ఆ సమస్యని తెదేపా-బీజేపీలు పరిష్కరించుకోగలవా?

  విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో శనివారం తెదేపా-బీజేపీ నేతల సమన్వయ సమావేశం జరుగబోతోంది. రెండు పార్టీల మధ్య తలెత్తున భేధాభిప్రాయాలను, వాటి కారణాల గురించి చర్చించి సమస్యలను పరిష్కరించుకోవడం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెదేపా, బీజేపీ అధ్యక్షులు కిమిడి కళావెంకట రావు, కంబంపాటి హరిబాబు, బీజేపీ మంత్రులు డా. కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ నేత సోము వీర్రాజు తదితరులు పాల్గొంటారు.   తమ మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు తలెత్తుతున్నాయో, వాటికి మూల కారణాలు ఏమిటో ఈ సమావేశంలో పాల్గొనబోతున్న వారందరికీ స్పష్టంగా తెలుసు. కనుక వారి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలను తొలగించుకొనే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోదనే విషయం దాదాపు స్పష్టమయిపోయింది. దానిని ప్రజలు, తెదేపా నేతలు కూడా అర్ధం చేసుకొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేనప్పుడు కనీసం బిహార్ రాష్ట్రానికి ప్రకటించినట్లుగా భారీ ఆర్ధిక ప్యాకేజీ అయినా కేంద్రప్రభుత్వం మంజూరు చేస్తుందని రాష్ట్ర ప్రజలు చాలా కాలంగా ఆశగా ఎదురు చూస్తున్నారు. వారితో బాటే తెదేపా నేతలు కూడా ఎదురు చూస్తున్నారు.   ప్రధాని నరేంద్ర మోడి బిహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకి అడగకుండానే భారీ ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటించారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితులు చూస్తున్నా కూడా ఇంతవరకు ప్యాకేజీ ప్రకటించలేదు. సహజంగానే అందుకు ప్రజలు, ప్రభుత్వం, తెదేపా నేతలు, ప్రతిపక్షాలు ఆగ్రహంగా ఉన్నారు. బహుశః రాష్ట్ర బీజేపీ నేతలలో కూడా ఈ విషయంలో అసంతృప్తిగానే ఉండి ఉండవచ్చును. కానీ పైకి చెప్పుకోలేని నిస్సాహయతలో ఉన్నారు. తమ పార్టీపై, కేంద్రప్రభుత్వంపై తెదేపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నపుడు చూస్తూ మౌనంగా ఉండలేరు కనుక వారు కూడా ప్రతివిమర్శలు చేయవలసి వస్తోంది. కేంద్రం మంజూరు చేస్తున్న పధకాలు, నిధుల గురించి మాట్లాడకుండా తమపై విమర్శలు చేయడం సరికాదని వారు వాదిస్తున్నారు. అలాగే కేంద్రం సహాయంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెదేపా ప్రభుత్వం తన స్వంతవిగా ప్రచారం చేసుకొంటూ పూర్తి క్రెడిట్ స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని వారి ఆరోపణ. రాష్   ట్ర ప్రభుత్వం తమను ఆ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మధ్య భేదాభిప్రాయలకి మూల కారణం కేంద్రం హామీలను అమలు చేయకపోవడం, చేస్తున్న వాటిని తెదేపా ప్రభుత్వం స్వంతం చేసుకోవడమేనని స్పష్టం అవుతోంది. మొదటిది కేంద్రప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం కనుక దానిని ఏవిధంగా పరిష్కరించుకోవాలనే విషయం ఇరు పార్టీల నేతలు నేటి సమావేశంలో చర్చించుకోవడం మంచిది.   ఇక కేంద్ర పధకాలను తెదేపా ప్రభుత్వం తనవిగా చెప్పుకొంటోందనే బీజేపీ నేతల ఆరోపణలలో బయటకు కనబడని మరో కోణం కూడా ఉన్నట్లుంది. సరిగ్గా అదే కారణంతో లేదా భయంతోనో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఉదారంగా నిధులు మంజూరు చేయడం లేదేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అదే కారణమయితే, రాష్ట్రంలో బీజేపీ నేతలను కూడా ప్రతీ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయడం ద్వారా ఆ సమస్య పరిష్కరించుకోవచ్చును. అప్పుడు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు, ఇతర హామీలను అమలు చేయవచ్చును. సమస్యకు ఇదే మూలకారణమయితే రెండు పార్టీలు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. లేకుంటే చివరికి వారే నష్టపోతారు.

రాహుల్ కష్టపడకుండా ప్రధాని* అయిపోయే చాన్స్?

