మా ఆయన పాస్‌పోర్టు వివరాలివ్వండి- మోదీ భార్య!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్య యశోదాబెన్‌, తన భర్తకు సంబంధించిన పాస్‌పోర్టు వివరాలను తెలుపవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆమె సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తుని దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే- గత ఏడాది నవంబరులో యశోదాబెన్ తనకి పాస్‌పోర్టు కావాలంటూ పెట్టుకున్న అర్జీని అధికారులు తిరస్కరించారు. ఆమె తన పాస్‌పోర్టుతో పాటు వివాహానికి సంబంధించిన సర్టిపికెట్లను పొందుపరచలేదనీ, అందుకే ఆమె పాస్‌పోర్టుని తిరస్కరిస్తున్నామనీ అధికారులు చెప్పారు. దాంతో ఒళ్లుమండిన యశోదాబెన్‌, వివాహానికి సంబంధించి ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా తన భర్త ఎలా పాస్‌పోర్టుని పొంది ఉంటారో తెలుసుకోవాలనుకున్నారు. అందుకని ప్రస్తుతం సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. మోదీ కనుక తన వ్యక్తిగత వివరాలను దాచిపెట్టి పాస్‌పోర్టును పొందినట్లు వెల్లడైతే, ప్రతిపక్షాలకు ఒక వివాదం దొరికినట్లే! యశోదాబెన్ సమాచారహక్కు చట్టాన్ని ఆశ్రయించడం ఇది మొదటిసారేం కాదు. 2014లో తన రక్షణ కోసం ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారో చెప్పమంటూ ఆమె ఒక దరఖాస్తుని దాఖలు చేశారు. తనకి రక్షణగా ఉన్న వ్యక్తుల గురించి తనకు పూర్తి సమాచారం ఉండాలనీ, లేకపోతే మాజీ ప్రధాని ఇందిరాగాంధీలాగా స్వంత అంగరక్షకుల నుంచే తాను ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందనీ... ఆమె అప్పట్లో ఆందోళనను వ్యక్తం చేశారు.

ఆమె గురించి కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటోందంటే...

  ముంబై దాడులలో ప్రధాన సూత్రధారి అయిన డేవిడ్ హెడ్లీ ముంబై కోర్టుకి రోజుకో నిజాన్ని వెల్లడిస్తున్నాడు. పాకిస్తాన్‌ గూఢచారి వ్యవస్థకీ తీవ్రవాద సంస్థలకూ సంబంధాలున్నాయనీ, తాను భారతదేశానికి చాలా సార్లు వచ్చి వెళ్లాననీ... ఇలా హెడ్లీ చెబుతున్న వివరాలు కొత్తవే అయినా ఆశ్చర్యం కలిగించేవి ఏవీ కావు. కానీ ఇవాళ హెడ్లీ విచారణలో వెల్లడించిన ఒక అంశం తప్పకుండా అటు కాంగ్రెస్‌కి ఇబ్బందినీ, బీజేపీకి సంతోషాన్నీ ఏకకాలంలో కలిగించేదిగా ఉంది. గుజరాత్‌ పోలీసులు 2004లో ఎన్‌కౌంటర్‌ చేసిన ఇస్రత్‌ జహాన్ అనే అమ్మాయి, లష్కర్‌ ఏ తయ్యబా తీవ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి అని హెడ్లీ కుండబద్దలు కొట్టారు. దాంతో ఇన్నాళ్లూ ఇస్రత్‌ జహాన్‌ ఒక అమాయకురాలైన కాలేజి విద్యార్థిని అనీ, ఆమెను మతం పేరుతోనే అన్యాయంగా చంపారనీ చెబుతున్న కాంగ్రెస్‌కు పచ్చివెలక్కాయ పడినట్లైంది. హెడ్లీ చెబుతున్న దాని ప్రకారం ఇస్రత్‌ గుజరాత్‌లో మారణహోమం సృష్టించేందుకు నియమించబడిన ఒక తీవ్రవాది. అందుకోసం ఆత్మాహుతికి సైతం పాల్పడేందుకు ఆమె సిద్ధంగా ఉంది. మరో ముగ్గురు తీవ్రవాదులతో కలిసి ఇస్రత్‌ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ మీద ఆత్మాహుతి దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తుండగా, గుజరాత్‌ పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఇస్రత్ జహాన్ ఎన్‌కౌంటర్‌ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. 2004 తరువాత జరిగిన ప్రతి ఎన్నికలలోనూ కాంగ్రెస్‌ ఇస్రత్ ప్రస్తావనను తీసుకువచ్చేది. మోదీ మతోన్మాదంతో కావాలని ఒక అమాయకురాలని చంపించాడని ఆరోపించేది. అనేక న్యాయవిచారణలలో కూడా ఇస్రత్‌ని చంపేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపారని తేలడంతో బీజేపీ తనను తాను సమర్థించుకునేందుకు ఇన్నాళ్లూ అవకాశం లేకపోయింది. కానీ ఇప్పడు సాక్షాత్తూ లష్కర్‌ ఏ తయ్యబా తీవ్రవాది అయిన హెడ్లీనే, ఇస్రత్‌ ఒక కరోడా తీవ్రవాది అని తేల్చేయడంతో కాంగ్రెస్‌ తన బాణీని మార్చింది. కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ ‘ఇస్రత్‌ తీవ్రవాది అయితే అయి ఉండవచ్చు కానీ, ఆమెను ఎన్‌కౌంటరు చేయడం మాత్రం తగిన చర్య కాదు’ అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు మాత్రం ఇన్నాళ్లూ ఒక తీవ్రవాది మరణాన్ని రాజకీయం చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు. ఇస్రత్‌ జహాన్‌ను ఇన్నాళ్లూ పొగిడిన నేతలు ఇప్పడు సంజాయిషీ ఇవ్వాల్సిందే అంటున్నారు. అయినా మన పిచ్చిగానీ నేతలు ఎప్పుడన్నా తప్పుని ఒప్పుకుంటారా?

కథ… స్క్రీన్ ప్లే… దర్శకత్వం .. దాసరిదేనట..

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఎలాగొలా సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ అధికారులు ఆయన డిమాండ్లకు ఒప్పుకోవడంతో ముద్రగడ కూడ దీక్ష విరమించేశారు. ఇక ఈవ్యవహారం సద్దుమణిగిపోయింది. అయితే ఇప్పుడు ముద్రగడ దీక్షతో రాజకీయాలు చేద్దామనుకున్న నేతలకు మాత్రం ఆఖరికి మిగిలింది సున్నా.. పైగా వారి అటు ఇటు కాకుండా అయిపోయింది వారి పరిస్థితి. ఇంతకీ ఆ వారు ఎవరనేది ఇప్పటికే పూర్తిగా అర్ధమై ఉంటుంది. ఇంకెవరూ వైసీపీ పార్టీ నేతలు. ఏదో ఇప్పుడు ముద్రగడ దీక్ష విరమించడంతో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది కానీ.. దీనికి వేయాల్సిన స్కెచ్ ముందే వేశారంట వైసీపీ అధినేత జగన్ అండ్ బ్యాచ్. అయితే కథ… స్క్రీన్ ప్లే… దర్శకత్వం మాత్రం దాసరిదేనని అంటున్నారు రాజకీయ వర్గాలు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న దాసరిని జగన్ కలవడంతో ఆయన కదిలిపోయి.. జగన్ తో కలిసి కాపులకి నేనే ఐకాన్ అంటూ ఆయన రంగంలోకి దిగేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. దీనిలో భాగంగానే దీక్ష చేస్తున్నప్పుడు ముద్రగడకు మద్దతు తెలపడానికి కిర్లంపూడిలోకి ఆయన నివాసానికి రావడానికి కూడా బయల్దేరారు. కానీ పోలీసులు మాత్రం ఆయనను రానివ్వకుండా అక్కడే ఆపేశారు. దీనికి గాను దాసరి ప్రభుత్వంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మరోవైపు జగన్ ఎలాగూ అటు సీమలో ప్రత్యేక నిప్పు పెట్టే ప్రయత్నాలు ఎలాగూ చేస్తున్నాం.. ఇటు కోస్తాలో కాపు రచ్చ రగిల్చి వాడుకోవాలి అనుకున్నారు. అందుకనే దీక్ష చేపట్టిన ఆందోళన కారుల దగ్గరకు తమ నేతలను పంపించి మరీ మద్దతు తెలిపారు. అలా కాపులకు మద్దతు తెలిపి టీడీపీని ఇరకాటంలో పెట్టాలని చూసింది. కానీ ముద్రగడ దీక్ష విరమించేసరికి సీన్ రివర్స్ అయింది. మరోవైపు కాపు దీక్షకు ఓపెన్ గా మద్దతు తెలపడంతో బీసీ సంఘాలనుండి వ్యతరేక భావం ఏర్పడిందని.. బిసిలకు దూరం కావాల్సి వచ్చిందని వైసిపి నేతలు వాపోతున్నారు. దీంతో వైకాపా పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. మరి ఇప్పుడు బీసీ సంఘాల ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో బీసీ సంఘాలకు సపోర్ట్ చేసి వారి నుండి బలాన్ని పొందుతారో లేదో చూడాలి. 

6,000 కోట్లు- పాకిస్తాన్‌కు అమెరికా సాయం!

ఒక పక్క ప్రపంచంలోని ప్రతి తీవ్రవాద చర్యా పాకిస్తాన్‌ వైపు వేలెత్తి చూపించవచ్చుగాక! కానీ అమెరికా, పాకిస్తాన్‌ మీద మండిపడుతున్నట్లు కనిపిస్తూనే కావల్సినప్పుడు కావల్సినంత సాయం చేస్తూనే ఉంటుంది. అందుకు తాజా ఉదహరణగా తీవ్రవాదం మీద ‘పోరాడేందుకు’ అమెరికా 6,000 కోట్ల రూపాయలని పాకిస్తాన్‌కు అందిస్తోంది.  తీవ్రవాదం మీద జరుగుతున్న పోరులో పాకిస్తాన్‌ తన ముఖ్యమైన భాగస్వామి అనీ, అందుకు ప్రతిఫలంగా ఆ దేశానికి ఈ భారీ సాయం అందిస్తున్నామనీ అమెరికా నేతలు చెబుతున్నారు. తీవ్రవాదులు తమ దేశంలోకి చొచ్చుకురాకుండా పోరాడేందుకూ, అలా చేసే పోరాటం కోసం తగిన ఆయుధాలను సమకూర్చుకునేందుకూ అమెరికా ఈ డబ్బుని అందిస్తోందట. ఇలా పాకిస్తాన్‌కి ధనసాయం అందించడం వల్ల పాకిస్తాన్‌లోని తీవ్రవాదం అంతరించిపోయి, భారతదేశంతో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయన్నది అమెరికా ఉవాచ. కానీ విశ్లేషకుల అంచనా మాత్రం వేరేలా ఉంది. ఆసియాలో నానాటికీ పెరుగుతున్న భారతదేశం ప్రాబల్యాన్ని తగ్గించేదుకే తరచూ అమెరికా, పాకిస్తాన్‌కు ఇలాంటి సాయం చేస్తూ ఉంటుందంటున్నది వారి వాదన. అమెరికా అభిప్రాయం ఎలా ఉన్నా పాకిస్తాన్‌ నిజంగా ఈ సొమ్మును తీవ్రవాదులను నిర్మూలించేందుకు వాడుతుందా లేక వారిని మరింతగా పెంచి పోషించేందుకు ఉపయోగిస్తుందా అన్నది అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబుని ఊహించడం ఏమంత కష్టం కాదేమో!

తుని ఘటన.. ప్రభుత్వం వదిలినా మేం వదలం..!

