ప్రగల్బాలు పలికిన పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్?

ప్రగల్బాలు పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్  దేనికైనా రెడీ అంటూ బీరాలు..భారత్‌లో రక్తంపారిస్తామంటూ కారుకూతలు... కన్నుకి కన్ను..పన్నుకు పన్ను అంటూ డైలాగులు...తీరా కట్ చేస్తే పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్‌ ... అవును మీరు వింటున్నది నిజమే. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్ కన్పించడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత...రెచ్చిపోయి మాట్లాడిన మునీర్‌... అదృశ్యమయ్యాడు. రెండ్రోజులుగా ఎవరికీ కన్పించడం లేదు. ఇప్పటికే ఆయన ఫ్యామిలీ దేశం విడిచి వెళ్లిపోగా...తాజాగా పాక్ ఆర్మీ చీఫ్‌ మిస్స్‌ అవ్వడం సంచలనంగా మారింది. అతడు రావల్పండిలోని బంకర్‌లో దాక్కున్నట్లు వార్తలు వస్తున్నాయ్‌. రెండ్రోజుల క్రితం పాక్‌ ప్రధాన మంత్రి  ఓ ఫొటో షేర్ చేసింది. అందులో ప్రధాని పక్కన ఆర్మీ చీఫ్‌ ఉన్నట్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ పోస్టు అనుమానాలకు మరింత బలం చేకూరినట్లైంది. పహల్గామ్‌ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పాక్ ఆర్మీకి పట్టుకుంది. దేనికైనా సిద్ధం, యుద్ధానికి రెడీ అంటూ పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నా.. లోలోపల గజగజ వణికిపోతుంది. ఇండియాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో పాక్‌కు బాగా తెలుసు. గతంలో జరిగిన అనుభవాలు కళ్లముందే ఉన్నాయ్‌. సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఎయిర్‌ స్ట్రైక్స్‌ను ఇంకా మరిచిపోలేదు. ఈసారి  భారత్ నుంచి అంతకు మించి రియాక్షన్ ఉంటుందని భావిస్తోంది పాక్‌.  ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు నుంచే...సరిహద్దు సమీపంలోకి ఆయుధాలను తరలిస్తోంది దయాది దేశం. LOC వెంబడి భారత వైమానిక దాడులను పసిగట్టడానికి చర్యలు చేపట్టింది. సియాల్‌కోట్‌ ప్రాంతానికి పాకిస్థాన్‌ సైన్యం తన రాడార్‌ వ్యవస్థలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుకు 58 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖోర్‌ కంటోన్‌మెంట్ వద్ద టీపీఎస్‌-77 రాడార్ సైట్‌ను ఏర్పాటు చేసింది. టీపీఎస్‌-77 మల్టీ-రోల్ రాడార్ అనేది అత్యంత సామర్థ్యం గల రాడార్ వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు, ఎయిర్‌ ట్రాఫిక్‌ పర్యవేక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు.  ఇటు పీవోకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించింది. పీఓకే ప్రాంతం అంతటా చాలా లాంచ్ ప్యాడ్‌లు ఉన్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించిన కొంతసేపటికే.. పాకిస్తాన్ ఈ చర్య తీసుకుంది. కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుటా, కోట్లి, ఖుయిరట్టా, మంధర్, నికైల్, చమన్‌కోట్, జంకోట్ నుండి ఉగ్రవాదులను తరలించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాక్ చర్యలను ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు పసిగడుతోంది. ఇప్పటికే LOC వెంబడి నిఘా పెంచింది. ఫ్రంట్‌లైన్‌ ఫైటర్‌ జెట్స్‌తో విన్యాసాలు  చేపట్టింది. గతవారం రఫేల్ సహా ఫైటర్ జెట్లు పెద్దఎత్తున సైనిక విన్యాసంలో పాల్గొన్నాయి. ఇటు నేవీ కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. దాంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

మృతుల కుటుంబాలకు పాతిక లక్షలు ఎక్స్ గ్రేషియా

సింహాచలం అప్పన్నచందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుని ఏడుగురు మరణించిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఘ సానుభూతి తెలియజేశారు. భారీ వర్షం కారణంగానే గోడకూలిందన్న ఆయన.. సింహాచలంలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అదలా ఉండగా..సింహాచలం ప్రమాద ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాలవీరాంజనేయులు, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ , ఎంపీ భరత్, సింహాచలందేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు, అధికారులు పాల్గొన్నారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పాతిక లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మూడు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.  భాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని నిర్ణయించారు.  ఇలా ఉండగా సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోలవాలని ఆకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  

సింహాచలం విషాదం..ఈ పాపం ఎవరిది ?

సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేళ జరిగిన అపశ్రుతి అత్యంత విషాదకరం. గోడ కూలడమే ప్రమాదానికి కారణం అయినప్పటికీ.. ఈ దుర్ఘటన అనేక ప్రశ్నలను తెరమీదకు తీసుకువస్తున్నది.  భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే వర్షం ఒక కారణమైతే కావచ్చు కానీ, సింహాచలం అప్పన చందనోత్సవ సమయంలో ప్రతి ఏటా ఏదో ఒక గలాటా జరుగుతూనే ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడటానికి బాధ్యులెవరన్నది తేల్చాల్సి ఉంది. ఏడాది మొత్తంలో ఒక రోజు మాత్రమే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఉంటుంది. ఆ కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.  సరిగ్గా అక్షయ తృతీయ రోజు జరిగే ఈ చందన యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడం రివాజు. అయితే గతంలో కేవలం పరిమిత భక్తులతో  మాత్రమే ఈ యాత్ర సాగేది. అయితే తరువాత తరువాత పరిస్థితి మారింది. ఇదో వీఐపీ యాత్రగా మారిపోయింది. సాధారణ భక్తుల తాకిడికి తోడు వీఐపీల హడావుడీ అధికమైంది.  ముఖ్యంగా  పోలీస్, పొలిటికల్, జ్యుడిషరీ, దేవాదాయ, రెవెన్యూ  విభాగాల నుంచి వీఐపీల ఎక్కువైపోయింది. దీంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో చ ందనోత్సవ సమయంలో ప్రతిఏటా సమస్యలు ఉత్పన్నమౌతూనే ఉన్నాయి. తాజా సంఘటనే తీసుకుంటే.. మంగళవారం (ఏప్రిల్ 29)అర్ధరాత్రి దాటిన తరువాత, బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.  దీంతో సాధారణ దర్శనం కోసం క్యూ లైన్ లో ముందు రోజు రాత్రి నుంచీ  వేచి ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  సరిగ్గా అదే సమయంలో 300 రూపాయల టికెట్ తీసుకున్న భక్తుల క్యూ లైన్ కు  ఆనుకుని ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ గోడను ఇటీవలే తాత్కాలికంగా నిర్మించారు దీనికి బాధ్యులు ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతోంది. నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందా అన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.  ఏటా చందనోత్సవం సమయంలో దేవాదాయ శాఖలో ఏదో ఒక సమస్య, ఇబ్బంది సాధారణం అయిపోయింది. ఒకసారి ఈవో కు వ్యతిరేకంగా, మరోసారి ఉద్యోగులకు వ్యతిరేకంగా సంఘటనలు జరుగుతుంటాయి. ప్రధానంగా టికెట్ల  కేటాయింపు విషయంలో  గందరగోళం నెలకొంటుంది.  సాధారణ భక్తులు డబ్బులు ఇచ్చి కొనే టికెట్ల కంటే..  ప్రోటోకాల్ టికెట్లకి ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతున్నది.  ఇక విషయానికి వస్తే..  గోడ కూలిన ఘటనలో ఏడుగురు  మృతి చెందారు ఘటనా స్థలాన్ని హోం మంత్రి అనిత పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. బాధ్యులెవరైనా, ఎంతటి వారైనా వదిలేది లేదని హోంమంత్రి ఇప్పటికే హెచ్చరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించినట్లైతే.. ఈ దుర్ఘటనకు ఇంజినీరింగ్ అధికారుల వైపల్యం కారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింహాచలం ఆలయంలో ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యం చాలా వరకు ఉంటుంది మెట్ల మార్గం నిర్మాణం రోడ్ల విషయంపై కూడా చాలా వరకు విమర్శలు వినిపిస్తున్నాయి తాజా ఘటనలతో పూర్తి విచారణ జరిపించి అసలైన బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  ఇక సింహాచలంలో కూడా తిరుమల తరహాలో దర్శనాలు కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ ప్రతిపాదన గత ఏడాదే అప్పటి జిల్లా కలెక్టర్ చేశారు.  టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే లోపలికి వెళ్లే రీతిన ఆటోమేటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే చాలావరకు తొక్కిసలాటలు నిరోధించే అవకాశం ఉంటుంది.  ప్రధానంగా వీఐపీల పేరిట సింహాచలంలో దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది దీనివలన ఆదాయం కోల్పోవడం మాత్రమే గాక ఇతర భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.

కృష్ణారెడ్డి ఐపీఎస్.. కృషి ఉంటే యువకులు ఐపీఎస్ లు అవుతారు!

ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితం ప్రారంభించి.. ఐపీఎస్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం అసలే కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు  ఉదయ కృష్ణారెడ్డి. అందుకే, స్వయం కృషికి సజీవ రూపంగా నిలిచే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయ కృష్ణారెడ్డిని అభినందించారు. కన్న కలలను సాకారం చేసుకున్న కృష్ణా రెడ్డి.. కలలు కనండి , కన్న కలలను సాకారం చేసుకోండి, అన్న మరో మహనీయుడు, ప్రాతః స్మరనీయుడు, మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాంను కూడా  గుర్తుకు తెచ్చారు. ఆ విధంగానూ కృష్ణా రెడ్డి  అభినందనీయుడు.  అవును. చంద్రబాబు నాయుడు తమ అభినందన సందేంలో అన్నట్లుగా  ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితాని ప్రారంభించి  ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన కృష్ణా రెడ్డి జీవితం యువతకు ఒక ఆదర్శం. నిరంతర పరిశ్రమతో, కృషి, పట్టుదలను తోడు చేసుకుని ధైర్యంగా ముందుకు సాగితే ఎలాంటి కలైనా  సాకారం అవుతుందని.. ఎంతటి అవరోధాలనైనా అతిక్రమించ వచ్చునన్న సత్యాన్ని కృష్ణా రెడ్డి మరోమారు నిరూపించారు. అవును..  ముఖ్యమంత్రి అనంట్లుగా ఓటమిని అంగీకరించని వారిదే భవిష్యత్ అని మరో నిరూపించిన, కృష్ణా రెడ్డి  ఐపీఎస్ నిజంగా అభినందనీయుడు. ఎవరీ కృష్ణా రెడ్డి, ఏమా కథ? అంటే..  ప్రకాశం జిల్లాలోని ఉల్లపాలెం గ్రామానికి చెందిన ఎం. ఉదయ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 350 ర్యాంకు సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో స్థానం సంపాదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అభినందనలు అందుకున్నారు. కలలు కనండి ...కన్న కలలను సాకారం చేసుకోండి  అన్న మాజీ రాష్ట్రపతి ఎపీజే అబ్దుల్ కలాం  సందేశానికి  సజీవ రూపంగా నిలిచిన  ఉదయ కృష్ణారెడ్డి 2013లో,ఏపీ పోలీస్ డిపార్టుమెంటులో  కానిస్టేబుల్‌గా చేరారు. గుడ్లూరు, రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. అదే సమయంలో, ఉన్నతాధికారి నుంచి ఎదురైన అవమానాలు అతనిలో ఐపీఎస్  కావాలనే ఆకాంక్షను రగిల్చాయి. ఆ అధికారి చేసిన అవమానమే అతనిలో అశయాన్ని రగిల్చింది.  పేదరికంలో పుట్టి..  చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉదయకృష్ణారెడ్డిని అతని అమ్మమ్మ రమణమ్మ పెంచింది. కూరగాయలు అమ్ముకుని పొట్ట పోసుకునే  రమణమ్మ, మనవడిని పెంచి పెద్ద చేసింది. అలాగే, అతని మామ కోటి రెడ్డి చేయూత నిచ్చారు. చేయి పట్టి నడిపించారు. అటు అమ్మమ్మ రమణమ్మ,ఇటు మేన మామ కోటి రెడ్డి ఇచ్చిన చేయూతతో, కృష్ణారెడ్డి  2013లో ఏపీ పోలీస్ డిపార్టుమెంటులో  కానిస్టేబుల్‌గా చేరారు. అయితే ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఉన్నతాధికారి చేసిన అవమానాలకు సమాధానంగా ఐఏఎస్ కావాలని సంకల్పం చెప్పుకున్న, కృష్ణారెడ్డి, 2018 లో సివిల్ సర్వీసెస్ పూర్తి సమయం కోసం కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మూడు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, పట్టు వదలని విక్రమార్కునిలా  మరో ప్రయత్నం చేశారు. ఈసారి 780 వ ర్యాంక్ వచ్చింది. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ లో ఉద్యోగం వచ్చింది. అయినా, ఐపీస్  కావాలనే, ఆశయాన్ని చంపుకోలేదు. కల అంటే నిద్రలో వచ్చేది కాదు... నిద్ర పోనివ్వకుండా చేసేది కల   అన్న   కలాం స్పూర్తితో  రైల్వే సర్వీస్  శిక్షణ సమయంలో మరోమారు సివిల్స్ రాశారు. 350వ ర్యాంక్ సాధించారు. ఐపీఎస్ కల సాకారం చేసుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.  ఇప్పుడు ఉదయ కృష్ణా రెడ్డి. ఐపీఎస్.. భారతీయ యువత లో అపారమైన సామర్ధ్యం ఉందని, ఆత్మ స్థైర్యంతో ఓటమిని అంగీకరించకుండా ముందుకు సాగితే విజయం తధ్యమని విశ్వాసం వ్యక్త పరిస్తున్నారు. అమ్మమమ రమణమ్మ, మామయ్య కోటి రెడ్డి తన జీవితాన్ని తీర్చి దిద్దారని అన్నారు.అలాగే, తన ప్రయాణంలో సహకరించిన  మెంటర్స్,కు కృతజ్ఞతలు తెలిపారు.  అన్నివిధాల తండ్రిలా ఆడుకున్నఅదనపు డీజీ మహేష్ భగవత్‌కు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో విషాదం.. గోడకూలి ఎనిమిది మంది మృతి

సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.  సింహాచలం బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూ లైన్ వద్ద  ఈ దుర్ఘటన జరిగింది. మంగళవారం (ఏప్రిల్ 29) అర్థరాత్రి దాటిన తరువాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. ఆ కారణంగానే గోడ కూలింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. గోడ కూలిన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎష్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ సంఘటనా స్థలం వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  

విజయసాయిరెడ్డి ఇరికిస్తున్నారా?.. ఇరుక్కుంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న నేత.. వైసీపీ మాజీ ఎంపీ వై.విజయసాయిరెడ్డి.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా అందరికీ సుపరిచితుడైన ఆ ఆడిటర్ .. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని.. ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వం ఇంకా మూడేళ్లకు పైగా ఉండగానే ఆయన పదవికి, వైసీపీకి రాజీనామా చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.  ఆ క్రమంలో కాకినాడ సీపోర్టు కేసులో కూడా ఏ2 గానే ఫైల్ అయ్యారు. దీంతో  రాజకీయాల్లో ఉన్నా లేకున్నాన్నా తనకు ఏ2 మాత్రం కామన్‌గా మారిపోయిందనుకున్నారో? లేక పొలిటికల్ రీఎంట్రీ కన్ఫర్మ్ చేద్దామనుకుంటున్నారో స్పష్టత లేదు కానీ కాకినాడు పోర్టు కేసు విచారణ మొదలైన నాటి నుంచి పొలిటికల్ అటెన్షన్‌ని మాత్రం తన వైపుకు తిప్పుకుంటున్నారు సాయిరెడ్డి.  గతంలో వైసీపీలో అన్నీ తానై చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేకపోయినా అటు మీడియాతో పాటు పొలిటికల్‌గా అటెన్షన్ అంతా తన వైపు తిప్పుకోవడనికి తెగ తాపత్రయ పడిపోతున్నారు. గత నెలలో కాకినాడ సీపోర్టు కేసులో సీఐడీ విచారణకు వెళ్లిన సాయిరెడ్డి, విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా లిక్కర్ స్కాంపై హాట్ కామెంట్లు చేశారు. లిక్కర్ స్కాంపై తనను అడిగితే చాలా విషయాలు చెబుతానంటూ ఎవరికీ తెలియని రాజ్ కేసిరెడ్డిని ఆ కేసులో ఫోకస్ చేశారు.  అక్కడి నుంచి రకరకాల ట్విస్ట్ ల మధ్య కేసు విచారణ షురూ అయ్యింది.. లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అని విజయసాయిరెడ్డి పేర్కొన్న రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అవ్వడంతో తేనె తుట్టె కదులుతోంది. అంతేకాక కాకినాడ పోర్టు వ్యవహారంలో తన పాత్ర లేదని చేసిందంతా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే చేశారని విజయసాయి చెప్పుకొచ్చారు. పోర్టు వాటాల స్వాధీనానికి సంబంధించి మొత్తం చేసింది విక్రాంత్‌రెడ్డే అని బాంబు పేల్చారు. ఆ తర్వాత టాపిక్ ను కాకినాడ పోర్టు అంశం నుంచి లిక్కర్ స్కాం వైపు డైవర్ట్ చేశారు విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందు ఫోకస్ చేసింది లిక్కర్ స్కాంపైనే.. అయితే దాన్ని ఎటు నుంచి మొదలు పెట్టాలో అర్దం కాక సర్కారు సతమతమవుతున్న సమయంలో అవసరం లేకపోయినా విజయసాయరెడ్డి దారి చూపించారంటున్నారు.  ఏపీ లిక్కర్ స్కాంలో సూత్రధారి.. పాత్రధారి అంటూ జగన్ సన్నిహితుడైన కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరును హైలెట్ చేశారు. భవిష్యత్ లో అవసరమైతే మరిన్ని అంశాలను వెల్లడిస్తానంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. లిక్కర్ స్కాంపై తనను అడిగితే పూర్తి వివరాలు చెప్పేస్తానని ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో విజయసాయిరెడ్డిని విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో విచారణ కి హాజరయ్యారు. ఈ కేసులో అంతవరకు నిందితుడిగా భావించిన సాయిరెడ్డిని సాక్షిగా పరిగణించాలని సిట్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగింది.  ఈ నెల 18న లిక్కర్ స్కాంపై విచారణకు హాజరైన సాయిరెడ్డి.. యధావిధిగా బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు.. మద్యం స్కాం మొత్తాన్ని కేసిరెడ్డి రాజ్ రెడ్డి నడిపించారని మరోసారి కుండ బద్ధలు కొట్టారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన మీటింగ్స్, కేసిరెడ్డి వ్యవహార శైలిపై సంచలన  విషయాలు వెల్లడించారు.  అదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి ఉన్నారన్న సాయిరెడ్డి ఆ ఇద్దరు వ్యాపారం చేసుకుంటామంటే అరబిందో కంపెనీ నుంచి తాను 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించానని తెలిపారు. ఇందులో అదాన్ డిస్టలరీస్ కి 60 కోట్లు, డికాక్ సంస్థకు 40 కోట్లు అరబిందో శరత్ చంద్రారెడ్డి ద్వారా సమకూర్చానన్నారు. అదాన్ డిస్టలరీస్ కి ఇచ్చిన 60 కోట్లు వడ్డీతో కలిసి తిరిగి ఇచ్చేశారని.. డికాక్ తీసుకున్న 40 కోట్లలో అసలు మాత్రమే రిటర్న్ వచ్చిందని.. దీనిమీద ఇంకా వివాదం కొనసాగుతోందన్నారు. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూనే వారికి వ్యాపారం చేసుకోవటానికి 100 కోట్లు అప్పు ఇప్పించానని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. అయితే సాక్షిగా విచారణకు పిలిచారు అనుకుంటున్న తరుణంలో సడన్ గా సాయి రెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.  సాయిరెడ్డి లిక్కర్ స్కాంలో ఎవ‌రినో ఇరికంచ‌బోయి తానే ఇరుక్కుంటున్నారా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మొదట కాకినాడ పోర్టు వ్యవ‌హారంలో విచార‌ణ‌కు వ‌చ్చిన సాయిరెడ్డి, ఆ సమయంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి తన అల్లుడని.. వారితో తనకు అసలు వ్యాపార సంబంధాలు లేవని చెప్పారు. కనీసం వారిని వారి సంస్ధలో ఓ ఉద్యోగం కోసం కూడా అడగలేదన్నారు. ఆ తర్వాత లిక్కర్ వ్యవహారానికి వచ్చే సరికి వారి ద్వారానే వ్యాపారం చేసుకోవటానికి వంద కోట్లు ఇప్పించానని తానే చెప్పుకొచ్చారు.  అర‌బిందో సంస్దతో త‌న‌కు ఆర్దిక లావాదేవీలు ఏమీ లేవు.. కేవ‌లం బంధుత్వం మాత్రమే ఉంద‌న్న సాయిరెడ్డి... అసలు ఆయనకు ఏ సంబంధం లేకపోతే ఎందుకు వంద కోట్లు ఇప్పించారు?.. ఎవ‌రు అడ‌క్కపోయినా లిక్కర్ స్కాం గురించి మీడియా ముందు ఎందుకు మాట్లాడారు?.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో ఓ ఎంపీగా మాత్రమే ఉన్న ఆయన హైద‌రాబాద్‌లో ఓసారి.. విజ‌య‌వాడ‌లో మ‌రోసారి త‌న నివాసంలో లిక్కర్ పాలసీపై ఏ హోదాతో చ‌ర్చించారు?  కేసిరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డిని మొదట జగన్‌కి తానే ప‌రిచ‌యం చేశాన‌ని చెప్పిన ఆయన ఆ త‌ర్వాత అర‌బిందో ద్వారా 100 కోట్లు ఎందుకు ఇప్పించారు?..  లిక్కర్ వ్యవ‌హారంతో ఏ సంబందం లేకుంటే వాళ్లకు అప్పు ఇప్పించాల్సిన అవ‌స‌రం ఏంటి?.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. . మొత్తం మీద ఈ వ్యవహారంలో సాయిరెడ్డి టార్గెట్ ఏంటి పార్టీ నుంచి తనకు పొమ్మనకుండా పొగ పెట్టిన వారిని టార్గెట్ చేయలనుకుంటున్నారా?.. పొలిటికల్ రీఎంట్రీ కోసం చూస్తున్న ఆయన తనపై ఉన్న వైసీపీ ముద్రను తొలగించుకోవడానికి ఇదంతా చేస్తున్నారా? సాయిరెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? లిక్కర్ కేసులో ఇంకా ఎవరినైనా ఆయన ఇరికిస్తారా.. ఆయనే ఇరుక్కుంటారా?అసలు ఆ కేసు ఏ టర్న్ తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

