విశాఖలో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

  హైదరాబాద్‌లో కేవలం 14 నెలల్లోనే హైటెక్ సిటీని నిర్మించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని విట్  విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని  కొనియాడారు. ఈ సందర్భంగా విట్-ఏపీ క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం, నూతన స్టార్టప్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన వి-లాంచ్‌ ప్యాడ్ 2025 ఇంక్యుబేషన్ సెంటర్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. విద్యార్థులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, విట్-ఏపీలో 95 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్ అంతా ఐటీ దేనని అప్పట్లోనే చెప్పాను దేశంలోని ఐఐటీలలో 20 శాతం సీట్లు తెలుగోళ్లే కొల్లగొడుతున్నారు. అన్నింటిలో తెలుగువారు ముందుండాలనేదే నా ఆకాంక్ష అని తెలిపారు.ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులుంటారు.. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని పేర్కొన్నారు.  మే 2 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పున:ప్రారంభం కాబోతుందని.. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని.. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేది. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్‌ ఉద్యోగానికి కూడా డిమాండ్‌ ఉండేది. ఇప్పుడు కలెక్టర్‌ పోస్టు కంటే ఐటీ ఉద్యోగానికే డిమాండ్‌ ఎక్కువగా ఉందన్నారు. విట్‌ అమరావతిలో 95 శాతం ప్లేస్‌మెంట్లు వస్తున్నాయి. మీరు ఉద్యోగంలో సంతృప్తి చెందవద్దు.. కొత్త సంస్థలు స్థాపించండి. సిలికాన్‌ వ్యాలీలో కంపెనీల సీఈవోలంతా తెలుగోళ్లు, భారతీయులే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారు. త్వరలో అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నాం. మన పిల్లలు ప్రపంచస్థాయి సేవలు అందించే స్థాయికి ఎదగాలి. వాట్సప్‌ సేవ ద్వారా ప్రజలకు పరిపాలన, ప్రభుత్వ సర్వీసులు దగ్గర చేశాం. వాట్సప్‌ ద్వారా వెయ్యి రకాల సేవలు అందిస్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2047కి మార్గసూచి రూపొందిస్తున్నాం. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. ఇప్పుడు కలెక్టర్ పోస్ట కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో విట్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాథన్, వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎస్.వి. కోటారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రాజకీయ సయోధ్య మూన్నాళ్ళ ముచ్చటేనా?

పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి  ఒక్కటయ్యాయి. ఐక్యతను  ప్రదర్శించాయి. ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. మాలో మాకు సవాలక్ష విబేధాలు ఉండవచ్చును కానీ..  మా దేశం పై మరో దేశం ఏ రూపంలో దాడి చేసినా, రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కటై నిలుస్తామని శతృ మూకకు స్పష్టమైన హెచ్చరిక చేశాయి. దేశం గర్వించేలా అధికార, ప్రతిపక్ష నాయకులు, చేతులు కలిపి సయోధ్య  ప్రదర్శించారు. అవును పహల్గాం ఉగ్ర దాడి పై చర్చించేందుకు ఏప్రిల్ 24 న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, ఎంఐఎం సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కాంగ్రెస్ అగ్ర నేతలు, రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే సహా  అన్ని పార్టీల నాయకులు సర్కార్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, మద్దతు ఇస్తామని  అండగా నిలుస్తామని ‘బ్లాంక్ చెక్ ’ ఇచ్చారు. సంపూర్ణ మద్దతు ఇచ్చారు. సయోధ్య ప్రకటించారు. అయితే.. ఈ మాటల తడి ఇంకా పూర్తిగా అరక ముందే.. వాతావరణం వేడెక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అవును  అఖిలపక్ష సమావేశంలో వ్యక్తమైన సయోధ్యకు ఇంతలోనే   చుక్కెదురు అయిందా?  ఇంతలోనే సయోధ్యకు చిల్లు పడిందా?  అనే  అనుమనాలు, ఆందోళన వ్యక్త మవుతున్నాయి.  ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ స్వరం మెల్లమెల్లగా మారుతోందని అంటున్నారు.  ఏప్రిల్ 24న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో భద్రతా లోపాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపక్షాలకు తప్పడు సమాచారం ఇచ్చిందని, తప్పు దోవ పట్టించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తృణమూల్ కాంగ్రెస్ స్వరం కలిపింది.  అఖిల పక్ష సమావేశంలో  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు, ఉగ్రదాడి జరిగిన  బైసరాన్ లోయలో పర్యటించేందుకు టూర్ ఆపరేటర్స్  స్థానిక అధికారుల అనుమతి తీసుకోలేదనీ,   అలాగే  సహజంగా బైసరాన్  లోయలో పర్యాటకుల సందర్శనకు జూన్  లో అనుమతిస్తారనీ,  కానీ ఈసారి స్థానిక అధికారులు, పోలీసుల అనుమతి లేకుండానే టూరిస్ట్  ఆపరేటర్స్ ఏప్రిల్ 20 నుంచే బైసరాన్  లోయకు పర్యాటకులను  తీసుకు పోయినట్లు పేర్కొన్నారు. అయితే  హోం శాఖ అధికారులు ఇచ్చిన ఈ సమాచారం తప్పని  బైసరాన్ లోయ ఒక్క మంచు కురిసే కాంలో తప్పించి, సంవత్సరం పొడుగునా తెరిచే ఉంటుందిని  స్థానిక పత్రికలలో కథనాలు వచ్చాయి. ఈ పత్రికా కథనాలే.. విపక్షాలకు ఆయుధం అయ్యాయి.   అవును ఆ పత్రికా కథనాలను ఉటంకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ మీడియా సెల్ ఇంచార్జి, జైరాం రమేష్  సోషల్ మీడియా ప్లాట్ ఫారం   ‘ఎక్స్’  వేదికగా  చిన్నగా  చిచ్చు పెట్టారు.  అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చినట్లుంది.  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  అధ్యక్షతన ఏప్రిల్ 24 న జరిగిన అఖిలపక్ష సమావేశంలో సరైన  సమాచారం ఇచ్చినట్లు లేదు. నిజానికి  తప్పుడు  సమాచారం యిచ్చినట్లుంది  అంటూ, ఒక అస్పష్ట పోస్టు పెట్టారు. చిచ్చు రాజేశారు. ఆవెంటనే  మరో కాంగ్రెస్ ఎంపీ రందీప్ సుజ్రేవాలా  ఒక అడుగు ముందుకేసి  దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ మన్నట్లు, పహల్గాం  ఉగ్ర దాడిలో ఇంటెలిజెన్స్, భద్రతా వైఫల్యాలు జరిగాయని నిర్ధారించారు. ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు  అఖిల పక్ష సమావేశానికి, మొత్తం దేశానికీ దేశానికీ ఎందుకు  అబద్దం చెప్పారంటూ  ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  అలాగే..  తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు, మాజీ జర్నలిస్ట్ సాగరికా ఘోష్  కూడా కాంగ్రెస్ తో గొంతు కలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం, హోం మంత్రి అమిత్ షా, ఎందుకు ప్రతిపక్షాన్ని తప్పు దో పట్టించారు? అంటూ ప్రశ్నించారు.  అయితే.. ఏవో కొన్ని స్థానిక పత్రికల్లో వచ్చిన కధనాల అధారంగా కాంగ్రెస్, తృణమూల్  నాయకులు..  ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లు అసత్యాన్ని ప్రచారం చేయడం ఏమిటని బీజేపీ ఎదురు దాడికి దిగింది. అంతే కాకుండా అఖిలపక్ష  సమావేశంలో ఇచ్చిన మాటను  కాంగ్రెస్ పార్టీ  ఇంతలోనే ఎందుకు తప్పుతోందని  అధికార బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు..  నువ్వోకటంటే మేము నాలుగు అంటాం  అంటూ బీజీపీ రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది ఇందిరా గాంధీ మర్డర్ మొదలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక భద్రతా లోపాలాను ప్రస్తావిస్తూ ఎదురు దాడికి దిగారు. దీంతో ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు  అవుతుందని గ్రహించి కావచ్చును, కాంగ్రెస్ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే   సెక్యూరిటీ లోపాల గురించి  హోం మంత్రి అమిత్ షా అఖిల పక్ష సమావేశంలో అంగీకరించారు.  సో.. తానా విషయంలోకి పోను కానీ  1961 సిందూ నదీ జలాల ఒప్పందం నిలిపి వేయడంపై అభ్యంతరం వ్యక్తపరిచారు. దిగువకు నీరు పంపకుండా  ఎలా నిలుపుతారు అంటూ నిలదీశారు? అసాధ్యమంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు.  అయితే..  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇంతలోనే  ‘యు’ టర్న్ తీసుకోవడం, కాంగ్రెస్ వెంట తృణమూల్ అడుగులు వేయడం, మరో వంక కర్ణటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పాకిస్థాన్ పై యుద్ధం వద్దని అనడం వంటి  పరిణామాలను  గమనిస్తే..  అఖిల పక్ష సమవేశంలో వ్యక్తమైన రాజకీయ సయోధ్య మూన్నాళ్ళ ముచ్చ టేనా  అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారు..రజతోత్సవ సభపై రేవంత్ రియాక్షన్

  హన్మకోండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఇప్పుడు మాపై నిందలు వేేేస్తున్నరని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, తనకు మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాహుల్ గాంధీతో తనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్,కేకే, వేం నరేందర్ రెడ్డితో కలిసి నిన్న శాంతి కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు, అపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణపై చర్చించారు.  అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్ హయంలో ఖమ్మం రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అవసరాలకు అనుగణంగా కేసీఆర్, ప్రధానీ మోడీ మాటలు మారుస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని, రెండు దేశాలను ఓడించిన ఘనత ఇందిరాగాంధీదేనన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శాసన సభ్యులు హైదరాబాద్ లో టైమ్ పాస్ చేయడం సరికాదని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీలో ఓపిక ఉంటే పదవులు వస్తాయి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారు. రాహుల్ గాంధీకి, నాకు గ్యాప్ ఉందనడం అవాస్తవం అని మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఎవర్నీ నమ్మించాల్సిన పని లేదన్నారు. బయట ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోనని చెప్పారు.  

హరిరాం అక్రమాస్తులు.. వంద కోట్లు పైమాటే!?

