ఇక ఆమె కుటుంబ పెద్ద

పురుషాధిక్య సమాజపు సంకెళ్లను భారతీయ మహిళ ఒకటొకటిగా తెంచుకుంటోంది. హిందూ అవిభక్త కుటుంబం (హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ-హెచ్ యు ఎఫ్)లో కర్తగా ఆ కుటుంబంలో పెద్దవాడైన పురుషుడే ఉండటం తరతరాల ఆనవాయితీ. అయితే, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పు ఈ భావనను తునాతునకలు చేసింది. ఈ ఆనవాయితీకి ఎలాంటి చట్టబద్ధత లేదని, ఇది చెల్లదని జస్టిస్ కుటుంబంలో అందరి కంటే పెద్దదైన మహిళ కూడా కుటుంబ పెద్ద  లేదా కర్త కావచ్చని  చెప్పింది. కుటుంబంలోని పెద్దామె ఆ ఇంటి యాజమాన్యం చేపట్టి, అవిభక్త ఆస్తులను తనే నిర్వహించవచ్చు. కుటుంబ వ్యవహారాలను నడిపించే హక్కు ఆమెకు ఉంటుంది. హిందూ ధర్మాల ప్రకారం, కుటుంబంలో ముందు పుట్టిన పురుషుడికి కుటుంబ పెద్ద హోదా దక్కుతుంది. దీనిపై ఇటీవలి కాలంలో రకరకాల వివాదాలు ఉత్పన్నమవుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక మహిళ ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ కుటుంబంలోని పెద్ద కుమారుడి కూతురైన ఆమె తన తండ్రి తదనంతరం తన బాబాయి పెద్ద కుమారుడు తనను తాను కర్తగా ప్రకటించుకోడం చెల్లదని వాదించింది. ఈ వాదనను అంగీకరించిన జస్టిస్ నజ్మి వజీరీ కర్తగా కుటుబంలో కెల్లా వయసులో పెద్దదైన మహిళ కర్తగా కావడానికి న్యాయ ప్రకారం అర్హురాలే అని పేర్కొన్నారు. హిందూ పురుషులకు, స్త్రీలకు చట్టం సమాన వారసత్వ హక్కులు ఇచ్చిందని, హిందూ మహిళల సమాన హక్కులను గుర్తించడం చట్టం ధ్యేయమని న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఫలితంగా కుటుంబ పెద్దగా వ్యవహరించే అధికారం స్త్రీకి లభించింది.

మంచుమనిషి దొరికినట్లేనా!

హిమాలయాల్లో మనిషిని పోలిన ఆకారంతో ఎతి అనే భారీ జీవి సంచరిస్తోందన్నది వందల ఏళ్లుగా వస్తున్న నమ్మకం. అయితే ఇంతవరకూ దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలూ కనిపించనేలేదు. ఏదన్నా ఒక ఆధారం కనిపించినా కూడా అది హేతువాదుల అనుమానాల ముందర వీగిపోయేది. కానీ ఇప్పడు తాను ఎతి సంచారానికి సంబంధించిన ఒక బలమైన సాక్ష్యాన్ని సంపాదించానంటున్నారు ‘స్టీవ్‌ బెర్రీ’ అనే బ్రిటిష్ యాత్రికుడు. స్టీవ్‌ బెర్రీకి పర్వతాలను ఎక్కడం అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే స్టీవ్‌, భూటాన్‌లో ఉన్న గంగ్‌ఖర్‌ అనే పర్వతాన్ని ఎక్కుతుండగా అతనికి ఎతికి సంబంధించిన పాదముద్రలు కనిపించాయట. హిమాలయ పర్వతశ్రేణిలో భాగమైన ఈ గంగ్‌ఖర్‌ పర్వత శిఖరాన్ని ఇంతవరకూ మనుషులెవ్వరూ చేరుకోలేదు. అలాంటి పర్వతం మీద వాలుగా ఉన్న ఒక చోట వరుసగా కనిపించే పాదముద్రలు మనిషివి అవడానికి వీల్లేదు అంటున్నారు స్టీవ్‌. ఎందుకంటే నరమానవుడెవ్వరూ ఇంతవరకూ ఆ ప్రదేశాన్ని చేరుకోలేదుట. ఇక ఆ పాదముద్రలు చూస్తేనేమో ఏదో నాలుగుకాళ్ల జంతువుదిలాగా తోచడం లేదు. ఇక అంత వాలుగా ఉండే చోట మరో జంతువు ఏదీ రెండు కాళ్ల మీద నడవడం అసాధ్యం అంటున్నాడు ఈ పర్వతారోహకుడు. వెరసి ఈ ముద్రలు ఎతి అనే మంచుమనిషివే అని జనాల్ని కూడా నమ్మమంటున్నాడు. అయితే కేవలం పాదముద్రల ఫొటోని చూపించి ఎతిని నిరూపించడం ఏమంత సులభం కాదు. మంచు కొండల మీద చిన్నపాటి ముద్రలు సైతం నిరంతరం కురిసే మంచు వల్ల చిత్రవిచిత్రమైన ఆకారాలని సంతరించుకుంటాయి. పైగా స్టీవ్‌ మాటని జనాలు సందేహించేందుకు ఓ ముఖ్య కారణం కూడా ఉంది. స్టీవ్‌ బెర్రీ ‘మౌంటెన్‌ కింగ్‌డమ్స్‌’ అనే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ సంస్థ యాత్రికులు హిమాలయాలలోకి తీసుకువెళ్తూ ఉంటుంది! ఈ మాట విన్నాక స్టీవ్‌ చెబుతున్న విషయం మీద జనాలకి మరిన్ని అనుమానాలు మొదలైపోయాయి. ఇంతకీ మరి ఆ అడుగులు ఎవరివో!

జైట్లీ గైట్లీ నై జాంతే.. నా మాటే ఫైనల్ !

కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయరాదన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం పెద్దగా ఆశ్యర్యం కలిగించడం లేదు. స్టాక్ మార్కెట్ కూడా అంతగా ప్రభావితం కాలేదు. తక్షణ స్పందనగా సూచీలు అతి స్వల్పంగా క్షీణించాయి. ఈ నెల 29న కేంద్ర బడ్జెట్ ఉన్నందున,  రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్  నిర్ణయించుకుని ఉండవచ్చు. మంగళవారం నాటి నిర్ణయం వల్ల  రుణాల, డిపాజిట్ల వడ్డీరేట్లలోనూ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.  రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు అన్నా తగ్గుతుందని ఆశావహులు అంచనా వేశారు.( 100 బేసిస్ పాయింట్లు ఒక పర్సంటేజ్ పాయింటుకు సమానం). రెపో రేటు 6.75 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు రఘురామ్ రాజన్ చెప్పారు. రెపో రేటు అంటే...  బ్యాంకులు ఆర్బీఐ నుంచి నిధులు అప్పుగా తీసుకుంటే వాటి మీద చెల్లించాల్సిన వడ్డీరేటు. రెపో రేటు తక్కవగా ఉంటే బ్యాంకులు ఆర్బీఐ నుంచి చౌకగా నిధులు సమకూర్చుకుని తమ కస్టమర్లకు తక్కువ వడ్డీకి పారిశ్రామిక రుణాలు, హౌస్ లోన్లు, ఇతరత్రా రుణాలు ఇవ్వగలవు. క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను కూడా 4 శాతం వద్ద స్థిరంగా ఉంచాలని పరపతి విధాన ద్వైమాసిక సమీక్షలో ఆర్బీఐ నిర్ణయించింది. బ్యాంకులు తాము డిపాజిటర్ల నుంచి సమీకరించే నిధుల్లో కొంత శాతాన్ని రిజర్వు బ్యాంకు వద్ద నగదు రూపంలో జమ చేసితీరాలి. వీటి మీద ఆర్బీఐ బ్యాంకులకు కొంత వడ్డీ చెల్లిస్తుంది. ఇది కూడా ఎకానమీలో నిధుల లభ్యతను నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ చేతిలో ఒక ప్రధాన సాధనం. 2015 క్యాలెండర్ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 125 బేసిస్ పాయింట్లు తగ్గించి వ్యవస్థలో లిక్విడిటీ పెంచడానికి ప్రయత్నించింది. టోకు ధరల సూచీ వరుసగా 14 నెలల నుంచి నెగెటివ్ జోన్లో ఉంటోంది. డిసెంబర్లో కూడా టోకు దరల సూచీ 0.73 శాతం క్షీణించింది. అయితే, ఈ క్షీణత ఏడాదిలో కెల్లా అతి తక్కువ. ఆహార పదార్థాల ధరలు పెరగటం వల్ల క్షీణత శాతం తగ్గింది. ఆహార ధరల ఉప సూచీ నవంబర్లో 5.2 శాతం పెరగ్గా,  డిసెంబర్లో అమాంతం 8.17 శాతం హెచ్చింది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులు తిరిగి తలెత్తుతున్నాయనడానికి ఇదొక సంకేతంగా భావించడం కూడా రఘురామ్ రాజన్ రేట్లలో మార్పు చేయకపోవడానికి మరొక కారణం. అయితే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్ట్రియల్ ప్రొడక్షన్)  క్రమంగా తగ్గిపోతోంది. గడచిన నవంబర్లో 3.2 శాతం క్షీణించింది. వ్యవస్థలో లిక్విడిటీ.. నిధుల లభ్యత.. తగినంతగా మెరుగుపడక పోవడం వల్లే తయారీ, మౌలిక సదుపాయాల రంగాలు కుంటినడక నడుస్తున్నాయి. ప్రస్తుతం జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి) రేటు బాగానే ఉన్నప్పటికీ,  ఈ పరిస్థితిని విస్మరిస్తే ఎకానమీ తిరిగి మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందని పరిశ్రామిక రంగం భయపడుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా కీలక రేట్లను అంటే రెపో సీఆర్ఆర్ రేట్లను తగ్గించవలసిందిగా సంకేతప్రాయంగా చెప్పారు. ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్బీఐ అనుకున్న స్థాయిలోనే ద్రవ్యోల్బణం కొనసాగుతున్నందున వడ్డీరేట్లు తగ్గేందుకు రిజర్వు బ్యాంకు మరిన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తాననుకున్నదే చేస్తారు. ఆయన తనదైన శైలిలోనే వ్యవహరించారు. కీలక రేట్లను తగ్గించలేదు.

మేనకమ్మ కడుపు చల్లగా...

  కడుపులో బిడ్డను కడుపులేనే కడతేర్చే దుష్టసంస్కృతికి నూకలు చెల్లిపోతున్నాయి. గర్భస్థ స్థాయి నుంచే ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదెలా సాధ్యం అని ఆశ్యర్యపోకండి. దీనికోసం ముందుగా లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం తొలగిస్తారు. పుట్టే బిడ్డ ఆడా మగా అనేది ముందే తెలుసుకుంటారు. అలా పుట్టబోయే ఆడ శిశుల వివరాలు నమోదు చేస్తారు. పుట్టబోయేది పాప అయితే, గర్భస్రావం చేయించాలనుకునే భర్త అత్తమామల ఆటలు చెల్లకుండా వారిపై నిఘా ఉంచుతారు. ప్రస్తుతం లింగనిర్ధారణ పరీక్షల మీద నిషేధం ఉన్నా అది అమలు కావడం లేదు. తల్లీబిడ్డల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు డాక్డర్లు ఎప్పటికప్పుడు స్కానింగ్ చేయించుతారు. అయితే ఈ పరీక్షలో శిశువు ఆడా మగా అనేది తెలుస్తుంది. చట్టప్రకారం దీన్ని వెల్లడించరాదనే కఠిన నిబంధనలు అమల్లో ఉన్నా, డబ్బాశకు లోబడి కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లు లింగవివరాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, ఎందరో పాపాయిలు పాపం ఈ లోకంలోకి రాకుండానే పరలోకాలకు పయనం కడుతున్నారు. గర్భస్థ పాపాయిలను కడతేర్చడం అమానుషం మాత్రమే కాదు. సామాజికంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీని దుర్వినియోగం అవుతున్న కారణంగా దేశంలో ఏటికేడాది ఆడమగ నిష్పత్తి తగ్గిపోతోంది. దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యి మందికి కేవలం 943 మందే ఆడపిల్లలు ఉంటున్నారు. హర్యానాలో అయితే  ఈ నిష్పత్తి 1000 మందికి 889 మాత్రమే ఉంది. ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాకున్నా, ఈ రేషియోను పెంచే దిశగా ప్రభుత్వం చేస్తున్న ఆలోచన హర్షణీయం. లింగనిర్ధారణపై నిషేధం ఎత్తేసి పుట్టబోయే పాపాయిలకు ఒక నేషనల్ రిజిస్టర్ నిర్వహించి వారికి రక్షణ కల్పిస్తామని కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ చేసిన ప్రకటనకు పుట్టబోయే పాపాయిలు రుణపడి ఉంటారు.

ఓటు వేసిన ప్రముఖులు

  జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లో రోడ్‌ నంబర్ 10 పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన హైదరాబాదీలంతా బయటికొచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని.. నగర అభివృద్ధిని కాంక్షించే వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జంట నగరాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు     తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  బంజారాహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. తెలుగుదేశం పార్టీకి ఓటంటే అది అభివృద్ధికి ఓటు వేసినట్లేనని అన్నారు.     గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి ఓటు హక్కువినియోగించుకున్నారు. ఖైరతాబాద్ పోలింగ్ బూత్‌లో గవర్నర్ నరసింహన్, ఆయన భార్య ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. తాను ఒక సిటిజన్‌గా ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలిపారు.     టీడీపీ యువనేత నారా లోకేశ్, ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రహ్మణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.     హీరో నాగార్జున, అమల జూబ్లిహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తనకు ఓటేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నా అని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా గెలుస్తుందని ఉందని ధీమా వ్యక్తం చేశారు.

వామ్మో స్వతంత్ర అభ్యర్థులు!

గ్రేటర్‌ ఎన్నికల బరిలో 1333మంది అబ్యర్థులు ఉంటే వీరిలో దాదాపు సగం మంది స్వతంత్ర అభ్యర్థులే! ఎన్నికలు జరుగుతున్న 150 వార్డులలో కలుపుని 640 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారో ఏమో చెప్పడం కష్టం కానీ, వీరి వల్ల ఇతర పార్టీల అభ్యర్థులకు మాత్రం తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా టికెట్లను ఆశించి భంగపడినవారే స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతారు. అలా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు బరిలో ఉండటం వల్ల అంతిమంగా ఎవరూ లాభపడని పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. టి.ఆర్‌.ఎస్‌ తరఫు నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్రయత్నించిన వారందరినీ కె.టి.ఆర్‌ స్వయంగా నయానో భయానో బుజ్జగించి పోటీ నుంచి తొలగిపోయేట్లు చూశారు. కానీ మిగతా పార్టీలు అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకపోవడంతో, ఇప్పడు ఆ అభ్యర్థులే తమ గెలుపుకు గండికొట్టే అవకాశం ఉంది. స్వతంత్రంగా బరిలోకి దిగిన అభ్యర్థులకి ఎటు చూసినా లాభమే! గెలిస్తే తిరిగి తమకి ఇష్టం వచ్చిన పార్టీ జెండాకి సలాం కొట్టవచ్చు. ఓడితే ఇతరులను కూడా ఓడించామన్న తృప్తితో మరో అవకాశం కోసం ఎదురుచూడవచ్చు. మరి ఇవాళ జరుగుతున్న ఎన్నికలలో వీరి తడాఖా ఎలా ఉంటుందో చూడాలి!

ఎన్నికల దిశగా జమ్ము కశ్మీర్?

జమ్ము కశ్మీర్ ఎన్నికల దిశగా అడుగులేస్తోందా? పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ (పీడీపీ) వైఖరి ఈ ఊహాగానాలకు తెర తీసింది.  రాష్ట్ర్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ఆకస్మిక మృతి చెంది మూడు వారాలు గడుస్తున్నా రాష్ట్ర్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కావాలనుకుంటే ముఖ్యమంత్రి కావడం తనకు 10 నిముషాల పని అని పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తి అంటున్నారు.. అంటున్నారే కానీ ఆ దిశగా ఏ మాత్రం చొరవ తీసుకోడం లేదు. సయీద్ కుమార్తె అయిన మెహబూబా తమ అలయన్స్ భాగస్వామి బీజేపీ మీద అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ కూడా మాట్టాడుతున్నారు. తన తండ్రి సయీద్ శాంతి కోసం సామరస్యం కోసం కలలు కన్నారని ఆయన కలలు ఇక మీదట కూడా నెరవేరతాయని తాననుకోడం లేదని మెహబూబా వ్యాఖ్యానించారు. తనకు ఈ విషయంలో బీజేపీపై నమ్మకం కుదిరితేనే తాను సీఎం పీఠం ఎక్కుతాననంటున్నారు. దీంతో అలయన్స్  అపనమ్మక సంక్షోభంలో కూరుకుపోయినట్లు స్పష్టం అవుతోంది. అయితే ఆమె మనసులో వేరేదో భావన ఉందని పరిశీలకులు అనుమానిస్తున్నారు. జనవరి 31 సమావేశంలో ఒక స్పష్టత వస్తుందని భావించారు. కానీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఏం తేలలేదు. ఇలా ఉండగా, పీడీపీ నాన్చుడు వ్యవహారంతో బీజేపీలో అసహనం పెరిగిపోతోంది. మరోవైపు ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ కూడా పీడీపీ వైఖరిని తీవ్రంగా దుయ్యబడుతోంది. ఇది రాజ్యాంగాన్ని పరిహసించడమే అని ఆ పార్టీ అధినేత ఇక గవర్నర్ కూడా జాప్యంతో విసిగిపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేదా అంటూ పీడీపీ బీజీపీలను నిలదీశారు. పీడీపీ చీఫ్ మెహబూబాను, బీజేపీ రాష్ట్ర  అధినేత సత్పాల్ శర్మలను మంగళవారం తనను కలవాలని హుకుం జారీ చేశారు. ఈ సమావేశం తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తునిలో వంద‌ల ప్రాణాలు పోయేవా!