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జన పేరిట ఓ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అది కాస్త ఉద్రిక్తంగా మారి ఆందోళన కారులు రెచ్చిపోయి వాహనాలు, రైలుకు నిప్పంటించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఈ విషయంపై రైల్వేశాఖ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31న జరిగిన తుని ఘటనలో ఆందోళన కారులు రత్నాచల్ ఎక్స్రప్రెస్ కు నిప్పంటించి.. అందులో ఉన్న ప్రయాణికులను భయభ్రాంతులను చేశారు. దీంతో విశాఖ నుండి విజయవాడ మధ్య ఉన్న ప్రాంతాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించటంతో పాటు రైల్వేశాఖకు కూడా అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టి తీవ్ర నష్టం కలిగించిన అంశాన్ని రైల్వేశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఈఘటనకు సంబంధించి ఆధారాలను సేకరించడంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి కొంత మంది ఫొటోలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అంతేకాదు నిప్పంటిన వారే కాదు.. ఆందోళన ఉద్రిక్తత చేయడానికి ప్రయత్నించిన వారిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రైల్వే దర్యాప్తు బృందాలు చాలా లోతుగా దర్యాప్తును సాగిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ ఆధారాలను సేకరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ప్రభుత్వ చూసీ చూడనట్టు వదిలేస్తుందేమో కానీ మేము మాత్రం వదిలేది లేదు రైల్వేశాఖ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి సంఘటనలను తేలికగా వదిలేస్తే భవిష్యత్తులో మళ్లీ పునరావృతమవుతాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి మన ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందో లేదో తెలియదు కానీ రైల్వే అధికారులు మాత్రం వదిలేరాలేరు..

హనుమంతప్పకు దేశ వ్యాప్త ప్రార్ధనలు.. ప్రముఖుల ట్వీట్లు.

గత వారం సియాచిన్‌లో ఏర్పడిన హిమపాతంలో 10మంది సైనికులు గల్లంతైన సంగతి తెలిసిందే. వారిలో తొమ్మిది మంది జవాన్లు చనిపోగా ఒక హనుమంతప్ప మాత్రం మృత్యుంజయుడై సజీవంగా బయటపడ్డాడు. హిమపాతంలో గల్లంతైన జవాన్ల కోసం రెస్క్యూ టీమ్ అక్కడి వెళ్లి వారిని వెలికితీసే క్రమంలో హనుమంతప్ప సజీవంగా బయటపడ్డాడు. దీంతో అతనిని ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే హనుమంతప్ప కోమాలోకి వెళ్లినట్టు వైద్యులు చెప్పిన నేపథ్యంలో అతను తొందరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్ధనలు జరుపుతున్నారు. అంతేకాదు అతను కోలుకోవాలని ప్రముఖులు కూడా ట్వీట్టర్లో ట్వీట్స్ కూడా చేస్తున్నారు.

ప్రాణాయామంతోనే ఆ సైనికుడి ప్రాణాలు నిలిచాయా!

గత వారం సియాచిన్‌లో ఏర్పడిన హిమపాతంలో 10మంది సైనికులు గల్లంతైన సంగతి తెలిసిందే! కనీసం వారి మృతదేహాలన్నా వెలికితీయాలని అక్కడి భారతీయ సైనికులు సాగించిన వెతుకులాటలో ఒక అద్భుతం వెలికి చూసింది. హనుమంతప్ప అనే ఒక సైనికుడు ఇంకా ప్రాణాలలతోనే ఉండటం ప్రపంచాన్నే ఆశ్చర్యపరచింది. దాదాపు 35 అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన హనుమంతప్ప, అయిదురోజుల పాటు ప్రాణాలను నిలుపుకోగలిగాడు. 20,000 అడుగుల ఎత్తున ఉండే సియాచిన్‌ పర్వతాల మీద ఆ సమయంలో -40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఆ పరిస్థితులలో అయిదు రోజులు కాదు కదా! అయిదు గంటలు కూడా మంచులో ఉండటం సాధ్యం కాదు. ఎలాంటి ఆహారం కూడా లేకుండా హనుమంతప్ప అయిదు రోజుల పాటు సజీవంగా ఉండటం ఇప్పడు వైద్యులని సైతం ఆశ్చర్యపరుస్తోంది. హనుమంతప్ప యోగాలో నిష్ణాతుడు కావడమే అతని ఊపిరికి కారణమంటున్నారు అతని సహచరులు. హనుమంతప్ప ప్రాణాయామంలో దిట్ట అట. కేవలం తాను యోగాసనాలను వేయడమే కాకుండా, తన సహచరులకు కూడా యోగాను నేర్పించేవాడట. యోగా చేయడం వల్ల అలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే శారీరక సామర్థ్యమే కాకుండా, మానసిక స్థైర్యం అలవడుతుందనీ... అందుకు హనుమంతప్ప సంఘటనే ఉదాహరణ అనీ యోగా గురువులు పేర్కొంటున్నారు. ఈ దెబ్బతో యోగా వైభవం మరోసారి ప్రపంచం ముందుకి వచ్చినట్లైంది.

జికా వైరస్‌కు టీకా ఇప్పట్లో లేనట్లేనా!

హైదరాబాదుకు చెందిన భారత్‌ బయోటెక్ సంస్థ తాను జికాకు టీకాకు కనుగొన్నానని ప్రపంచానికి సగర్వంగా చాటింది. ఈ టీకాని ప్రయోగించే దశ చివరికి చేరుకుందనీ, ప్రభుత్వం నుంచి కనుక త్వరత్వరగా అనుమతులు లభిస్తే మరో రెండేళ్లలోనే విపణిలోకి తీసుకురాగలమని చెప్పింది. అయితే ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రస్తుతం చుక్కెదురైంది. భారతదేశంలోని ఔషధ పరిశోధనలను నియంత్రించే ‘ఇండియన్ కౌన్సల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌’ (ICMR) భారత్‌ బయోటెక్ సాధించిన ప్రగతితో అంతగా తృప్తి చెందినట్లు కనిపించడం లేదు. జికా టీకా ఎలా పనిచేస్తుందో తమకి స్పష్టత కలగడం లేదనీ, మరింత సమాచారంతో తమ వద్దకు రమ్మని ICMR, భారత్ బయోటెక్‌ సంస్థ ప్రతినిధులకు సూచించిందట. అంతేకాదు! తాము నిబంధనల మేరకే అనుమతులు ఇస్తామనీ, త్వరత్వరగా అనుమతులని అందించే ప్రసక్తే లేదని ICMR ఉన్నతాధికారి సౌమ్యా స్వామినాధన్‌ కుండబద్దలు కొట్టేశారు. దాంతో ‘సాధారణ ప్రక్రియ’ ప్రకారమే జికా వైరస్‌కు టీకా రూపొందించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీని వల్ల ఈ టీకా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడానికి కనీసం ఏడేళ్లు పడుతుంది. జికా టీకాను ICMR నిలువరించడానికి కారణం ముందస్తు జాగ్రత్తా లేకపోతే ప్రభుత్వ సంస్థలతో కనిపించే నిస్తేజమా అన్నది తెలియడం కష్టం. ఏదేమైనా ఈ టీకా ఆలస్యం అయ్యేకొద్దీ లక్షల మంది ప్రజలు మాత్రం ప్రమాదపు అంచున ఉంటారన్నది మాత్రం వాస్తవం.  

కేసీఆర్ క్యాబేజీలు హరీశ్ రావు వాడుతున్నాడంట..!

తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఫాంహౌజ్ లో పలు రకాలైన కూరగాయలు పండిస్తారు. అందులో క్యాబేజీలు కూడా పండిస్తారు. అయితే ఆయన పండించిన క్యాబేజీలను కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు ఎక్కువగా ఉపయోగిస్తున్నారంట. అది ఎలాగంటారా.. ప్రజల చెవుల్లో పెట్టడానికి. ఇంతకీ ఈ మాటలు ఎవరన్నారనుకుంటున్నారా.. ఇంకెవరూ..టీడీపీ ఫైర్ బ్రాండ్.. రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కడే ఇలాంటి మాటలను పేల్చగలడూ. టీఆర్ఎస్ విషయంలో అయితే రేవంత్ కు మాటలు అలా వచ్చేస్తుంటాయంతే. ఇంతకీ సంగతేంటంటే.. నారాయణ్ ఖేడ్ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. తమ అభ్యర్ధి తరపున ప్రచారంలో రేవంత్ రెడ్డి..కేసీఆర్‌ ఫ్యామిలీపై మళ్ళీ విమర్శనాస్త్రాలు గుప్పించారు. గ్రేటర్ ఓటమితో..నారాయణ్ ఖేడ్ ఎన్నికల్లో విపక్ష పార్టీలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని.. గతంలో ఖేడ్ ను పట్టించుకోని టీఆర్ఎస్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతోంద‌ని.. మంత్రి హరీష్ రావు సింగూర్ ప్రాజెక్టు ఎండగట్టారని..అందుకే జిల్లాలో మంచి నీటి కరువు ఏర్పడిందని ఆరోపించారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా కేసీఆర్ పండిస్తున్న క్యాబేజీల‌ను హరీష్ రావు ఖేడ్ ప్రజల చెవిలో పెడుతున్నారని.. ఇప్పటికే కేసీఆర్ వారసుడు కేటీఆర్ అని తేల్చిచెప్పారు..టీఆర్ఎస్ లో స్థానం లేని హరీష్ రావు నారాయణ్ ఖేడ్ ను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మరి రేవంత్ కౌంటర్లకు టీఆర్ఎస్ పార్టీ.. హరీశ్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.

పవన్ కళ్యాణ్ కు సీన్ రివర్స్ అయినట్టుంది..!

ముద్రగడ పద్మనాభం కాపుల కోసం చేపట్టిన దీక్ష ఫలించిందనే చెప్పొచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నివేదిక రావడం..వారిని బీసీల్లో చేర్చడం.. రిజర్వేషన్లు కల్పించడం.. వీటన్నింటికి ఎంత సమయం పడుతుందో తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం ముద్రగడ డిమాండ్ లకు సానుకూలంగా స్పందించింది..దీంతో ముద్రగడ కూడా తాను చేపట్టిన నిరాహార దీక్షను విరమించాడు. అయితే ఇక్కడ వరకూ పరిస్థితి బానే ఉంది. దీనివల్ల ఇప్పుడు జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పడాల్సి వచ్చింది. ఈ కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో అటు దీక్ష చేపట్టిన ముద్రగడ బానే ఉన్నాడు.. తన డిమాండ్ లకు ఓకే చెప్పిన ఏపీ ప్రభుత్వం బానే ఉంది.. కానీ ఈ ఉద్యమం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై మాత్రం కాపులలో వ్యతిరేకత ఏర్పడింది. ముద్రగడ ఏర్పాటు చేసిన మహా గర్జన ఉద్రిక్తంగా మారిందనే విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆందోళనకారులు రైలును కూడా తగలబెట్టారు. దీంతో ఇది చాలా వివాదాస్పదమైంది. ఈ సంఘటన గురించి పలువురు పలు రకాలుగా కూడా వ్యాఖ్యానించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి తనకు తోచింది చెప్పారు. అయితే అక్కడే పవన్ కళ్యాణ్ పప్పులో కాలేశారు. రైలు తగలబెట్టడం అసాంఘీక శక్తుల చర్య అయి ఉండొచ్చని.. తను ప్రత్యేకంగా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదని తానొవ్వక.. నొప్పించక అనే రీతిలో మాట్లాడాడు. దీంతో కాపు వర్గం పవన్ కళ్యాణ్ పై మండి పడుతుంది. కాపు వర్గానికి సపోర్డ్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడినందుకు ఆయనపై నిరసనలు వెల్లువెత్తాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మని దగ్ధం చేయటానికి ప్లాన్ చేసుకున్నారు. ఇక వెంటనే తేరుకున్న పవన్ కళ్యాణ్ మొదటికే మోసం వస్తుందనుకున్నారేమో.. కాపులను గుర్తించాలంటూ తను ట్విట్టర్ నుండి మద్దతు ప్రకటించాడు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉందని.. కాపుల డిమాండ్‌ను పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీని పవన్ కోరారు. అయితే దీనికి కూడా వారు పవన్ కు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ లో మద్దతు తెలపడం కాదు.. బయటకు వచ్చి పోరాడు అని అంటున్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

పఠాన్‌కోట్‌ సంఘటనలో అజార్ అమాయకుడు- పాక్‌!

అంతా అనుకున్నట్లే జరిగింది. కాకపోతే కాస్త వెనుకా ముందుగా… అంతే! ‘మీ దేశంలో తలదాచుకుంటున్న మౌలానా అజార్, మా దేశంలోని పఠాన్‌కోట్ మీద దాడి చేయించాడు’ అని భారతదేశం ఎంతగా మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. దీనికోసం మనదేశం అందించిన సాక్ష్యాధారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. భారతదేశం ఇలాంటి ఆరోపణలు చేయగానే పాకిస్తాన్‌ కాస్త హడావుడి చేయడం, వేడి చల్లారిన తరువాత మాకేం తెలియదు పొమ్మంటం కొత్తేమీ కాదు. ఈసారి కూడా పాకిస్తాన్, మన దేశం అందించిన సాక్ష్యాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. అజార్ నేతృత్వం వహిస్తున్న ‘జైష్‌- ఏ- మహమ్మద్‌’ (JeM) తీవ్రవాద సంస్థకి చెందిన కొందరిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఆ సంస్థ నాయకుడైన అజార్‌ జోలికి కానీ... అతని కుడి, ఎడమ భుజాల వంటివారి జోలికి కానీ పోలేదు. ఈ తతంగం అంతా జరుగుతుండగానే, తన జోలికి వస్తే ఊరుకునేది లేదని అజార్‌ పరోక్షంగా ఏం ఖర్మ ప్రత్యక్షంగానే పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. ఎట్టకేళకు ఆయన పంతమే నెగ్గినట్లుంది! పఠాన్‌కోట్‌ దాడికి అజార్‌ పురికొల్పాడని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవంటూ విచారణ బృందం చేతులెత్తేసింది. ఈ మేరకు తమ ప్రభుత్వాధినేతలకు ఒక నివేదికను కూడా సమర్పించింది. మహా అయితే అజార్‌కు ‘తెలియకుండా’ ఆయన శిష్యులు ఎవరన్నా ఈ పని చేసి ఉండవచ్చని తేల్చింది. భారతదేశం తన మీద తానే దాడి చేసుకుని పాకిస్తాన్‌ మీద నింద వేస్తోందని మరో నివేదికలో పేర్కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదేమో! పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం మీద జరిగిన దాడిలో ఏడుగురు వీరజవాన్లనూ, మన రక్షణ దశాల పరువునూ కోల్పోయిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

ముద్రగడ నివాసంలో అర్ధరాత్రి చర్చలు!

కాపులకు రిజర్వేషన్లను కల్పించాలంటూ ముద్రగడ చేపట్టిన దీక్ష నేడు నాలుగో రోజుకి చేరుకుంది. మూడో రోజైన ఆదివారం ముద్రగడ తలుపులు వేసుకుని మరీ దీక్షని సాగించడంతో... జిల్లాలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన ప్రభుత్వం తరఫున కొందరు ప్రతినిధులు అర్ధరాత్రినాటికి ముద్రగడ ఇంటిని చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ముద్రగడ చేసిన డిమాండ్లకు ఇవాళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయ. కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు ఏర్పాటు చేసిన మంజునాధ కమీషన్ తన నివేదికను కేవలం మూడు నెలలలోనే ఇవ్వాలన్నది ముద్రగడ ప్రధాన డిమాండుగా కనిపిస్తోంది. ఇక కాపుల సంక్షేమం కోసం రెండు వేల కోట్లని కేటాయించాలన్నది ఆయన రెండో డిమాండుగా తెలుస్తోంది. తుని సంఘటనలో నమోదైన కేసుల గురించి కూడా ముద్రగడ చర్చించినట్లుగా కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, బోండా ఉమామహేశ్వరావు ఈ చర్చలను నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి తమ ప్రతినిధుల రాయబారానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

విశ్వాసాన్ని కోల్పోయాం – దానం నాగేందర్‌!

కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బడుగుబలహీన వర్గ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడమే, గ్రేటర్‌ ఎన్నికలలో పరాజయానికి కారణమన్నారు దానం నాగేందర్‌. ఎన్నికలు జరుగుతున్నప్పుడే తనకి రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయే తెలిసిపోయిందనీ… ఓటరు నాడిని తాను అప్పుడే గ్రహించాననీ నేడు జరిగిన ప్రెస్‌మీట్లో చెప్పుకొచ్చారు దానం. అందుకే ఎన్నికల తరువాత తన అభ్యర్థులందరినీ ఓటమికి సిద్ధంగా ఉండమంటూ ఓదార్చానన్నారు. అధికార పార్టీనే మేయర్‌ పీఠం మీద ఉంటే తమకు లాభం చేకూరుతుందని ఓటర్లు భావించారనీ…. అందుకే తెలివిగా ఇంత భారీ మెజారటీని కట్టబెట్టారనీ వాపోయారు. అయితే ప్రజలకి వాగ్దానం చేసినట్లుగా తెరాస తన హామీలు అన్నింటినీ నిలబెట్టుకోవాలనీ, లేనిపక్షంలో తాము వారిని నిలదీస్తామని హెచ్చరించారు. గ్రూపు తగాదాల వల్ల కూడా తమ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు దానం. ఈ ఎన్నికలలో పరాజయానికి వ్యక్తిగత బాధ్యతను వహిస్తూ గ్రేటర్‌ హైదరాబాద్ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజినామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.