మెట్రో రైళ్లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనపై హైకోర్టులో విచారణ

  మెట్రోస్టేషన్లు, రైళ్లలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌లపై మెట్రో రైళ్లలో ప్రకటనపై పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణకు హైదరాబాద్ మెట్రో రైలు తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనలు ఇప్పుడు వేయడంలేదన్న ఏజీ పేర్కొన్నారు. మెమో దాఖలు చేసినట్లు తెలిపిన ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. తదుపరి విచారణ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. మెట్రో ట్రైన్లలో నిషేధిత బెట్టింగ్‌ యాప్‌ ప్రకటనలపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది.  న్యాయవాది నాగూర్‌ బాబు ఈ పిల్​ను వేశారు. అనంతరం న్యాయస్థానంలో ఆయన తన వాదనలు వినిపించారు. ‘బెట్టింగ్‌ యాప్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ మెట్రో రైళ్లలో మాత్రం ప్రకటనలు ఇస్తున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్‌లపై ఇప్పటికే ఈడీ విచారణ కొనసాగుతోంది. మెట్రో రైళ్లలో ఈ అడ్వర్టైజ్​మెంట్స్​పై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు. మెట్రో రైళ్లలో 2022 తర్వాత బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలను ప్రదర్శించలేదని హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ఆసుపత్రి నుంచి శ్రీ తేజ్ డిశ్చార్జ్

  సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప-2 రిలీజ్ సందర్భంగా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ 5 నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్‌గా ఉందని తండ్రి భాస్కర్ తెలిపారు. ఈ ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్‌తో సహా థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో బన్నీనీ  ఏ11 నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు.  ఆ తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. బెయిల్ పేపర్లు ఆలస్యం కావటంతో ఆయన ఓ రోజు రాత్రి మొత్తం చంచల్‌గూడ జైలులో ఉండాల్సి వచ్చింది. అనంతరం అల్లు అర్జున్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాననని హామీ ఇచ్చారు. అయితే ఘటన జరిగి ఇప్పటికే దాదాపు 5 నెలలు గడిచిపోవటంతో చాలా మంది ఈ ఘటనను మర్చిపోయారు కూడా. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండటంతో డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇక్కడి నుంచి రిహాబిలిటేషన్‌ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరఫీ వంటివి నిర్వహించాక ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించినట్లు సమాచారం

సుప్రీంకోర్టు నూతన చీఫ్ జస్టిస్‌గా బి.ఆర్. గవాయ్

  సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా  బి.ఆర్. గవాయ్ ఎన్నికయ్యారు.  గవాయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. మే 14న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీజేఐ పదవి చేపడుతున్న రెండో దళితుడిగా జస్టిస్ గవాయ్. కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్‌ 1985లో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు. 1992లో నాగ్‌పూర్‌ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్‌ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్‌ గవాయ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అత్యున్నత న్యాయస్థానానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన  సేవలందించనున్నారు.  

ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ : ప్రధాని

  జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై కీలక వ్యూహరచన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే జాతీయ సంకల్పమని ప్రధాని పునరుద్ఘాటించారు.  ఈ లక్ష్య సాధనలో భాగంగా, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పహల్గామ్ దాడికి పాల్పడిన వారికి తగిన రీతిలో గట్టి బదులిస్తామని కూడా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో  అంతం చేస్తామని  ప్రధాని తెలిపారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.   

భూదాన్ భూముల వివాదం సోదాలపై ఈడీ కీలక ప్రకటన

    రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నాగారంలో భుదాన్ భూములు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై ఈ నెల 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం..27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ తాజాగా కొందరు ఐపీఎస్‌ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో ఐపీఎస్‌లు మహేశ్‌భగవత్‌, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా ఉన్నారు. భూదాన్‌ భూముల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని గవర్నమెంట్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి ఏప్రిల్‌ 24న విచారణ చేపట్టారు.  నాగారంలోని 181, 182 సర్వే నెంబర్‌లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇందులో అక్రమాలు జరిగాయని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ప్రభుత్వంతోపాటు పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వారి భార్యలు, పిల్లలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ప్రభుత్వం, సీబీఐ, ఈడీతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా ముగ్గురు ఐపీఎస్‌లు హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ అంశంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు సైతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్..కర్మణ్యే వాధికారస్తే

సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌‌ ఎక్స్‌లో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం  ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ట్వీట్టర్ వేదికగా స్మితా  స్పందించారు. భగవద్గీతలోని "కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన" శ్లోకాన్ని ఉటంకిస్తూ ఆమె తన పోస్ట్‌ను ప్రారంభించారు. "పర్యాటక శాఖలో నాలుగు నెలలు పనిచేశాను. నా వంతుగా అత్యుత్తమంగా సేవలు అందించేందుకు ప్రయత్నించాను. రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2025-30 పర్యాటక విధానాన్ని తీసుకువచ్చాం. ఇది ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడిన టూరిస్ట్ ప్రాంతాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు, పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన పునాదిగా నిలుస్తుంది" అని ఆమె వివరించారు. తెలంగాణలో తొలిసారిగా, 2025-30 టూరిజం పాలసీ తీసుకొచ్చాం. ఇది ఇప్పటివరకు నిర్లక్షించబడిన పర్యాటక ప్రాంతాలకు దిశను చూపేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు బలమైన పునాది అవుతుంది.  శాఖ పనితీరును మళ్లీ ఆకళింపు చేసి, బాధ్యతను నూరిపోసే ప్రయత్నం చేశాను. ఒక గ్లోబల్ ఈవెంట్‌కు అవసరమైన ప్రణాళికా మౌలికతల ఏర్పాటుకు పునాది వేశాను. ఇది చాలా అవకాశాలకు తలుపులు తీయగలదని నమ్మకం ఉంది’ అని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పర్యాటక శాఖలో పనిచేయడం గర్వంగా, గౌరవంగా ఉందని నమస్కారం సింబల్ జోడించారు.ఈ సందర్భంగా స్మితా సబర్వాల్‌కు నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు. మీరు టూరిజం లో చాలా మార్పు తీసుకొని వచ్చారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.  ఇటీవల హైదరాబాద్ శివార్లలోని కంచ గచ్చిబౌలి భూముల కేటాయింపు వ్యవహారంలో స్మితా సబర్వాల్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం నేపథ్యంలోనే ఆమెపై బదిలీ వేటు పడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమెను తక్కువ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక సంఘానికి బదిలీ చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.   

రేపే టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల

  విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది. రేపు.. అంటే ఏప్రిల్‌ 30వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేర‌కు విద్యాశాఖ అధికారికంగా ప్ర‌క‌టించింది. .ఈ సారి కొత్త‌గా మార్కుల‌తో పాటు స‌బ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఆ విధంగానే మార్క్స్ మెమోలు జారీ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి  పదో తరగతి రిజల్ట్స్ విడుదల చేస్తారని సమాచారం.మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన ప‌ది ప‌రీక్ష‌ల‌కు 5 ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను ntnews.com వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.   మూల్యాంకనం పూర్తి కావడంతో రిజల్ట్స్‌ రిలీజ్‌ కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం విద్యా శాఖ ఎదురు చూసింది. ఈలోపు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో పలితాలు విడుదల చేస్తోంది.మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌)లో స్టూడెంట్స్‌కు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్, వర్క్‌ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అనే నాలుగు కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు.

మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

  మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి.  మే 4 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీల్లో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ ముగింపు వేడుకలను భాగ్యనగరంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎయిర్ పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాంపిటీషన్స్‌కు వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదని సీఎం అన్నారు. విభాగాలవారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పోటీలు నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు  

సభ సక్సెస్ సరే.. కానీ, ప్యూచరేంటి?

ఆపరేషన్ సక్సెస్ .. పేషెంట్ డెడ్  ఇదొక మెడికల్ ఇడియమ్.  అయితే రాజకీయాలలోనూ ఈ నానుడి తరచూ వింటూనే ఉంటాం. విజయవంతమైన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి కూడా విశ్లేషకులు అదే అంటున్నారు. అవును.. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం (ఏప్రిల్ 27) ఘనంగా నిర్వ హించిన  బీఆర్ఎస్   రజతోత్సవ సభ, జన సమీకరణ వరకూ సక్సెస్ అయింది. ఆశించిన పది లక్షల మంది కాకున్నా, లక్షల్లోనే జనం సభకు హాజరయ్యారు. అయితే.. వచ్చిన జనాల్లో ఆ స్థాయిలో ఉత్సాహం కనిపించలేదు, అందుకనే  రాజకీయ విశ్లేషకులు ఆపరేషన్ సక్సెస్ .. పేషెంట్ డెడ్ అంటున్నారు. నిజానికి సభకు వచ్చిన జనాలు, పార్టీ క్యాడర్  మాత్రమే కాదు, వేదికను అలంకరించిన నాయకుల్లోనూ పెద్దగా ఉత్సాహం కనిపించిలేదు. చివరకు  కేసీఆర్ ఎంట్రీ కూడా చెప్పుకున్నంత గొప్పగా లేదని అంటున్నారు. ముఖ్యంగా.. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు  సభ  జరిగిన తీరుపై పెదవి విరుస్తున్నారు. జన సమీకరణ వరకు ఓకే కానీ.. క్యాడర్ లో ఉత్సాహం కనిపించలేదని అంటున్నారు. నాయకులు మొదలు క్యాడర్ వరకు ఎవరికి వారు పార్టీ రజతోత్సవ సభను  ఇంటి పండగ చేసుకున్నట్లు లేదని అంటున్నారు.    అంతే కాదు  ‘గుర్రాన్ని చెరువు వరకు తీసుకు రావచ్చును  కానీ నీటిని తాగించలేము’  అనే సామెతను గుర్తు చేస్తున్నారు. అంటే..  సభకు హాజరైన జనం, ముఖ్యంగా పార్టీ క్యాడర్ ఏదో వచ్చాం, వెళ్లాం అన్నట్లుగానే వచ్చి వెళ్ళారు తప్ప  వారిలో ఉత్సాహం అంతగా కనిపించలేదని అంటున్నారు. అందుకే  రజతోత్సవ సభ టీఆర్ఎస్  సభలా లేదని..  బీఆర్ఎస్ సభలా ఉందని సీనియర్ నాయకుడు ఒకరు చమత్కరించారు. అంటే, టీఆర్ఎస్  బీఆర్ఎస్ ఒకటి కాదనే అభిప్రాయం సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.     అదలా ఉంటే..  బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు ప్రసంగంలోనూ వెనకటి వేడి వినిపించలేదని అంటున్నారు. అవును. బీఆర్ఎస్ సభ  టీఆర్ఎస్ సభలా లేదు కేసీఆర్ ప్రసంగం కేసీఆర్ ప్రసంగంలా లేదని అంటున్నారు. అయితే.. విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్ భాషలో వచ్చిన మార్పును మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. సెన్సార్ కత్తెరకు పనిలేకుండా, ఆ .. పదం ఒక్కటైనా లేకుండా కేసీఆర్ ప్రసంగించడం అభినందనీయం అంటున్నారు. బహిరంగ సభ వేదిక నుంచి కేసీఆర్ ఇంత  చక్కటి భాషలో మాట్లాడడం ఇటీవల కాలంలో బహుశాఇదే మొదటి సారేమో అంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ భాషలో వచ్చిన మార్పును అందరు స్వాగతిస్తున్నారు. అలాగే  కేసీఆర్ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయితే, అందులో కొత్త దనం ఏమీ లేదని బీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒకటికి వందసార్లు చెప్పిన విషయాలనే  కేసీఆర్ చెప్పారు, కాంగ్రస్ ప్రభుత్వం పై కేటీఆర్  చేసిన ఆరోపణలనే కేసీఆర్ చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా అవే విమర్శలు చేశారు. అదొక్కటే  తేడా మిగిలినదంతా సేమ్  టూ సేమ్’ , అన్నట్లుగా సాగింది. అందుకే..  కేసీఆర్ ప్రసంగం అంతగా రక్తి కట్టలేదని, ఉపన్యాసంలో ఊపు,ఉత్సాహం లేదని అంటున్నారు.  అలాగే, రజతోత్సవ సభ ద్వారా కేసీఆర్ పార్టీ నాయకులకు క్యాడర్’కు దశ దిశ నిర్దేశిస్తారు అనుకుంటే..  అసలు ఆ ఊసే లేదాని అంటున్నారు. నిజానికి కేసీఆర్ కు సైతం ముందడుగు ఎలా వేయాలి అనే విషయంలో ఒక క్లారిటీ లేనట్లుందని అంటున్నారు. అలాగే.. పార్టీ నాయకత్వం,వారసత్వం విషయంలో కుటుంబంలో ముదిరిన విభేదాలు సైతం కేసీఆర్ కు తలనొప్పిగా మారాయంటున్నారు.  అందుకే.. బీఆర్ఎస్ రజతోత్సవ సభ గులాబీ పార్టీలో ఉత్సాహం నింపడంలో విఫలమైందని అంటున్నారు. అందుకే సభ సక్సెస్ అయినా పార్టీ  ఫ్యూచర్ ఏమిటి అనే విషయంలో క్లారిటీ రాలేదని అంటున్నారు. అయితే, ముందు ముందు కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? పార్టీ అంతర్గత విభేదాలను ఎలా  చక్క దిద్దుతారు ? అనే  దానిపైనే, బీఆర్ఎస్ భవిష్యత్ ఆధార పడి ఉంటుందని అంటున్నారు.