కాళేశ్వరం మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ భూక్యా హరిరాంని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది  ఏసీబీ. హరిరాంతో సంబంధమున్న 14 ప్రదేశాలతో దాడులు చేసింది అవినీతి నిరోధకశాఖ. ఈ దాడుల్లో భూక్యా హరిరాంకి సంబంధించిన భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ  హరిరాంను గజ్వేల్ లో శనివారం (ఏప్రిల్ 26)అరెస్టు చేసింది. ఈ సందర్భంగా హరిరాం విలాసవతంతమైన ఆస్తుల జాబితా విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే.. షేక్‌పేటలో లగ్జరీ విల్లా, కొండాపూర్‌లో లగ్జరీ విల్లా, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్, మాదాపూర్‌లో ఫ్లాట్, నార్సింగిలో ఫ్లాట్, అమరావతిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండివిడ్యువల్ హౌసెస్, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల్లో మామిడి తోటతో కూడుకున్న ఫామ్ హౌస్. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవంతి, కుత్బుల్లా పూర్ లో ఓపెన్ ప్లాట్, మిర్యాలగూడలో మరో ఓపెన్ ప్లాట్, ఒక బీఎండబల్యూ కారుతో సహా.. 2 ఇతర వామనాలు తమ సోదాల్లో వెలుగులోకి తీశారు అధికారులు. ఇంకా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లతో కలుపుకుని సుమారు ఈ అక్రమాస్తుల   విలువ వంద కోట్ల మేర ఉండొచ్చని అంచనా.  హరిరాంను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు అధికారులు. కాళేశ్వరం రూపకల్పన, నిర్మాణం నిర్వహణలో తీవ్రమైన లోపాలను బయట పెట్టింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. నివేదిక విడుదలైన కాసేపటికే ఇది జరగడం గమనార్హం.

స్థానిక పీఠాల్లో కూటమి పాగా!

ఫలిస్తున్న బాబు చాణక్యం దూసుకు పోతున్న కూటమి  డీలా పడిన వైసీపీ ఏపీలో కూటమి పార్టీలు స్థానిక పీఠాలను కైవశం చేసుకుంటున్నాయి. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో  రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలల రాజధాని నిర్మాణం ఓ వైపు యుద్ధప్రాతిపదికన సాగుంతోంది. మూడేళ్ల కాల వ్యవధిలో అమరావతి పూర్తి కానున్నదని చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పనుల వేగం ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నది, అదే సమయంలో తెలుగుదేశం స్థానిక సంస్థలపై దృష్టి కేంద్రీకరించింది. జగన్ హయాంలో  దౌర్జన్యంగా గెలుచుకున్న స్థానిక సంస్థలలో జెండా ఎగుర వేస్తున్నది. గ్రేటర్ విశాఖపై కన్నేసిన టీడీపీ ఆ దిశగా దూసుకెళ్లి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం లో సక్సెస్ అయింది. ఇక అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ దక్కించుకున్న  గుంటూరు,కుప్పం, మాచర్ల మున్సిపల్ పీఠాల్నిసైతం తెలుగుదేశం కూటమి తన ఖాతాలో వేసుకుంది.  రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా స్ధానాల్లో ఉన్న మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు తప్పుకోవడమో, అవిశ్వాసంలో పదవులు కోల్పోవడమూ జరుగుతోంది. ఈ సీట్లను  ఎన్నికల ద్వారా కూటమి సర్కార్ తమ ఖాతాలో జమ చేసుకుంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో పలువురు వైసీపీ సభ్యులు టీడీపీ వైపు దూకేశారు. దీంతో ఐదో వార్డ్ కౌన్సిలర్ సెల్వరాజ్ కూటమి తరఫున మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. వైసీపీ నుండి నలుగురు కౌన్సిలర్లు టీడీపీ వైపుకు వెళ్ళిపోయారు.  దీంతో 24 మంది సభ్యులలో 14మంది మద్దతుతో పాటు ఎక్స్ ఆఫిషియో మెంబర్ మద్దతు కూడా లభించడంతో టీడీపీ సునాయాసంగా ఛైర్మన్ పీఠం దక్కించుకుంది లాగే గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ పీఠం సైతం కూటమి కైవసం చుసుకుంది. మేయర్ ఎన్నికల్లో కూటమికి 34 ఓట్లు, వైసీకి 27 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ కౌన్సిలర్ కోవెలమూడి రవీంద్ర మేయర్ గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఈ పరిణామంతో టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. గతంలో మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో ఇక్కడ మేయర్ ఎన్నిక జరిగింది. మరోవైపు పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం సాధించింది. మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా.. ఇందులో 21 మంది కౌన్సిలర్ల మద్దతుతో టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకుంది. టిడిపి బలపరిచిన అభ్యర్థి 27 వార్డు కౌన్సిలర్ షేక్ మదార్ సాహెబ్ ఛైర్మన్ పీఠం అధిష్టించబోతున్నారు. గతంలో మాచర్లలో ఏకపక్షంగా ఛైర్మన్ పీఠం దక్కించుకున్న వైసీపీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా భావించాల్సి ఉంటుంది.   ఇక విజయవాడ మేయర్ పీఠంపై కూడా కూటమి కన్నేసిందని తెలుస్తోంది. విజయవాడలో టీడీపీ కూటమి అభ్యర్థి విజయానికి ఏ వ్యూహారు రచించనుననారన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న అంశంగా మారిపోయింది.  

కుప్పం మునిసిపాలిటీ తెలుగుదేశం ఖాతాలోకి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం. గత ఆ నియోజకవర్గ కేంద్రం అయిన కుప్పం మునిసిపాలిటీ మాత్రం గత ఐదేళ్లుగా వైసీపీ చేతిలో ఉంది. కుప్పం మునిసిపల్ చైర్మన్ గా వైసీపీ నేత డాక్టర్ సుధీర్ రెడ్డి ఉండేవారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత సుధీర్ రెడ్డి తన కౌన్సిలర్ పదవికి  రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచీ కుప్పం మునిసిపల్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. రాజీనామా చేసిన సుధీర్ రెడ్డి తెలుగుదేశం గూటికి చేరారు. నియోజకవర్గం లో గత ఐదేళ్లుగా మున్సిపల్ ఛైర్మన్ కుర్చీ వైసీపీ పరిధిలో ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత మాజీ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ రెడ్డి కౌన్సిల్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.   దీంతో ఖాళీగా ఉన్నకుప్పం మునిసిపల్ చైర్మన్ పదవికి సోమవారం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అనూహ్యంగా తెలుగుదేశం విజయం సాధించి చైర్మన్ గిరీని సొంతం చేసుకుంది. మునిసిపల్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి, తెలుగుదేశం కౌన్సిలర్ సెల్వరాజ్ విజయం సాధంచారు. వాస్తవానికి కుప్పం చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి అవసరమైన బలం వైసీపీకి ఉంది. దీంతో అంతా వైసీపీ విజయం సాధించడం ఖాయమనే భావించారు. అయితే అనూహ్యంగా వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు తెలుగుదేశంకు మద్దతు ఇచ్చారు. దీంతో తెలుగుదేశం బలం 15కు పెరిగింది. తెలుగుదేశం అభ్యర్థి సెల్వరాజ్ విజయం సాధించారు.  

విశాఖ మేయర్‌‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ..గుంటూరు, కుప్పం టీడీపీ కైవసం

  విశాఖ మహానగర పాలక మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవం ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు.  మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. దీంతో మేయర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కోరం సరిపోవడంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి.. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్‌గా కూటమి అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్‌ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటించి.. ఆయనకు ధ్రువపత్రం అందజేశారు. 2021 గ్రేటర్ విశాఖ నగర పాలక ఎన్నికల్లో టీడీపీ  అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును అధిష్ఠానం ప్రకటించింది. అప్పట్లో మెజార్టీ లేకపోవడంతో ‘పీలా’కు పదవి దక్కలేదు. నాలుగేళ్ల పాటు పార్టీ బలోపేతానికి చేసిన కృషితో పాటు, వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడిన పీలా శ్రీనివాసరావుకు పార్టీ అధిష్ఠానం మరోసారి అవకాశం కల్పించింది. మరోవైపు చిత్తూరు  కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా కైవసం చేసుకుంది. ఎన్నిక ప్రక్రియ చివరి నిమిషంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో, వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలకడం ఈ విజయానికి కారణమైంది. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కుప్పంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఓటింగ్ ప్రక్రియకు ముందు వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ శిబిరానికి చేరుకోవడం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. దీంతో టీడీపీ బలం ఒక్కసారిగా పెరిగింది. మొత్తం 14 మంది టీడీపీ కౌన్సిలర్ల మద్దతుకు, ఎమ్మెల్సీ ఓటు కూడా తోడవడంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా 15 ఓట్లు నమోదయ్యాయి. 5వ వార్డు కౌన్సిలర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న వన్నియకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజును కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు అధికారులు ప్రకటించారు. వైసీపీ నుంచి కేవలం 8 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. గుంటూరు నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా కూటమి అభ్యర్థి, టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర (నాని) ఎన్నికయ్యారు. గత మేయర్, వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు కొత్త మేయర్ ఎన్నికను అధికారులు నిర్వహించారు. ఈ ఎన్నికలో కూటమి తరఫున కోవెలమూడి రవీంద్ర విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు.నిన్నటి వరకు ఈ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని అందరూ భావించారు. అయితే, ఈ ఉదయం అనూహ్యంగా వైసీపీ తరఫున 30వ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ నెలకొంది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. కూటమి తరఫున కోవెలమూడి రవీంద్ర, వైసీపీ పక్షాన అచ్చాల వెంకటరెడ్డి మేయర్ పదవికి పోటీ పడ్డారు.వాస్తవానికి గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లతో సంపూర్ణ ఆధిక్యం ఉండేది.టీడీనపీకి 9, జనసేనకు ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. సుమారు 19 మంది వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామంతో కార్పొరేషన్‌లో వైసీపీ బలం తగ్గగా, మేయర్‌‌ను టీడీపీ కైవసం చేసుకుంది.

జగన్ టీం.. కేరాఫ్ బెజవాడ జిల్లా జైలు.. పరమర్శకు జగన్ వెళ్లేదెప్పుడు?

మాజీ ముఖ్యమంత్రి జగన్ టీం మొత్తం ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కపెడుతోందా? అంటే అందరూ కాకపోయినా చాలా మంది పరిస్థితి అలాగే ఉందని సమాధానం వస్తుంది. ఇప్పటి జగన్ అక్రమాలలోనూ, అవినీతిలోనూ, దౌర్జన్యాలలోనూ భాగస్వాములైన వంశీ, రాజ్ కసిరెడ్డి, ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, సజ్జల శ్రీధర్ రెడ్డిలు వేరువేరు కేసులలో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే గత 75 రోజులుగా బెజవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆయన బెయిలు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.  ఇక మద్యం కుంభకోణంలో కర్త, క్రియ, కర్మగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి సైతం అరెస్టై ఇదే విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఆయనపై ఇసుక మాఫీయా ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు త్వరలో ఈ కేసులో కూడా ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయంటున్నారు. అంటే ఆయనకు కూడా ఇప్పటిలో బెయిలు వచ్చే అవకాశాలు మృగ్యమే. ఇక మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించి కోర్టులో ప్రవేశ పెట్టగా ఆయనను కూడా కోర్టు విజయవాడ జిల్లా జైలుకు రిమాండ్ చేసింది. అదే విధంగా ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కూడా అక్కడే ఊచలు లెక్కపెడుతున్నారు. వీరందరూ ఒకే బ్యారక్ లో వేరువేరు సెల్స్ లో ఉన్నారు. ఎప్పుడో వల్లభనేని వంశీ అరెస్టైన సమయంలో జగన్ విజయవాడ జిల్లా జైలుకు వచ్చి ఆయనతో ములాఖత్ అయ్యారు. పరామర్శించారు. ధైర్యం చెప్పారు. అయితే ఆ తరువాత అరెస్టైన రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులును జగన్ ఇంకా పరామర్శించలేదు. ఆయన జైలు పరామర్శ యాత్రలకు విరామం ప్రకటించినట్లుగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.  దర్యాప్తు సంస్థల వేగం దూకుడూ చూస్తుంటే ముందు ముందు మరింత మంది జగన్ బ్యాచ్ నేతలు అరెస్టయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అదే జరిగితే విజయవాడ జిల్లా జైలుకు మరింత మంది వీఐపీలు రిమాండ్ ఖైదీలుగా వచ్చే అవకాశం ఉంది. వారంతా కూడా జైలుకు వచ్చిన తరువాత తీరిగ్గా అందరినీ ఒకే సారి పరామర్శించేయవచ్చన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లున్నారంటూ నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు.  

అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానం.. జగన్ కింకర్తవ్యం?

అమరావతి పనుల పున: ప్రారంభానికి మే2న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సారి అమరావతి పనులకు ఎలాంటి విఘాతం కలగకుండా, అత్యంత వేగంగా పూర్తి చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు  41 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లు   ఖరార య్యాయి.  అలాగే  రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.4,700 కోట్ల అంచనా వ్యయంతో ఐదు టవర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్టేట్ సెక్రటేరియట్‌ను నిర్మాణానికి టెండర్లు పిలిచింది. అమరావతి పూర్తికి మూడు సంవత్సరాల గడువును నిర్ణయించి.. ఆ దిశగా వేగంగా ముందుకు కదులుతున్నారు.   ఇక అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  2015లో కూడా అమరావతి ప్రారంభోత్సవానికి జగన్‌ను  ఆహ్వానించారు, కానీ అప్పుడు ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.  ఆ తరువాత 2019లో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ మూడు రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు.  అయితే 2024 ఎన్నికలలో  జనం జగన్ ను అధికారం నుంచి దించేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికే ఓటుశారు.   ఇప్పుడు చంద్రబాబు నిర్దిష్ట కాలవ్యవధిలో అమరావతిని పూర్తి చేయాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. అదలా ఉంచితే.. ఇప్పుడు ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి జగన్ హాజరౌతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు సరైన కారణం చూపకుండా జగన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరు అవ్వడం అంటే ప్రజాభిష్ఠాన్ని ఖాతరు చేయకపోవడమే అవుతుంది. జగన్ మూడు రాజధానుల విధానాన్ని జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారన్నది గత ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. ఇక అంటే జనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని తేల్చేశారు. ఈ దశలో అందుకు పడుతున్న కీలక ముందడుగు అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి జగన్ తన అహంకారంతో గైర్హాజరైతే.. జనానికి మరింత దూరమౌతారు. ఆయన ఎటూ రారని ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపకుంటే.. అదే వేరే విషయం కానీ, ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినా కూడా గైర్హాజరు కావడాన్ని జగన్ ఎలా సమర్థించు కుంటా రన్నది ఆయనకే తెలియాలి. కానీ, సమస్య ఏమిటంటే జగన్  జనం ఇవ్వని ప్రతిపక్ష హోదా డిమాండ్ తో అసెంబ్లీనే బాయ్ కాట్ చేశారు. అలాగే ఇప్పుడు అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికీ డుమ్మా కొట్టే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

