కృష్ణా డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత నెట్టెం రఘురామ్, నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌గా ధనుంజయరెడ్డి (టీడీపీ), చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ నేత అమాస రాజశేఖర్ రెడ్డిని నియమించారు. అనంతపురం డీసీసీబీ చైర్మన్‌గా కేశరెడ్డి (టీడీపీ), కర్నూలు డీసీసీబీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన డి. విష్ణువర్ధన్ రెడ్డి, కడప డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత బి. సూర్యనారాయణరెడ్డి నియమించారు. డీసీఎంస్ చైర్మన్‌ లిస్ట్ ఇదే శ్రీకాకుళం డీసీఎంస్ చైర్మన్‌గా టీడీపీ నేత అవినాశ్ చౌదరి, విశాఖ డీసీఎంస్ చైర్మన్ గా కొట్ని బాలాజీ (టీడీపీ), విజయనగరం డీసీఎంస్ చైర్మన్‌గా గొంప కృష్ణ(టీడీపీ), గుంటూరు డీసీఎంస్ చైర్మన్‌గా వడ్రాణం హరిబాబు (టీడీపీ), కృష్ణా డీసీఎంస్ చైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన బండి రామకృష్ణను నియమించారు. నెల్లూరు డీసీఎంస్ చైర్మన్‌గా టీడీపీ నేత గొనుగోడు నాగేశ్వరరావు, చిత్తూరు డీసీఎంస్ చైర్మన్‌గా సుబ్రహ్మమణ్యం నాయుడు(టీడీపీ), అనంతపురం డీసీఎంస్ చైర్మన్‌గా నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ), కర్నూలు డీసీఎంస్ చైర్మన్‌గా జి. నాగేశ్వరయాదవ్(తెలుగుదేశం పార్టీ), కడప డీసీఎంస్ చైర్మన్ గా టీడీపీ చెందిన యర్రగుండ్ల జయప్రకాశ్‌ను నియమించారు. ఈ మేరకు లిస్టు రిలీజ్ చేశారు. 

తిరుపతి జిల్లాలో కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన కారు .. ఐదుగురు మృతి

    తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూత‌ల‌ప‌ట్టు-నాయుడుపేట జాతీయ ర‌హ‌దారిపై పాకాల మండ‌లం తోట‌ప‌ల్లి వ‌ద్ద కంటైన‌ర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. స్థానికులు క్షతగాత్రుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను తమిళనాడులోని కృష్ణగిరి వాసులుగా గుర్తించారు.  మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, దాదాపు 9 ఏళ్ల వయసున్న బాలుడు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. ఈ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

గ్రూప్-1 నియామకాలపై టీజీపీఎస్సీ అప్పీలు పిటిషన్

  తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు సింగిల్ ఇచ్చిన మధ్యంతరం ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ  అప్పీల్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు సీజే ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది.  గ్రూపు-1 పరీక్షలో అక్రమాలు జరిగాయని హైకోర్టుపలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మెయిన్స్ ఎగ్జామ్ మూల్యాంకనం సరిగ్గా జరుగలేదని, పరీక్షల కేంద్రాల కేటాయింపుల్లోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.  గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కొన్ని పిటిషన్లు దాఖలు కావడం, వాటిపై విచారణ జరగడం, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, నియామక పత్రాలు జారీ చేయకుండా ఆపడం జరిగింది. అయితే, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.    

పేదరికం తరిగి ఉపాధి పెరిగిపోతోంది..ట!