బల్దియా బాద్ షా కేసీఆర్.. ప్రజల తీర్పు

ఆఖరికి గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు మేయర్ స్థానాన్ని దక్కించుకుంటారా.. ప్రజలు ఎవరికి పట్టం కట్టారా? అని ఎదురుచూస్తున్న అందరి ఉత్కంఠకు తెర దిగింది. అందరూ ఊహించినట్టే ఈ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ తమ ప్రభంజనాన్ని చాటుకుంది. సొంతగా బరిలో దిగిన టీఆర్ఎస్ పార్టీ బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ గ్రేటర్ ఎన్నికలు మొత్తం 150 డివిజన్లలో పోటీ జరగగా.. ఈ స్థానాలకు మొత్తం 31333 మంది అభ్యర్ధులు బరిలో దిగారు.  ఈ 150 డివిజన్లలో కూడా వందకు పైగా స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకొని మరోసారి తన సత్తా చూపించింది.ఇదిలా ఉండగా ఇక మిగిలిన పార్టీలు నామరూపాలు లేకుండా పోయినట్టు తెలుస్తోంది. విపక్షాలు అయితే కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీడీ పార్టీ ఆశలు పెట్టుకున్న ఎరియాలు కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టంకట్టాయి. అంతేకాదు మొత్తం ఎన్నికల నేపథ్యంలో కేవలం 45 శాతం మాత్రమే పోలింగ్ శాతం జరిగింది. అంటే ఒక్క డివిజన్లో సుమారు యాభైవేల మంది ఓటర్లు ఉన్నా.. పోలింగ్ జరిగింది 45 శాతం కాబట్టి అందులో ఇరవై వేల మందికి పైగా తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే ఈ ఇరవై వేలలో దాదాపు పదిహేను వేల మందికి పైగా ఓటర్లు టీఆర్ఎస్ కే ఓటు వేసినట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. గెలిచిన కేటీఆర్ ఈ గ్రేటర్ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం కేసీఆర్ తనయుడు.. మంత్రి కేటీఆర్ గురించి చెప్పుకోవాలి. ఈ ఎన్నికలను తను వ్యక్తిగతంగా తీసుకొని.. ఎన్నికల బాధ్యతను తన భుజాలపై వేసుకొని చాలా కష్టపడ్డారు. తన వాక్చాతుర్యంతో గ్రేటర్ ప్రజలను బాగా ఆకట్టుకొని.. ఎన్నికల గెలుపుకు ప్రధాన కారణమయ్యారు. అంతేకాదు ఈ గ్రేటర్ ఎన్నికలు కేటీఆర్ కి కూడా చాలా ముఖ్యం. ఈ ఎన్నికలపైనే దాదాపు తన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. కేసీఆర్ కూడా తన కొడుకు సామర్థ్యాన్ని చూసుకోవడానికే ఈ ఎన్నికల బాధ్యతను కేటీఆర్ పై మోపారు. అందుకే కేటీఆర్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికల గెలుపుకు కష్టపడ్డారు. కానీ ఎట్టకేలకు టీఆర్ఎస్ గెలిసింది. టీఆర్ఎస్ గెలిచిందంటే కేటీఆర్ కూడా గెలిచినట్టే.. సెటిలర్లు టీడీపీని నమ్మలేదా..? గ్రేటర్ ఎన్నిల్లో పార్టీలన్నీ నువ్వా.. నేనా అంటూ పోటా పోటీగా ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు అందరికి తలెత్తే ప్రశ్న ఏంటంటే.. సెటిలర్లు కూడా టీడీపీని నమ్మలేదా.. సెటిలర్లు ఉన్న ఏరియాలు కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టం గట్టాయి. ఎందుకు..? ఇలా ప్రశ్నలెన్నో తలెత్తుతన్నాయి. ఎందుకంటే.. ఇద్దరు సీఎంల కొడుకులు సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీగా ప్రచారం చేశారు. ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారం చేశారు. మరి ఆయన ప్రచారానికి కూడా ప్రజలు ఇంప్రెస్ అవ్వలేదా..?. అయితే కేటీఆర్ మాత్రం సీమాంధ్రులను ఆకట్టుకునే విధంగా మాట్లాడారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇక సీమాంధ్రులు కూడా కేటీఆర్ మాటలకు పడిపోయారేమేకాని టీఆర్ఎస్ పార్టీకే ఓటేశారు. అంతేకాదు ఎప్పుడూ సీమాంధ్రులకు ఒక్క సీటు కూడా ఇవ్వని కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం దాదాపు 20 స్థానాలను సీమాంధ్రులకు ఇచ్చారు. ఇది కూడా ఒక కారణం అయి ఉండచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..    ఎక్కడో సెటిలర్లు ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే.. అది కూడా చాలా తక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. ఓటమికి కారణాలు ఏంటి..? గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే మిగిలిన పార్టీలను చెత్తగా ఓడించి టీఆర్ఎస్ పార్టీకే పట్టంగట్టారు నగర ప్రజలు. మిగిలిన పార్టీలను ఓడించి టీఆర్ఎస్ పార్టీనే గెలిపించడానికి గల కారణాలు ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్న టీఆర్ఎస్ పాలన ప్రజలకు నచ్చిందా..? టీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వా పథకాలు ప్రజలకు నచ్చాయా..? లేకపోతే.. ఈసారి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో చూద్దామని గెలిపించారా..? ఇలా ఎన్నో కారణాలు కావచ్చు. ఇక తెలంగాణలో మిగిలిన పార్టీల సంగతి అంతంత మాత్రమే ఉంది.. ఇది కూడా టీఆర్ఎస్ గెలుపుకు ఒక కారణం కావచ్చు. మొత్తానికి కారణాలు ఏదైనా కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ ను గెలిపించారు.  

బల్దియా కింగ్ ఎవరు..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గ్రేటర్ ఎన్నికలు రావడం జరిగిపోయింది.. ఎన్నికలు ముగియడం అయిపోయింది. అయితే ఇప్పుడు అందరూ ఆసక్తి చూసేది మాత్రం ఎన్నికల ఫలితాల కోసం. అన్ని పార్టీలూ పోటా పోటీగా ప్రచారం నిర్వహించి. మీరెంత అంటే.. మీరెంత అంటూ.. హైదరాబాద్ ను అభివృద్ది చేసింది మేము అని ఒక పార్టీ అంటే.. ఈసారి మాకు ఛాన్స్ ఇవ్వండి.. ఇంకా అభివృద్ధి చేస్తామని ఇంకో పార్టీ.. ప్రతిపక్ష పార్టీ గెలిస్తే పదవికి రాజీనామా చేస్తామంటూ సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. ఇలా అనేక పరిణామాలమధ్య గ్రేటర్ ఎన్నికలు జరిగిపోయాయి. అసలు సినిమా అంతా ముదుంది.. మరి ఇప్పుడు ప్రజలు ఎవరిని నమ్మారు..? ఎవరి మాటలను నమ్మి ఎవరికి ఓటు వేశారు..?ఎవరికి గ్రేటర్ పట్టం కట్టారు..? అని అటు రాజకీయనాయకులతో పాటు ప్రజలు కూడా అందరూ చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. బల్దియా కింగ్ ఎవరూ అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పలు ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలవాలని బాగానే కష్టపడింది. కేసీఆర్ తనయుడు గ్రేటర్ ఎన్నికలు బాధ్యతను మొత్తం తమ భుజాలపై వేసుకొని చాలా కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో కనుక టీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ కూడా గెలిచినట్టే. కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టినట్టే. అంతేకాదు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిచినట్టయితే కొన్ని సంవత్సరాల వరకూ టీఆర్ఎస్ కు తిరుగులేనట్టే. ఇక తెలంగాణలో కాస్తో కూస్తో ఆదరణ ఉన్న పార్టీ అంటే టీడీపీ. సార్వత్రిక ఎన్నికల్లో సంగతేమో కాని.. గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ కు టీడీపీ గట్టి పోటీనే. ఎలాగూ గ్రేటర్లో సెటిలర్లు ఎక్కువ కాబట్టి ఆ ఓట్లు ఇటు పడే అవకాశాలు చాలా ఎక్కువనే ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో టీడీపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందో.. చూడాలి. ఒకవేళ పరిస్థితులు తారుమారైనా కనీసం 25 స్థానాలు గెలుచుకోకపోతే కోలుకోవడానికి చాలా కాలమే పడుతుంది. ఇక మిగిలిన పార్టీల సంగతి కూడా అంతే. గౌరవ ప్రధమైన స్థానాలు దక్కించుకోకపోతే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో తమ పార్టీల భవిష్యత్ ఎంటో తెలియాలంటే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడించేంత వరకూ ఆగాల్సిందే. ఈ రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించడంతో బల్దియా కింగ్ ఎవరో.. ఎవరు నగరాన్ని ఏలుతారో తెలిసిపోతుంది.  

ఇంతకీ ముద్రగడ ఆశిస్తున్నదేమిటి?

  తమ వర్గాన్ని బీసీలలో చేర్చి వాళ్లకి రిజర్వేషన్‌ కల్పించాలంటూ ముద్రగడ తునిలో చేసిన రైల్‌ రోకో హింసాత్మకంగా మారింది. అసాంఘిక శక్తుల వల్లే ఆ రోజు ఉద్రిక్రత చెలరేగిందంటూ ముద్రగడ చేతులెత్తేశారు. తుని సంఘటనల తరువాత ప్రభుత్వం తనంతట తానుగా దిగివచ్చి ఉద్యమనేతలకు కావల్సినన్ని హామీలను ఇచ్చింది. వారి సంక్షేమం కోసం 1000 కోట్లను కేటాయించాలని నిర్ణయించింది. ఉద్యమనేతలు కోరినట్లుగా వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు తగిన నివేదికల కోసం చర్యలు తీసుకుంది. ఒకవైపు ప్రభుత్వం ఇలా సానుకూలంగా స్పందిస్తూ ఉంటే మరో వైపు ముద్రగడ ఉద్యమం మీద మరింత పట్టుని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేటి నుంచి కిర్లంపూడిలోని తన స్వగృహంలో ముద్రగడ ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. సాధారణంగా ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకువెళ్లేందుకు ఆమరణ దీక్షను చేపడతారు.   మరి ప్రభుత్వం సానుకూలంగా ఉన్న సమయంలో కూడా ముద్రగడ ఆమరణ దీక్షను చేపట్టడంలోని ఆంత్యం ఏమిటో సాటి నేతలకు సైతం బోధపడటం లేదు. స్వయంగా ప్రభుత్వ మంత్రులే ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినా దీక్షను విరమింపచేయడంలో విఫలమయ్యారు. ఉద్యమాన్ని నిలువరించేందుకు తాము స్పష్టమైన హామీలను ఇచ్చిన తరువాత కూడా ముద్రగడ దీక్షను ఎందుకు సాగిస్తున్నారో ప్రభుత్వానికి సైతం బోధపడటం లేదు. తునిలో హింస జరిగితే కారణం అసాంఘిక శక్తులే అన్న ముద్రగడ తన దీక్ష సమయంలో ఏదన్నా అనుకోని ఘటన జరిగితే దానిని కూడా ఇలాంటి జవాబే చెబుతారేమో! ఇంతకీ ముద్రగడ ఆశిస్తున్నదేమిటి? హామీలను నెరవేర్చేవరకూ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నారా! లేకపోతే ఉద్యమ నేతగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నారా!  

ఏం జరుగుతోందో నాకు తెలియాలి- రాహుల్‌

దేశంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఏర్పడినా ఇప్పడు రాహుల్‌ తక్షణమే స్పందిస్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ యూనివర్సిటీలో జరిగిన గొడవలో విద్యార్థులను పరామర్శించేందుకు ఒకటికి రెండుసార్లు ఇక్కడికి వచ్చారు. ఒక సున్నితమైన అంశాన్ని రాహుల్‌ రాజకీయం చేస్తున్నారని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించినా ఆయన పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక గొడవ గురించి తక్షణమే తనకు నివేదికను అందించాలని రాహుల్‌ అక్కడి ముఖ్యమంత్రిని ఆదేశించారట. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యకు ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయట. ఈ ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక సంఘటనలో నలుగురు టాంజానియా దేశ విద్యార్థుల మీద స్థానికులు దాడి చేశారు. వారిలో ఒక యువతిని వివస్త్రగా ఊరేగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకపక్క పోలీసులు కానీ రాష్ట్రప్రభుత్వం కానీ యువతి విషయంలో ఎలాంటి పొరపాటూ జరగలేదని చెబుతుండగా… బెంగళూరులోని ఆఫ్రికన్‌ విద్యార్థి సంఘాలు మాత్రం పోలీసులు కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుని హోదాలో రాహుల్ గాంధీ తన కోసం ఒక నివేదికను ఆశిస్తున్నారు. అసలే సున్నితంగా ఉన్న ఈ అంశం కాస్తా రాహుల్ గాంధీ జోక్యంతో మరింత వివాదాస్పదం అయ్యేట్లు ఉంది. ఈసారి మరి రాహుల్ మనసులో ఏముందో!

జికా వైరస్‌కు తెలుగువాడి సవాల్‌!

  ఆఫ్రికా నుంచి అమెరికా వరకూ దేశదేశాలనే వణికిస్తున్న జికా వైరస్‌ ఒక హైదరాబాద్‌ సంస్థ టీకాను కనుగొంది! వైరస్‌ను అడ్డుకునేందుకు ఏం చేయాలో తెలియక పిల్లల్ని కనవద్దన్నీ, రక్తదానాలు చేయవద్దనీ ప్రభుత్వాలే చెబుతున్న సమయంలో ఒక తెలుగు సంస్థ జికాకి టీకాను రూపొందించేసింది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అనే ఔషధ సంస్థ జికాకు టీకాను తయారుచేసే ప్రక్రియలో తుదిదశకు చేరుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ కృష్ణ ఎల్ల నిన్న ఒక విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. జికా వైరస్‌కు ఇది ప్రపంచంలోనే తొలి టీకా అవుతుందనీ, ఆ మేరకు తాము పేటెంట్‌ని సైతం దాఖలు చేశామని కృష్ణ తెలియచేవారు. 2014లో జికా నిదానంగా విజృంభిస్తున్న సమయంలోనే ఈ సంస్థ దాని ప్రమాదాన్ని గ్రహించింది. అప్పటి నుంచే జికాకు విరుగుడుగా టీకాను కనుగొనేందుకు ప్రయత్నాలు ఆరంభించింది.   అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం తమ దాకా వస్తే చూసుకోవచ్చులే అనుకుని నిర్లక్ష్యంగా ఉన్న సమయంలో ముందుచూపుతో వ్యవహరించింది ‘భారత్‌ బయోటెక్‌’. భారత ప్రభుత్వం కనుక ఈ టీకాను సత్వర అనుమతులు అందిస్తే కేవలం రెండేళ్లలోనే దీనిని విస్తృతంగా మార్కెట్లోకి తీసుకురాగలమని చెబుతోంది ఈ సంస్థ. జికా వైరస్‌కు టీకాను కనుగొనేందుకు అమెరికాలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ… అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఒకవేళ ఆ పరిశోధనలు ఫలించినా వారి మందు సామాన్యులకి అందుబాటులోకి రావడానికి మరో పదేళ్లు పడుతుందని అంచనా. మరో వైపు జికా విజృంభిస్తూ ఒకో దేశాన్నీ దాటుకుంటూ ప్రపంచాన్నే చుట్టుముడుతోంది. జికా వైరస్‌ వల్ల బ్రెజిల్‌ దేశంలో వేలమంది పిల్లలు మెదడుకి సంబంధించిన తీవ్రమైన లోపాలతో పుడుతున్నారు. ఇలాంటి సందర్భంలో జికాకు విరుగుడు కనుక్కోవడం అంటే ప్రజల నెత్తిన పాలు పోయడమే!  

సియాచిన్‌లో పదిమంది సైనికులు గల్లంతు

  ఇండో- పాక్‌ సరిహద్దులో ఉన్న సియాచిన్‌లో దాదాపు పదిమంది భారతీయ సైనికులు గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. వీరంతా 18 వేల అడుగుల ఎత్తున పహారా కాస్తుండగా ఒక హిమపాతంలో కొట్టుకుపోయినట్లు సమాచారం. * సియాచిన్‌ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన సైనిక స్థావరం. * ధృవ ప్రాంతాల తరువాత అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రదేశం కూడా ఇదే. * చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు దాదాపు -50 డిగ్రీలకు పడిపోతాయి. * సియాచిన్‌లో పహారా కాసే సైనికులు శత్రుదేశ దాడికంటే ప్రకృతి చేసే విలయంలోనే ఎక్కువగా ప్రాణాలను కోల్పోతూ ఉంటారు. *రక్తాన్ని గడ్డకట్టించే చలి, గుండెపోటు, హిమపాతాలు, మంచు తుపానులు, కొండల మీద నుంచి జారిపడటం... వంటి కారణాల వల్ల ఇప్పటివరకు వేలాదిమంది భారతీయ సైనికులు ప్రాణాలు విడిచారు. * సియాచిన్‌కు ఇటువైపు ఉండే భారత సైనికులే కాదు అటువైపున ఉండే పాకిస్తాన్‌ సైనికులు కూడా చలికి బలైపోతుంటారు.2012 ఏప్రిల్ నెలలో 129 మంది పాకిస్తాన్‌ సైనికులు ఇలాగే ప్రాణాలను కోల్పోయారు.   సియాచిన్‌లో ఇలా అనవసరంగా జరుగుతున్న ప్రాణ నష్టాన్ని నివారించేందుకు, అక్కడి అరుదైన పర్యావరణాన్ని రక్షించేందుకు భారత్‌-పాక్‌లు కలిసి ఆ ప్రదేశాన్ని ‘శాంత స్థావరం’గా ప్రకటించాలని మేధావులు ఎప్పటినుంచో కోరుతున్నారు. కానీ…