ఉగ్రదాడి బాధిత కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం

  జమ్ముకాశ్మీర్  పహల్గామ్ ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన  మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ భారీ విరాళం విరాళం ప్రకటించింది. పార్టీ తరపున ₹50 లక్షల ఆర్ధిక సహాయం, అలాగే జనసేన పార్టీ ప్రమాద బీమా నుండి ₹5 లక్షల ఇన్సూరెన్స్ తో కలిపి మొత్తంగా ₹55 లక్షలు అందించనున్నామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  కీలక ప్రకటన చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరుపున ఉగ్ర మృతులకు నివాళులు  అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి హాజరై ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.  క్రియాశీలక జనసైనికుడు మధుసూదన రావు కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని, కుటుంబపెద్ద అయిన మధుసూదన్ చనిపోవడం బాధకరమని అన్నారు.  డబ్బుతో ప్రాణాలకు విలువ కట్టలేమని, కానీ ఈ సాహయం కుటుంబపెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. అంతేగాక ఈ రోజు ఆర్థిక సహాయం చేసి వదిలేయడం కాకుండా మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన ఎల్లవేళలా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. 

అసెంబ్లీలో చంద్రబాబు తెలంగాణ పదం నిషేధించారా? కేసీఆర్ ఆరోపణల్లో వాస్తవం ఉందా?!

బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగంలో గతంలోని వాడి, వేడీ కనిపించలేదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. పార్టీ నేతలు, శ్రేణులే కేసీఆర్ ప్రసంగం చప్పగా ఉందని పెదవి విరుస్తున్నారు. ఆయన పిలుపు మేరకు నేతలు, క్యాడర్ శ్రమించి సిల్వర్ జూబ్లీ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించారు. అయితే ఆ వచ్చిన వారిని ఆకట్టుకునే విధంగా అయితే కేసీఆర్ ప్రసంగం లేదన్న భావన పార్టీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ తన ప్రసంగం మొత్తం కాంగ్రెస్ ను టార్గెట్ చేయడానికీ, చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికే పరిమితం చేశారు తప్ప.. బీజేపీ గురించి ఒక్కటంటే ఒక్క మాట లేదు. ఒక్క విమర్శ లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అన్నట్లుగా బీజేపీ ఎదుగుతున్న సూచనలకు కనిపిస్తున్నా కేసీఆర్ మాత్రం ఆ పార్టీపై చిన్నపాటి విమర్శ చేయడానికి కూడా ఇష్టపడలేదన్నట్లుగా ప్రసంగించారని పార్టీ క్యాడర్ నిరుత్సాహంగా చెబుతోంది. అన్నిటికీ మించి అసందర్భంగా చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని  నిషేధించారంటూ వైల్డ్ ఆరోపణ ఒకటి చేసేశారు. చంద్రబాబు ఆదేశంతోనే అప్పటి స్పీకర్ ప్రతిభాభారతి సభలో తెలంగాణ నినాదం వినిపించకూడదంటూ రూలింగ్ పాస్ చేశారని కేసీఆర్ అన్నారు.   కేసీఆర్ ప్రసంగంలో మునుపటి వాడీవేడీ లేకపోవడం అటుంచి కేసీఆర్ తన ప్రసంగంలో చంద్రబాబు గురించి అసత్యాలు చెప్పారనీ, తద్వారా జనంలో చంద్రబాబును తెలంగాణకు బూచిగా చూపించి, ఆయనకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ కు ఉన్న అనుబంధం తెలంగాణకు నష్టం చేకూరుస్తుందని చెప్పడానికి నానా ప్రయాసా పడ్డారని పార్టీ వర్గాలే అంటున్నాయి. అప్పడు ఏం జరిగిందో తెలిసిన వారు కేసీఆర్ నోట ఈ అవాస్తవాలు ఏంటి? ఆయన బీజేపీకి దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించారా? కుమార్తె  కవిత మద్యం కుంభకోణం కేసు, కుమారుడు కేటీఆర్ పై కేసులు, అదే విధంగా ఫోన్ ట్యాంపరింగ్ కేసుల భయంతో బీజేపీని శరణు జొచ్చుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆప్పుడు, ఇప్పుడు కూడా తెలంగాణ సెంటిమెంట్ రాజేయడానికి చంద్రబాబు పేరు ఉపయోంచుకుంటున్నారు. అయితే రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ఏనాడు బీఆర్ఎస్ ప్రస్తావన కానీ, కేసీఆర్ ప్రస్తావనను కానీ తీసుకువచ్చిన సందర్భం లేదు. కానీ కేసీఆర్ కు మాత్రం తన రాజకీయం కోసం చంద్రబాబు పేరు వాడని సందర్భం లేదు.  ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని చంద్రబాబు నిషేధించారనడం పూర్తిగా అవాస్తవం.  అప్పుడు అసలు జరిగిందేంటంటే.. 2001లో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేసి టీఆర్ఎస్ ను స్థాపించారు.  అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) అప్పటి వాజ్ పేయి ప్రభుత్వానికి ఒక తీర్మానాన్ని పంపింది. అ  తక్షణమే రెండో ఎస్ఆర్సి ఏర్పాటు చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను పరిశీలించాలని అందులో కోరింది. అయితే అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్ కే అద్వానీ అందుకు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.  చిన్న రాష్ట్రాలు ఆచరణ సాధ్యం కాదనీ, చిన్న రాష్ట్రాల వల్ల దేశ సమగ్రతకు ముప్పనీ పేర్కొన్నారు. ఆ సమయంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కు అసలు ప్రాతినిథ్యమే లేదు.   ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు సభలో జై తెలంగాణ నినాదాలు చేయడం ప్రారంభించారు. వారి వైఖరి కారణంగా సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగేది. ఈ నేపథ్యంలోనే అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి సభలో నినాదాలను నిషేధిస్తూ రూలింగ్ ఇచ్చారు. అయితే ఆ రూలింగ్ లో ఎక్కడా తెలంగాణ నినాదాలను నిషేధిస్తున్నట్లు ఎక్కడా లేదు. మొత్తంగా సభా కార్యక్రమాలను అడ్డుకునే విధంగా సభ్యులు నినాదాలు చేయడాన్ని నిషేధిస్తూ అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి రూలింగ్ ఇచ్చారు.  తెలంగాణ నినాదాల బహిష్కరణ అనే మాటను కేసీఆర్ తన రాజకీయ అజెండా మేరకు తీసుకువచ్చి చంద్రబాబుకు ఆపాదించారు. అదిగో సరిగ్గా అప్పటి నుంచే టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య స్నేహ బంధం ఏర్పడింది. 2004 అసెంబ్లీ ఎన్నికలలో ఆ రెండు పార్టీలూ కలిసి పని చేయడానికి ఒక అంగీకారానికి వచ్చేలా చేసింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కూటమి విజయం సాధించి వైఎస్ ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.  కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి దక్కింది. సో చెప్పొచ్చేదేంటంటే.. నాడు, నేడూ కూడా చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ఫోకస్ చేసి రాజకీయలబ్ధి పొందాలన్నది కేసీఆర్ ప్రయత్నం అప్పడూ.. ఇప్పుడూ కూడా. అందుకే సిల్వర్ జూబ్లీ సభలో కూడా కేసీఆర్ చంద్రబాబు జపమే చేశారు. ఆయనపై విరమ్శలు గుప్పించడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను సజీవంగా ఉంచాలన్నదే ఆయన ప్రయత్నమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిన చిరుత.. ఎక్కడంటే?

  తమిళనాడు నీలగిరి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీస్ స్టేషన్ లోకి చిరుతపులి ప్రవేశించింది. రాత్రిపూట ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చి గదిలో కలియతిరిగింది. లోపల ఎవరూ కనిపించకపోవడంతో కాసేపటి తర్వాత తిరిగి వెళ్లిపోయింది. ఊటీ సమీపంలోని నడువట్టం పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి ఘటన  జరిగింది. అది గమనించిన ఓ కానిస్టేబుల్ అలర్ట్ అయ్యారు.  లోపల ఎవరు కనిపించకపోవడంతో అక్కడి నుంచి పులి బయటకు వెళ్లిపోయింది. లోపల ఉన్న కానిస్టేబుల్ వెంటనే తలుపులు మూసేశారు.నడువట్టం ప్రాంతంలో చిరుతల సంచారం ఇటీవల ఎక్కువైందని, ఫారెస్ట్ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంది వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది