గిడ్డి ఈశ్వరిని వెనకేసుకు వచ్చిన జగన్

  బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి చింతపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల అసభ్యంగా మాట్లాడటమే కాకుండా ఆయన తల నరుకుతానని హెచ్చరించారు. ఆ సమస్యంలో ఆమె పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆమెను వారించకుండా ఆమె మాటలకు చాలా సంతోషిస్తున్నట్లుగా ముసిముసి నవ్వులు నవ్వారు. స్థానిక తెదేపా నేతల పిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేప్పట్టారు.   తన పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తుంటే వారించవలసిన జగన్, ఇప్పుడు ఆమెనే వెనకేసుకు రావడం విస్మయం కలిగిస్తోంది. గిరిజన జాతికి చెందిన ఆమె తనకు వచ్చిన బాషలో తన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆమెపై కేసులు పెట్టి పోలీసుల చేత ప్రభుత్వం వేధిస్తోందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలు చాలా మంది తన పట్ల చాల సార్లు అటువంటి మాటలే మాట్లాడారని కానీ వంటిని తానెన్నడూ సీరియస్ గా తీసుకోలేదని, కానీ చంద్రబాబు నాయుడుని విమర్శించినందుకు ఈవిధంగా తన పార్టీ ఎమ్మెల్యేని వేధించడం సరికాదని జగన్ అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు పట్ల తన పార్టీ ఎమ్మెల్యే ఆవిధంగా మాట్లాడటాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్దిస్తున్నట్లే స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో ప్రధానప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా వాదించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

జగన్ కి అదీ ఒక ఆనవాయితీగా మారిందా?

  ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడటం సర్వసాదారణమయిన విషయమే. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుండి రెక్కలు కట్టుకొని వచ్చి అక్కడ వాలిపోయి తక్షణమే ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టేస్తారు. బాక్సైట్ తవ్వకాలు, కల్తీ మద్యం, కాల్ మనీ వ్యవహారం అందుకు తాజా ఉదాహరణలు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు పోరాడవలసిన బాధ్యత ఉంటుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైకాపా ఆ బాధ్యత సక్రమంగానే నిర్వహిస్తోంది. కానీ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నంలో జగన్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కారణంగా ప్రభుత్వం కంటే ముందు వైకాపాయే ఎదురుదెబ్బలు తింటోంది. ప్రత్యేక హోదా మొదలుకొని కల్తీ మద్యం కేసు వరకు అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి.   బాక్సైట్ తవ్వకాలను అక్కడి గిరిజనులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకొంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చింతపల్లిలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించి వచ్చేరు. కల్తీ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహం వలన మద్యం వ్యాపారాలు చేసుకొంటున్న స్వంత పార్టీలో నేతలే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో పోలీసులు ఇప్పటికే తొమ్మిదిమందిని అరెస్ట్ చేసారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ఐ.పి.ఎస్. అధికారి నేతృత్వంలో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసారు. కనుక ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొంటోందని ప్రజలు భావిస్తున్నారు.   కాల్ మనీ వ్యవహారం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా స్పందించారు. ఆ వ్యవహారంలో తమ పార్టీకి చెందినవారున్నా కూడా విడిచిపెట్టవద్దని కలెక్టర్ ని, పోలీసులను ఆదేశించారు. కాల్ మనీ పద్దతిలో అప్పులు తీసుకొన్నవారెవరూ వాటిని తిరిగి చెల్లించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం, ఈ విషయంలో ఎవరయినా మహిళను వేధిస్తే వారిపై నిర్భయ చట్టం క్రింద కేసులు నమోదు చేయమని పోలీసులను ఆదేశించడం గమనిస్తే ఆయన ఈ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో అర్ధమవుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ వ్రాయడం, మళ్ళీ నేడు తన పార్టీ నేతలను వెంటబెట్టుకొని గవర్నర్ నరసింహన్ న్ని కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై పిర్యాదు చేయాలనుకోవడం గమనిస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం కాక తన పార్టీ ఉనికిని చాటుకోవడానికి ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.   గవర్నర్ కేవలం కేంద్రప్రభుత్వం తరపున రాష్ట్రంలో ప్రతినిధిగా మాత్రమే వ్యవహరిస్తూ అత్యవసరమయిన సమయంలో మాత్రమే తన విశేషాదికారాలు ఉపయోగిస్తారు తప్ప ప్రతీ సమస్యను ఆయనే స్వయంగా పరిష్కరించరని అందరికీ తెలుసు. ఆ పని చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది పూర్తిగా విఫలమయిందని భావించినపుడు గవర్నరే స్వయంగా జోక్యం చేసుకొంటారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదనుకోలేము. కానీ ప్రతీ సమస్యపై గవర్నర్ ని కలిసి పిర్యాదు చేయడం జగన్ ఒక ఆనవాయితీగా మార్చుకొన్నారు.   ఆయన తీరు చూస్తుంటే ‘నాన్న పులి’ కధ గుర్తుకు వస్తోంది. చివరికి ఇది కూడా ఒక ‘రొటీన్ తంతు’ గా మారిపోతోంది. జగన్మోహన్ రెడ్డి తన ముఖ్య నేతలని వెంటబెట్టుకొని గవర్నర్ ని కలవడం, ఆయనకి వినతి పత్రం ఇస్తూ ఫోటోలు తీయించుకొని మీడియాలో వస్తే వాటిని చూసి తృప్తి పడటం మినహా దాని వలన మరే ప్రయోజనం కనబడటం లేదు. ఆయన ఆశిస్తున్నట్లుగా దాని వలన పార్టీకి పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో గవర్నర్ ని కలుస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడితే మంచిది.

బ్యాంకులకి కావూరి కంపెనీ రూ. 1,000 కోట్లకు టోపీ?

  మాజీ ఎంపీ కావూరి సాంభశివరావుకి చెందిన ప్రోగ్రెసివ్ కంస్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ తమ బాకీలు తిరిగి చెల్లించడంలేదంటూ వేర్వేరు బ్యాంకులకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ లో అబీడ్స్ సెంటర్ వద్ద గల ఆయన కార్యాలయం ముందు ఈరోజు మౌన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఒకటీ రెండు కాదు 18 బ్యాంకులకు ఏకంగా రూ. 1,000 కోట్లు ఆయన సంస్థ బాకీలు పడింది. ఆ సంస్థ చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల కోసం తమ వద్ద నుండి అప్పులు తీసుకొందని తరువాత ఎన్ని సార్లు అడిగినా తిరిగి చెల్లించడం లేదని సదరు బ్యాంకులు ఆరోపిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. సామాన్య ప్రజలు ఎవరయినా చిన్న మొత్తం అప్పు తీసుకొంటే దానిని వారి వద్ద నుండి ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు ఏకంగా వెయ్యి కోట్లు ఒక ప్రజా ప్రతినిధికి చెందిన సంస్థకు ఇవ్వడం, అది ఆయన తిరిగి చెల్లించనపుడు దానిని వసూలుచేసుకోలేక...కనీసం ఆయనను గట్టిగా నిలదీసి అడగలేక ఆయన కార్యాలయం ముందు మౌన ప్రదర్శన చేయడం చేయడం అవి ఎంత నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాయో స్పష్టం అవుతోంది. బ్యాంకులు అంత బారీ రుణాలు ఆయన సంస్థకు ఇచ్చేయంటే ఏదో ఒక హామీ తీసుకొనే ఉంటాయి. కోర్టుకు వెళ్లి వాటిని వేలం వేసి తమ బాకీ రాబట్టుకొనే ప్రయత్నం చేయకుండా, ఈవిధంగా ఆయన కార్యాలయం ముందు నిలబడి మౌనప్రదర్శన చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన కావూరి ప్రజలకి ఆదర్శంగా వ్యవహరించాలి. కానీ ఆయనే ఈవిధంగా బ్యాంకు బకాయిలు చెల్లించకుండా వారికి ఈ దుస్థితి కల్పించడం చాలా శోచనీయం. ఇటువంటి విషయాలలో సామాన్యులపట్ల బ్యాంకులు ఏవిధంగా కటినంగా వ్యవహరిస్తాయో, అదేవిధంగా కావూరి సంస్థతో కూడా వ్యవహరించి ఉంటే ప్రజలు కూడా హర్షించేవారు. కానీ సామాన్యుల పట్ల ఒకవిధంగా డబ్బు, పలుకుబడి అధికారం ఉన్నవారి పట్ల మరో విధంగా వ్యవహరించడం వలన వారికి ప్రజల సానుభూతి, మద్దతు కూడా లభించదు. పైగా ఇటువంటి విమర్శలే ఎదుర్కోవలసి వస్తుంది.

వైకాపా నేతల ఆ విమర్శల వెనుక వ్యూహం ఏమిటో?

  వైకాపా నేతలు అందరూ కూడబలుకొన్నట్లుగా ఒకేసారి మూకుమ్మడిగా తెదేపా ప్రభుత్వంపై , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తుండటం చూస్తుంటే దాని వెనుక ఏదయినా సరికొత్త వ్యూహం సిద్దం చేసుకొన్నారా? అని అనుమానం కలుగుతోంది. ఆ పార్టీకి చెందిన బొత్స సత్యనారాయణ, వాసిరెడ్డి పద్మ, ధర్మాన ప్రసాదరావు ఒకేసారి మూడు వేర్వేరు ప్రాంతాల నుండి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విజయవాడ నగరంలో బయటపడిన సెక్స్ రాకెట్, కల్తీ మద్యం, ఇసుక మాఫియా అంశాలను ప్రస్తావిస్తూ వారు విమర్శలు గుప్పించారు. కానీ బాక్సైట్ తవ్వకాల గురించి తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడకపోవడం గమనార్హం.   ప్రత్యేక హోదా అంశంతో తెదేపా ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని ప్రయత్నించి చివరికి జగన్మోహన్ రెడ్డి చాలా అవమానకరంగా తన ఆమరణ నిరాహార దీక్షను ముగించవలసి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. అప్పటి నుండి అటువంటి అంశం కోసం వైకాపా నేతలు అన్వేషిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగానే వైకాపా తమ పోరాటాలు కొనసాగించేందుకు మళ్ళీ మంచి బలమయిన కారణం దొరికిందని సంతోషపడ్డారు. కానీ వారి అత్యుత్సాహం కారణంగా అప్రమత్తమయిన ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల కోసం తను జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసింది. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ వైకాపా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వం తీసుకొన్న ఆ నిర్ణయం దానికి బహుశః నిరాశ కలిగించి ఉండవచ్చును. ఒకప్పుడు మనసులో రాష్ట్ర విభజన జరగాలని కోరుకొంటూనే, మళ్ళీ దానిని వ్యతిరేకిస్తు పోరాడినట్లే, ఇప్పుడు బాక్సైట్ తవ్వకాల విషయంలో కూడా ప్రయత్నించింది. కానీ మళ్ళీ ఆ విషయంలో కూడా వైకాపా భంగపడింది.   చింతపల్లి సభకు బాగానే జనసమీకరణ చేసి విజయవంతం అయిందనిపించుకొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వులను నిలిపివేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చింతపల్లి వెళ్లి బహిరంగ సభ ఎందుకు నిర్వహించారోనని రాజకీయ వర్గాలలో వారు నవ్వుకొంటున్నారు. ఆ సభ నిర్వహించడం వలన వైకాపాకు కొత్తగా ఒరిగిందేమీ లేదు కానీ వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడటం వలన, ఆ సభ ద్వారా వైకాపా చెప్పాలనుకొన్నది ప్రజలకు చేరకపోగా తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. సభలో జగన్ మాటల కంటే ఆమె మాటలే హైలైట్ అయ్యాయి. చివరికి ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి కూడా కనబడుతోంది. ఇదంతా ఎలాగ ఉందంటే ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ అన్నట్లుంది.   నిజానికి వైకాపా నేతలందరూ తమ చింతపల్లి సభ విజయవంతం అవడం గురించి, బాక్సైట్ తవ్వకాల గురించి మాట్లాడి ఉండాల్సింది. కానీ ఎవరూ ఆ ప్రసక్తి ఎత్తడం లేదంటే మళ్ళీ మరోమారు తాము తప్పటడుగు వేశామని గ్రహించినట్లు అర్ధమవుతోంది. బహుశః అందుకే ప్రజల దృష్టిని దాని నుండి మళ్ళించడానికి వైకాపా నేతలందరూ కూడబలుకొన్నట్లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నట్లున్నారు.

బీఫ్ ఫెస్టివల్ కోసం భవిష్యత్ పణంగా పెట్టడం వివేకమనిపించుకొంటుందా?

  ఊహించినట్లే ఉస్మానియా విద్యార్ధులు పంతానికి పోయి హైకోర్టు మరియు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆదేశాలను ధిక్కరిస్తూ బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న 12 మంది విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేసారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినందున వారు వేరే వర్గం మీద విజయం సాధించిన అనుభూతి పొందుతుండవచ్చును. కానీ ఆ అనుభూతికి చాలా బారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు వారికి శిక్ష తప్పకపోవచ్చును. అలాగే తమ విశ్వవిద్యాలయ ఆదేశాలను ధిక్కరించినందుకు వారి అడ్మిషన్లు రద్దయ్యే అవకాశం ఉంది. ఈ రెండు జరిగినట్లయితే వారి చదువులు, భవిష్యత్ దెబ్బ తినే ప్రమాదం ఉంది. కనుక హైకోర్టు మరియు విశ్వవిద్యాలయం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ విద్యార్ధులను క్షమించి వదిలిపెడితే బాగుంటుంది. లేకుంటే వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. దేశంలో ప్రధాన మంత్రి అంత వ్యక్తే చట్టానికి కట్టుబడి ఉంటునప్పుడు విద్యార్ధులు తాము చట్టానికి అతీతులమని భావిస్తూ ఇటువంటి పనులకు పూనుకొంటే చివరికి నష్టపోయేది వాళ్ళే. కనుక ఇంతటితో ఈ అనవసరమయిన రాద్ధాంతానికి స్వస్తి పలికి చదువులపై దృష్టి పెడితే మంచిది.

తెదేపాకు విజయ రామారావు గుడ్ బై!

  తెలంగాణాలో తెదేపాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత విజయరామారావు ఇవ్వాళ్ళ పార్టీకి రాజీనామా చేసారు. ఆయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి పంపారు. ఆయన ఖైరతాబాద్ పార్టీ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నప్పటికీ గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తెరాసలోకి మారే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఎన్నికల ముందు హైదరాబాద్ జంట నగరాలలోని పార్టీ నేతలు వెళ్లిపోతుండటంతో పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రిని చంపుతానని ఎమ్మెల్యే హెచ్చరిస్తుంటే జగన్ ముసిముసి నవ్వులా?

  వైకాపా సంస్క్రతి ఎంత గొప్పదో నిన్న చింతపల్లిలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో మరొకమారు బయటపడింది. విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జగన్ ఆ సభను నిర్వహించారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై షరా మామూలుగా తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించారు.   ఇటువంటివన్నీ ప్రస్తుత రాజకీయాలలో మామూలు విషయాలే అని సరిపెట్టుకోవచ్చును. కానీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తను ఒక ప్రజా ప్రతినిధిననే విషయం కూడా మరిచిపోయినట్లు “ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో అడుగుపెట్టినట్లయితే ఆయన తల నరుకుతాను...బాణాలతో చంపుతాము” అని తప్పుగా మాట్లాడారు. ఆమె అలాగ మాట్లాడుతుంటే పక్కనే నిలబడిన జగన్మోహన్ రెడ్డి చిర్నవ్వులు చిందించారు తప్ప ఆమెను వారించే ప్రయత్నం చేయలేదు. అది చూసి ఆమె మరింత రెచ్చిపోతూ ముఖ్యమంత్రిని ‘వాడు...వీడు..’ అంటూ సంభోదిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే జగన్ ఆమె మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వారు.   ఆమె వెనుకబడిన ప్రాంతానికి చెందిన ఒక గిరిజన మహిళ కనుక ఆమెకు తన పరిధిని అతిక్రమించకూడదనే విషయం తెలిసిఉండకపోవచ్చునని సరిపెట్టుకోవచ్చును. కానీ పక్కనే నిలబడి ఉన్న జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసు. కానీ ఆయన తన పార్టీ ఎమ్మెల్యే ఆవిధంగా ముఖ్యమంత్రిపట్ల అభ్యంతరకరంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని హత్య చేయడానికి కూడా వెనుకాడనని హెచ్చరిస్తుంటే ఆయన వెంటనే ఆమెను వారించకపోగా ముసిముసి నవ్వులు నవ్వడాన్ని ఏమనుకోవాలి?   ఎమ్మెల్యేగా ఎన్నికయిన తరువాత ప్రజాప్రతినిధులు అందరూ తాము రాజ్యాంగానికి లోబడి నడుచుకొంటామని ప్రమాణం చేస్తారు. కానీ వైకాపా ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని చంపుతానని బహిరంగంగా హెచ్చరిస్తుంటే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆమె మాటలను సీరియస్ గా తీసుకొన్నట్లయితే అమవుతుందో ఆమెకి తెలియక పోవచ్చును కానీ జగన్మోహన్ రెడ్డి తప్పకుండా తెలిసే ఉంటుంది. అయినా ఆమెను వారించకపోవడం చూస్తుంటే ఆమెను ఆవిధంగా మాట్లాడటాన్ని ఆయనే ప్రోత్సహించినట్లు భావించవలసి ఉంటుంది. లేదా తన మనసులో చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న ద్వేషం, ఆగ్రహం ఆమె మాటలలో వ్యక్తం అవుతుంటే అందుకు ఆయన చాలా సంతోషించినట్లు భావించవలసి ఉంటుంది.

కమల్ హాసన్ కార్యాలయానికి వారం రోజులు స్పెషల్ పవర్ కట్!

  చెన్నైలో ఇటీవల కురిసిన బారీ వర్షాల కారణంగా నగరం అస్తవ్యస్తం అవడంతో ‘తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని’ కోలీవుడ్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ విమర్శించారు. ‘తనవంటి ప్రముఖులు విరాళాలు ఈయవలసి వస్తోందంటే ప్రజలు కట్టిన పన్నులన్నీ ఏమయిపోతున్నాయో?’ అని ప్రశ్నించారు.   ఆయన చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు ఆర్ధికమంత్రి పనీర్ సెల్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమల్ హాసన్ కి ఆరు పేజీల బహిరంగ లేఖ వ్రాశారు. అది చూసి కంగారుపడిన కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకొని క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తమిళనాడులో అమ్మ (జయలలిత) ప్రభుత్వంపై ఎవరయినా విమర్శలు చేస్తే అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. కమల్ హాసన్ కూడా మూల్యం చెల్లించక తప్పలేదు. ఆల్వార్ పేటలోని ఎల్డం రోడ్డులో ఉన్న ఆయన కార్యాలయానికి వారం రోజుల పాటు పవర్ కట్ చేయబడింది. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్దరించినప్పటికీ ఎల్డం రోడ్డు కాలనీలో మాత్రం అందుకే పునరుద్దరించలేదని అందరూ భావించారు. కమల్ హాసన్ కార్యాలయానికి మాత్రమే పవర్ కట్ చేస్తే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది కనుక ఎల్డం రోడ్డు కాలనీలో ఉన్న అన్ని ఇళ్ళకి గత వారం రోజులుగా పవర్ కట్ చేసారని మీడియాలో వార్తలు వచ్చేయి.   దానిపై రాష్ట్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ అవన్నీ అర్ధరహితమయిన ఆరోపణలని కొట్టిపడేశారు. “ఆ ప్రాంతంలో ఒక అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబిల్ పాడయిపోయింది. కానీ అక్కడ నీళ్ళు నిలిచిపోవడంతో ఇన్నాళ్ళు రిపేర్ చేయడం సాధ్యం కాలేదు. అందుకే ఎల్డం రోడ్డు ప్రాంతంలో విద్యుత్ సరఫరా పునరుద్దరించడానికి ఆలశ్యం జరిగింది,” అని వివరణ ఇచ్చేరు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పినపటికీ బహుశః మున్ముందు ఇటువంటి సమస్యలు ఇంకా ఎదుర్కోకాక తప్పదేమో?

భారత్ తొలి బులెట్ ట్రైన్ ప్రాజెక్టుని దక్కించుకొన్న జపాన్

  నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత భారతదేశానికి నిజమయిన అభివృద్ధి అంటే ఏవిధంగా ఉంటుందో ప్రజలకు కళ్ళారా చూపిస్తున్నారు. ఆయన ప్రకటించిన అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులలో బులెట్ ట్రైన్ కూడా ఒకటి. ముంబై-అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తామని ఆయన అధికారం చేపట్టిన నాలుగయిదు నెలలకే ప్రకటించారు. అప్పుడు ఎవ్వరూ ఆయన మాటలను నమ్మలేదు. కానీ ఆ ప్రాజెక్టుకి నేడు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర కూడా వేసింది. సుమారు రూ.98,000 కోట్లతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుని జపాన్ దక్కించుకొంది. ఈ ప్రాజెక్టు కోసం చైనా కూడా పోటీ పడింది. కానీ భద్రతా ప్రమాణాలను పాటించడంలో, సాంకేతికంగా కూడా జపాన్ బులెట్ ట్రైన్ లే అన్ని విధాల మెరుగుగా ఉన్నాయని భావించడంతో జపాన్ కే ఈ ప్రాజెక్టును కట్టబెట్టాలని కేంద్రప్రభుత్వం నిశ్చయించుకొంది. జపాన్ ప్రధాని సింజు ఆబే భారత్ లో మూడు రోజుల పర్యటన కోసం రేపు డిల్లీకి వస్తున్నారు. ఆ సందర్భంగా ఇరు దేశాలు ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్టు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి ఒక ప్రకటన చేయవచ్చును.   ముంబై-ఆహ్మదాబాద్ మధ్య 505 కిమీ దూరం ఉంది. దానిని అధిగమించడానికిమన సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్ళు సుమారు 7గంటల సమయం పడుతుంది. అదే బులెట్ ట్రైన్ అయితే ఆ దూరాన్ని కేవలం రెండు గంటల్లో అధిగమించగలదు. అది గంటకు 250-300 కిమీ వేగంతో నడుస్తుంది. ఈ బులెట్ ట్రైన్ వస్తే ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య తిరిగే విమాన సర్వీసులు వేరే మార్గంలో నడుపుకోవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు.

