చదువు' కొనేందుకు ' కిడ్నీ విక్రయం
తల్లిదండ్రులు బాగా చదువుకోమని చెప్పి,పెద్ద చదువులు చెప్పిస్తుంటే, చదవడానికి ఇబ్బంది పడేవారందరూ తెలుసుకోవాల్సిన దయనీయ గాథ ఇది. ఆ కుర్రాడికి చదువంటే ప్రాణం..అతని కష్టానికి ఫలితంగా ఐఐటీలో సీటు లభించింది..కానీ సరస్వతీ కటాక్షం ఉన్న ఆ అబ్బాయికి,లక్ష్మీ కటాక్షం లేదు..చదువు పూర్తి చేయడానికి,అతని ఆర్ధిక పరిస్ధితి అడ్డుపడింది..చదువు మీద ప్రేమ చంపుకోలేక,తన కిడ్నీనే అమ్మాలనుకున్నాడు..ఇంతలోనే ఓ సంఘటన అతని జీవితంలో మార్పు తెచ్చింది..
మహేశ్,.వారణాసికి చెందిన దళిత విద్యార్థి. చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా చదువులో మాత్రం టాపర్.. కష్టపడి ఐఐటీ భువనేశ్వర్‌లో సీటు సంపాదించాడు. కానీ చదవడానికి ఆర్థిక స్థోమత చాలలేదు. దీంతో దాదాపు రెండు లక్షలు అప్పు చేసి చదువుకున్నాడు..కానీ ఆ అప్పును తీర్చే మార్గం అతనికి కనబడలేదు..దాంతో తన కిడ్నీని అమ్మకానికి పెట్టాడు..మూత్రపిండాలు అమ్మాలనుకుంటున్నాను,తీసుకుని డబ్బులివ్వండి అంటూ చాలా ఆసుపత్రులు తిరిగాడు..కానీ అతని కిడ్నీ ఎవరూ తీసుకోలేదు..
ప్రస్తుతం ఐఐటీ రెండో సంవత్సరం చదువుతున్న మహేశ్ తన చదువు కోసం 2.7లక్షలు లోన్ తీసుకున్నా,అతని చికిత్స కోసమే డబ్బులో సగం ఖర్చయ్యేది. చదువు కొనసాగించడానికి డబ్బులేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆఖరిని రాజస్థాన్‌లోని అల్వార్‌లో రోడ్లు కూడా వూడ్చాడు. తన బతుకుపై విరక్తి కలిగి చనిపోవాలని ఉందంటూ ఎన్నోసార్లు స్నేహితులతో చెప్పుకుని కుమిలిపోయాడు.ఇలా ఎన్నో ఒడిదుడుకులతో సాగుతున్న మహేశ్ జీవితంలో అనుకోకుండా, ప్రముఖ సామాజికవేత్త సందీప్ పాండే రూపంలో సాయం దొరికింది.మరికొంతమంది విద్యార్థుల నుంచి నిధులు కూడా సేకరించి మహేశ్ అప్పును తీర్చేశాడు.
మహేశ్ తండ్రికి పక్షవాతం రావడంతో తల్లే పాచిపని చేస్తూ ఇంటిని నెట్టుకొస్తోంది. అప్పు అయితే తీర్చగలిగాడు కానీ ఇంకా కూలీ పని చేస్తూనే ఇటు చదువు, అటు కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. తన వంటి పేదల్లో,చదువుకోవాలన్నా వీలుపడక,జీవితంపై విరక్తి కలిగి కొందరు ప్రాణాలు తీసుకుంటుంటే, చాలా తక్కువ మందికి మాత్రమే, సాయం లభిస్తోందని బాధపడుతున్నాడు మహేశ్.ఇలాంటి పేద సరస్వతీ పుత్రులను ఆదుకోకపోతే,దేశం ఎంతో మంది భవిష్య పౌరులను నష్టపోవాల్సి వస్తుందంటూ, ఆవేదన చెందుతున్నాడు.