ప్రపంచ బ్యాంకు ఉవాచ దేశంలో పేదరికం ఏ స్థాయిలో వుందో, ఆకలి స్థాయి ఏమిటో, కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న పేదలకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. కానీ ప్రపంచ బ్యాంకు తాజా   నివేదిక మాత్రం భారత దేశంలో పేదరికం రోజురోజుకూ తగ్గిపోతోందని అంటోంది.  ఆర్థిక పేదరికం మాత్రమే కాకుండా, విద్య, ఆరోగ్యం జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వివిధ కోణాల పేదరికంలో కుడా  కూడా భారత దేశం మంచి మెరుగుదల సాధించిందని నివేదిక పేర్కొంది. అలాగే..  ఉపాధి కల్పనలోనూ భారత దేశం ముందుకు దుసుకుపోతోందని   ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక లెక్కలు కట్టి మరీ తేల్చి చెప్పింది.  అవును. గడచిన దశాబ్ద కాలంలో భారత దేశంలో 17.10 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.  2011-12లో దేశ జనాభాలో 16.2 శాతం ప్రజలు దుర్భర పేదరికం (రోజుకు రూ.200 కంటే తక్కువ ఆదాయం)లోమగ్గగా, 2022-23 నాటికి ఆ సంఖ్య 2.3 శాతానికి తగ్గినట్టు ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదిక  పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. దుర్భర పేదరికంతో బాధపడుతున్నవారు పదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరం 7.7 నుంచి 1.7 శాతానికి తగ్గింది. పేదలు క్రమేణా దిగువ, మధ్య-ఆదాయ కేటగిరీలోకి మారుతున్నారు. అలాగే దిగువ, మధ్య-ఆదాయ కేటగిరిలో ఉన్నవారు మధ్య తరగతి ఆదాయ కేటగిరిలోకి వెళ్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 69 శాతం నుంచి 32.5 శాతానికి, పట్టణాల్లో 43.5 శాతం నుంచి 17.2 శాతానికి తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం 25 నుంచి 15 శాతానికి తగ్గింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో భారత్‌ పురోగతి సాధిస్తోందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది. 2021-22 నుంచి యువత (శ్రామిక-వయసు జనాభా) కంటే వేగంగా ఉపాధి పెరుగుతోందని వెల్లడించింది. ముఖ్యంగా మహిళలు, గ్రామీణుల్లో స్వయం ఉపాధి పెరుగుతోందని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగం 6.6 శాతానికి తగ్గిందని, 2017-18 నుంచి ఇదే అతి తక్కువ అని వెల్లడించింది. ఉపాధి కోసం గ్రామీణ పురుషులు పెద్ద సంఖ్యలో పట్టణాల బాట పడుతున్నారని తెలిపింది. వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళల ఉపాధి మెరుగుపడినట్టు పేర్కొంది. దేశంలో మహిళల ఉపాధి రేటు 31 శాతానికి చేరినట్టు వెల్లడించింది. అయితే,ఉపాధి విషయంలో మహిళలు మెరుగుపడినప్పటికీ, వారిపై అసమానతలు మాత్రం తగ్గలేదని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. మహిళా ఉద్యోగ రేటు 31 శాతానికి చేరుకుందని, కానీ వేతన ఉద్యోగాల్లో మహిళల కంటే పురుషులు 234 మిలియన్లు ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. అలాగే దేశంలో ఉన్న పేదరికాన్ని కూడా నివేదికలో ప్రపంచ బ్యాంకు ప్రస్తావించింది. అలాగే, 2011-12లో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 60శాతంగా  ఉన్న పేదల, 2022-23 నాటికి 54 శాతానికి తగ్గారని, అని వరల్డ్ బ్యాంకు పేర్కొంది. అయితే,ఇప్పటికి కూడా పేదరికంలో పెద్ద పీట ఈ ఐదు రాష్ట్రాలదే’అని కూడా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే ఈ నివేదిక అక్షర సత్యమా అంటే కాదు. నిజానికి ప్రపంచ బ్యాంకు నివేదిక అనే కాదు, ప్రపంచంలోని ఏ సంస్థ ఇచ్చే నివేదిక అయినా సంపూర్ణ సత్యం కాదు. సంపూర్ణ అసత్యం కాదు. కొంత సత్యం. కొంత అసత్యం. అయితే.. ఇతర దేశాలతో పోల్చి నప్పుడు, ముఖ్యంగా కొవిడ్ అనంతర కాలంలో, మన దేశం ఆర్థిక పరిస్థితి ఎంతో కొంత మెరుగ్గా ఉందని ప్రపంచ దేశాలు అన్నీ అంగీకరిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడవ స్థానికి చేరుకుంటుందని అంటున్నారు. అలాగే.. గడచిన పదేళ్ళలో 25 కోట్ల మందికి పైగా పేదలు, పేదరికం గీత దాటి పై మెట్టుకు చేరుకున్నారని, కేంద్ర విత్త మంత్రి నిల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.  అయితే.. మరో వంక విపక్షాలు మాత్రం దేశంలో పేదరికం, నిరుద్యోగం పోటాపోటీగా పెరిగి పోతున్నాయని అంటున్నారు. అందుకే.. మజ్ను అందాలను చూడాలంటే లైలా కళ్లతో చూడాలి అంటారు.

MCRHRD వైస్ చైర్మన్‌గా సీఎస్ శాంతి కుమారి

  తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ  సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఆమెకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్‌ (డీజీ)గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కాగా తెలంగాణ తదుపరి సీఎస్‌గా  కె. రామకృష్ణారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా ఎంపిక చేసింది.