  ఒకప్పుడు కాంగ్రెస్ అధిష్టాన దేవత నించోమంటే నించొని, కూర్చోమంటే కూర్చొన్న ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దానికే షరతులు పెట్టగలుగుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడిన ప్రాంతీయ పార్టీల నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తమలాగే మరో ప్రాంతీయ పార్టీలాగనో అంతకంటే తక్కువగానో చూస్తున్నారు. పాపం..కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వంటి వాళ్ళు కూడా ప్రధానమంత్రి కావలసిన రాహుల్ గాంధీ అంతటి వాడిని పట్టుకొని ‘నా స్నేహితుడు’ అనేస్తున్నారు.   అంతటితో ఆగితే పరువాలేదు. “వచ్చే ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మా పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తులు కోరుకొన్నట్లతే, మా నేతాజీని...అదే...మాడాడీ ములాయం సింగ్ యాదవ్ ని ప్రధాన మంత్రిని చేస్తామని చెప్పండి...మీతో పొత్తులకి ఇప్పుడే ఒకే చేప్పేస్తానని,” అఖిలేష్ యాదవ్ ఈరోజు మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక సందేశం పంపించారు. అంతే కాదు రాహుల్ గాంధి కష్టపడకుండా అధికారం చేపట్టేందుకు అఖిలేష్ యాదవ్ మంచి ఆఫర్ కూడా ఇచ్చేరు. తన తండ్రిని ప్రధానమంత్రిని చేసినట్లయితే, తాము రాహుల్ గాంధిని ఉప ప్రధానిని చేస్తామని ప్రకటించేశారు.   కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు రాహుల్ గాంధి కోసం ప్రధానమంత్రి కుర్చీలో కర్చీఫ్ వేసి ఉంచినా అప్పుడు ఆ బాబు అందులో కూర్చోవడానికి చాలా భయపడ్డారు. ఆ తరువాత నరేంద్ర మోడీ వచ్చి ఆ కర్చీఫ్ ని తీసి పక్కన చెత్తబుట్టలో పడేసి అందులో ఏకంగా పెద్ద పరుపు, దుప్పటి, దిండు అన్నీ వేసేసుకొని సెటిల్ అయిపోయారు. ఆయన తీరు, ట్రాక్ రికార్డులని బట్టి చూస్తుంటే మరో పది పదిహేనేళ్ళ వరకు అందులో నుంచి ఆయనకీ లేచే ఉద్దేశ్యం ఉన్నట్లు కనబడటం లేదు.   ఇటువంటి పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ ఇస్తున్న ఆఫర్ ని స్వీకరించి ములాయం పక్కన ఓ చిన్న కుర్చీవేసుకొని సెటిల్ అయిపోవడమా...లేక ప్రస్తుతం తమ పార్టీ రాజేసిన ‘మత అసహనం’ పొగ భరించలేక ఒకవేళ మోడీ ఆ కుర్చీలో నుండి లేచిపోతారేమోనని వేచి చూడడమా...? అనే అయోమయంలో పడింది కాంగ్రెస్ పార్టీ. ‘ఎలాగు మోడీకి పొగ పెట్టాము కదా...దాని భరించలేక ఒకవేళ ఆయనంతట ఆయన లేచిపోతారేమోనని ఎదురు చూద్దామా’ అంటే ఈలోగానే వచ్చే ఏడాదే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వచ్చేస్తున్నాయి.   ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవు కనుక ‘అక్కి ప్రపోజల్’ కి ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకొంటే కాంగ్రెస్ తలదించుకోవలసి వస్తుంది. “రాహుల్ గాంధి నాయకత్వ లక్షాణాలు లేవని మేము మొదటి నుండి మొత్తుకొంటూనే ఉన్నాము కదా...చెపితే వినరూ...అంటూ” పార్టీలో అసంతృప్తి రాగాలు వినవలసి వస్తుంది. వాళ్ళని ఎదుర్కోవడానికి రాహుల్ గాంధి మళ్ళీ అర్జెంటుగా విదేశాలకు వెళ్లి చార్జింగ్ చేసుకొని రావలసి వస్తుంది.   అలాగని అఖిలేష్ యాదవ్ ఇస్తున్న ఈ ఆఫర్ ని కాదంటే ఈలోగా ఆయన మరెవరి చెయ్యో పట్టుకొన్నట్లయిటే, అప్పుడు మాయావతిని బ్రతిమాలుకోవలసి వస్తుంది అది ఇంకా కష్టం. ఆమె కూడా ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోవాలని చాలా కాలంగా కలలు కంటోంది. కనుక ఆమె కూడా రాహుల్ గాంధిని తన పక్కన చిన్న కుర్చీలో సర్దుకుపోమని కోరవచ్చును. అయినా ప్రాంతీయ పార్టీలు కూడా రాహుల్ గాంధీకి ఇలాగ అగ్నిపరీక్షలు పెట్టేస్తున్నాయేమిటి...బొత్తిగా చిన్నా పెద్ద చూడకుండా! ఏమిటో పాపం!

అమెరికాపై మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు

  ఆర్.ఎస్.ఎస్.అధినేత మోహన్ భగవత్ అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగాలని, అందుకు భారతీయులు అందరూ ముందుకు రావాలని కోరారు. గుజరాత్ లోని సుప్రసిద్ధ సోమనాద్ దేవాలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని అభిప్రాయం వ్యక్తం చేసారు.   ఈ సందర్భంగా ఆయన అమెరికాపై కూడా ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్య చేసారు. ప్రపంచంలో ఎక్కడయినా ఆ దేశ విలువలపైనే దాడులు జరుగుతుంటాయి. అమెరికా మూలాలు దాని వ్యాపారంలోనే ఉన్నాయి కనుక ఉగ్రవాదులు ట్విన్ టవర్స్ ట్రేడ్ సెంటర్ పై దాడులు చేసారని అన్నారు. అంటే భారతీయ మూలాలు హిందుత్వంలో ఇమిడి ఉన్నాయి కనుక హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయని కనుక దానిని కాపాడుకోవాలని ఆయన చెపుతున్నట్లు భావించవలసి ఉంటుంది.   భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా అందరూ అభివర్ణిస్తుంటారు. కానీ ఆయన ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశమని, దానిని అందరూ గౌరవించాలని ఆయన చెప్పడం గమనిస్తే ఈ భిన్నత్వాన్ని ఆదరిస్తున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అందరూ గౌరవించాలని చెపుతున్నట్లు భావించవచ్చును.   శ్రీరాముడు కొందరికి దేవుడయితే, మరి కొందరు ఆదర్శనీయమయిన సత్పురుషుడుగా భావిస్తారని అన్నారు. కనుక ఆ మహాపురుషుడు జన్మించిన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగితే చూడాలని తను ఆశిస్తున్నట్లు తెలిపారు. తన జీవిత కాలంలో ఈ కోరిక తీరుతుందో లేదోననే అనుమానం కూడా వ్యక్తం చేసారు. ఆర్.ఎస్.ఎస్.కి చెందిన అధికారిక ట్వీటర్ ఖాతాలో ఆయన ఇవ్వన్నీ పేర్కొన్నారు.   అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలని ఆయన కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దాని వలన దేశంలో మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తుతాయో ఆయనకి, ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకి అందరికీ తెలుసు. అందుకే అటువంటి ఆలోచనలు ఎవరూ చేయడం లేదు. కానీ ఇరు మతగురువులు, పెద్దలు కలిసి చర్చించుకొని ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొంటే తప్ప ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం దొరకడం కష్టం. అది సాధ్యం కాదనుకొన్నప్పుడు యధాస్థితిలో వదిలిపెట్టడమే ఉత్తమ పరిష్కారం.

శివసేనలోకి రాజా సింగ్?

  హైదరాబాద్ లోని బీజేపీ ఘోషా మహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై తిరుగుబాటు చేయడం, పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడటం కారణంగా అతనిని పార్టీలో నుండి తొలగించాలని బీజేపీ భావిస్తోంది. అతను కూడా పార్టీని వీడే ఆలోచనతో ఉన్నారు.   ఆయన మొదట తెరాసలో చేరుదామని భావించినప్పటికీ, శివసేన పార్టీ నుండి మంచి ఆఫర్ రావడంతో ఆయన తెరాసలో చేరే ఆలోచనను విరమించుకొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో శివసేన పార్టీ చాలా కాలంగా ఉన్నపటికీ, దానికి బలమయిన నాయకులు, కార్యకర్తలు లేకపోవడంతో అది తన ఉనికిని చాటుకోలేకపోతోంది. కనుక రాజా సింగ్ ను పార్టీలోకి ఆహ్వానించి అతనికి అధ్యక్ష భాద్యతలు అప్పగించాలనిశివసేన పార్టీ భావిస్తున్నట్లు తాజా సమాచారం. అందుకు రాజా సింగ్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః నేడో రేపో అతను ఒక నిర్ణయం తీసుకోవచ్చును. కానీ అతను బీజేపీని విడిచి దానికి మిత్రపక్షమయిన శివసేనలోకి వెళ్ళినట్లయితే, అతని వలన తెలంగాణా బీజేపీ నేతలకి ఏదో ఒకవిధమయిన తలనొప్పులు తప్పకపోవచ్చును.

అమెరికా, సాన్ బెర్నార్డినో నగరంలో కాల్పులలో 14 మంది మృతి

  అమెరికాలో సాన్ బెర్నార్డినో నగరంలో నిన్న ఉదయం స్థానిక కాలమాన ప్రకారం 10.59 గంటలకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో అక్కడికక్కడే 14 మంది మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు. సాన్ బెర్నార్డినో నగరంలో ఇన్ ల్యాండ్ రీజియనల్ సెంటర్ లో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. కొన్ని స్వచ్చంద సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో స్థానిక ప్రజలు పాల్గొన్నపుడు ముగ్గురు దుండగులు లోపాలకి ప్రవేశించి వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.   ఈ కాల్పుల సమాచారం అందుకొన్న వెంటనే సాన్ బెర్నార్డినో స్వాట్ పోలీసుకు తక్షణమే అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆ ముగ్గురు దుండగులను పట్టుకొనేందుకు ప్రయత్నించారు. వారిలో ఒకడు పోలీసు కాల్పులలో మరణించగా మరొకడు తప్పించుకొని పారిపోయినట్లు సాన్ బెర్నార్డినో పోలీస్ ఉన్నతాధికారి వికీ సెర్ వాంటిస్ తెలిపారు. మూడో వ్యక్తి ఆచూకి తెలియలేదు. బహుశః అతను కూడా తప్పించుకొని పారిపోయుండవచ్చునని భావిస్తున్నారు. కాల్పులు జరిపిన ముగ్గురూ ఏదయినా ఉగ్రవాద సంస్థకి చెందిన వారా లేక నగరంలో అసాంఘిక శక్తులా? అనేది పోలీసుల దర్యాప్తులో తెలియవలసి ఉంది. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ కాల్పులకు భాద్యత తీసుకోలేదు.

చంద్రబాబు తెలంగాణా తెదేపాకు దూరం అవుతున్నారా?

  స్థానిక సంస్థల కోటాలో జరుగునున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో తెదేపా అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు తన పార్టీ తెలంగాణా నేతలతో చర్చించారు. మహబూబ్ నగర్ నుండి మాజీ ఎమ్మెల్యే కొత్త కోట దయాకరరెడ్డిని పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టేందుకు ఆయన ఆమోదం తెలిపారు. కానీ రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలా వద్దా చేస్తే గెలిచే అవకాశాలున్నాయా లేవా? అని ఆలోచించుకొని బరిలోకి దిగడం మంచిదని ఆయన తన నేతలకు సూచించారు. ఈ విషయంలో వారినే తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే గ్రేటర్ ఎన్నికల కోసం కూడా ఇప్పటి నుండే తగిన వ్యూహ రచన చేసుకోవాలని కోరారు.   అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పార్టీ బాధ్యతలను క్రమంగా అక్కడి నేతలకే అప్పగించాలని భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఎర్రబెల్లి-రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి-ఉమా మాధవ రెడ్డిల మధ్య నెలకొన్న తీవ్ర భేదాభిప్రాయాల వలన పార్టీ చాలా బలహీనపడింది. పార్టీలో నేతల మధ్య సయోధ్య లేదని తెలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ బాధ్యతలు వారికే పూర్తిగా అప్పగించినట్లయితే దాని వలన పార్టీ మరింత నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వచ్చే నెలలో కీలకమయిన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీపై తన పట్టు వదులుకొన్నట్లయితే దాని వలన ఎన్నికలలో పార్టీ నష్టపోవచ్చును.

అవును! అమీర్ ఖాన్ గురించి నేను అలాగా మాట్లాడటం తప్పే: వర్మ

  బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మత అసహనం గురించి మాట్లాడిన కొన్ని మాటలపై చాలా మందిలాగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఆయనపై విమర్శలు గుప్పించారు.   తనపై వస్తున్న విమర్శలపై అమీర్ ఖాన్ స్పందిస్తూ నేను భారతదేశాన్ని విడిచి ఎక్కడికి వెళ్లిపోవాలనుకోవడం లేదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నా దేశభక్తిని రుజువు చేసుకోవలసిన అవసరం లేదు. నా ఇంటర్వ్యూ యొక్క పూర్తి సారాంశం గురించి తెలియని వాళ్ళే నన్ను విమర్శిస్తున్నారు. అది చూస్తే వాళ్ళు కూడా తమ అభిప్రాయం మార్చుకొంటారని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.   అమీర్ ఖాన్ చెప్పిన ఆ మాటలు విన్న తరువాత రామ్ గోపాల్ వర్మ ఆ ఇంటర్వ్యూ సారాంశం మొత్తం చదివి అమీర్ ఖాన్ చెప్పినట్లే తన అభిప్రాయం మార్చుకొన్నారు. మార్చుకోవడమే కాకుండా ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను తొందరపడి అమీర్ ఖాన్ పట్ల తప్పుగా మాట్లాడానని ఒప్పుకొన్నారు.   దాని గురించి వివరిస్తూ “మన జీవితంలో మనం ఎన్నో తప్పులు తెలిసీ తెలియకుండా చేస్తుంటాము. ఇది కూడా అటువంటిదే. ఫ్లాప్ సినిమాలు తీయడం పెద్ద తప్పు అనుకొంటే ఈవిధంగా తొందరపడి స్పందించడం చిన్న తప్పు అనుకోవచ్చును. అమీర్ ఖాన్ మాట్లాడిన ఆ రెండు ముక్కలు బయటకు రాగానే అందరూ తమ స్పందిన్చినట్లే నేను ఆ రెండు ముక్కలలో ఉన్న అర్ధాన్ని మాత్రమే స్వీకరించి స్పందించాను. ఆ సమయంలో నా మనసుకు ఏమి తోచిందో అదే చెప్పాను. కానీ అమీర్ ఖాన్ ఇంటర్వ్యూ పూర్తి సారాంశం చదివిన తరువాత ఆయనేమీ తప్పు ఉద్దేశ్యంతో అలాగా మాట్లాడలేదని అర్ధమయింది. నేను ఆవిధంగా మాట్లాడటం తప్పే,” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

రాజా సింగ్ కోరుకొన్నదే జరుగబోతోందేమో?

  ఘోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్ధులు గోమాంసంతో విందు (బీఫ్ ఫెస్టివల్) చేసుకొంటారనే వార్తలపై స్పందిస్తూ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు పార్టీ సిద్దం అవుతోంది.   “ఒకవేళ ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ చేసుకొన్నట్లయితే, నా సత్తా ఏమిటో ఈసారి వారికి రుచి చూపిస్తాను. బీఫ్ ఫెస్టివల్ చేసుకొనట్లయితే దాద్రి సంఘటనలు హైదరాబాద్ లో కూడా పునరావృతం అవుతాయని హెచ్చరించారు. గోమాంసం తిన్నారనే అనుమానంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాద్రిలో ఒక వ్యక్తిని కొందరు అతి కిరాతకంగా చంపారు. ఆ దురదృష్టకర సంఘటన వలన నేటికీ మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే రాజ సింగ్ ఈవిధంగా మాట్లాడటంతో పార్టీకి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకోవలసివస్తోంది.   ఆయన గత ఏడాది కాలంగా పార్టీ కార్యాలయానికే రాలేదని బహుశః తెరాసలో చేరేందుకే పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘిస్తూ పార్టీకి వ్యతిరేకంగా, నష్టం కలిగించే విధంగా మాట్లాడుతున్నారని బీజేపీ నేత వెంకట రెడ్డి అభిప్రాయపడ్డారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల ముందు పార్టీకున్న ఐదుగురు ఎమ్మెల్యేలలో ఒకరిని అధికార తెరాస పార్టీకి కోల్పోవలసి వస్తే దాని వలన బీజేపీకి చాలా నష్టం జరుగవచ్చును. కానీ రాజా సింగ్ ధోరణి వలన పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది కనుక పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ రాజా సింగ్ తెరాసలో చేరే ఉద్దేశ్యంలో ఉన్నట్లయితే ఆయన కూడా అదే కోరుకొంటున్నారేమో?