డబ్బులు వాళ్లకి.. జబ్బులు జనాలకి

ప్రజలను పీల్చి పిప్పి చేసిన జే బ్రాండ్  లిక్కర్ పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఊరుపేరు లేని బ్రాండ్లు ధనదాహంతో విషం అమ్మి సొమ్ము చేసుకున్ననాటి పాలకులు  బయట పడుతున్న నిజాలు- ఉలికి పడుతున్న నేతలు ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4 గా నమోదు అయిన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇటీవల సీఐడీ అధికారులు విచారించారు. తర్వలో మరోసారి విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చారు. మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామిని కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు. అయన జగన్ ప్రభుత్వలో ఐదు సంవత్సరాల పాటు ఎక్సెజ్ శాఖను నిర్వహించారు. వారితో పాటు గాలివీడు కు చెందిన ఎక్సెజ్ ఉన్నతాధికారి అయిన సత్య ప్రసాద్ కూడా  లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అల్టిమేట్ టార్గెట్ జగనే అవుతారన్న భయం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం విక్రయాలు పేదల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. మద్యం కారణంగా లివర్, కిడ్నీ, మెదడు సంబంధిత న్యూరో వ్యాధులతో ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారి సంఖ్య ఆ అయిదేళ్లలో ఏటా పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు ద్వారా ఆసుపత్రుల్లో ఇన్‌పేషంట్లుగా చేరి ఉచిత చికిత్స పొందినవారి గణాంకాలు.. నాసిరకం మద్యం తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. వీరు కాకుండా సొంత ఖర్చులతో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన, పొందుతున్నవారు భారీ సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలోని పది రకాల వ్యాధుల అధ్యయన వివరాలను ఇటీవల వెల్లడించిన సీఎం చంద్రబాబు.. అందుకు దారి తీసిన పరిస్థితులను పరిశీలించి నియంత్రణ చర్యలను చేపట్టాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. మద్యం ప్రభావిత వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్లలో మద్యం ప్రభావిత జబ్బులతో చికిత్స పొందినవారి వివరాలను ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు సేకరించింది. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం తాగినవారి ఆరోగ్యాలు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించింది.  28 రోగాలకు మద్యం కారణమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఆక్స్‌ఫర్డ్‌ పాపులేషన్‌ హెల్త్, పెకింగ్‌ విశ్వవిద్యాలయం కూడా సుదీర్ఘకాలంపాటు ఐదు లక్షల మంది మద్యం బాధితుల ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసింది. 61 రోగాలకు ప్రత్యక్షంగా, 206 జబ్బులకు పరోక్షంగా మద్యమే కారణమవుతోందని ఈ సంస్థలు వెల్లడించాయి. నాసిరకం మద్యం ప్రభావం మరింత ఎక్కువే ఉంటుంది.  వైసీపీ పాలనలో ఓ మాదిరి తాగే అలవాటున్న వారికీ నాలుగేళ్లలోనే కాలేయం చెడిపోయిన సంఘటనలు నమోదయ్యాయి. బాధితుల్లో అత్యధికులు బడుగు, బలహీనవర్గాలవారే. నెలల వ్యవధిలోనే వారి ఆరోగ్యం క్షీణించింది. వీరి వయసు 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉందని లెక్కలు చెప్పుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల 2020-21లో మద్యం దుష్పలితాల ప్రభావం కాస్త తగ్గింది. మద్యం విక్రయాలు తగ్గడమే దీనికి కారణమన్న విశ్లేషణలున్నాయి.  వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన లిక్కర్‌ స్కాం లాంటిది దేశంలో మరెక్కడా జరగలేదంటున్నారు. వైసీపీ నాయకులు తయారు చేయించిన నాసిరకం కల్తీ మద్యంతో లక్షలాదిమంది అనారోగ్యం పాలయ్యారు. వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయా జిల్లాల్లో విక్రయించిన బ్రాండ్లను బట్టి వాటి ప్రభావం బాధితులపై పడింది. కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలు లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తుల్లో తొలి 5 స్థానాల్లో నిలిచాయి.  నెల్లూరు, కర్నూలు, తిరుపతి, నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో మెదడు సంబంధిత న్యూరో కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా కిడ్నీ కేసులు నమోదయ్యాయి. 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు ద్వారా ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కిడ్నీ బాధితుల సంఖ్య 49 వేలుగా ఉంటే 2019-24 మధ్య కాలంలో వారి సంఖ్య 91 వేలకు చేరడం గమనార్హం. ఈ గణాంకాలు చూసి విస్తుపోయిన సీఎం  చంద్రబాబు బాధితులను ఆదుకోవడానికి వైద్య విభాగాలను అలర్ట్ చేయాల్సి వస్తోందిప్పుడు.

రేవంత్ పేరెత్తకుండానే కేసీఆర్ ప్రసంగం.. వ్యూహాత్మకమేనా?

తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన  ఎన్నికలలో  పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత  బీఆర్ఎస్ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ సభ ఏదైనా ఉందంటే... అది ఆదివారం వరంగల్ వేదికగా జరిగిన రజతోత్సవ సభ మాత్రమే. బీఆర్ఎస్ ఆవిర్భవించి పాతికేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ పార్టీ జరుపుకున్న రజతోత్సవ సభకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. పార్టీ పరాజయం తరువాత కేసీఆర్ పాల్గొన్న భారీ బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం. అంతకు ముందు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నా.. వాటికి ఇంతటి హైపూ లేదూ, జనమూ పట్టించుకోలేదు. కానీ బీఆర్ఎస్ (టీఅర్ఎస్) అవిర్భవించి పాతికేళ్లు పూర్తి అయిన  సందర్భంగా జరిగిన ఈ బహిరంగ సభలో కేసీఆర్ దాదాపు గంట సేపు ప్రసంగించారు.  ఈ ప్రసంగం మొత్తం వ్యూహాత్మకంగా సాగింది.   అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో కేసీఆర్ ఇంత సుదీర్ఘ ప్రసంగం చేసిన సందర్భం లేదు. సార్వత్రిక ఎన్నికల ప్రచార సభలలో ఒకటి రెండు సార్లు ప్రసంగించినా ఆ ప్రసంగాలన్నీ చప్పగా సాగాయి. క్లుప్తంగా ప్రసంగాన్ని ముగించేశారు.   అన్నిటి కంటే చెప్పుకోవలసిన విషయమేంటంటే గంట సేపు ప్రసంగంలో కేసీఆర్ ఒక్కటంటే ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావంచలేదు. అయితే ప్రసంగం మొత్తం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విధ్వంసకరంగా ఉందని విమర్శలు గుప్పించారు.  రేవంత్ సర్కార్ టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగం సాగినా రేవంత్ పేరు మాత్రం ఆయన నోటి వెంట రాలేదు. గతంలో కూడా రేవంత్ పేరు ప్రస్తావించడానికి కానీ, ఆయనను అసెంబ్లీలో చూడడానికి కానీ కేసీఆర్ ఇష్టపడలేదన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.   ఇప్పుడు కూడా ఆయన తన నోటి వెంట రేవంత్ పేరు ఉచ్ఛరించలేదు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరు కావడానికి కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటమే కారణమని కూడా పార్టీ వర్గాలు చెబుతుంటాయి. రేవంత్ నుఅందుకే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారని అంటారు.  ఇప్పుడు ఆయన తాజా ప్రసంగంలో కూడా వ్యూహాత్మకంగా రేవంత్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన పాలనను తూర్పారపట్టారు.   

మే 1 నుంచి 15 వరకూ తిరుమలలో బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు.. సిఫారసు లేఖలకు నో

వేసవి సెలవులు కావడం, ఇంటర్ టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా వారాంతాలలో అయితే తిరుమల కొండపై ఇసుక వేస్తే రాలనంతగా భక్త జనసందోహం ఉంటోంది. ఎలా చూసినా సగటున రోజుకు 80 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో  తిరుమల తిరుపతి దేవస్థానం.. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకూడదు, వారికి స్వామి వారి దర్శనం త్వరితగతిన చేయించాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1 నుంచి 15వ తేదీ వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించింది.   నేరుగా వచ్చే ప్రోటోకాల్  వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించింది.  ఎమ్మెల్యే, ఎంపీ ఇతర అధికార, ప్రముఖుల సిఫారసు లేఖలతో వచ్చేవారికి బ్రేక్ దర్శనాలకు కల్పించరాదని నిర్ణయించింది. అంటే ఎటువంటి సిఫారసు లేఖలను పరిగణనలోనికి తీసుకోదన్న మాట. అయితే  శ్రీవాణి, డోనర్స్ దర్శనాలు యథావిధిగా అమలు అవుతాయి.   గత ప్రభుత్వ హయాంలో తిరమలకు వచ్చే వీఐపీలకు అనువుగా బ్రేక్ దర్శనాలను మార్పు చేశారు. అప్పటి వరకు ఉన్న ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాల స్థానంలో  ప్రోటోకాల్, రెఫెరల్, జనరల్ గా మార్పు చేశారు. అదే విధంగా దర్శన సమయాన్ని కూడా మార్పు చేశారు.  వైసీపీ హయాంలో వేకువ జామున 5 గంటల నుంచి ఉన్న దర్శన సమయాన్ని ఉదయం 7.30 గంటలకు జనరల్ దర్శనం 10 గంటల కు ప్రోటోకాల్.. శ్రీవాణి... రెఫరల్, డోనార్స్, ఎంప్లాయిస్ ను అనుమతిస్తారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే బ్రేక్ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. దీంతో సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనానికి తీవ్ర ఆలస్యం జరిగేది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొలువుదీరిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆ దర్శన వేళల్లో మార్పు చేసింది.  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తొలి బోర్డు సమావేశంలో నే దర్శన సమయాన్ని మార్పు చేస్తామని ప్రకటన చేశారు. మే నెల 1 నుంచి 15 వరకు రద్దీ పెరుగుతున్న తరుణంలో ప్రయోగాత్మకంగా దర్శన సమయాన్ని మార్పు చేయనుంది. మే 15 వరకు ఉదయం 6 గంటలకు ప్రోటోకాల్ దర్శనం అమలు చేయనున్నారు. దీని పై భక్తుల అభిప్రాయాలు సేకరించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

ఫైనాన్స్ కమిషన్ ఛైర్మెన్ గా స్మితా సభర్వాల్

   తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక సెక్రటరీ స్మితా సభర్వాల్‌ను ఫైనాన్స్ క‌మిష‌న్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీగా స్మితా స‌బ‌ర్వాల్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా శశాంక్ గోయెల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్. వెంకట్ రావు, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్, ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా శశాంక, జెన్‌కో సీఎండీగా హరీష్, హెల్త్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, పరిశ్రమలు, పెట్టుబడుల సీఈవోగా జయేశ్ రంజన్, హెచ్‌ఎండీఏ సెక్రటరీగా ఇలంబర్తిలను నియమించారు. కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో మార్ఫింగ్ చేసిన ఫొటోను రీ ట్వీట్ చేసిన స్మితా స‌బర్వాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

రాసిపెట్టుకోండి మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే..కేసీఆర్ దీమా

  హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్‌ రజతోత్సవ సభ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి మృతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కన్నతల్లి, జన్మభూమిని మించిన స్వర్గం లేదని అన్నారు. వరంగల్ మామూలు నేల కాదు.. ఎంతోమంది వీరుల్ని కన్న గడ్డ అని చెప్పారు. ఇవాళ ఈ గడ్డ మీద బీఆర్ఎస్ సభ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున గులాబీ జెండా ఎగిరిందని గుర్తుచేశారు. ఆ నాడు గులాబీ జెండాను ఎంతోమంది అవమానించారని చెప్పారు. కానీ ఎనాడూ నిరాశ చెందలేదని.. నిర్విరామంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామని అన్నారు.  వ‌ల‌స‌వాదుల విష‌కౌగిలిలో న‌లిగిపోతున్న‌టువంటి తెలంగాణను ఎట్టి ప‌రిస్థితుల్లో విముక్తి చేయాల‌ని స్వ‌రాష్ట్రం సాధించాల‌ని, జ‌న‌నీని, జ‌న్మ‌భూమిని మించింది లేద‌ని చెప్పి నేను ఒక్క‌డిగా బ‌య‌ల్దేరి తెలంగాణ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టాను. 25 ఏండ్ల క్రితం ఎగిరిన జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది అవ‌మాన‌ప‌రిచారు.  ఎన్నో మాట‌లు అన్నారు. ఎగ‌తాళి, అవ‌హేళ‌న చేశారు. మఖ‌లో పుట్టింది పుబ్బ‌లో పోత‌ద‌ని అన్నారు. కానీ అనేక మంది త్యాగాల‌తోని, వంద‌లాది మంది బ‌లిదానాల‌తోని, అనేక ఉద్య‌మాల‌తోని యావ‌త్ తెలంగాణ అద్భుత‌మైన ఉద్య‌మమై ఎగిసిప‌డింది. ఒక స‌మ‌యంలో తెలంగాణ యావ‌త్ ఒక ప‌క్క‌న నిల్చుని బ‌రిగీసి నా తెలంగాణ అక్క‌డ పెట్టు అని నిల‌బ‌డ్డ‌ సంద‌ర్భం సృష్టించాం. తెలంగాణ‌ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు.రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడుగలేదని.. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని అన్నారు.కేసీఆర్ రైతు బంధు కింద ఏం ఇస్తుండు.. ప‌దివేలు ఇస్తుండు.. మేం 15 వేలు ఇస్తామ‌ని చెప్పిండ్రు. పెన్ష‌న్లు 2 వేలు ఇస్తుండు మేం 4 వేలు ఇస్తామ‌ని చెప్పిండ్రు. ఇద్ద‌రు ఉంటే ఒక్క‌రికే ఇస్తుండు.. మేం ముస‌లిది ముస‌లోడికి ఇద్ద‌రం ఇస్త‌మ‌ని చెప్పిండ్రు.. ఇవ‌న్నీ కాంగ్రెసోళ్లు చెప్పిండ్రు క‌దా.. దివ్యాంగుల‌కు కేసీఆర్ 4 వేలు ఇస్తుండు మేం 6 వేలు ఇస్త‌మండ్రు. ఆడ‌పిల్ల‌ల‌కు స్కూటీలు కొనిస్తామ‌న్నారు.  విద్యార్థుల‌కు విద్యాకార్డు కింద‌ ఐదు ల‌క్ష్య‌ల గ్యారెంటీ కార్డు ఇస్తామ‌ని ఎన్నో మాట‌లు చెప్పిండ్రు. ఇక ఒక‌రి వెనుక ఒక‌రు ఉరిచి.. 2 ల‌క్ష‌ల లోన్ తెచ్చుకోండి డిసెంబ‌ర్ 9న ఒక క‌లంపోటుతో ఖ‌తం చేస్తా అని అన్నారు. చేసిండ్రా అంటే చేయ‌లేదు అని కేసీఆర్ విమ‌ర్శించారు.ఏప్రిల్ 27, 2001న జ‌ల‌దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చ‌రిత్ర‌ను మలుపుతిప్పిన మ‌హోజ్వ‌ల‌ ఘ‌ట్టం. కులం, మ‌తం, ప‌ద‌వుల కోసం పుట్ట‌లేదు.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. ప‌ద‌వీ త్యాగాల‌తోనే మ‌న తెలంగాణ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. అది ఫ‌లించి సొంత రాష్ట్ర క‌ల కూడా నెర‌వేరింది. చీక‌ట్ల‌ను పార‌దోల‌డానిక ప్ర‌జ‌ల్లో ఆత్మ‌విశ్వాసం పెంపొందించ‌డానికి ఒక మాట చెప్పాను. ఉద్య‌మం నుంచి వెన‌క్కి మ‌ళ్లితే, ఉద్య‌మ జెండాను దించితే రాళ్ల‌తో కొట్టి చంపాండ‌ని అని చెప్పి ఉద్య‌మాన్ని ప్రారంభించాను.  ఆ త‌న‌ద‌నంత‌రం జ‌రిగిన పంచాయతీ ఎన్నిక‌ల్లో, సిద్ధిపేట ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప్రాణం పోసి ఊపిరిలూదితే అద్భుతంగా ఉద్య‌మం పురోగ‌మించిందన్నారు.హెచ్‌సీయూ భూములు అమ్ముకుంటున్నారు. అసలు ఏ భూములు అమ్ముకోవాలి. ఏ భూములు అమ్మకూడదో విచక్షణ ఉండాలని సూచించారు. వందకు వందశాతం మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అవసరమైతే డైరీల్లో రాసుకోండి అని సూచించారు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని.. నేను కూడా రేపటినుంచి బయల్దేరుతా ఒక్కొక్కరి సంగతి చూస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ

    సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో వారు భేటీ అయ్యారు.  మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్,  జంపన్న,  రవిచందర్ లు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులపై కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ను వారు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు వినతి పత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ  నేతలు.  ఈ సందర్బంగా సీఎం రేవంత్ వారితో మాట్లాడుతూ.. ‘నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించదు. గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం మాజీ మంత్రి జానారెడ్డికి ఉంది. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటాం. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్‌ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.

తెలంగాణ నూతన సీఎస్‌గా కె.రామకృష్ణారావు నియామకం

  తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ శాంతి కుమారి ఈ నెల 30 పదవీవిరమణ చేయనున్నారు. 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రామకృష్ణారావు తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన రిటైర్ కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్‌ల్లో శశాంక్ గోయల్  తరువాత రామకృష్ణారావు సీనియర్‌గా ఉన్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో తనకున్న అనుభవం తోడ్పడుతుందన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనను నియమించారు. రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్‌,  గుంటూరు కలెక్టర్‌ గా  కూడా విధులు నిర్వహించారు.  

ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

  ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, పర్యటన రోడ్ మ్యాప్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌ఫోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.  ఈ సమావేశంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధాని పర్యటనను సక్సెస్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 5లక్షల మందితో భారీ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు.   

ఈడీకి లేఖ రాసిన మహేష్ బాబు ఎందుకంటే?

  మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులకు బదులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాశారు.  రేపు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల.. విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు సూపర్ స్టార్ బదులిచ్చారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇందులో కొంత మొత్తం చెక్కుల రూపంలో, మరికొంత నగదు రూపంలో అందుకున్నారు. ఈ తీసుకున్న డబ్బులకు సంబంధించిన లెక్కలు వివరించాల్సిందిగా ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ శివారులో ‘సాయి సూర్య డెవలపర్స్’ పేరుతో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.సంస్థ యాజమాన్యంలో ఉన్న సతీష్ గుప్త ప్రజలను మోసం చేసినట్టు నిర్ధారణ కావడంతో సైబరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.అనంతరం ఈ కేసును ఈడీకి బదిలీ చేశారు. సాయి సూర్య డెవలపర్స్‌తో పాటు సూరానా ఇండస్ట్రీస్ సంస్థ కూడా మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.