జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ప్రక్రియ రెండు వారాల్లో ముగింపు?
జి.హెచ్.ఎం.సి. ఎన్నికల నిర్వహణ చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా 45 రోజులలో పూర్తయ్యే ఎన్నికల ప్రక్రియను కేవలం 15 రోజులలోనే పూర్తి చేసేవిధంగా చట్ట సవరణలు చేసింది. దాని ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన నాటి నుండి కేవలం 15 రోజులలోనే ఎన్నికల ప్రక్రియ ముగించవలసి ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన మూడురోజులలోగా అభ్యర్ధులు నామినేషన్లు వేయడం నాల్గవ రోజున వాటి పరిశీలన, ఆ మరునాడు ఒక్కరోజే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలు పూర్తిచేయవలసి ఉంటుంది.
నేడో రేపో జి.హెచ్.ఎం.సి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని వార్తలు వస్తున్న నేపద్యంలో ఒకవేళ ఇవ్వాళ్ళ అది వెలువడినట్లయితే, ఈ నెల 10వ తేదీలోగా ఈ ప్రక్రియ ముగించవలసి ఉంటుంది. జనవరి 15లోగా ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. అదే కనుక జరిగితే హైదరాబాద్ పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు ఎవరూ ఈ ఎన్నికలలో పాల్గొనేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే వారిలో చాలా మంది ఆ సమయంలో సంక్రాంతి పండుగకి తమతమ స్వస్థలాలు వెళ్లి ఉంటారు.
అందుకే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను ఈనెల 28వ తేదీన నిర్వహించాలనుకొంటున్నట్లు తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లు కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చేయి. ఆంధ్రా ఓటర్ల ఓట్లతోనే తమ పార్టీ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలుస్తుందని మంత్రి కె.టి.ఆర్. చెపుతున్నారు. ఒకవేళ అదే నిజమనుకొంటే ఎన్నికలకు నోటిఫికేషన్ సంక్రాంతి పండుగ తరువాతనే ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే ఆంధ్రా ఓటర్లు ఈ ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణా ప్రభుత్వం ఇంత ఆకస్మికంగా ఎన్నికల నిర్వహణ చట్టానికి సవరణలు చేయడం వలన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఎన్నికలకి తెరాస దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని సిద్దంగా ఉంది. కానీ తెదేపా, బీజేపీ, మజ్లీస్, కాంగ్రెస్ తదితర పార్టీలు ఇంకా దీనిపై కసరత్తు చేస్తున్నాయి. ఒకవేళ నేడోరేపో నోటిఫికేషన్ విడుదలయినట్లయితే అవి తమ అభ్యర్ధుల పేర్లను హడావుడిగా ఖరారు చేసుకోవలసి రావచ్చును. అదే జరిగితే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాసదే పైచెయ్యి అవుతుంది.