విదేశీ విద్యపై మోజుకి బలవుతున్న భారతీయ విద్యార్ధులు

  అమెరికాలో ఉన్నత విద్యలభ్యసించాలనే భారతీయ విద్యార్ధుల తాపత్రయం అక్కడి కొన్ని విశ్వవిద్యాలయాలకు వరంగా మారుతుంటే, ఆ విద్యార్ధుల జీవితాలకు శాపంగా మారుతోంది. విదేశీ విద్యార్ధులను చేర్చుకొనేందుకు అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ వర్సిటీ, నార్త్‌ వెస్ట్రన్‌ పాలిటెక్నిక్‌ కాలేజిలు కొన్ని అవకతవకలకు పాల్పడుతున్నట్లు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ గుర్తించడంతో ఆ రెండు విశ్వవిద్యాలయాలను పరిశీలనలో ఉంచింది. కానీ ఆ రెండు విశ్వవిద్యాలయాలు తాము నిషేధిత జాబితాలో లేవని విద్యార్ధులకు, వారి తల్లి తండ్రులకు భరోసా ఇస్తూ నేటికీ విదేశీ విద్యార్ధులను చేర్చుకొంటునే ఉన్నాయి. అందులో చేరేందుకు భారత్ తో సహా వివిధ దేశాలలో గల అమెరికా కౌన్సిలేట్ లు వీసాలు జారీ చేస్తున్నాయి కూడా. కానీ వాటిలో చేరేందుకు శాన్‌ఫ్రాన్సికో వెళ్ళిన 14మంది భారతీయ విద్యార్ధులను ఎఫ్.బి.ఐ. అధికారులు నిర్బందించి సుమారు ఒకరోజు ప్రశ్నించిన తరువాత వారందరినీ అమెరికాలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. అందరూ తక్షణమే వెనక్కి తిప్పి పంపించేసారు.   ఉన్నత విద్యలభ్యసించేందుకు ఎంతో వ్యయప్రయాసలతో అమెరికా చేరుకొన్న విద్యార్ధుల జీవితాలు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారాయి. వారి ఈ పరిస్థితి చూసిన తరువాత కూడా ఇంకా కొంతమంది హైదరాబాద్ కి చెందిన విద్యార్ధులు అదే విశ్వవిద్యాలయాలలో చేరేందుకు సిద్దమవడం విశేషం. వారందరూ అమెరికా వెళ్ళేందుకు ఎయిర్ ఇండియాలో టికెట్లు కూడా కొనుకొన్నారు. కానీ అమెరికాకు వెళ్ళిన విద్యార్ధులనే వెనక్కి తిప్పి పంపేస్తుంటే, మళ్ళీ మరో బ్యాచ్ విద్యార్ధులను అదే విశ్వవిద్యాలయంలో చేరడానికి తీసుకువెళ్ళడానికి ఎయిర్ ఇండియా నిరాకరించింది. టికెట్ కోసం విద్యార్ధులు చెల్లించిన మొత్తాన్ని కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసేందుకు సిద్దపడింది.   ఆ సంస్థ చెపుతున్న విషయాలలో నిజానిజాలు తెలుసుకోకుండా దానిలో టికెట్స్ బుక్ చేసుకొన్న విద్యార్ధులు నిన్న హైదరాబాద్ లోని ఎయిర్ ఇండియా కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సదరు విశ్వవిద్యాలయాలు భరోసా ఇస్తునప్పుడు, అమెరికా ప్రభుత్వమే వాటిలోజేరేందుకు వీసాలు జారీ చేస్తునప్పుడు మధ్యలో ఎయిర్ ఇండియాకి అభ్యంతరం ఏమిటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ ఎయిర్ ఇండియా సంస్థ వారిని తీసుకువెళ్ళడానికి అంగీకరించడం లేదు. నిజానికి ఎయిర్ ఇండియా ఒక విమానయాన వ్యాపార సంస్థ మాత్రమే. కనుక దానికి విద్యార్ధుల జీవితాల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళి తిరిగి వెనక్కి తీసుకు రావడం వలన దానికి ఎంతో కొంత లాభమే తప్ప నష్టం ఉండబోదు. కానీ భారతీయ విద్యార్ధులు నష్టపోకూడదనే ఒక సామాజిక బాధ్యతతోనే వారిని హెచ్చరిస్తోందని స్పష్టం అవుతోంది. కనుక దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్ధులు అందరూ ముందు అమెరికా నుంచితిప్పి పంపబడిన విద్యార్ధులను కలిసి, వారు ఆవిధంగా ఎందుకు రావలసివచ్చిందో తెలుసుకొంటే మంచిది.   కానీ ఆ రెండు విశ్వవిద్యాలయాలలో విదేశీ విద్యార్ధులు చేర్చుకోవడానికి అమెరికా కౌన్సిలేట్ వీసాలు ఎందుకు జారీ చేస్తున్నాయి? విద్యార్ధులను తమ దేశంలో అడుగుపెట్టేందుకు అమెరికా ప్రభుత్వం స్వయంగా వీసాలు జారీ చేసినపుడు మళ్ళీ వారిని ఎందుకు తిప్పి పంపిస్తోంది? ఆ రెండు విశ్వవిద్యాలయాలు పరిశీలనలో ఉంచినపుడు విదేశీ విద్యార్ధులను చేర్చుకోవడానికి ఎందుకు అనుమతోస్తోంది? లేదా అమెరికా నుండి వెనక్కి తిప్పి పంపబడిన విద్యార్ధులు ఆ విశ్వవిద్యాలయాలలో చేరేందుకు తప్పుడు పత్రాలు ఏమయినా సమర్పించడం వలననే ఈవిధంగా జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనవలసి ఉంది.

అధిక వడ్డీ వసూలు చేస్తే...

దేశ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదలను నిలువునా దోచుకుంటున్నారు. ఈ వడ్డీ వ్యాపారం శ్రుతి మించి, అదుపుతప్పి ప్రాణ, మానాలతో కూడా ఆడుకునే స్థాయికి పెరిగి పోయింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటపడిన కాల్‌మనీ వ్యవహారం. కాల్‌మనీ, మైక్రో ఫైనాన్స్... ఇలా పేరు ఏదైనా సదరు వ్యాపారుల లక్ష్యం మాత్రం అధిక వడ్డీలు వసూలు చేయడం. వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎందరో! ఏపీలో కాల్ మనీ వ్యవహారం రచ్చ రచ్చ అయిన తర్వాత ఏపీ ప్రభుత్వం అధిక వడ్డీ నియంత్రణకు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ముందుగా కాల్ మనీ వ్యాపారుల భరతం పట్టడంలో నిమగ్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా వున్న వడ్డీ వ్యాపారుల మీద దాడులు జరిపి అక్రమంగా, అనైతికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారి మీద కేసులు పెట్టింది. దానితో పాటు మరో ప్రశంసనీయమైన ముందడుగు వేసింది. ఇకమీదట ఏపీలో అడ్డగోలుగా వడ్డీ వ్యాపారం చేసేవారి నడ్డి విరగడం ఖాయం. వడ్డీ వ్యాపారులను సమర్థంగా నియంత్రించాలంటే సమగ్రమైన చట్టాన్ని తేవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించింది. వడ్డీ వ్యాపార నియంత్రణ బిల్లును సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేస్తే మూడేళ్ళ జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. అంచేత... అధిక వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారులూ... పారాహుషార్!

నేరస్థుడి జీవితానికి భద్రత కల్పిస్తున్నారు సరే...కానీ,

  బాల నేరస్థుడి విడుదలని నిలిపివేయాలని దాఖలయిన పిటిషన్ని కొట్టివేస్తూ ఈ విషయంలో సుప్రీం కోర్టు తన అసహాయత వ్యక్తం చేసింది. “బాలనేరస్థుల చట్టప్రకారం అతనికి గరిష్టంగా మూడేళ్ళ శిక్ష విధించబడింది. మేము కూడా ప్రజాభిప్రాయంతో ఏకీభవిస్తున్నప్పటికీ అతని శిక్షను పొడిగించడానికి చట్టం అనుమతించదు. చట్టం మా చేతులని కట్టివేసింది,” అని సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పింది.   ఇందులో సుప్రీం కోర్టును తప్పు పట్టడానికి లేదు. బాల నేరస్థుల చట్టానికి మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణల బిల్లును ఆమోదించడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రాజ్యసభలో సహకరించి ఉండి ఉంటే బహుశః నేడు బాల నేరస్థుడి విషయంలో సుప్రీం కోర్టు ఈవిధంగా నిసహాయత వ్యక్తం చేయవలసిన అవసరం ఏర్పడేది కాదేమో?   ఈ హేయమయిన నేరానికి పాల్పడిన బాల నేరస్తుడిని ప్రజలు గుర్తుపట్టకుండా అతని మొహానికి ముసుగువేసి కోర్టుకి తీసుకువచ్చేవారు. అందుకు ఎవరూ తప్పు పట్టడం లేదు. అధికారులు అతనిని నిన్న విడుదలచేసిన తరువాత డిల్లీలో ఒక ఎన్జీఓ సంస్థకు అప్పగించారు. అప్పుడు కూడా అతనిని ప్రజలు గుర్తు పట్టకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. అధికారులిచ్చిన ఒక సమాచారం ప్రకారం ఆ ఎన్జీఓ సంస్థ అతని పేరుతో సహా అతని వ్యక్తిగత వివరాలన్నీ మార్పు చేసేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అతను రేపు బయట ప్రపంచంలోకి వెళ్ళినా ఎవరూ అతనిని గుర్తుపట్టి హాని తలపెట్టకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు తెలిపారు.   అతను మళ్ళీ సాధారణ జీవితం సాగించేందుకు వీలుగా బాలనేరస్థుల చట్ట ప్రకారం అతనికి రూ.10, 000 నగదు, అవసరమయిన సహాయ సహకారాలు అందించబోతున్నారు. బయట పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం అతనిని ఎన్జీఓ సంస్థలో భద్రంగా చూసుకొంటూ, అతనిని సమాజసేవా కార్యకలాపాలలో పాల్గొనేలా చేస్తూ అతనిలో మానసిక పరివర్తనకు ప్రయత్నిస్తారు. ఏదయినా వృత్తి శిక్షణలో అతను ఆసక్తి చూపినట్లయితే దానిలో అతనికి శిక్షణ ఇస్తారు. ఒకవేళ అతను తనకు అక్కడ ఉండటం ఇష్టం లేకపోయినట్లయితే తనకు నచ్చిన చోటికి వెళ్లిపోవచ్చును.   అత్యంత హేయమయిన నేరానికి పాల్పడిన వ్యక్తిలో మానసిక పరివర్తన తెచ్చేందుకు ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకొంటునప్పుడు, ఈ కేసులో భాదితురాలికి న్యాయం ఎందుకు చేయడం లేదు? ఇంకా ఎన్నేళ్ళ తరువాత న్యాయం చేస్తారు? అసలు న్యాయం జరుగుతుందా? లేక మిగిలినవారిని కూడా ఏదో ఒక రోజున వారి సత్ప్రవర్తన కారణంగా క్షమాభిక్ష పెట్టి ఇలాగే బయటకు పంపించివేస్తారా? అని ఆమె తల్లి తండ్రులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు మన ప్రభుత్వం, కోర్టులు, చట్టాలే జవాబు చెప్పవలసి ఉంటుంది. అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి, హత్యకి గురయిన నిర్భయకు ఇంత వరకు న్యాయం చేయలేకపోయినా, ఆ నేరం చేసిన వ్యక్తి తిరిగి జన జీవన స్రవంతిలో కలిసిపోయేందుకు మన ప్రభుత్వం, చట్టాలు, న్యాయ వ్యవస్థ అన్ని జాగ్రత్తలు తీసుకోవడాన్ని ఆమె తల్లితండ్రులు, ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.   ఈ సమాజం ఆ బాలనేరస్థుడి విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, అలాగే అతను బాల నేరస్తుల గృహంలో ఉన్నపుడు డిల్లీ హైకోర్టు బాంబు ప్రేలుళ్ళ కేసులో మరొక బాలనేరస్తుడితో స్నేహం చేసి మరింత రాటు తేలాడని తెలిసి కూడా అతనిని బయటకు విడిచిపెట్టారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ అతని వలన సమాజానికి లేదా సమాజం వలన అతనికి ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పలేము. నేడు కాకపోతే రేపయినా అతని ఉనికి బయటపడకుండా ఉండదు. అప్పుడు సమాజం అతనిపట్ల ఏవిధంగా స్పందిస్తుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అప్పుడు అతను సమాజం పట్ల ఏవిధంగా రియాక్ట్ అవుతాడో ఎవరూ ఇప్పుడు ఊహించలేరు.   చట్టాలకి, ప్రభుత్వాలకి, న్యాయ వ్యవస్థలకి అంత లోతుగా ఆలోచించే తీరిక లేకపోవచ్చును లేదా సాధ్యం కాకపోవచ్చును. కానీ అటువంటి విపరీత పరిణామాలు జరిగినట్లయితే దానికి ఎవరు బాధ్యులు వహిస్తారు? అతని వలన మరొక మహిళ ఇలాగే ప్రాణాలు కోల్పోయినా లేదా సమాజంలో వ్యక్తులే అతనిపై దాడి చేసినా అప్పుడు తాపీగా ఈ నిర్ణయం తప్పని అందరూ చింతించవలసి ఉంటుంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే, ముందుగానే జాగ్రత్త పడితే మంచిది కదా?

హ్యాపీ బర్త్ డే టు యు మిస్టర్ జగన్: చంద్రబాబు నాయుడు

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఆయన డిశంబర్ 21, 1972లో కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన పూర్తిపేరు యెదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆయన 44వ సం.లోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా నేతలు, కార్యకర్తలు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అదేమీ పెద్ద విశేషం కాదు. అంతకంటే పెద్ద విశేషమేమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కొందరు మంత్రులు, తెదేపా ఎమ్మెల్యేలు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి కూర్చొన్నచోటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడమే విశేషం.   ఆ తరువాత షరా మామూలుగానే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయడం, కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాలపై చర్చకు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ తిరస్కరించడంతో సభను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి, జగన్మోహన్ రెడ్డితో సహా వైకాపా ఎమ్మెల్యేలు అందరూ బయటకి వెళ్ళిపోయారు. మొన్న రోజాను సభ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించినపుడు, అందుకు నేను బాధపడటం లేదని ఆమె చెప్పినప్పుడు, ఆమె తన సినిమా, టీవీ కార్యక్రమాలు చేసుకొనేందుకు వీలుకలిగిందనే ఉద్దేశ్యంతోనే ఆమె ఆవిధంగా అని ఉంటారని మీడియాలో విమర్శలు వినిపించాయి. మళ్ళీ నేడు జగన్ సభని బాయ్ కాట్ చేసి వెళ్లిపోవడంతో, బహుశః తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికే వెళ్లి పోయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ ఒక్కటీ తప్ప అన్నిటికి ఒకే?

  పార్లమెంటు సమావేశాలు మొదలయి రెండు వారాలు పూర్తికావస్తున్నా కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన 36 బిల్లులలో ఇంతవరకు ఒక్క బిల్లును కూడా ఆమోదించలేదు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల మళ్లింపు విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిని కేసులో విచారణకు స్వయంగా హాజరుకమ్మని పాటియాలా కోర్టు ఆదేశించడంతో, మోడీ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పక్షాలు పార్లమెంటుని స్తంభింపజేస్తుండటంతో ఇంతవరకు ఒక్క బిల్లు కూడా అమోదానికి నోచుకోలేదు.   ప్రధాని నరేంద్ర మోడి స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ లను తన ఇంటికి టీ సమావేశానికి ఆహ్వానించి మాట్లాడినప్పుడు వారు సానుకూలంగా స్పందించారని వార్తలు వచ్చేయి. కానీ యధాప్రకారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుని స్తంభింపజేస్తూనే ఉంది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చొరవ తీసుకొని నిన్న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఒక్క జి.ఎస్.టి. బిల్లుకి తప్ప మిగిలిన అన్నిటినీ ఆమోదించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చేయి.   సోనియాగాంధీ స్వయంగా జి.ఎస్.టి. బిల్లు ఆమోదానికి సహకరిస్తామని ఇదివరకు ప్రధాని నరేంద్ర మోడికి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు దానికి తప్ప మిగిలిన అన్ని బిల్లుల ఆమోదానికి సహకరిస్తామని చెప్పడం విశేషం. ఆ బిల్లునే మోడీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కానీ దానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని సవరణలు సూచించింది. అవి చేస్తే తప్ప దాని ఆమోదానికి సహకరించమని కాంగ్రెస్ పార్టీ తెగేసి చెప్పింది. కనుక ఈ సమావేశాలలో జి.ఎస్.టి. బిల్లు ఆమోదం పొందే అవకాశాలులేనట్లే కనిపిస్తోంది. అఖిలపక్ష సమావేశంలో మిగిలిన అన్ని బిల్లుల ఆమోదానికి సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కనుక ఈరోజు పార్లమెంటు ఉభయసభల సమావేశాలు సజావుగా సాగే అవకాశం ఉంటుందేమో?   ఆ బిల్లులలో 16-18సం.ల వయసున్నవారు హత్యలు, అత్యాచారాలకు పాల్పడినట్లయితే వారినీ పెద్దవారిగా పరిగణించి శిక్ష వేయాలని బాలనేరస్థుల చట్టంలో మోడీ ప్రభుత్వం ఒక సవరణ చేసింది. ఆ బిల్లు కూడా నేడు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఒకవేళ అది ఆమోదం పొందినట్లయితే నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో మూడేళ్ళు శిక్ష అనుభవించి రేపు విడుదల కాబోతున్న బాల నేరస్థుడి విడుదలపై ప్రభావం పడే అవకాశం ఉండవచ్చును.

రోజా మేడమ్‌కి హ్యపీ ఎందుకంటే...

కాల్‌మనీ వ్యవహారం మీద అసెంబ్లీలో రచ్చరచ్చ చేయాలని వైసీపీ నాయకుడు జగన్ నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకే ఆయన పార్టీ సభ్యులు అసెంబ్లీలో తమ ప్రతాపం చూపిస్తూ సభా కార్యక్రమాలు సజావుగా నడవకుండా చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ధోరణికి పతాక స్థాయిగా వైసీపీ నాయకురాలు రోజా వ్యవహరిస్తున్న తీరును పెద్ద ఉదాహరణగా చూపిస్తున్నారు. ఏ విషయంలో అయినా తమ నాయకుడి ఆశయాలకు అనుగుణంగా రాద్ధాంతం చేసే రోజా మేడమ్ కాల్‌మనీ వ్యవహారం విషయంలో తన ప్రతాపం చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఏకంగా సంవత్సరంపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. రోజా సస్పెన్షన్ పట్ల ఆ పార్టీ నాయకుడు జగన్ బాధపడిపోతూ వుంటే, రోజా మేడమ్ మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనను సస్పెండ్ చేసినందుకు రోజా మేడమ్ హ్యాపీగా ఫీలవటాన్ని అధికార పార్టీ నాయకులు కామెడీగా తీసుకున్నారు. అసెంబ్లీలో అయినా, అసెంబ్లీ బయట అయినా తమ నాయకుడు జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్ కార్యక్రమాన్ని రోజా మేడమ్ చాలా విజయవంతంగా నిర్వహిస్తూ వుంటారు. స్వతహాగా నటి కావడం వల్ల రౌద్ర రసాన్ని చాలా ప్రతిభావంతంగా పోషిస్తూ వుంటారు. అయితే ఈ ధోరణి వల్ల నటిగా ఆమె పట్ల ప్రజల్లో వున్న అభిమానాన్ని క్రమంగా కోల్పోతున్నారు. ఈ నష్టాన్ని రోజా గ్రహించినప్పటికీ అధినేత మెప్పుకోసం అల్లరి చేయాల్సిన బాధ్యతను ఇష్టంలేకపోయినా నిర్వర్తిస్తున్నారని, ఇప్పుడు సస్పెండ్ కావడం వల్ల ఇక ఆమెకు అల్లరి చేసే బాధ తప్పిందని, అందుకే ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు. అంతేకాకుండా, ఈ మధ్యకాలంలో సినిమాలతోపాటు టీవీ ప్రోగ్రామ్స్‌లో కూడా రోజాకు అవకాశాలు పెరిగాయని, సస్పెండ్ అయిన ఈ సంవత్సర కాలంలో టీవీలో, సినిమాల్లో ఎడాపెడా నటించేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చని ఆమె ఆనందపడిపోతోందని వెటకారంగా అంటున్నారు.

హరీష్ రావు డ్రైవర్‌కీ తప్పలేదు...

తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు నిరంతరాయంగా జరుగుతూనే వున్నాయి. తెలంగాణ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు మొదటి నుంచీ ఎక్కువే. స్వతహాగా ఈ ప్రాంత ప్రజలు సున్నిత హృదయులు కావడం వల్ల తమ ఆవేదనను వ్యక్తం చేయడానికి ఆత్మహత్యను మార్గంగా ఎంచుకుంటూ వుంటారు. తెలంగాణ సాధన ఉద్యమం సందర్భంగా అందుకే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే తాము కోరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణలో ఆత్మహత్యలు ఆగుతాయని చాలామంది భావించారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు జరగవని అనుకున్నారు. ప్రభుత్వం కూడా తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల, రైతు అనుకూల విధానం వల్ల రైతుల ఆత్మహత్యలే వుండబోవని అనుకుంది. అయితే వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా వుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజూ నలుగురైదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పాపం ప్రభుత్వం కూడా రైతుల్లో మనోబలం నింపడానికి, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తీవ్రంగా కృషి చేస్తోంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నం, ప్రచారం చేస్తోంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావడం లేదని, ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు రైతుల్లో నమ్మకం పెంచడం లేదని తెలుస్తోంది. ప్రతిరోజూ జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే దీనికి నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం రైతుల్లో భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని పెంచలేకపోతోంది. తమ కష్టాలను ప్రభుత్వం తీర్చగలదన్న విశ్వాసాన్ని పెంపొందించలేకపోతేందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మిగతా రైతుల విషయం అలా వుంచితే, ప్రభుత్వాన్ని నడిపే కీలక వ్యక్తుల దగ్గర పనిచేసేవారికి కూడా ప్రభుత్వం మీద నమ్మకం కలగలేదా అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే, మంత్రి హరీష్ రావు దగ్గర గత సంవత్సర కాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్న కృష్ణాజీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజీ మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం లింగారెడ్డిపల్లికి చెందిన రైతు. వ్యవసాయంలో నష్టం రావడం వల్ల కృష్ణాజీ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంలా దొరికింది. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు తమ దగ్గర పనిచేస్తున్న వారిలోనే నమ్మకం పెంచుకోలేకపోయారని... ఇక రాష్ట్ర వ్యాప్తంగా వున్న రైతుల్లో నమ్మకం ఎలా పెంచగలరని ప్రశ్నిస్తున్నారు. హరీష్ రావు దగ్గర పనిచేసే వ్యక్తికీ ఆత్మహత్య తప్పకపోవడం బాధాకరమని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో ఇరుకున పడినట్టే కనిపిస్తోంది.

కోరికోరి చిప్పకూడు తినడమెందుకో?!

నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో తల్లీకొడుకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చిప్పకూడు తప్పేలా లేదనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో వీళ్ళిద్దరూ జాయింటుగా జైలుకు వెళ్ళే ప్రమాదం ముంచుకొస్తోంది. అయినప్పటికీ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించకుండా జైలుకు వెళ్ళాలని, తద్వారా రాజకీయంగా బలపడాలని తల్లీకొడుకులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం వుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తమ అధినేత్రి సోనియా, ఆమె పుత్రరత్నం రాహుల్ గాంధీ ఈ కేసు విషయంలో మొండిగా వ్యవహరిస్తూ స్వయంగా జైలుకు వెళ్తే భవిష్యత్తులో పరిస్థితి ఎలా వుంటుందోనని కాంగ్రెస్ వర్గాలు భయపడుతున్నాయి. రాజకీయ వ్యూహం పేరుతో కోరికోరి జైలుకు వెళ్ళడం కొరివితో తల గోక్కున్నట్టే అవుతుందని వారు భయపడుతున్నారు. జైలుకు వెళ్ళేంత సాహసం చేయవద్దని మేడమ్‌కి, చిన్నసార్‌కి చెప్పాలని వున్నా, అలా చెప్పే ధైర్యం లేక మిన్నకుంటున్నారు. నిజానికి ఈ కేసు విషయంలో తల్లీ కొడుకులు లేనిపోని రాజకీయాలను ప్రదర్శిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. తాము జైలు వెళ్ళడం ద్వారా బీజేపీని బద్నామ్ చేయాలని వీరు భావించడం హాస్యాస్పదంగా వుందని వారు అంటున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులను సోనియా కుటుంబం అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ ప్రస్తుతం బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. విచారణకు సోనియా, రాహుల్ హాజరు కావలసి వుంది. టైమ్ బాగాలేకపోతే వాళ్ళు అరెస్టు అయ్యే అవకాశం కూడా వుంది. ఈ సందర్భాన్ని కూడా సోనియా అండ్ సన్ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం తమను సాధించడానికి ఈ కేసును ఉపయోగించుకుంటోందని అంటున్నారు. అయితే నిజానికి ఈ కేసును దాఖలు చేసిన సమయంలో సుబ్రహ్మణ్య స్వామి బీజేపీలోనే లేరు. సోనియా, రాహుల్ బెయిల్ కోసం ప్రయత్నించకుండా జైల్లో కూర్చోవడం వల్ల బీజేపీకి జరిగే నష్టమేమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించకుండా అనవసరంగా జైలుకు వెళ్ళాలని అనుకోవడం తప్పు నిర్ణయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల ప్రకారం సోనియా, రాహుల్ జైలుకు వెళ్ళి చిప్పకూడు తినడానికే ఫిక్సయినట్టు అర్థమవుతోంది.

జగన్ అండ్ కో ఓవర్ చేస్తున్నారా?

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టుగా వైసీపీ నాయకుడు జగన్ పరిస్థితి తయారైందని రాజకీయ పరిశీలకులు భావిస్తు్న్నారు. కాల్‌మనీ వ్యవహారంలో అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్న జగన్ సక్సెస్ అయ్యే దాఖలాలు కనిపించడం లేదు. ఇష్యూ అటు తిరిగి, ఇటు తిరిగి జగన్‌కే ఇబ్బందికరంగా తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఈ అంశం మీద ఓవర్‌గా రియాక్ట్ అయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనరాని మాటలు అన్నందుకు ఆ పార్టీ నాయకురాలు రోజా సంవత్సరంపాటు సస్పెండ్ అవడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో అన్ని పార్టీలవారూ వున్నారన్నది జగమెరిగిన సత్యం మాత్రమే కాదు.. జగనెరిగిన సత్యం కూడా. వాస్తవానికి ఈ అంశంలో ఏ ఒక్క పార్టీనో వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. జగన్ అధికార పార్టీ వైపు వేలు చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళూ ఆయన పార్టీనే చూపించేలా పరిస్థితి వుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ఈ సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అసెంబ్లీలో రాద్ధాంతం చేయడం సరైన పద్ధతి  అనిపించుకోదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాల్‌మనీ వ్యవహారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైనది కాదు. ఎప్పటి  నుంచో కాల్‌మనీ వ్యాపారం వుంది. కానీ, జగన్ అండ్ కో అసెంబ్లీలో వ్యవహరిస్తు్న్న తీరు మాత్రం తెలుగుదేశం పార్టీయే కాల్‌మనీ వ్యాపారానికి కారణం అని బలవంతంగా అయినా ఒప్పించాలన్నట్టుగా వుంది. నిజానికి కాల్‌మనీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది తెలుగుదేశం ఎంపీ అనే విషయాన్ని జగన్ మరచిపోయినట్టు నటించడం భావ్యం కాదని పరిశీలకులు అంటున్నారు. కాల్‌మనీ అనేది ఒక సామాజిక సమస్య. ఈ సమస్యను పరిష్కరించే విషయంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తన బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్నట్టుగా వుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ ప్రతి విషయాన్నీ రాజకీయం చేసే ధోరణిని విడిచిపెడితే ప్రజల్లో మరింత పలచన కాకుండా వుంటారని సూచిస్తున్నారు.

రోజా అందుకు బాధ పడటం లేదుట!

  వైకాపా ఎమ్మెల్యే రోజా శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అనుచితంగా వ్యహరించినందుకు ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. ఆమెను సభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయడం సరికాదని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే రోజా మాత్రం తనను సస్పెండ్ చేసినందుకు బాధపడటం లేదని చెప్పడం విశేషం. సస్పెండ్ చేయడం కంటే సస్పెన్షన్ చేసిన తీరుకే బాధపడుతున్నానని ఆమె అన్నారు. కానీ ఊహించని ఈ పరిణామంతో ఆమెను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కి ఉందా లేదా? అనే చర్చ మొదలయిందిపుడు. సభ నుండి ఏడాదిపాటు సస్పెండ్ అయినందుకు ఆమె ఏమాత్రం బాధపడనపుడు, ఆమెను సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కి ఉందా లేదా? అనే చర్చ అనవసరమేనని చెప్పవచ్చును.   ఇదివరకు తెలంగాణా శాసనసభ నుంచి తెదేపా ఎమ్మెల్యేలు అందరినీ సమావేశాలు జరిగినంత కాలానికి సభ నుంచి సస్పెండ్ చేసినపుడు వారు స్పందించిన తీరుకు, ఇప్పుడు రోజా స్పందిస్తున్న తీరుకి చాలా తేడా కనబడుతోంది. తెదేపా ఎమ్మెల్యేలు అందరూ తమను సస్పెండ్ చేయడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఆ తరువాత స్పీకర్ మధుసూదనాచారిని కలిసి తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయమని విన్నవించుకొన్నారు. అయినప్పటికీ సస్పెన్షన్ ఎత్తివేయక పోవడంతో గవర్నర్ నరసింహన్ ని కలిసి పిర్యాదు చేసారు. కానీ రోజా తనను సస్పెండ్ చేసినందుకు బాధపడటం లేదని చెప్పడం విశేషం.   ఒకవేళ ఆమెకు తనపై ఏడాదిపాటు విధించినందుకు బాధపడి ఉంటే ఆమె సభలోనే తన తప్పును అంగీకరించి, మళ్ళీ అటువంటి తప్పులు పునరావృతం కానీయనని హామీ ఇచ్చి తన సస్పెన్షన్ ఎత్తివేయామని స్పీకర్ ని ప్రాధేయపడి ఉండేవారు. ఐదేళ్ళ కాలపరిమితిలో ఏకంగా ఒక ఏడాదిపాటు సస్పెండ్ చేయబడినందుకు ఆమెకు ఏమాత్రం బాధ కలగకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.

కాల్‌మనీ కథలు -3 - ప్రాణాలు తీస్తున్న పాపిష్టి వ్యాపారం

కాల్‌మనీ కాలనాగుల కాటుకు ఎన్నో జీవితాలు బలైపోయాయి. ఇప్పుడు కాల్‌మనీ వ్యవహారం బయట పడటంతో కాల్‌మనీ వ్యాపారులు చేసిన అకృత్యాలు ఒకదాని వెంట మరొకటి వెలుగులోకి వస్తోంది గానీ, కాలగర్భంలో కలసిపోయిన అకృత్యాలకు, దారుణాలకు అంతేలేదు. కాల్‌మనీ వ్యవహారం బయటపడి, ప్రభుత్వం వడ్డీ వ్యాపారుల భరతం పడుతూ వున్నప్పటికీ, కాల్‌మనీ వ్యాపారుల బారిన పడిన చిత్తూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా కాల్‌మనీ వ్యాపారుల పడగ నీడ నుంచి తప్పించుకునే అవకాశం వుందని తెలుసుకోలేక నలుగురు సభ్యుల ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం దిగ్భ్రాంతికర అంశం. చిత్తూరు జిల్లా దిగువ నాగులపల్లె గ్రామానికి చెందిన శివశంకర్ కుటుంబం అధిక వడ్డీలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. అలాగే ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే కాల్‌మనీ వ్యాపారుల బారిన పడిన ఒక ఆటో డ్రైవర్ భార్యను కాల్‌మనీ వ్యాపారం చేసే ఒక న్యాయవాది తన అదుపులో వుంచుకున్నాడన్న విషయం బయటపడింది. కాల్‌మనీ వ్యాపారులు చేసిన దుర్మార్గాలు, దారుణాలు ఇప్పుడు వరుసగా బయటపడుతున్నాయి. అయితే విజయవాడకు చెందిన కాల్‌మనీ వ్యాపారి కారణంగా ఎంతో భవిష్యత్తు వున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పటి వరకూ కాలగర్భంలో కలసిపోయింది. ఇప్పుడు ఆ దారుణం బయటపడింది. విజయవాడలో కాల్‌మనీ వ్యాపారంలో ముదిరిపోయిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు గతంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. సదరు ప్రజా ప్రతినిధుల దగ్గర చెమ్చాగిరీ చేస్తూ, బలవంతపు వసూళ్ళు చేసే ఒక వ్యక్తి కారణంగా ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబం కాల్‌మనీ ఉచ్చులో చిక్కుకుపోయింది. ప్రజా ప్రతినిధుల అనుచరుడి కన్ను ఆ కుటుంబంలో వున్న యువతి మీద పడింది. అప్పు సాకు చెప్పి ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు. దాంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సదరు కాల్‌మనీ వ్యాపారుల హవా నడిచిన కాలంలో జరిగిన ఈ ఆత్మహత్య అసలు విషయం బయట పడకుండానే కాలగర్భంలో కలసిపోయింది. ఇప్పుడు బయటపడింది. ఇంకా ఇలాంటి ఎన్ని దారుణాలను కాల్‌మనీ వ్యాపారులు సమాధి చేశారో! (కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తదుపరి ఆర్టికల్‌లో.....)

రాజకీయ పరిపక్వత ప్రదర్శిస్తున్న కేజ్రీవాల్

  ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చాలా రాజకీయ పరిపక్వత కనబడుతోందిపుడు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినపుడు ఏవయినా సమస్యలు ఎదురయితే ఒక సాధారణ ఉద్యమ నాయకుడులాగే రోడ్ల మీద ధర్నాలు చేసేవారు. కేంద్రప్రభుత్వం మీద అలిగి రాజీనామా చేసి తన ప్రభుత్వాన్ని తనే కూల్చుకొన్నారు. కానీ ఆవిధంగా చేయడం చాలా పొరపాటని నిజాయితీగా ప్రజల ముందు అంగీకరించి మళ్ళీ అటువంటి పొరపాట్లు చేయబోనని ప్రజలకు చెప్పగలగడం కేవలం ఆయనకే చెల్లునేమో? రాజకీయ నాయకులు తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటారు. కానీ ఆయనలాగ నిజాయితీగా తన తప్పులను ప్రజల ముందు ఒప్పుకొనే సాహసం మరెవరూ చేయలేరనే చెప్పవచ్చును.   తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై సిబిఐ అధికారులు దాడులు చేసినపుడు కేజ్రీవాల్ మొదట కాస్త కంగారుపడినప్పటికీ అంతలోనే మళ్ళీ తేరుకొని ఒక పరిపక్వ రాజకీయ నాయకుడు ఏవిధంగా ప్రతిస్పందిస్తాడో సరిగ్గా అలాగే ఆయన కూడా ప్రతిస్పందించారు. ఇదే సంఘటన ఇదివరకు జరిగి ఉండి ఉంటే ఆయన తన మంత్రులతో కలిసి రోడ్డు మీద ధర్నాకు దిగి నవ్వులపాలయి ఉండేవారు. అందుకు కోర్టుల చేత కూడా మొట్టి కాయలు వేయించుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు డిల్లీ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తూ రాజకీయంగా ఎదుర్కోవడం చూస్తుంటే ఆయనకి రాజకీయ పరిణతి వచ్చినట్లు స్పష్టమవుతోంది.   ఆయన చేస్తున్న ఆరోపణలలో నిజానిజాలు ఇంకా నిరూపించబడవలసి ఉంది. కానీ ఆ ఆరోపణలు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి, కేంద్రప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారాయి. ఆమాద్మీ పార్టీ తిరుగులేని మెజార్టీతో డిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ తను ఒక్కడే బలమయిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కష్టమని ముందే గ్రహించి బిహార్ ఎన్నికలలో నితీష్ కుమార్ కి మద్దతు ఇచ్చేరు. అలాగే మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చేతులు కలిపారు. తత్ఫలితంగా ఇప్పుడు వారిరువురూ కూడా ఆయనకు అండగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి తెలియజేయకుండా, ఆయన అనుమతి తీసుకోకుండా సచివాలయంలోకి సిబిఐ అధికారులు ప్రవేశించడాన్ని వారు తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీపై యుద్ధం చేయడానికి ఎల్లప్పుడూ ఉత్సుకతతో ఉంటుంది కనుక ఈ వ్యవహారంలో అది కూడా అరవింద్ కేజ్రీవాల్ కి మద్దతుగా నిలబడి అరుణ్ జైట్లీపై విమర్శలు గుప్పిస్తోంది.   సిబిఐ అధికారులు తన ప్రధాన కార్యదర్శి కార్యాలయంపై దాడులు చేసినపుడు అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తగ్గి ఉండి ఉంటే పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవేమో? కానీ ఆయన చాలా తెలివిగా పావులు కదుపుతూ రాజకీయ పరిణతిని ప్రదర్శిస్తున్నారు.

ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్న తెరాస ఎంపీలు

  తెరాస నేతలు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అందరికంటే ముందు వారే కేంద్రప్రభుత్వాన్ని కోరారు. కానీ మళ్ళీ వాళ్ళే అందుకు అడ్డుపడుతున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేమాటయితే తెలంగాణా రాష్ట్రానికి కూడా తప్పనిసరిగా ఇవ్వాలని మెలిక పెడుతున్నారు. అంతకంటే తమిళనాడు, ఓడిశా రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే తెలంగాణా ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేదని నేరుగా చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు ఇవ్వాలని మెలికపెడుతూ రాని ప్రత్యేక హోదాని రాకుండా అడ్డుకొంటున్నారు.   దేశంలో తెలంగాణా రాష్ట్రం రెండవ ధనిక రాష్ట్రమని, తెరాస ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల వలన రాష్ట్రం అన్ని రంగాలలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, త్వరలోనే తెలంగాణా రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలువబోతోందని పదేపదే చెప్పుకొంటారు. అయినా కూడా రాష్ట్ర విభజన కారణంగా అన్ని విధాల చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సమానంగా తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతుంటారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు తెలిసి ఉండకపోవచ్చును కానీ ఇంతవరకు కలిసి ఉన్న తెలంగాణాకి తెలియదనుకోలేము. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడటం చాలా విచారకరం.   లోక్ సభలో తెరాస పక్ష నేత జితేందర్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్న వై.వి. సుబ్బారెడ్డి అభ్యర్ధనను తాము సమర్ధిస్తున్నామని, అయితే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే మాటయితే తెలంగాణకు కూడా ఇవ్వాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సముఖంగా ఉన్నప్పటికీ ఇటువంటి కారణాల చేతనే వెనుకంజవేయవలసి వస్తోంది. ఒక్క ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే కాదు రైల్వే జోన్ వంటి మిగిలిన హామీల అమలుకు ఇటువంటి సమస్యలే అవరోధంగా నిలుస్తున్నాయి.

కాల్‌మనీ కథలు-2 - కాల్‌మనీ వెనుక ‘కాలామనీ’!

కాల్‌మనీ... ఒక్కో వ్యక్తి వందల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్వహిస్తు్న్న ఘరానా వడ్డీ వ్యాపారం. పది రూపాయల ‘ధర్మవడ్డీ’తో నిర్దాక్షిణ్యంగా నిర్వహిస్తున్న వ్యాపారం. డబ్బు అవసరం వున్నవారి బలహీనతను ‘క్యాష్’ చేసుకోవడానికి బడాబాబులు ఎంచుకున్న ఒక మార్గం. వడ్డీతో ఆగకుండా అసలుకూ ఎసరు పెట్టే బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి ఈ వ్యాపారాన్ని బూతు స్థాయికి దిగజార్చిన ఘనులు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. మొన్నటి వరకు రూపాయికి కూడా ఠికానా లేని విజయవాడ కాల్‌మనీ వ్యాపార ప్రముఖులు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. నిన్నమొన్నటి వరకు కనకదుర్గ గుడిలో చెప్పుల స్టాండ్ నిర్వహించుకుంటూ, బంతిపూలు అమ్ముకుంటూ పొట్టపోసుకున్న వ్యక్తి ఇప్పుడు కాల్‌మనీ వ్యాపారాన్ని నిర్వహిస్తూ కోట్లకు పగడలెత్తాడు. అక్కడితో ఆగాడా... ప్రజా ప్రతినిధి కూడా అయిపోయాడు. మరి కాల్‌మనీ వ్యాపారంలో ముదిరిపోయిన ఇలాంటి వాళ్ళకి వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? కాల్‌మనీ వ్యాపారంలో వినియోగిస్తున్న డబ్బంతా బ్లాక్ మనీనే. లెక్కాపత్రం లేని డబ్బే. సీమాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణాజిల్లా పరిసరాల్లో బడాబాబుల దగ్గర డబ్బుకు లోటు లేదు. అయితే ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి సరైన అవకాశాలే లేవు. బ్యాంకులో వేస్తే సవాలక్ష లెక్కలు చెప్పాలి. బ్యాంకు వాళ్ళు ఇచ్చే వడ్డీ చూస్తే విరక్తి కలుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి సరైన అవకాశాలు చాలా తక్కువ. అందుకే చాలామంది డబ్బున్నవాళ్ళు కాల్‌మనీ వ్యాపారులకు తమ దగ్గర వున్న డబ్బును ఇస్తున్నారు. ప్రతిఫలంగా మూడు రూపాయల వడ్డీ పుచ్చుకుంటున్నారు. కాల్‌మనీ వ్యాపారులు ఆ డబ్బును తీసుకునేవారి అవసరం తీవ్రతను బట్టి మూడు నుంచి ఆరు రూపాయల వడ్డీకి తిప్పుతున్నారు. ఒక్క విజయవాడలోనే యాభైమందికి పైగా కాల్‌మనీ వ్యాపారులు వున్నారు. వారిలో 20 మంది ఈ వ్యాపారంలో బాగా ముదిరిపోయారు. ఈ వ్యవహారంలో దొరికిపోయిన ఒక ఎమ్మెల్యే కాల్‌మనీ వ్యాపారంలో వందకోట్లు తిప్పుతుంటే, మరో ఎమ్మెల్సీ కూడా వందకోట్లతో ఎంచక్కా వ్యాపారం చేస్తున్నాడు. ఒక్క విజయవాడలోనే ప్రతి ఏడా 15 వందల కోట్ల టర్నోవర్‌తో కాల్‌మనీ వ్యాపారం వర్ధిల్లుతోందంటే ఈ వ్యాపారం ఎంతలా వేళ్ళూనుకునిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంత వ్యాపారం జరిగినా ప్రభుత్వానికి పన్నురూపంలో ఏమైనా ఆదాయం అభిస్తోందా అంటే... అదీ లేదు.. పెట్టుబడి, ఆదాయం... అంతా నల్ల డబ్బే... కాల్‌మనీ కాలామనీ వ్యాపారంలో నల్లడబ్బు వున్న అనేకమంది పెట్టుబడులు పెట్టారు. ఒక మోస్తరు భూస్వాముల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల వరకూ ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ ఆదాయంలో చాలాభాగాన్ని ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ వ్యవహారం బయటపడి రచ్చ కావడంతో వాళ్ళు తమ పెట్టుబడులు తిరిగి రాకపోతే పోయె... ఈ ఇష్యూలో తమ పేరు వున్నట్టు బయట పడకూడదని గుర్తొచ్చిన దేవుడికల్లా మొక్కుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఒక మంత్రిగారికి కూడా ఈ కాల్‌మనీ వ్యాపారులతో సంబంధ బాంధవ్యాలు వున్నట్టు తెలుస్తోంది. ఏ ఇష్యూ జరిగినా మీడియా ముందుకు వచ్చేసి గంటలు గంటలు మాట్లాడే ఆ మంత్రిగారు కాల్‌మనీ వ్యవహారం గురించి ఈ స్థాయిలో రచ్చరచ్చ అవుతున్నా ఎంతమాత్రం స్పందించలేదు. ఎందుకంటే పాపం ఆయన సన్నిహితులే ఈ వ్యాపారంలో వున్నారు. ఆయనేం మాట్లాడగలడు? (కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తదుపరి ఆర్టికల్‌లో.....)

జగన్ సారూ... ఇప్పుడేమంటారూ?

గత  ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తామని వైసీపీ నాయకులు కన్న కలలు కల్లలు కావడం... భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు శూన్యంగా కనిపిస్తూ వుండటంతో వైసీపీ నాయకులలో అసహనం పెరిగిపోయి అప్పుడప్పుడు అదుపుతప్పి ప్రవర్తించడం జరుగుతోందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతూ వుంటాయి. అందువల్ల కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు గొడవలకు దిగుతూ వుంటారని అంటూ వుంటారు. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. ఎంపీలు కూడా అసహనంతో వున్నారన్న విషయాన్ని ఆమధ్య వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిరూపించారు. నవంబర్ 26వ తేదీన రేణిగుంట విమానాశ్రయంలో విమానాశ్రయ ఉద్యోగి మీద ఆయన చేయి చేసుకుని వీరంగం సృష్టించారు. ఆయనకు సపోర్టుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా సదరు ఉద్యోగిని వీరబాదుడు బాదారు. అయితే ఈ విషయంలో జగన్ తన పార్టీ నాయకులను మందలిస్తే బావుండేది. అయితే ఆయన వారికి మద్దతుగా నిలిచారు. వాళ్ళు చాలా అమాయకులని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన పార్టీ నాయకులను లేనిపోని గొడవల్లో, కేసులలో ఇరికిస్తూ తమ పార్టీ ప్రతిష్ఠను తీసే ప్రయత్నాలు చేస్తోందని బాధపడిపోయారు. తన పార్టీ నాయకులు ఎవర్నీ కొట్టలేదని చెప్పుకొచ్చారు. అయితే నిజం నిలకడమీద తేలుతుంది. అంటారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా నిజం నిలకడమీద తేలింది. రేణిగుంట విమానాశ్రయంలో జరిగిన ఆ గొడవ తాలూకు సీసీటీవీ ఫుటేజ్ బయటి ప్రపంచానికి వెల్లడి అయింది. ఒక జాతీయ న్యూస్ ఛానల్  ఆ ఫుటేజ్‌ను సంపాదించి ప్రసారం చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి,వారి అనుచరులు ఎయిర్‌పోర్ట్ మేనేజర్ రాజశేఖర్‌పై దాడి చేయటం, పిడిగుద్దులతో ఆయనను కొట్టడం సదరు ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ మొన్నటి వరకూ తన పార్టీ నాయకులు ఎయిర్ పోర్టు ఉద్యోగిని కొట్టిన ఫుటేజ్ వుంటే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడికి సవాళ్ళు విసిరారు. ఆ ఫుటేజ్‌లో తన పార్టీ నాయకులు మేనేజర్‌ను కొట్టి ఉంటే మిథున్‌రెడ్డితో రాజీనామా చేయిస్తానని,లేకపోతే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ ఫుటేజ్ బయటపడింది. దాంట్లో వైసీపీ నాయకుల నిర్వాకం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు జగన్ గారు ఏమంటారో!

చిత్రకారిణి హేమా ఉపాద్యాయ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

  ముంబైకి చెందిన ప్రముఖ చిత్రకారిణి హేమా ఉపాద్యాయ్ (43), ఆమె లాయర్ హర్ష్ భంబానీ (65) జంట హత్యల కేసును మహారాష్ట్ర పోలీసులు చేదించారు. ముంబై సమీపంలోని ఖాండివిల్లీ అనే పట్టణంలో శనివారం సాయంత్రం ఒక మురికి కాలువలో వారిరువురి శవాలను పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హేమా ఉపాద్యాయ్ తన భర్త చింతన్ ఉపాద్యాయ్ తో మనస్పర్ధలు రావడంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకొంది. ఆమె తరపున లాయర్ హర్ష్ భంబానీ వాదిస్తున్నారు. వారిరువురూ హత్యకాబడటంతో సహజంగానే పోలీసులు ఆమె భర్తనే అనుమానించారు. కానీ వారి హత్యకేసులో ఆమె భర్తకు ఎటువంటి సంబంధం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.   తమ మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులకు అభ్యర్ధించినప్పటి నుండి తాను డిల్లీలో ఉంటున్నానని, అప్పుడప్పుడు ఏదయినా పని మీద ముంబై వచ్చినప్పుడు తమ ఇంట్లోనే ఉంటున్నానని అతను తెలిపాడు. తన బార్యకు తనకు ముంబైలోని ఒక ఫ్లాట్ విషయంలో గొడవలు జరుగుతున్న మాట వాస్తవమని, అయినప్పటికీ తాను దాని కోసం ఆమెను హత్య చేసేంత కిరాతుకుడిని కానని పోలీసులకు తెలిపాడు. తన భార్యకు చెల్లించవలసిన భరణం రూ. రెండు లక్షలను ఆమె చనిపోయే ముందు రోజే ఆమె లాయరుకి చెల్లించానని చింతన్ ఉపద్యాయ్ తెలిపాడు. అతను తన భార్య అంతిమ క్రియలకు కూడా హాజరయ్యాడు.   పోలీసుల దర్యాప్తులో వారిరువురిని హత్య చేసింది ఉత్తరప్రదేశ్ కి చెందిన విజయ్ రాజ్భర్, ప్రదీప్ రాజ్భర్, ఆజాద్ రాజ్భర్ మరియు శివ కుమార్ రాజ్భర్ అనే నలుగురు వ్యక్తులని తేలింది. వారిలో శివ కుమార్ రాజ్భర్ అనే వ్యక్తిని వారణాసిలో పోలీసులు పట్టుకొన్నారు. అతనిచ్చిన సమాచారంతో మిగిలిన ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేయగలిగారు. వారు నలుగురు ఉత్తరప్రదేశ్ లో రాంపూర్ అనే ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వారు విగ్రహాలు తయారు చేస్తుంటారు. వారి వద్ద నుండి 20 డెబిట్/క్రెడిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వాటిలో తొమ్మిది కార్డులు హేమా ఉపాద్యాయ్, ఆమె లాయర్ హర్ష్ భంబానీలకు చెందినవే. మిగిలిన కార్డులు వేరేవారికొ చెందినవని పోలీసులు గుర్తించారు. అంటే ఆ నలుగురు కలిసి ఇంకా చాలా హత్యలు, దోపిడీలు చేసి ఉండవచ్చని స్పష్టం అవుతోంది.   హేమా ఉపాద్యాయ్, హర్ష్ భంబానీ నోట్లో తామే గుడ్డలు కుక్కి హత్య చేసి వారి శవాలను ప్లాస్టిక్ గోనె సంచీలో చుట్టి మురికికాలువలో పడేశామని వారు అంగీకరించారు. హత్యకు కారణం డబ్బేనని ప్రాధమికంగా రుజువు అయ్యింది. కానీ వేరే ఇతర కారణాలు ఉన్నాయా? హేమా ఉపాద్యాయ్ భర్తకి వారితో ఏమయినా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

కాల్‌మనీ కథలు-1 - రాజకీయ విభేదాలే రచ్చకీడ్చాయి

కాల్‌మనీ కథలు - 1 రాజకీయ విభేదాలే రచ్చకీడ్చాయి   విజయవాడలో బయపడిన కాల్‌మనీ ఫైనాన్స్ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఏపీ ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన కాల్‌మనీ వ్యవహారం ప్రజలకు కొత్త విషయమేమీ కాదు... బ్లాక్‌మనీ పెరిగిపోయిన బడాబాబులు ఆ డబ్బును వడ్డీలకు తిప్పగల ‘సత్తా’ వున్నవాళ్ళకు డబ్బును మూడు రూపాయల వడ్డీకి ఇస్తారు. ఆ ‘సత్తా’ వున్నవాళ్ళు ఆ డబ్బును ఆరు నుంచి పది రూపాయల వరకు వడ్డీకి తిప్పుతారు. సహజంగానే ఈ స్థాయి వడ్డీలు జనం కట్టలేకపోవడం, చివరికి అప్పులు తీసుకున్నవారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం....! మొన్నటి వరకూ ఈ కాల్‌మనీ వ్యాపారం గురించి అందరికీ తెలిసిన కోణం ఇదొక్కటే. అయితే లేటెస్టుగా బయటపడిన అనేక వ్యవహారాలు దిగ్భ్రాంతిగొలిపేలా వున్నాయి. ధనంతో మాత్రమే లింక్ వున్న వ్యవహారం అనుకున్న కాల్‌మనీ మాన, ప్రాణాలతో కూడా చెలగాటం ఆడేస్థాయికి ఈ వ్యాపారం జరుగుతోందన్న విషయం బయటపడటం సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన రోజుకో కొత్త విషయం బయటపడుతూ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన లోగుట్టును ‘తెలుగువన్’ ‘కాల్‌మనీ కథలు’ పేరుతో పాఠకులకు అందిస్తోంది. ఈ అంశం మీద ‘తెలుగువన్’ చేసిన పరిశోధనలో బయటి ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసిన అనేక అంశాలు బయటపడ్డాయి. వాటిని ‘కాల్‌మనీ కథలు’  సిరీస్ ద్వారా పాఠకులకు అందిస్తున్నాం. కాల్‌మనీ వ్యాపారం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల్లో చాలా మామూలు విషయం. ప్రజలకు డబ్బుతో అవసరం వుంటుంది. అవసరానికి డబ్బు ఇచ్చి ప్రజల్ని ఆదుకోవలసిన బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో సవాలక్ష రూల్స్ పెడుతూ వుంటాయి. బడాబాబులకు కోట్లకు కోట్లు రుణాలు ఇచ్చి, వాళ్ళు ఎగవేసినా పెద్దగా పట్టించుకోని బ్యాంకులు చిన్నా చితకా ప్రజలకు రుణాలు ఇవ్వాలంటే మాత్రం బ్రహ్మాండం బద్దలయ్యేంత స్థాయిలో రూల్స్ పెడతాయి. అందుకే ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్‌మనీ వ్యాపారులను  ఆశ్రయించక తప్పడం లేదు. ఆరు రూపాయల నుంచి పది రూపాయల వరకు వడ్డీ చెల్లించడానికి సిద్ధపడి మరీ అప్పులు తీర్చుకుంటున్నారు. కాల్‌మనీ సాలెగూటిలో చిక్కుకున్న తర్వాత బయట పడటం చాలా కష్టం. ఒక్కసారి ఈ గూటిలో చిక్కారా... ఇక తమ ఆస్తుల మీద ఆశలు వదులుకోవడమే... విజయవాడ పరిసరాల్లో దాదాపు బడాబాబులకు బినామీదార్లుగా యాభై మందికి పైగా కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరిలో 20 మంది వరకు మహా యాక్టివ్‌గా ఈ వ్యాపారాన్ని మూడు అప్పులు, ఆరు ఆస్తి స్వాధీనాలు అన్నట్టుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో బయటపడిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఈ వ్యాపారంలో మకుటం లేని మహారాజులు. ఎవరి దారిలో వారు కాల్‌మనీ వ్యాపారం చేస్తూ బాగా ‘డెవలప్’ అయ్యారు. కొద్దికాలం క్రితం వరకూ మధ్యతరగతి జీవితాలను ఈడ్చిన వీరిద్దరూ ఇప్పుడు ప్రజా ప్రతినిధుల స్థాయికి ఎదిగారంటే దానికి ప్రధాన కారణం కాల్‌మనీ వ్యాపారం ద్వారా అడ్డగోలుగా సంపాదించిన డబ్బే. గతంలో ఛోటా నాయకుడిగా వుండే ఒక వ్యక్తికి కాల్‌మనీ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బు ఎమ్మెల్యే పదవిని వరప్రసాదంగా ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయరంగం అండతో ఆయన గారు తన వ్యాపార చక్రాన్ని మరింత వేగంగా తిప్పడం ప్రారంభించాడు. తన దగ్గర వున్న డబ్బును రొటేషన్ చేయడానికి అనేకమంది అనుచరులను నియమించుకున్నాడు. సదరు అనుచరుల ద్వారా ఆస్తులను గుంజుకోవడంతోపాటు డబ్బు కట్టలేని ఆడవాళ్ళను లోబరుచుకోవడం లాంటి దారుణాల వరకు చేయడం ప్రారంభించాడు. ఈ ఎమ్మెల్యే అనుచరుడు ఒకడు ఒక మహిళకు యాభై లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు. ఆ యాభై లక్షలకు వడ్డీ మాఫీ చేయడం కోసం ఆ మహిళను వేధించి ఆమె శారీరకంగా తమకు లొంగిపోయేలా చేశారు. ఆ మహిళను విలాస వస్తువులాగా అనేకమంది దగ్గరకు పంపించాడు. ఆమె మరికొంత డబ్బు కావాలని ఫోన్ చేసి అడిగింది. దానికి ఎమ్మెల్యే మనిషి నుంచి దుర్మార్గమైన సమాధానం వచ్చింది. బీటెక్ చదువుతున్న నీ కూతుర్ని నాయకుల దగ్గరకు పంపిస్తే నీకు కావలసిన డబ్బు ఇస్తానని ఆ వ్యక్తి పచ్చిగా చెప్పేశాడు. ఆమె ఎవరెవరి దగ్గరకి వెళ్ళాల్సి వుంటుందో ఆ చిట్టా కూడా చదివాడు. ఈ సంభాషణ మొత్తాన్నీ రికార్డు చేసిన ఆ మహిళ స్థానిక పార్లమెంటు సభ్యుడికి ఆ సంభాషణను వినిపించింది. ఆ ఎంపీ దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్ళడంతో కాల్‌మనీ వ్యాపారం వెనుక జరుగుతున్న అత్యంత జుగుప్సాకరమైన అంశాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఒక దుర్మార్గాన్ని ఆపిన ఆ ఎంపీ నిజంగా చాలా గొప్పవాడు. కాల్ మనీ ద్వారా దారుణాలకు పాల్పడుతున్న వ్యక్తులలో తన పార్టీకి సంబంధించిన వారు వున్నారని తెలిసి కూడా ఉపేక్షించకుండా ఆ విషయాన్ని బట్టబయలు చేసిన ఆయనకు హేట్సాఫ్ చెప్పాలి. ఈ వ్యవహారం ఇప్పటికీ బయటపడకపోయేదే... ఈ  కేసులో ప్రధాన నిందితుడిగా వున్న ఒక నాయకుడికి ఒకవైపు కాల్‌మనీ ద్వారా వస్తున్న డబ్బు ప్రవాహం.. మరోవైపు అర్హత లేకపోయినా అందివచ్చిన పదవి అహంకారాన్ని పెంచాయి. దాంతో జిల్లాలో సీనియర్‌ నాయకుడిగా వున్న ఒక ఎమ్మెల్సీని నోటికొచ్చినట్టుగా విమర్శించేవాడు. సొంత పార్టీ నాయకుడన్న విచక్షణ కూడా లేకుండా విమర్శలు గుప్పించేవాడు. రాజకీయ రంగంలో ఆరితేరి వున్న ఆయన ఈ నాయకుడిని టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం ఇరికించాడని తెలుస్తోంది. తనను విమర్శిస్తున్న ఆ నాయకుడికి సంబంధించిన అన్ని గుట్టుమట్లూ తన గుప్పిట్లో పెట్టుకుని వాటిని బయటపెట్టి ఇరుక్కుపోయేలా చేసినట్టు సమాచారం. ఈ కాల్‌మనీ నాయకుడు ఆ వ్యాపారాన్ని అడ్డు పెట్టుకుని మహిళలను ఎలా వేధించాడో.. ఎవర్ని వెంటపెట్టుకుని ఎప్పుడెప్పుడే ఏయే దేశాలకు ఎవరెవరితో టూర్లు వెళ్ళాడో లాంటి వివరాలన్నీ  ఆయన వెల్లడి చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అధికార పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన విభేదాలు, ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం అధికార పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే విషయమే. అయినప్పటికీ కాల్‌మనీ వెనుక ఉన్న దారుణమైన విషయాలు బయటపడటానికి ఈ విభేదాలే కారణమయ్యాయి. (కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తదుపరి ఆర్టికల్‌లో.....)

గౌతం సవాంగ్ ఎందుకు శెలవులో వెళుతున్నారంటే...

  కాల్ మనీ వ్యవహారం నానాటికీ ముదురుతున్న సమయంలో విజయవాడ పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ ఈ నెల 17 నుంచి 10 రోజులపాటు శలవులో వెళుతుండటం అధికార పార్టీకి ఊహించని సమస్యలను, ప్రతిఅప్క్ష పార్టీలకు బలమయిన ఆయుధాన్ని అందిస్తోంది. ఆయన క్రీస్టియన్ మతస్తుడు. ఆస్ట్రేలియాలో ఉన్న తన అల్లుడు,కుమార్తె వద్దకు వెళ్లి ఈసారి వారితో క్రిస్టమస్ పండుగ జరుపుకోవాలని నెలరోజుల ముందుగానే శలవుకి దరఖాస్తు చేసుకొన్నారు. ఆయన శలవు మంజూరు అవడంతో ఆస్ట్రేలియాకి టికెట్లు కూడా కొనుకొన్నారు. కానీ ఊహించని విధంగా ఈ కాల్ మనీ వ్యవహారం బయట పడటం, దానిలో అధికార తెదేపా నేతల పేర్లు బయటపడుతుండటంతో, తమ పార్టీ నేతలను కాపాడుకోవడానికి తెదేపా ప్రభుత్వమే ఆయనని శలవు మీద పంపుతోందని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు.   ఈ వ్యవహారంలో ఆయనపై అధికార ప్రతిపక్షాల ఒత్తిడి ఎక్కువయిపోవడంతో ఆయన శలవు మీద వెలుతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన ఆస్ట్రేలియా వెళ్ళడానికి చాలా రోజుల క్రితమే ఏర్పాట్లు చేసుకొన్నారని పోలీస్ అధికారులు చెపుతున్నారు. ఈ పది రోజుల కోసం ఆయన స్థానంలో సురేంద్రబాబు అనే మరో ఐపీఎస్ అధికారి తాత్కాలికంగా బాధ్యతలు తీసుకొంటున్నారు.