బొత్స పార్టీని వదులుకొంటారా..మద్యం వ్యాపారాలనా?

  విజయవాడ స్వర్ణా బార్ లో కల్తీ మద్యం త్రాగి ఐదుగురు చనిపోయిన వెంటనే హడావుడిగా అక్కడ వాలిపోయిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో మద్యపానంపై నిషేధం విధించాలని డిమాండ్ చేసారు. దానిని అమలు చేసే అవకాశం ముందుగా చంద్రబాబు నాయుడుకే ఇస్తున్నామని, ఒకవేళ ఆయన వలన కాకపోతే తమ పార్టీ అధికారంలోకి రాగానే తాము అమలుచేస్తామని ప్రకటించేశారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదీస్తామని హెచ్చరించారు.   ఆయన తెదేపా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నంలో తమ స్వంత పార్టీ నేతలనే ఇబ్బందికర పరిస్థితులోకి నెట్టేరు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ వంటి అనేక మంది నేతలకు మద్యం వ్యాపారాలున్నాయి. అందుకే వారెవరూ ఈ సంఘటనపై నోరు విప్పి మాట్లాడే సాహసం చేయలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే మద్యపాన నిషేధం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే, బొత్స సత్యనారాయణ వంటివారు అనేక మంది వైకాపాను వీడే అవకాశం ఉంటుంది. వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి పార్టీలో నేతలు ఎవరూ మద్యం వ్యాపారం చేయకూడదని సూచించారు. అంటే మద్యం వ్యాపారం చేస్తున్న బొత్స సత్యనారాయణ వంటి నేతలకే ఆ హెచ్చరిక అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే భవిష్యత్ ఉండదని భావించి ఆయన వైకాపాలో చేరితే. ఊహించని విధంగా జగన్ కూడా షాక్ ఇస్తున్నారిప్పుడు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూమద్యనిషేధం అమలు చేయదు కనుక వారికీ ప్రభుత్వం తరపున ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ స్వంత పార్టీ తరపునుండే సమస్య ఎదురవుతుండటం విచిత్రం.

ఎందుకీ భజన రాజేంద్ర ప్రసాద్?

  ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ నేతలు చేసిన సోనియా, రాహుల్ గాంధీల భజనలతో ప్రజల చెవులు చిల్లులు పడ్డాయి. ఇప్పుడు ఆ వారసత్వ భజన కార్యక్రమాన్ని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అందిపుచ్చుకొన్నట్లున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఆయన కుమారుడు నారా లోకేష్ కి భజన చేసేస్తున్నారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతారని, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఆ నోటితోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి రాష్ట్రపతి పదవి కేటాయించేసారు.   అంతవరకు బాగానే ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడి తనేమీ పదవిలో నుండి తప్పుకొంటానని ప్రకటించలేదు. పైగా చంద్రబాబు నాయుడు తనకి జాతీయ స్థాయి రాజకీయాలలో పాల్గొనే ఆసక్తి లేదని ప్రకటించారు. మరి అటువంటప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఈవిధంగా మాట్లాడటం వలన ప్రయోజనం ఏమిటి? దీనిని బీజేపీ నేతలు ఏ విధంగా స్వీకరించాలి?   ఇక నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకోవడం వలన కూడా ఏమీ ప్రయోజనం ఉండబోదు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు, బలాబలాలు ఎలాగా ఉంటాయో, అప్పటికి రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైకాపా భారీ మెజార్టీతో గెలుస్తుందని, తనే ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా నమ్మారు. కానీ చివరికి ఏమయిందో అందరికీ తెలుసు. మళ్ళీ వచ్చే ఎన్నికలలో తమ పార్టీయే గెలిచి అధికారంలోకి రాబోతోందని జగన్మోహన్ రెడ్డి కూడా జోస్యం చెప్పుకొంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కలలు కంటోంది.   కనుక తెదేపా నేతలు భవిష్యత్ గురించి కలలు కనే ముందు వర్తమానంలో దాని కోసం ఏమి చేస్తున్నాము? ఇంకా ఏమేమీ చేయాల్సి ఉంది? అని ఆలోచించి అందుకు అనుగుణంగా పనిచేసుకుపోతే కలలు నిజమవుతాయి. లేకుంటే అవి పగటి కలలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

అమరావతి నిర్మాణానికి కేంద్రం వాటా రూ. 27,097 కోట్లు మాత్రమే!

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సుమారు 1.25 లక్షల కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేస్తుంటే, కేంద్రప్రభుత్వం కేవలం రూ.27,097 కోట్లు ఉంటే సరిపోతుందని ప్రకటించింది. రాజధాని నిర్మాణం వ్యయం అంచనా వేసేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన ఆధారంగా కేంద్ర మంత్రి హెచ్.పి.చౌదరి లోక్ సభలో ఈ ప్రకటన చేసారు. ఆ నివేదిక ప్రకారం రాజధానిలో భవనాల నిర్మాణానికి రూ. 10,519 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.1,563 కోట్లు అవసరమని ప్రకటించారు.   రాజధాని నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం ఇంతవరకు రూ.1850 కోట్లు విడుదల చేసింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మరో రూ.25, 247 కోట్లు విడుదల చేస్తే సరిపోతుంది. కేంద్రప్రభుత్వం మొదటి నుండి కూడా రాజధాని ప్రధాన నగర నిర్మాణానికి, దానిలో సచివాలయం, శాసనసభ, రాజ్ భవన్, హైకోర్టు తదితర భవనాల నిర్మాణానికి మాత్రమే నిధులు మంజూరు చేస్తానని చెపుతోంది. కనుక ఆ లెక్క ప్రకారమే అంచనాలు వేసి రాజధాని నిర్మాణం కోసం తను ఇవ్వబోయే మొత్తం ఎంతనే విషయంపై నేడు పార్లమెంటులో స్పష్టత ఇచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. ఇంతవరకు విడుదల చేసిన డబ్బు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు ఖర్చు చేసినట్లు, అందుకు కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చేయి. ఒకవేళ ఆ వార్తలు నిజమనుకొంటే, ఖర్చయిపోయిన ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవలసి ఉంటుంది.   రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్న లెక్కలకి, కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిదులకి ఎక్కడా పొంతన లేదు. ఇది ముందుగానే గ్రహించినందునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిని “స్విస్ ఛాలంజ్” పద్దతిలో నిర్మించభోతున్నట్లు ప్రకటించారు. ఆ విధానంలో రాజధాని నిర్మాణంలో పాలుపంచుకొనే విదేశీ సంస్థలే పెట్టుబడులు పెడతాయి. అందుకు ప్రతిఫలంగా వాటికి రాజధానిలో వాణిజ్య స్థలాలు లేదా అవి నిర్మించి ఇస్తున్న భవనాలలో దీర్ఘ కాలం లీజు క్రింద ఇస్తారు. తద్వారా కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వకపోయినా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ వినూత్నమయిన ఆలోచన రాష్ట్రానికి మేలే చేస్తుందో లేక నష్టపోవలసి వస్తుందో కాలమే చెప్పాలి.   ఏమయినప్పటికీ చంద్రబాబు నాయుడు కలలు కంటున్నా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అయితే బహుశః అందులో సామాన్య ప్రజలకు చోటు ఉండక పోవచ్చును. ఎందుకంటే అత్యుత్తమ, అత్యాధునిక సౌకర్యాలు, సదుపాయాలు, హంగులు ఆర్భాటాలు కల్పిస్తునప్పుడు దానికి అక్కడ నివసిస్తున్నవారు చాలా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. కనుక కేవలం లక్షాధికారులు, కోటీశ్వరులకు మాత్రమే రాజధానిలో నివసించే యోగ్యత కలిగి ఉంటారేమో? ఏమో? ఈ సందేహానికి కాలమే సమాధానం చెపుతుంది.

ఏ సమస్యకయినా పరిష్కారం ఒకటే...అదే జగన్ ముఖ్యమంత్రి అవడం!

  మీ వీధిలో దీపాలు వెలగడం లేదా? మీకు పెన్షన్ సక్రమంగా అందడం లేదా? మీ పంటలకు సక్రమంగా నీళ్ళు అందడం లేదా? మీ అబ్బాయి/అమ్మాయికి ఉద్యోగం దొరకడం లేదా?మీకు ప్రత్యేక హోదా కావాలా? సమస్య ఏదయినా సరే పరిష్కారం ఒకటే..అదే అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం. ఈ సమస్యలకి ఆయన ముఖ్యమంత్రి అవడానికి సంబంధం ఏమిటి అనుకోవద్దు. ఎటువంటి సమస్యలయినా తను ముఖ్యమంత్రి అవగానే తీర్చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. విజయవాడలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన తరువాత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్యకు మళ్ళీ అదే సరయిన పరిష్కారం అన్నట్లు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మధ్య నిషేధం అమలు చేసేస్తామని అక్కడిక్కడే ప్రకటించేశారు.   గుజరాత్ రాష్ట్రంలో చాలా కాలంగా మధ్య నిషేధం అమలులో ఉందని అయినా ఆ రాష్ట్రం దేశంలో నెంబర్: 1 స్థానంలో ఉందని, త్వరలో బిహార్ రాష్ట్రంలో కూడా మధ్య నిషేధం అమలుచేయబోతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారని, అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎందుకు మధ్య నిషేధం అమలుచేయలేకపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. మధ్య నిషేధం అమలు చేసే అవకాశాన్ని ముందుగా తెదేపా ప్రభుత్వానికే వదిలిపెడుతున్నామని, ఒకవేళ తెదేపా అమలుచేయలేకపోయినట్లయితే తరువాత తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించేశారు.   మద్యపానం వలన అనేక కుటుంబాలు చిద్రమవుతున్నప్పటికీ, కల్తీ మద్యం వలన అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నప్పటికీ మనకి మద్యం వలన వచ్చే ఆదాయం అవసరమా? అని జగన్ ప్రశ్నించారు. త్వరలో జరుగనున్న శాసనసభ సమావేశాలలో ఈ కల్తీ మద్యం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ తెలిపారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం త్రాగినవారికి సానుభూతి తెలిపేందుకు వచ్చేరా లేక తనను ముఖ్యమంత్రిని చేయమని ప్రజలను అడిగేందుకు వచ్చేరా? అని ప్రజలకి సందేహం కలిగితే ఆశ్చర్యమేమీ లేదు.

అవినీతిపై ఉపేక్ష తగదు!

నకిలీ పాస్ బుక్ లతో బోగస్ రుణాలు పొందిన వైనాలు వెలుగులోకి వచ్చి సంవత్సరంపైగా అవుతుంది.ఇంకా బయటపడుతూనే ఉన్నాయి.ఇలాంటి అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించి,శిక్షించటంలో అన్ని స్థాయిల్లో పూర్తి నిర్లక్ష్యం కనపడుతున్నది.తాజాగా ఆర్.బి.ఐ.వారు ఈ నేరాలకు బాధ్యులెవరంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖను వివరణ కోరటం అందుకు వారు ఈ పాస్ వ్యవస్థను తీసుకువచ్చామని ఇక ముందు జరగవని చెప్పటం విచిత్రంగానూ,హాస్యాస్పదంగానూ ఉంది.ఇలా అక్రమాలకు పాల్పడినవారు ఏ రాజకీయ పార్టీ నేత పంచనో చేరి మరిన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడు!అందుకు మన లంచగొండి వ్యవస్థ యధాశక్తి సహకరిస్తున్నది! నకిలీ నెయ్యి కుంభకోణమే ఇందుకు తాజా ఉదాహరణ!రాజకీయ వ్యవస్థ, అధికార వ్యవస్థ,పోలీసు వ్యవస్థ,న్యాయ వ్యవస్థ పూర్తిగా దిగజారి నిర్వీర్యమైపోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు!కేంద్ర న్యాయ పరిశోధనా సంస్థల్లో సిబ్బంది కొరత ఏళ్ళ తరబడి కొనసాగుతోంది.నేరాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఇదేం దౌర్భాగ్యం?సమాజ హితం కోరుతున్నవారంతా కూడా ఉదాసీనాన్ని వదలి పాలకుల్లో మార్పుకు, ఒత్తిడి పెంచటానికి ముందుకు రావాలి! అవినీతిపై ఉపేక్ష అంటే అవినీతిని ప్రోత్సహించటమే! గరిమెళ్ళ రామకృష్ణ

సోనియా, రాహుల్ కి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ

  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిలకి డిల్లీ హైకోర్టులో నిన్న ఎదురు దెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకి ఇచ్చిన భారీ రుణానికి సంబంధించిన కేసులో వ్యక్తిగతంగా హాజరు అవడంపై తమకు మినహాయింపు ఇవ్వాలనే వారి అభ్యర్ధనను డిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో వారు నేరానికి పాల్పడినట్లు అనుమాన్నాలు ఉన్నందున కేసు విచారణకు వారు హాజరు కావలసిందేనని డిల్లీ హైకోర్టు ఆదేశించింది. దానిని సవాలు చేస్తూ వారిరువురూ ఇవ్వాళ్ళ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేయనున్నారు.   అసోసియేటడ్ జర్నల్ లిమిటడ్ అనే సంస్థకు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికకి 2010 సం.లో కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్లు రుణం ఇచ్చింది. ఆ తరువాత ఆ పత్రిక మూత పడింది. దాని నుండి ఆ సొమ్ముని వసూలు చేసుకొనే హక్కును రూ. 50 లక్షలకే కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థకు అమ్మేసింది. ఒక రాజకీయ పార్టీ ఒక మీడియా సంస్థకు అంత బారీ ఋణం ఇవ్వడం, దానిని వసూలు చేసుకొనే హక్కులని నామ మాత్ర ధరకే వేరొకరికి అప్పగించడం అంతా కూడా కాంగ్రెస్ నిధులను ఒక ప్రద్దతి ప్రకారం దారి మళ్ళించడానికి ఉద్దేశ్యించినవేనని ఇందులో సోనియా, రాహుల్ గాంధీలే ప్రయోజనం పొంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసు వేశారు. దానిపై విచారణ చేసిన ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వారిరువునీ స్వయంగా కోర్టుకి హాజరుకమ్మని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. అప్పుడు వారిరువురూ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయగా హైకోర్టు కూడా వారు స్వయంగా హాజరు కావలసిందేనని తీర్పు చెప్పింది. కనుక వారు ఇప్పుడు ఆ హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేయబోతున్నారు.

నేను అలాగా అనలేదు, కానీ క్షమాపణలకి సిద్దం: కమల్ హాసన్

  నటుడు కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలను చూసి అధికార అన్నాడి.ఎం.కె. నేతలు ఆయనపై విరుచుకు పడ్డారు. తన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు అంత తీవ్రంగా స్పందిస్తారని ఊహించని కమల్ హాసన్ కంగారు పడినట్లున్నారు. వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకొన్నారు.   "ఒక మిత్రుడుకి వ్రాసిన లేఖలో చెన్నై పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసాను తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని అనలేదు. నేను ఎవరినీ విమర్శించలేదు.. తప్పులు పట్టలేదు. మీడియాలో నా లేఖలో కొంత భాగం మాత్రమే ప్రచురితమయింది. అది కూడా వక్రీకరించబడింది. అయినప్పటికీ ఒకవేళ నా లేఖ వలన ఎవరికయినా బాధ కలిగించినట్లయితే అందుకు క్షమాపణలు తెలపడానికి సిద్దంగా ఉన్నాను,” అని కమల్ హాసన్ అన్నారు.   "మళ్ళీ ఇప్పుడు కూడా పన్నీర్ సెల్వం నాపై చేసిన విమర్శలకి జవాబుగా నేను ఈ వివరణ ఇవ్వడంలేదు. కేవలం నా అభిమాన సంఘాలలో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అయోమయం ఏర్పడకూడదనే ఉద్దేశ్యంతోనే వివరణ ఇస్తున్నాను. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని నా అభిమాన సంఘాలను, విమర్శకులను కోరుతున్నాను,” అని అన్నారు కమల్ హాసన్.

తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందా?

  కాంగ్రెస్ నేతలంటే దేశముదురు రాజకీయ నేతలనే నిశ్చితాభిప్రాయం ప్రజలలో నెలకొని ఉంది. వారు ఎంత గడ్డు పరిస్థితులనయినా ఎదుర్కొని బయటపడుతుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు చూసి హడలిపోతున్నట్లున్నారు. “దానం నాగేందర్ తెరాసలో చేరుతున్నారంటూ ఆ పార్టీ నేతలు ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ తమతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారని” షబ్బీర్ అలి ఆరోపించడం చూస్తుంటే చాలా నవ్వొస్తోంది.   ఒకానొకపుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తెరాస నేతలతో రాష్ట్ర విభజన అంశంపై ఇలాగే మైండ్ గేమ్స్ ఆడిన విషయం మరిచిపోయినట్లున్నారు. కానీ అప్పుడు కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లాగా అక్రోశించలేదు. పట్టు విడుపులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీని చాలా తెలివిగా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెరాసను తమ పార్టీలో కలిపేసుకొని తెలంగాణాలో దాని ఉనికి లేకుండా చేసేద్దామని అతితెలివి తేటలు ప్రదర్శించి చివరికి చేతులు కాల్చుకొంది. అప్పటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు తెరాసను, దాని వ్యూహాలను ఎదుర్కొనలేక చతికిలపడుతూనే ఉన్నారు.   కాంగ్రెస్ పార్టీ ఏపీలో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన చేసింది కనుక కాంగ్రెస్ పార్టీ అక్కడ నష్టపోయిందని సరిపెట్టుకోవచ్చును. కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలిపెట్టుకొని మరీ తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు దెబ్బతింది? దెబ్బతిన్నా మళ్ళీ ఎందుకు కోలుకోలేకపోతోంది? అంటే కేసీఆర్ ధాటికి తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేతలు తట్టుకోలేకపోవడం వలననేనని అర్ధమవుతోంది. షబ్బీర్ అలీ ఆవేదనలో అదే కనబడుతోంది.   అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి వారయినా గొప్పగానే కనిపించవచ్చును. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయినప్పుడే సామర్ధ్యం నిరూపించుకోవలసి ఉంటుంది. కానీ షబ్బీర్ ఆలీ వంటి ఎంతో సీనియర్ నేత తెరాసతో తమతో మైండ్ గేమ్స్ ఆడుతోందని వాపోవడం చూస్తుంటే చాలా నవ్వు వస్తోంది. కాంగ్రెస్ పార్టీ తనను తాను స్వయంగా ఓడించుకొన్నప్పుడే వేరే పార్టీలు అధికారంలోకి వస్తుంటాయని, లేకుంటే ఏ ఇతర పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి లేదని అని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకొంటుంటారు. ఇప్పుడు దానినే తిరగేసి చెప్పుకోవాలేమో? ఏ ఇతర పార్టీ అయినా దానంతట అదే ఓడిపోతే తప్ప కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా గెలవలేదని చెప్పుకోవాలేమో?ఒకవేళ ఆ సత్తా ఉన్నట్లయితే జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో దానిని నిరూపించి చూపుకొనే అవకాశం దాని ఎదురుగా ఉంది.

మీరొస్తామంటే....మేము వద్దంటామా..?

  ఇదేదో సినిమా పాటకి పేరడీ కాదు. తెలంగాణా ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పిన మాటలు. దేని గురించి అంటే...ఇతర పార్టీలలో నుండి తెరాసలోకి రావాలనుకొంటున్న నేతల గురించి. సచివాలయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెపుతూ, “ఇతర పార్టీల ఎమ్మెల్యేలని బలవంతంగా మా పార్టీలో చేర్చుకోవడానికి వాళ్లేమయినా చిన్న పిల్లాలా? ఒక్కొక్కళ్ళు నాలుగయిదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజకీయ అనుభవం ఉన్నవ్వాళ్ళు. వాళ్ళకి ఏది మంచో ఏది చెడో ఎవరయినా చెప్పాలా? వాళ్ళని మా పార్టీలో చేర్చుకోవడానికి మేము ఎటువంటి ఆఫర్లు ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితులయ్యి చాలా మంది మా పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు వస్తామంటే మేము వద్దంటామా? ఎంతమంది వచ్చినా మా తలుపులు తెరిచే ఉంటాయి. మా పార్టీ ఆశయాలకి, సిద్దాంతాలకి అనుగుణంగా పనిచేయగాలమని భావించేవారందరికీ మేము స్వాగతం చెపుతాము,” అని కేటీఆర్ అన్నారు.   జి.హెచ్.ఎం.సి. ఎన్నికలతో తెలంగాణాలో ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తున్నారో దేనిని తిరస్కరిస్తున్నారో స్పష్టం అవుతుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చాలా పనులు చేపట్టిందని వాటిని ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ అన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ కార్యాలయం రాజమండ్రికి తరలించాలి.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ముంపు ప్రాంతాలను తెలంగాణా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిపారు.అయితే,ప్రాజెక్ట్ నిర్మాణన్ని పర్వవేక్షించే కార్యాలయం మాత్రం హైదరాబాదు నుంచి రాజమండ్రికి తరలించాల్సిన అవసరాన్ని మాత్రం మరచారు.అసలు కార్యాలయం హైదరాబాదులో ఏర్పాటు చేయటమే పెద్ద తప్పిదం!ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రం చేపట్టినా రాష్ట్రం చేపట్టినా పర్యవేక్షణ జరగవలసింది ప్రాజెక్ట్ నిర్మాణ స్థలానికి దగ్గరలో ఉంటేనే నిర్మాణం వేగవంతం అవుతుంది.రాష్ట్ర,కేంద్ర పాలకులు ఈ దిశగా ఆలోచించి వెంటనే ప్రాజెక్ట్ అధారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలి.అప్పుడే ప్రాజెక్ట్ నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి కాగలదు. గరిమెళ్ళ రామకృష్ణ