కిషన్ రెడ్డిని పదవిలో నుంచి తొలగించాలి: బీజేపీ ఎమ్మెల్యే

  హైదరాబాద్, ఘోషా మహల్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ ఈరోజు ఆకస్మాత్తుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై విరుచుకుపడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలంగా ఎదగలేకపోవడానికి కారకుడు కిషన్ రెడ్డేనని ఆయన ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పధకాలు, అభివృద్ధి పనుల గురించి తెలంగాణాలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను పార్టీ వైపు ఆకర్షించడంలో కిషన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని రాజా సింగ్ ఆరోపించారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను పైకి ఎదగనీయకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణాలో పార్టీకి కిషన్ రెడ్డే ప్రధాన అవరోధంగా ఉన్నారని, కనుక ఆయనని తక్షణమే ఆ పదవిలో నుండి తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడికి ఒక లేఖ కూడా వ్రాశానని రాజా సింగ్ తెలిపారు.   రాజా సింగ్ పార్టీ అధ్యక్షుడకి వ్యతిరేకంగా అధిష్టానానికి లేఖ వ్రాయడం చూస్తుంటే ఆయనకు పార్టీలో కొనసాగే ఉద్దేశ్యం లేనట్లు కనిపిస్తోంది. త్వరలో జరుగబోయే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాస ఒంటరిగా పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ తెదేపా-బీజేపీ-మజ్లీస్ పార్టీలు చాలా బలంగా ఉన్న చోట్ల తెరాస ఒంటరిగా పోటీ చేసి ఏవిధంగా నెగ్గుకు రాగలదనే అనుమానం కలగడం సహజమే. కనుక ఈ ఎన్నికలలోగా తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, ప్రత్యర్ధి పార్టీల నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేయవచ్చును. తెరాస నేతలు బహుశః రాజా సింగ్ ని ఇప్పటికే సంప్రదించారేమో? అందుకే ఆయన ఏకంగా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనే ఈ విధంగా విమర్శలు గుప్పిస్తున్నారేమో? పార్టీ అధ్యక్షుడుని విమర్శించినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నట్లయితే జరిగేది అదే!