ఒక వ‌ర్గాన్ని బి.సి.ల జాబితోకి చేర్చి రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించాలంటూ తునిలో జ‌రిగిన స‌భ ఉద్రిక్త‌త‌ల‌తో ముగిసింది. ఆ స‌భ‌లో ఒక నాయ‌కుడు అప్ప‌టిక‌ప్ప‌డు రైల్ రోకోకి పిలుపునివ్వ‌డంతో జ‌నం ఒక్క‌సారిగా రైలు ప‌ట్టాల మీద‌కు చేరుకున్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ విజ‌య‌వాడ‌కి వెళ్తున్న ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్ అప్పుడే ప‌ట్టాల మీద‌కు రావ‌డంతో ఉద్య‌మ‌కారుల ఆగ్ర‌హానికి ఆ రైలే ల‌క్ష్యంగా నిలిచింది. బోగీల్లోకి కొంద‌రు, రైలు పై క‌ప్పు మీద‌కి కొంద‌రు ఎగ‌బ‌డి దాని మీద త‌మ ప్ర‌తాపాన్ని చూపసాగారు. ఈ స‌మ‌యంలో రైలుని న‌డుపుతున్న వ్య‌క్తి క‌రెంటుని నిలిపివేయడంతో భారీ ముప్పు త‌ప్పిందంటున్నారు నిపుణులు. లేక‌పోతే షార్ట‌స‌ర్క్యూట్ జ‌రిగి వంద‌లాది ప్రాణాలు గాలిలో క‌లిసిపోయేవ‌ని చెబుతున్నారు. వంద‌ల ఓల్టేజ్‌తో న‌డ‌చే ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్‌లో విద్యుత్‌ఘాతం క‌నుక జ‌రిగితే జ‌న‌న‌ష్టం అపారంగా ఉండేద‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ఉద్య‌మ‌కారుల‌కు ఆ ముందుచూపు ఎలాగూ లేక‌పోయింది, క‌నీసం రైలు న‌డిపే వ్య‌క్తిక‌న్నా ప్ర‌జ‌ల ప్రాణాల గురించి స్పృహ ఉండ‌టంతో పెనుముప్పే త‌ప్పిన‌ట్లైంది.  

ముద్ర‌గ‌డ ఉద్య‌మాన్ని హైజాక్ చేశారా?

త‌మ వ‌ర్గంవారికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌మంటూ త‌నిలో ఒక భారీ స‌భ జ‌రుగుతోంది. ఆ వేదిక మీద ఎంతోమంది పెద్ద‌లు ఉన్నారు. వారంద‌రూ ఎన్నో విష‌యాలు మాట్లాడేందుకు, మ‌న‌సులోని మాట చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంగారు కాపుగ‌ర్జ‌న‌లో త‌న వంతు రాగానే హ‌ఠాత్తుగా ఉద్య‌మం తీరుని మార్చేశారు. `నేను మీ కోసమే ఉంటాను. నా కుటుంబం మీ కోసమే పని చేస్తుంది. మీరంతా నా వెంట ఉంటారా?’ అంటూ జ‌నాలని  రైలు ప‌ట్టాల వైపుకి బ‌య‌ల్దేర‌దీశారు. `ప్ర‌భుత్వం త‌మ డిమాండ్ల‌ను ఒప్పుకునేదాకా రైలు ప‌ట్టాల మీద నుంచి క‌దిలేది లేద‌ని` పిలుపునిచ్చారు. త‌మ కులం వారికి అన్యాయం జ‌రుగుతోందంటూ వాపోతున్న ముద్ర‌గ‌డ‌, త‌న తోటి నాయ‌కుల‌కు అవ‌కాశం కూడా ఇవ్వ‌కుండా జనాల దృష్టిని పూర్తిగా త‌న‌వైపుకి ఎందుకు మ‌ర‌ల్చుకున్న‌ట్లు! ఉద్య‌మాన్ని ఏక‌పక్షంగా ఎందుకు న‌డిపించిన‌ట్లు! ఇదంతా ఉద్య‌మాన్ని బ‌లోపేతం చేసేందుకు చేశారా లేక‌పోతే పోరాటానికి తాను ఒక్క‌డినే నాయ‌కుడిగా మిగిలిపోదామ‌నుకున్నారా!

ఇంట‌లిజ‌న్స్ వైఫ‌ల్య‌మే కార‌ణ‌మా!

ల‌క్ష‌లాదిమంది ప్ర‌జ‌లు ఒకేచోట‌కి చేరుకుంటున్నారు. అదీ ఉద్యమం చేసే ఉద్దేశంతో! మ‌రి ఇంత‌మంది ఒక‌చోట‌కి చేరుకుంటే ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారే అవ‌కాశం ఉన్న విష‌యం ఆంధ్రా ఇంట‌లిజ‌న్స్ ప‌సిగ‌ట్టలేక‌పోయిందా! వారిని అదుపు చేసేందుకు త‌గినంత పోలీసు బ‌ల‌గం ఉండాల‌నీ, ముందుగానే ఉద్య‌మ పెద్ద‌ల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వానికి సూచించ‌లేక‌పోయిందా. తుని ఘ‌ట‌న త‌రువాత ఇప్పుడు అందిరి మ‌న‌సులోనూ మెదులుతున్న ప్ర‌శ్న ఇదే! ఇంటెలిజ‌న్స్ క‌నుక ప్ర‌భుత్వాన్ని ముందుగా హెచ్చ‌రించి ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేదేమో! అలా జ‌ర‌క్క‌పోవ‌డంతో గుంపుల కొద్దీ వ‌స్తున్న జ‌నానికి కేవ‌లం గుప్పెడు మంది పోలీసులు మాత్ర‌మే ఎదురొడ్డి త‌న్నులు తినాల్సిన ప‌రిస్థితి దాపురించింది. పైగా జాతీయ ర‌హ‌దారికీ, రైలు ప‌ట్టాల‌కీ ద‌గ్గ‌ర‌గా ఈ స‌భ‌ను ఎంచుకోవ‌డంలోని ఆంత‌ర్యం కూడా బ‌హుశా ఇంట‌లిజన్స్ గ్ర‌హించ‌లేక‌పోయింది. ఫ‌లితం!

అత్యాచార నిందితులకు మరణశిక్ష… కానీ

పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన ‘కామ్‌దుని’ అత్యాచార సంఘటనలో న్యాయస్థానం ముగ్గురికి మరణశిక్షను విధించింది. ఈ నేరంలో భాగస్వామ్యులుగా ఉన్న మరో ముగ్గురికీ యావజ్జీవ కారాగారశిక్షను నిర్దేశించింది. 2013సంవత్సరం జులై నెలలో జరిగిన ఈ సంఘటనలో ‘కామ్‌దుని’ అనే గ్రామానికి చెందిన ఒక కాలేజి విద్యార్థిని మీద తొమ్మది మంది వ్యక్తులు అత్యాచారం చేసి చంపేశారు. బాధితురాలిని హింసించి, ఆమె శరీరాన్ని చీల్చి ఒక చేపల చెరువులో పారేసి చేతులు దులుపుకున్నారు నిందితులు. నిందితులలో కొందరు అధికార పార్టీ అయిన తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందినవారు కావడంతో పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే కామ్‌దుని గ్రామస్తులు తమ గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రిని సైతం న్యాయం కోసం నిలదీయడంతో, పోలీసులు కేసు పురోగతిని వేగవంతం చేయక తప్పలేదు. ఇదిలా ఉంటే కామ్‌దుని తీర్పుని అటు ప్రతిపక్షం ఇటు ప్రభుత్వం తమకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమ ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందన్నదానికి ఈ తీర్పు ఒక ఉదాహరణ అని ప్రభుత్వం చెబుతుండగా… రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ‘కామ్‌దుని’ ఘటన ఒక సాక్ష్యం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు న్యాయస్థానం దొషులకు కఠిన శిక్ష విధించినా, అది కామ్‌దుని ప్రజలను అంతగా తృప్తి పరచడం లేదు. తొమ్మిదిమంది నిందితులలో ముగ్గురిని వదిలేయడం ఇందుకు మొదటి కారణం కాగా, ఉన్నత న్యాయస్థానంలో ఈ తీర్పు ఎంతవరకు నిలుస్తుందన్న భయం మరో కారణం!

రాహుల్‌ దీక్ష ఫలించేనా!

రాహుల్‌ గాంధీ ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. ఆయన చేసే పని వెనుక రాజకీయ చాతుర్యం ఉందో… లౌక్యం తెలియని తత్వం ఉందో అంతకంటే తెలియదు. రైతుల ఆత్మహత్యల దగ్గర నుంచీ దళితుల హత్యల వరకూ దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నా నేరుగా పరామర్శించని రాహుల్‌ భాయ్‌ ఇప్పుడు రోహిత్‌ కుటుంబానికి అండగా నిలవడం సంతోషించదగ్గ విషయమే! కాంగ్రెస్‌ అధినాయత్వానికి ఎప్పుడూ తెలుగువారంటే చులకన అనీ, అందుకే వారిని చీల్చి లాభపడాలని చూస్తుంటారని వినిపించే ఆరోపణలన్నీ రాహుల్‌ ఒప్పుకోకపోవచ్చు. పి.వి.నరసింహరావుని కూరలో కరివేపాకులో తీసిపారేశారనీ, ఆంధ్రప్రదేశ్‌ని రాజకీయలబ్దితోనే హఠాత్తుగా విభజించారనీ… అదే రాజకీయ ఉద్దేశంతో ఇప్పుడు రోహిత్‌ మీద ప్రేమని ప్రదర్శిస్తున్నారనీ విపక్షాలు విమర్శించవచ్చుగాక! కానీ రాహుల్‌ మాత్రం తను రోహిత్‌ కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రత్యేక విమానంలో హుటాహుటిని వచ్చానని చెప్పారు.   జనవరి 30న మహాత్మాగాంధి హత్యకు గురైన రోజు. ఆ రోజున సాధారణంగా గాంధి వారసులంతా దిల్లీలోని రాజ్‌ఘాట్‌ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పిస్తారు. అయితే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగస్తూ రాహుల్‌ హైదరాబాదుకి చేరుకుని రోహిత్‌కు మద్దతుగా మౌనదీక్షలో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నారు. తప్పకుండా ఈ చర్య వార్తల్లోకి వచ్చి తీరుతుంది. దేశమంతా రాహుల్‌ ఈ రోజున ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అని చర్చించుకుంటుంది?. ఈ విషయాన్ని గ్రహించే రాహుల్‌ సంచలనానికి దారి తీశారా అన్నదే ఇప్పటి ప్రశ్న! రాహుల్ తీరుపై ఎబివిపి చాలా తీవ్రంగా స్పందిస్తూ గొడవలకు దిగుతూ, బంద్‌లకు పిలుపునిస్తోంది. రాహుల్‌ ఈ విషయాన్ని ఊహించకుండా ఉండి ఉంటారా!   రోహిత్‌ మరణం నిజంగా దురదృష్టకరమే!  దానికి దారి తీసిన పరిస్థితుల మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగాల్సిందే! నాగరికత ఇంత ముందుకు సాగిన తరువాత కూడా కులాల పేరుతో కొట్టుకోవల్సిన అవసరం ఎందుకు కలుగుతోందో, ఎవరు కల్పిస్తున్నారో నిగ్గు తేల్చాల్సిందే! కానీ విచిత్రమేమిటంటే ఈ సమయంలో స్పందించాల్సినవారేమో మౌనంగా ఉన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన పెద్దరికం ఉన్నవారేమో విషయాన్ని మరింత జటిలం చేస్తున్నారు. రోహిత్ మరణం ఒక సమస్యకు సూచనగా కాకుండా ఒక అవకాశంగా నేతలు భావిస్తే కులాలకాష్టం నిరంతరం రగులుతూనే ఉంటుంది. కొందరు నేతలకి కావల్సింది అదేనా అన్నదే ఇప్పుడు అందరి మనసులలో మొదలవుతున్న భయం. ఇంత జరిగిన తరువాత గాంధీ చివరి మాటలు మాత్రం మళ్లీ గుర్తుకురాక మానవు – హే రాం!

స్మార్ట్‌ సిటీల రగడ

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగారు నిన్న ప్రకటించిన 20 స్మార్ట్‌ సిటీల జాబితా తెలంగాణ వాదులకి నిరాశను మిగిల్చింది. రాబోయే ఐదు సంవత్సాలలో వేలాది కోట్లని వెచ్చింది ఈ స్మార్ట్‌ సిటీలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అయితే ఇందులో తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా ఎంపిక కాకపోవడంతో తెలంగాణ నాయకులు పక్షపాతం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖపట్నం, కాకినాడలకి చోటు దక్కగా తెలంగాణ తరఫున వరంగల్‌ మాత్రం కూతవేటు దూరంలో చతికిలబడింది. అయితే ఇందులో తన తప్పేమీ లేదనీ, స్మార్ట్‌ సిటీల ఎంపిక ఆద్యంతం పారదర్శకంగానే జరిగిందంటున్నారు వెంకయ్య నాయుడు. కొన్ని నగరాలు ఎందుకు ఎంపిక కాలేదో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే నిలదీయమని అంటున్నారు. ఎందుకంటే స్మార్ట్‌ సిటీలను ఎంపిక చేసేందుకు సదరు నగర పాలక సంఘం అందించిన నివేదిక, అక్కడి పరిస్థితులు, ఆ నగరంలోని ప్రజల అభిప్రాయాలు… వంటి ఎన్నో అంశాలకు మార్కులు కేటాయించింది కేంద్రం. తెలంగాణ నుంచి వరంగల్‌, కరీంనగర్‌ను ఈ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండూ కూడా తుది జాబితాలో చోటు చేసుకుంటాయని అందరూ ఆశించారు. కానీ దురదృష్టవశాత్తూ కరీంనగర్‌ నగరపాలక శాఖ అసలు నివేదికనే సమర్పిచలేదు. ఇక వరంగల్‌ మాత్రం కేవలం కొద్దిపాటి తేడాతో 23వ స్థానంలో నిలిచి తృటిలో అవకాశాన్ని కోల్పోయింది. నిజానికి కేవలం తెలంగాణ మాత్రమే కాదు… ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల నగరాలకు కూడా ఈ తుది జాబితాలో చోటు దక్కలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌ అయితే ఏకంగా 13 నగరాలను స్మార్ట్‌సిటీ కోసం సూచించినా వాటిలో ఒక్కటి కూడా ఎంపిక కాలేదు. వీటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కూడా ఉంది. ఏకంగా ప్రధానమంత్రి సూచించిన నగరానికే ఈ జాబితాలో చోటు దక్కలేదంటే పారదర్శకతకు ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది అంటున్నారు వెంకయ్యనాయుడు. మరి కొద్ది రోజులలో మరో 23 నగరాలను ఎంపిక చేస్తామని, ఈసారి పక్కాగా ప్రతిపాదనలను పంపమని సూచిస్తున్నారు. అప్పడు కూడా తెలంగాణకు చోటు దక్కకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లొల్లి తప్పదేమో!

రెండేళ్ల క్రితం పోయిన బాబా! ఇంకా తిరిగి వస్తాడనుకుంటూ…

పంజాబులోని జలంధరుకి చెందిన ‘బాబా అశుతోష్‌ మహరాజ్’ ఈ లోకాన్ని విడిచిపెట్టి జనవరి 29 నాటికి రెండేళ్లు పూర్తి కావస్తోంది. కానీ ఆయన చనిపోయారంటే మాత్రం ఆయన భక్తులు నమ్మేందుకు ససేమీరా అంటున్నారు. పైగా రెండేళ్లుగా ఆయన దేహం పాడుకాకుండా శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేశారు. ‘బాబా చనిపోలేదని నమ్మినప్పుడు ఈ శీతలీకరణ యంత్రాలు దేనిక’ని అడిగితే ‘ఆయనవంటి మహాత్ములకు హిమాలయాలలో తపస్సు చేసుకోవడం అలవాటు కదా. అందుకు!’ అని తడుముకోకుండా జవాబుని ఇస్తున్నారు భక్తులు. అశుతోష్‌ మహారాజ్ చనిపోయారని తాము నమ్మడం లేదనీ, ఆయన కేవలం సమాధి స్థితిలోకి వెళ్లారనీ, ఎప్పటికైనా లేచి కూర్చుంటారనీ భక్తులు మహా నమ్మకంగా ఉన్నారు. నిజానికి అశుతోష్‌ బాబా గుండెపోటుతో చనిపోయినట్లు ఆయన భక్తులైన కొందరు వైద్యులే తేల్చి చెప్పారు. కానీ ‘దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్‌’ పేరిట బాబా ఏర్పాటు చేసిన భక్త సంఘం మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. రోజులు గడుస్తున్నా బాబాగారు తిరిగి లేవకపోవడం, ఇతరులు ఎవ్వరూ లోపలికి రాకుండా భక్తులు ఆయన ఆశ్రమం దగ్గర కాపలా కాస్తుండటంతో… ఈ వ్యవహారం కాస్తా కోర్టు వరకూ వెళ్లింది. ఫిబ్రవరి 24న కోర్టు తన నిర్ణయాన్ని వినిపించబోతోంది. భక్తుల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుని కోర్టు ఊరుకుంటుందో లేక అంత్యక్రియలకు ఆదేశిస్తుందో వేచి చూడాల్సిందే. ఈలోపల బిహారుకి చెందిన ‘దలిప్‌ కుమార్‌ ఝా’ ఈ వివాదానికి ఓ కొత్త మలుపుని తీసుకువచ్చారు. తాను అశుతోష్‌కి కొడుకుననీ, కావలంటే డీఎన్ఏ పరీక్షలకు సిద్ధంగా ఉన్నాననీ, ఆయనకి అంత్యక్రియలు చేసే అధికారం తనకే ఉందనీ దలిప్‌ కుమార్‌ వాదన!

అఖిలేష్‌ యాదవ్‌కి సుప్రీం మొట్టికాయలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో లోకాయుక్తిని నిర్ణయించే ప్రక్రియలో ఆ రాష్ట్రముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కి సుప్రీంకోర్టులో ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది. అఖిలేష్‌ ఏరికోరి ఎన్నుకున్న ‘వీరేంద్ర సింగ్‌’ను సుప్రీం కోర్టు లోకాయుక్త పదవి నుంచి తొలగించింది. ‘ఆయన ఎన్నిక విషయంలో మాకు చాలా సందేహాలు కలుగుతున్నాయంటూ’ వ్యాఖ్యానించింది ధర్మాసనం. ములాయం తనయుడిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన అఖిలేష్‌ ఇప్పటికే అనేక సందర్భాలలో తన అనుభవ రాహిత్యాన్ని ప్రదర్శించారు. ఆ అనుభవ రాహిత్యం కాస్తా ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా చేరుకున్నట్లుంది. ఒక రాష్ట్రంలో జరిగే అవినీతిని సమర్థంగా ఎదుర్కొనేందుకు, ఎండగట్టేందుకు అక్కడి లోకాయుక్త ప్రయత్నిస్తారు. లోకాయుక్తగా ఎవరు ఉండాలన్నది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, విపక్ష నేత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి తీసుకునే నిర్ణయం. కానీ హైకోర్టు న్యాయమూర్తిని ఏ మాత్రం లెక్కచేయకుండా విపక్ష నేతతో కుమ్మక్కయి తనకు అనుకూలమైన వ్యక్తిని లోకాయుక్తగా ఎన్నకున్నారన్నది అఖిలేష్‌ మీద వచ్చిన ప్రధాన అభియోగం. వీరేంద్ర సింగ్‌, అఖిలేష్‌కి చాలా సన్నిహితుడు కావడం; వీరేంద్ర సింగ్‌ తమ్ముడు, ఇద్దరు పిల్లలు కూడా ప్రభుత్వ న్యాయవాదులుగా ఉండటం వల్లనే అఖిలేష్‌ ఆయనను లోకాయుక్తగా నియమించారన్నది ఆరోపణ. వీరేంద్రను లోకాయుక్తగా ఎన్నుకోవద్దంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంతగా మొత్తుకున్నా అఖిలేష్‌ ఎలాగొలా తన మాటనే నెగ్గించుకున్నారు. కానీ ఇప్పడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ఈ మొత్తం వ్యవహారం మీద ఏకంగా సుప్రీం కోర్టుకే లేఖ రాయడంతో ఇప్పడు లోకాయుక్త నియామకం కాస్తా రద్దయింది.

పవన్ కళ్యాణ్ పై ఇంత డౌట్ వచ్చిందేంటబ్బా..?

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు కొంత మందికి విచిత్రమైన డౌట్లు వస్తున్నాయి. అవి ఏంటంటారా.. అసలు పవన్ కళ్యాణ్ పొలిటీషియనేనా అని.. ఇప్పుడు ఇంత సడెన్ గా పవన్ కళ్యాణ్ పై ఆ డౌట్ రావడానికి కారణం ఏంటని తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు గాను పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే టీడీపీ-బీజేపీ పార్టీలన్నీ కలిసి పవన్ కళ్యాణ్ ను ప్రచారంలోకి దింపాలని చూశాయి. గతంలో సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షమైన టీడీపీ-బీజేపీ తరుపున ప్రచారం చేసి వాటి గెలుపులో ముఖ్య భూమిక పోషించారు పవన్ కళ్యాణ్. అదే కాన్సెప్ట్ తో ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా పవన్ తో ప్రచారం చేస్తే తమకు కొంచెం ప్లస్ అవుతుందని భావించారు. హైదరాబాద్ లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న కారణంగా తమ పార్టీ తరుపున పవన్ ను ప్రచారంలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారానికి రారని దాదాపు తేలిపోయింది. నిన్న మొన్నటి వరకూ ఆయన ప్రచారానికి వస్తారో.. రారో అన్న అనుమానాలు ఏర్పడ్డ ఇప్పుడు రారని కన్ఫర్మయిపోయింది. ఎందుకంటే తాజాగా కేంద్ర మంత్రి - టీడీపీ నేత సుజనా చౌదరి పవన్ కు ఫోన్ చేసి గ్రేటర్ ప్రచారానికి రావాల్సిందిగా కోరగా ఆయన నో చెప్పినట్లు సమాచారం. అంతేకాదు తాను సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో ఉన్నానని... ఇప్పుడు రావడం ఎంతమాత్రం కుదరదని ఆయన చెప్పేశారని అంటున్నారు. అంతేకాదు తాజాగా పవన్ కళ్యాణ్ తమ అభ్యర్ధి ఎన్నికల బరిలో నిలిపే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తమ అభ్యర్ధిని జూబ్లిహిల్స్ డివిజన్ తరుపున పోటీ చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని.. దీనికి సంబంధించి టీడీపీ నేతలతో మంతనాలు కూడా జరిపారని.. దీనికి టీడీపీ నేతలు ఈ డివిడన్ బీజేపీకి ఇచ్చామని.. మేం ఏం చేయలేమని చెప్పారని.. దానికి పవన్ బీజేపీ నేతలతో కూడా మాట్లాడాటనికి రెడీ అయ్యారని అనుకున్నారు. కానీ ఈ హడావుడి అంతా రెండు రోజులు మాత్రమే జరిగింది. ఇప్పుడు దీని ఊసే ఎక్కడా వినిపించడంలేదు. దీంతో ఇప్పుడు అసలు పవన్ పొలిటీషియనేనా.. బీజేపీ.. టీడీపీ తరుపున ప్రచారానికి వస్తారంటే రావడంలేదు.. కనీసం తన పార్టీ అభ్యర్ధినైనా రంగంలోకి దింపుతారంటే అది కూడా లేదు.. అని అనుకుంటున్నారు. మరి  ఈ విషయాల్ని పపన్ పట్టించుకుంటారా.. లేక లైట్ తీసుకుంటారా చూడాలి.

తీవ్రవాదులపై పైచేయి – ఈ రిపబ్లిక్ డే!

ఒక పక్క పఠాన్‌కోట్‌ దాడులు, మరో పక్క ప్రపంచవ్యాప్తంగా పేట్రేగిపోతున్న ISIS తీవ్రవాదులు… ఇన్ని ప్రమాదాల నడుమ కూడా గణతంత్ర దినోత్సవం మరోసారి ఘనంగా జరిగింది. గణతంత్ర దినోత్సవానికి కొన్ని నెలల ముందు నుంచే అప్రమత్తంగా ఉన్న రక్షణ యంత్రాంగం ఎప్పటికప్పుడు అనుమానితుల మీద అదుపు సాధించడంతో ఇది సాధ్యమైంది. ప్రధానమంత్రితో పాటుగా, దేశంలోని ముఖ్య పట్టణాల మీద దాడి చేసేందుకు ISIS పన్నిన వ్యూహాలను దేశ రక్షక దళాలు సమర్థంగా ఛేదించారు. అదను చూసి దేశవ్యాప్తంగా ఒకేసారి 14 మంది తీవ్రవాదులను అదుపులోకి తీసుకోవడంతో గణతంత్రానికి పెను ముప్పు తప్పింది. ఈనాటి గణతంత్ర వేడుకలతో ఫ్రాన్స్‌ దేశపు అధ్యక్షుడైన హాలన్‌ ఆతిధ్యం స్వీకరించగా, మన త్రివిధ దళాలు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో కవాతుని నిర్వహించాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా మరో దేశపు (ఫ్రాన్స్‌) సైనిక దళాలు కూడా ఈ కవాతులో పాల్గొన్నాయి. ఇక దాదాపు 26 సంవత్సరాల తరువాత సైన్యానికి అత్యంత విశ్వాసంగా మెలిగే శునకాలు కూడా తమ యజమానులతో కలిసి కవాతుని సాగించాయి. అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా గేట్‌ వద్దనున్న అమర్‌జవాన్‌ జ్యోతికి నివాళులు అర్పించి, రాష్ట్రపతిని సాదరంగా రాజ్‌పథ్‌కి తోడ్కొని వచ్చారు. ఒక పక్క గగనతలంలో సైనిక విమానాలు విన్యాసాలు చేస్తుండగా, మరో పక్క సైన్యానికి చెందిన వివిధ రెజిమెంట్లు తమ తమ పరాక్రమాలను ప్రదర్శించాయి. 17 రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు ఈసారి గణతంత్రం వేడుకలలో పాల్గొనగా వాటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన శకటాలు లేకపోవడం తెలుగువారికి నిరాశ కలిగించే అంశం.

ఒక గూటి శత్రువులు ఇంకో గూటికి.. మనగలరా..?

తెలంగాణ అధికార పార్టీలోకి వలసల పర్వం ఎప్పటినుండో సాగుతూనే ఉంది. ఉన్న పార్టీపై అసంతృప్తి చెందో.. పార్టీలో తమకు ప్రాధాన్యత లేదనో.. తమకు నేతల నుండి సపోర్టు రావడం లేదనో కారణం ఏదైనా కానీ.. తమ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు  నాయకులు. ఇప్పటికే చాలా మంది నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలు ఎక్కువగా టీఆర్ఎస్ లోకి చేరినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఒక పార్టీలోనే విభిన్న వాదనలు ఉండి.. ఒకరంటే ఒకరికి పడని.. ఒకరికి పదవి దక్కకుండా మరోకరు అడ్డుపడి.. ఇలా శత్రవులుగా ఉన్నవారందరూ ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా కృష్ణయాదవ్ టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరిన తలసాని యాదవ్ కి.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్న కృష్ణయాదవ్ కి గతం నుండే అభిప్రాయభేదాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినా కూడా.. ఎవరో ఒకరే మంత్రిగా ఉండే అవకాశం ఉండేది. తరువాత 2003 లో కృష్ణయాదవ్ స్టాంపుల కుంభకోణంలో చిక్కుకొని జైలుకి వెళ్ల్రారు. అనంతరం  కృష్ణయాదవ్ జైలు నుంచి వచ్చిన తరువాత టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకునేందుకే తలసాని ప్రయత్నించారు. కానీ తలసాని ఎత్తులను అడ్డుకొని చివరికి ఆయ‌న టీడీపీలో చేరారు. కానీ తనకు అనుకున్న ప్రాధాన్యత కల్పించలేదు. ఆ తరువాత తలసాని యాదవ్ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. టీడీపీ నుండి గెలుపొందిన తలసాని యాదవ్ ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లోకి చేరి ఆపార్టీలో మంత్రిగా కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా కోర్టులో ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎప్పుడైతే టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తలసాని టీఆర్ఎస్ లో చేరారో అప్పటి వరకూ ప్రాధాన్యత లేని కృష్ణయాదవ్ కు తలసాని పదవి లభించింది. అయితే ఇక్కడ కూడా రాజకీయాలు చేసి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణయాదవ్ ఆ పదవికి పనికిరాడని చెప్పి.. మాగంటి గోపీనాథ్‌కు ఆపదవిని కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో కంటోన్మెంటు ఎమ్మెల్యే జి. సాయన్న ప్రధాన పాత్ర పోషించారు. అయితే సాయన్న కూడా ఎప్పుడో టీఆర్ఎస్ లో చేరారు. అంతేకాదు ఇటీవల టీఆర్ఎస్ లోకి చేరిన విజయ రామారావుకి కూడా.. ఈ నేతలతో విభేధాలు ఉండేవి. మరి గత పార్టీలో పరస్పరం విబేధాలు ఉన్న నేతలందరూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అలాంటి నేతలు మరి ఇప్పుడు ఆ పార్టీలో కలిసి మనగలరా..? లేక గతంలో లాగానే అంటీ ముట్టనట్టు ఉంటారా అని అనుకుంటున్నారు. అయితే మన ఇంట్లో ఏం చేసినా చెల్లుతుంది కానీ.. పక్కింట్లోకి వెళ్లి ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే కుదరదు కదా.. అలానే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు తమ ఆటలు సాగించిన పార్టీ నేతలు.. పక్క పార్టీ అయినా టీఆర్ఎస్ లోకి వెళ్లి గతంలో లాగానే చేస్తానంటే కుదరదు కదా.. అందునా టీఆర్ఎస్ అధినేతే కేసీఆర్ ముందు కుప్పిగంతులు అంటే కష్టమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఎంతవరకూ కలిసి ఉంటారో చూడాలి.

చైనాపై భారత్ నిఘా

భారత్ కు ప్రధాన ప్రత్యర్ధి చైనా.పక్కలో బల్లెంలా ఉన్న చైనాపై ఒక కన్ను వేయడం,భారత రక్షణకు మేలు కలిగించేదే..ఆ దిశగానే అడుగు వేసింది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో.చైనాకు పొరుగున ఉన్న దక్షిణ వియత్నాంలో ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్‌, ఇమేజింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది.దీని ద్వారా చైనా భూభాగం, వివాదాస్పద దక్షిణ సముద్రంతో సహా, ఆసియాలోని కీలక ప్రాంతాలన్నీ భారత శాటిలైట్ల పరిధిలోకి వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వియత్నాంతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు భారత్‌ తలపెట్టిన ఈ చర్య, చైనాను ఇరకాటంలో పడేసే అవకాశముంది. దీన్ని వ్యవసాయ, శాస్త్ర పరిశోధన, పర్యావరణ అంశాలకోసం చేసే ప్రయోగంగా చెబుతున్నప్పటికీ,మెరుగైన ఇమేజింగ్ పరిజ్ఞానంతో ఇవి తీసే చిత్రాలు సైనిక అవసరాలకు కూడా వాడుకునే అవకాశముందని నిపుణులు అంటున్నారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాతో వివాదం నానాటికీ ముదురుతున్న నేపథ్యంలో వియత్నాం కూడా తన నిఘా, గూఢచర్య, భూపరిశీలన టెక్నాలజీని మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సైనికపరంగా చూస్తే ఆ దేశానికి ఈ చర్య ఎంతో కీలకమైంది.. ఈ చర్య భారత్-వియత్నం బంధాన్ని, మరింత పటిష్టం చేయడమే కాక,రెండు దేశాల రక్షణ వ్యవస్థలను బలపరిచే ప్రధానాంశంగా కనిపిస్తోంది.భద్రతా లోపాలు పూడ్చుకునే దిశగా వియత్నానికి, తన సామర్థాన్ని విస్తృతం చేసుకోవడానికి భారత్‌కు ఈ చర్య ఉపకరించబోతోందని అంటున్నారు నిపుణులు..దాదాపు 155 కోట్ల వ్యయంతో హో చి మిన్హ్ నగరంలో ఈ శాటిలైట్ సమాచార సేకరణ కేంద్రాన్ని భారత్ ఏర్పాటు చేస్తోంది. ఈ శాటిలైట్ సమాచార కేంద్రం అందించే ఫొటోలను వియత్నాం నిఘా, సైనిక అవసరాలకు కూడా వాడుకునే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు