చదువుకోండిరా బాబూ!
మన పెద్దవాళ్లని ఎవరనినన్నా కదిపితే... ‘అప్పట్లో మాకు చెప్పేవాళ్లు లేక సరిగా చదువుకుని ఏడవలేదు. కనీసం మీరన్నా బుద్ధిగా చదువుకోండిరా బాబూ!’ అని కళ్లెమ్మట నీళ్లు పెట్టుకున్నంత పనిచేస్తారు. కానీ చదువు సంగతి దేవుడెరుగు... అసలు తాము ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితిలో యువత ఉంటే, దేశం ఎలా బాగుపడుతుంది? యువకులకు ఆవేశం ఉండటంలో తప్పు లేదు- అది వారి స్వభావం! మనుషులకు భావస్వేచ్ఛ ఉండటంలో తప్పులేదు- అది వారికి అవసరం! కానీ ఆ ఆవేశానికి ఒక దిశ అంటూ లేకపోతే, వారి భావస్వేచ్ఛలో విచక్షణ లేకపోతే?
దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయంగా దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీని భావిస్తారు. ఇక్కడి ప్రాంగణంలో విద్యకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆలోచనకీ అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే దిగ్విజయ్ సింగ్ మొదలుకొని సీతారాం ఏచూరి వరకూ వందలాది రాజకీయ నాయకులను ఈ దేశానికి అందించింది. కానీ అదే విశ్వవిద్యాలయం ఇప్పుడు వార్తలలో నిలిచింది. ఫిబ్రవరి 9 2016 నాటికి అఫ్జల్ గురు అనే తీవ్రవాదిని ఉరితీసి మూడు సంవత్సరాలు కావస్తోంది. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు అఫ్జల్ గురుకి అనుకూలంగా సభను నిర్వహించారన్నది ఒక ఆరోపణ.
అఫ్జల్ గురు అమాయకుడేమీ కాదు... పాకిస్తాన్‌లో తీవ్రవాదుల దగ్గర ఓనమాలు నేర్చుకుని మన దేశపు పార్లమెంటు మీద దాడి చేసేందుకు సహకరించినవాడు. మరో దేశంలో ఇలాంటి పని చేస్తే ఎంత త్వరగా చర్యలు తీసుకుంటారో కానీ, మన దేశంలో అతనికి 12 సంవత్సరాల తరువాత 2013లో రహస్యంగా ఉరితీశారు. మనుషులని ఉరితీయడం అన్న సంప్రదాయాన్ని మనం వ్యతిరేకించవచ్చు, అందులోనూ రహస్యంగా ఉరితీసిన విధానాన్ని నిరసించవచ్చు. కానీ... ‘నువ్వు (అఫ్జల్) తలపెట్టిన కార్యక్రమాన్ని మేం పూర్తి చేస్తాం’ అని ఎవరన్నా నినదిస్తే వారిని దేశద్రోహులుగా ఎందుకు భావించకూడదు. ‘భారతదేశం నాశనం అయ్యేదాకా, మేం పోరాడుతూనే ఉంటాం’ అని ఎవరన్నా ప్రతిజ్ఞ చేస్తే అది భావస్వేచ్ఛగా ఎలా అనుకోగలం.
సరే! మనుషులన్నాక రకరకాలు ఉంటారు. అందులో కొందరికి అఫ్జల్‌గురు నచ్చవచ్చు. కానీ అలాంటి మనుషుల చుట్టూ అల్లుకుంటున్న రాజకీయమే ఇప్పుడు మరింత కలవరపరుస్తోంది. భారతదేశానికి వ్యతిరేకంగా, అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు చేయడం భావస్వేచ్ఛ అనీ, సహృద్భావ చర్చలో భాగం అనీ కొందరు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఖండించాల్సిన సందర్భంలో అలా చేయడం తమ పార్టీలకు అవమానంగా భావిస్తున్నారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ దేశం గురించి మాట్లాడే హక్కు ఒక్క RSS, ABVP, BJP వంటి సంస్థలకు మాత్రమే లేదుకదా! మరి దేశభక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడితే అది BJPకి లాభపడుతుందనుకుని విభిన్నమైన స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నట్లు? దళితులకు అన్యాయం జరిగితే ఒక పార్టీ, అగ్రవర్ణాలకు అన్యాయం జరిగితే ఒక పార్టీ; దేశభక్తి గురించి మాట్లాడాలంటే ఒక పార్టీ, దేశంలోని వివాదాల గురించి మాట్లాడాలంటే ఒక పార్టీ... ఇలా ఈ దేశ ప్రజల్నీ, దేశ సమస్యలనీ... ఆఖరికి దేశభక్తిని కూడా పార్టీలవారీగా పంచేసుకున్నారా ఏంటి?
రాజకీయ వేత్తల నుంచి ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలను ఆశించలేము. కానీ కనీసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులన్నా ఈ పరిస్థితి గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చినట్లుంది. తమ పిల్లలు లక్షలు సంపాదించే ఉద్యోగాలు సాధించాలనుకునే తల్లిదండ్రులు, ఏదో నాలుగు ముక్కలు చెప్పేసి చేతులు దులిపేసుకునే ఉపాధ్యాయులూ... అసలైన బాధ్యత అది కాదనీ, ఒక మంచి పౌరుడిని ఈ దేశానికి అందించడంలోనే తమ జీవితానికి సార్థకత ఉందనీ గ్రహించాల్సిన సమయం వచ్చినట్లుంది. యాదృచ్ఛికమో మరేదో కానీ దిల్లీ విశ్వవిద్యాలయంలో ఈ సభ జరిగిన రోజే సియాచిన్‌లో హనుమంతప్ప అనే సైనికుడు చావుబతుకుల మధ్య కనిపించాడు. దేశం కోసం 20000 అడుగుల ఎత్తున, -50 డిగ్రీల చలిలో, చావుతో సహజీవనం చేసే వేలాది సైనికులలో హనుమంతప్ప ఒకడు. అదృష్టమో, దురదృష్టమో కానీ హనుమంతప్ప మృత్యువుతో పోరాడుతూ దిల్లీలోనే చనిపోయాడు. అతనికి స్పృహ వచ్చి ఉంటే కనుక ఇలాంటి ప్రజల కోసమా నా జీవితాన్ని అంకితం చేసింది అనుకునేవాడేమో కదా!
చదువుకోండిరా బాబూ! మీరంతా మరో హనుమంతప్పలా మారనవసరం లేదు. కనీసం మన దేశాన్ని కాలపా కాస్తున్న సైనికులు సిగ్గుతో తలవంచుకునే పరిస్థితులు తీసుకురాకండి.