ఆయనొక బాబా...టర్నోవర్ రూ.2000 కోట్లు

  పెద్దపెద్ద వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలని పెంచుకొనేందుకు ప్రముఖ సినీ నటులకు కోట్ల రూపాయలు చెల్లించి వారిచేత ప్రచారం చేయించుకొంటాయి. బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకొంటుంటాయి. కానీ అటువంటి హంగూ ఆర్భాటం ఏదీ చేయకుండానే పతంజలి ఆయుర్వేదిక, ఆహార ఉత్పత్తులను దేశమంతా విస్తృతంగా అమ్మకాలు సాగించగలడం విశేషం. దాని యజమాననే దానికి బ్రాండ్ అంబాసిడర్. ఆయనే ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ !   దేశ వ్యాప్తంగా సుమారు 15,000కి పైగా పతంజలి ఆయుర్వేద దుఖాణాలున్నాయి. అయితే అవన్నీ చిన్న చిన్న దుఖాణాలు మాత్రమే. కనుక త్వరలో దక్షిణాదిన సుమారు 2000-3000 చదరపు అడుగుల వైశాల్యం గల పెద్దపెద్ద షాపులను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వాటిల్లో కేవలం పతంజలి ఉత్పత్తులు మాత్రమే విక్రయిస్తామని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ ఉత్పత్తులు బిగ్ బజార్, రిలయన్స్ ఫ్రెష్, డీ-మార్ట్ వంటి ప్రముఖ షాపింగ్ మాల్స్ లో కూడా లభ్యం అవుతున్నాయని అయన తెలిపారు. ఇకపై ఆన్ లైన్ అమ్మకాలపై కూడా దృష్టి సారించబోతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే వచ్చే ఏడాది మార్చి నుండి అమెరికా, కెనడా మరియు యు.కె.లకు తమ ఉత్పత్తులను ఎగుమతులు చేసేందుకు ప్రయత్నాలు మొదలయినట్లు తెలిపారు.   గత ఆర్ధిక సంవత్సరంలో రూ.2,000 కోట్ల బిజినాస్ టర్నోవర్ జరిగిందని, దానిని వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ. 5,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోన్నామని బాబా రాందేవ్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో మార్కెట్ అవసరాలకు సరిపోయే విధంగా పతంజలి ఉత్పత్తులను అందించేందుకు ఆంధ్రా, కర్నాటక, మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కడో ఒకచోట వచ్చే సం.లో రూ.1000 కోట్లు వ్యయంతో ఒక ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ సంస్థ వర్కింగ్ కేపిటల్ కోసం వివిధ బ్యాంకులు సుమారు రూ.500 కోట్లు అప్పు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేశాయని, అవసరమయితే ఇంకా ఎక్కువ మొత్తం ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం హరిద్వార్ లో పతంజలి సంస్థ ఒక మెగా ఫుడ్ పార్క్ దిగ్విజయంగా మంచి లాభాలతో నిర్వహిస్తోంది.   ఇంతవరకు ఆయుర్వేద ఔషధాలు, ఆహార, సౌందర్య ఉత్పత్తులపైనే దృష్టి కేంద్రీకరించిన పతంజలి ఆయుర్వేద సంస్థ ఇకపై ఆవు పాలతో పాలపొడి, చాక్లెట్స్ తయారు చేయాలని భావిస్తోంది. అలాగే నాణ్యమయిన పశువుల దాణా, పాల ఉత్పత్తిని వృద్ధి చేసేందుకు పశువుల బ్రీడింగ్ రంగాలలో ప్రవేశించబోతున్నట్లు బాబా రాందేవ్ తెలిపారు. సౌందర్య బ్రాండ్ విభాగంలో మరిన్ని సౌందర్య ఉత్పత్తులు, అలాగే శిశు రక్షణ విభాగంలో పసిపిల్లలకు సంబంధించిన ప్రీమియం ఉత్పత్తులను వచ్చే నెలలో మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.   ఆయుర్వేదానికి భారతదేశమే పుట్టినిల్లు అయినప్పటికీ, ఆధునిక వైద్య విధానాల పట్ల ప్రజలకు నమ్మకం పెరిగినందున ఆయుర్వేద వైద్యం, ఆయుర్వేద ఉత్పత్తులు ప్రజల ఆదరణకు నోచుకోలేకపోతున్నాయి. కానీ ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాబా రాందేవ్ కి చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ ఎటువంటి ప్రచారార్భాటం లేకుండానే ఇంత అద్భుతంగా తన వ్యాపారాన్ని పెంచుకోవడం విశేషమే. భారతీయులలో ఆయుర్వేదం పట్ల క్రమంగా నమ్మకం పెరుగుతున్నందునే పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులకి ఇంత ఆదరణ దక్కుతోందా లేకపోతే పతంజలి సంస్థ అనుసరిస్తున్న విన్నూత్నమయిన మార్కెట్ విధానాలే దానికి లాభాలు చేకూర్చి పెడుతున్నాయా? అనే ప్రశ్నకు కార్పోరేట్ కంపెనీలే జవాబు చెప్పాలి.

అప్పుడు అబ్దుల్ కలాం రాజీనామా చేయాలనుకొన్నారుట!

  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2006లో రాజీనామా చేయాలనుకొన్నారని ఆయన మీడియా కార్యదర్శిగా పనిచేసిన ఎస్.ఎం.ఖాన్ తెలిపారు. అప్పటి బీహార్ గవర్నర్ భూటా సింగ్ కేంద్రానికి పంపిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం బిహార్ అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించుకొంది. కేంద్రమంత్రివర్గం ఆ ప్రతిపాదనను ఆమోదించి రష్యా పర్యటనలో ఉన్న అబ్దుల్ కలాంకి పంపింది. దానిని కలాం మొదట తీవ్రంగా వ్యతిరేకించారు కానీ ప్రభుత్వం నచ్చజెప్పిన మీదట దానికి ఆమోదముద్ర వేశారు. ఆ తరువాత దానిని బిహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయడంతో కోర్టు దానిని కొట్టివేసింది. ఆ పరిణామాలన్నీ చూసిన కలాం తను ఆ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయకుండా ఉండాల్సిందని భావించారు. జరిగిన పరిణామాలన్నీ రాష్ట్రపతి గౌరవానికి భంగం కలిగించేవేనని కలాం భావించారు. అప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని అనుకొన్నారు. అందుకోసం ఆయన రామేశ్వరంలో ఉన్న తన అన్నగారిని సంప్రదించారు కూడా. కానీ తను రాజీనామా చేసినట్లయితే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని గ్రహించి కలాం ఆ ఆలోచనను విరమించుకొన్నారు. తనవల్ల దేశానికి మరో కొత్త సమస్య ఎదురవకూడదని ఆయన భావించారు. అందుకే తన రాజీనామా ఆలోచనను విరమించుకొన్నారు,” అని ఎస్.ఎం.ఖాన్ తెలిపారు. భువనేశ్వర్ లోని ఎస్.ఒ.ఏ. విశ్వవిద్యాలయం వారు శనివారం నిర్వహించిన “మై డేస్ విత్ గ్రేటెస్ట్ హ్యూమన్ సోల్ ఎవ్వర్” అనే కలాం స్మారక సభలో ఎస్.ఎం.ఖాన్ మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు.

జలాశయాల్లో ఇసుకను వినియోగించండి!

రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇసుక వ్యవహారం ఓ ప్రహసనంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిలిప్పీన్స్ నుంచీ నౌకల ద్వారా ఇసుక దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇది పాలకుల హ్రస్వ దృష్టికి అద్దం పడుతున్నది. దేశంలో వివిధ నదులపై నిర్మించిన సాగునీటి జలాశయాల్లో లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మీటలు వేసి నీటినిలవ, లభ్యతే క్లిష్టంగా మారింది.అలా ఏళ్ళ కొలది పేరుకొంటున్న ఇసుక గురించి పట్టించుకోకుండా మాఫియాలకు అవకాశం కల్పించటం, దిగుమతులు చేసుకోవటం సిగ్గుచేటు!ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబటులోకి వచ్చింది. అయినా ఆ దిశగా ఆలోచించరు. పరస్పర రాజకీయ విమర్శలు, రాజకీయ నాయకుల, అధికారుల మధ్య అనవసర సంఘర్షణలు పాలకుల వైఫల్యమే అని చెప్పక తప్పదు!అన్ని జలాశయాల నుంచి పూడికలు తీయించి వ్యాపార సరళిలో ఇసుకను విక్రయిస్తే, ఆ రాబడితో పేదలకు ఉచితంగా ఇళ్ళు కట్టించవచ్చు, మరుగుదొడ్లనూ నిర్మించవచ్చు. ఇందుకు రాజకీయ సంకల్పం ముఖ్యం! గరిమెళ్ళ రామకృష్ణ

స్థానిక రైళ్ళ వ్యవస్థే పరిష్కారం..

విజయవాడలో ఇళ్ళ అద్దెలూ, స్థలాల ధరలూ ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఒక్క విజయవాడలోనే కాదు, తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకూ అన్ని పట్టణాల్లో, నగరాల్లో ఇంటి అద్దెలు పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పల్లె సీమలను ఏ మాత్రం పట్టించుకోకుండా పాలకులు నిర్లక్ష్యం చేశారు. స్వగ్రామాల కంటే కూడా హైదరాబాదే ముద్దు అనుకున్నారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు! నగరాల్లో,పట్టణాల్లో ఒత్తిడి తగ్గాలంటే,ముంబై,చెన్నై,హైదరాబాద్ లలో మాదిరి స్థానిక రైళ్ళ వ్యవస్థలను అభివృద్ధి పరచుకోవాలి. అన్ని వర్గాల ప్రజలు గ్రామాలలోనే నివాసం ఉంటూ,తమ తమ పనులకు నగరాలకు వచ్చివెళ్ళేలా చౌకయిన రవాణాసదుపాయాలు కల్పిస్తే సమస్యకు  సరైన పరిష్కారం లభిస్తుంది. పాలకులు తమ పాలనా విధానాలు,ప్రణాళికలు జనబాహుళ్యానికి ఉపయోగపడేలా రూపొందిస్తే ఇలాంటి సమస్యలకు తావులేదు.ఈ మేరకు పాలకుల మైండ్ సెట్ మారాలి! గరిమెళ్ళ రామకృష్ణ

డిల్లీలో గగనతలం నుండి ఉగ్రదాడులకి అవకాశం?

  ఐసిస్ ఉగ్రవాదులు భారత్ లో మెట్రో నగరాలపై లేదా ప్రముఖ పుణ్య క్షేత్రాలపై దాడులు చేయవచ్చని కొన్ని రోజుల క్రితం నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇప్పుడు డ్రోన్ వంటి ఎగిరే వస్తువులను ఉపయోగించి గగనతలం నుండి దేశ రాజధాని డిల్లీపై దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. డిల్లీలో రాష్ట్రపతి భవన్, ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి నివాసాలపై, సిబీఐ, సి.ఐ.ఎస్.ఎఫ్ బి.ఎస్.ఎఫ్. వంటి సంస్థల ప్రధాన కార్యాలయాలున్న సిజి.ఓ.కాంప్లెక్స్ పై, రాజ్ పద్, ఇండియా గేట్ వంటి ప్రదేశాలలో ఎక్కడయినా గగనతలం నుండి దాడులు చేయవచ్చని నిఘావర్గాలు హెచ్చరించినట్లు హోం శాఖ తెలియజేసింది. డిల్లీ గగనతలం ఎక్కడ ఇటువంటి ఎగిరే వస్తువులు కనబడినా వాటిని తక్షణమే నేల కూల్చివేయమని హోం శాఖ భద్రతాదళాలకు ఆదేశాలు జారీ చేసింది.   డ్రోన్ వంటి ఎగిరేవస్తువులు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటి ద్వారా నగరాలలో ఒకచోట నుండి మరొక చోటికి వస్తువులను డెలివరీ చేయడానికి చాలా సౌకర్యం ఏర్పడుతుందని అందరూ చాలా సంతోషించారు. కానీ ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజం ఇంకా ఉపయోగించుకోవడం మొదలుపెట్టకమునుపే, అది ఉగ్రవాదులు చేతులులలో చాలా భయంకరమయిన ఆయుధంగా మారిపోయింది. ఇంతకు ముందు ఉగ్రవాదులు తాము ప్రేలుళ్ళకు పాల్పడాలనుకొనే ప్రదేశానికి స్వయంగా వెళ్లి అక్కడ బాంబులు అమర్చి పేల్చవలసి వచ్చేది. కానీ ఈ డ్రోన్ పరికరాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వారు దానికి బాంబులు అమర్చి ఎక్కడో మారుమూల సురక్షితమయిన ప్రాంతంలో కూర్చొని రిమోట్ ద్వారా తాము కోరుకొన్న చోట బాంబులు జారవిడిచి ప్రేల్లుళ్ళు చేసే సామర్ధ్యం పొందగలిగారు.   ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. కనుక ఈ డ్రోన్ పరికరాలను దేశంలో వినియోగించకుండా నిషేధం విధించారు. కానీ ఆ నిషేధం ఉగ్రవాదులను వాటిని ఉపయోగించకుండా ఆపలేదు కనుక ఈ పరికరాలను, వాటి మూలాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం. ఇంతవరకు కేవలం నేల మీదనే నిఘా అవసరం అయ్యేది. కానీ ఇప్పుడు విశాలమయిన ఆకాశంలో కూడా నిఘా పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. కనుక ఈ డ్రోన్ పరికరాలకి తక్షణమే విరుగుడు కనిపెట్టక తప్పదు.

జి.ఎస్.టి. బిల్లుపై సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్?

  ఎన్డీయే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ బిల్లుని ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ దానిపై కాంగ్రెస్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి రాజ్యసభలో బిల్లుని అడ్డుకొంటోంది. ఈ బిల్లులో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మూడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.   1.గరిష్టంగా 18 శాతం వరకు మాత్రమే పన్ను విధించడం. 2.దానికి అదనంగా వస్తు ఉత్పత్తి చేసిన రాష్ట్రాలకు 1 శాతం పన్ను విధించుకొనే వెసులుబాటును తొలగించడం. 3.ఈ చట్టం కారణంగా రాష్ట్రాలకు ఏర్పడబోయే రెవెన్యూ నష్టాన్ని భర్తీ చేసేందుకు, ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటినుంచి ఐదేళ్ళ వరకు దేశంలో అన్ని రాష్ట్రాలకు నూటికి నూరు శాతం పరిహారం చెల్లించడం. ఈ మూడు షరతులకు అంగీకరించినట్లయితే తాము ఆ బిల్లు ఆమోదం పొందేందుకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెపుతోంది.   ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోడి నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ని తన ఇంటికి టీ-సమావేశానికి ఆహ్వానించారు. ఆ సమావేశంలో వారు ఈ బిల్లుపై సుమారు 40 నిమిషాలు చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఇరువురూ కొంత సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. దీని గురించి ప్రధాని నరేంద్ర మోడి సూచించిన విషయాలపై తమ పార్టీ నేతలతో చర్చించి తమ అభిప్రాయం తెలుపుతామని సోనియా గాంధీ ఆయనకు హామీ ఇచ్చారు. ఈ బిల్లును ఎలాగయినా ఈసారి పార్లమెంటులో ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నిస్తున్న ఎన్డీయే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చెపుతున్న చివరి రెండు షరతులకు అంగీకరించి దానికి బదులుగా గరిష్ట పన్ను పరిమితిని 18-20 శాతం వరకు ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీని ఒప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఆనం బ్రదర్స్ చేరికతో నెల్లూరులో తెదేపా బలపడే అవకాశం?

  మాజీ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆయన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని వీడి త్వరలోనే తెదేపాలో చేరబోతున్నట్లు ప్రకటించేరు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెదేపా విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ, నెల్లూరు జిల్లాలో గల 10 అసెంబ్లీ స్థానాలలో తెదేపా కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. మిగిలిన 7స్థానాలు, ఒక లోక్ సభ సీటును కూడా వైకాపా గెలుచుకొంది. తెదేపా ప్రస్తుతం అధికారంలో ఉంది కనుక నెల్లూరులో ఆ బలహీనత పైకి కనబడదు. కానీ ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రం అది బయటపడుతుంది. అందుకే నెల్లూరులో వైకాపాను డ్డీ కొనగల ఆనం సొదరులను మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకొన్నారు. వారి చేరికకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి జిల్లాకు చెందిన సీనియర్ నేతలు అభ్యంతరం చెప్పారు కానీ వారందరికీ నచ్చజెప్పి ఆనం సోదరులకు చంద్రబాబు నాయుడు లైన్ క్లియర్ చేసారు.   ఇక జిల్లాలో వైకాపా చాలా బలంగా ఉన్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య కీచులాటలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి వర్గం తమను పట్టించుకోకుండా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, మేకపాటి పెత్తనం సహించబోమని జిల్లా వైకాపా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కారణంతో ప్రసన్నకుమార్ ఐదు నెలల క్రితం తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దపడ్డారు. కానీ అతనిని పార్టీ అధిష్టానం బుజ్జగించడంతో ప్రస్తుతం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆనం బ్రదర్స్ తెదేపాలో చేరడం వలన నెల్లూరు జిల్లాలో పార్టీ బలపడే అవకాశం ఉంటుందని భావించవచ్చును.

ఐసిస్ ఉగ్రవాదులకి టర్కీ పరోక్షమద్దతు ఇస్తోంది: పుతిన్

  మూడు రోజులక్రితం రష్యాకు చెందిన ఒక యుద్ద విమానాన్ని టర్కీ కూల్చి వేయడంపై ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. టర్కీ నుండి రష్యా దిగుమతి చేసుకొనే అనేక ఉత్పత్తులను తీసుకోవడం నిలిపివేసింది. టర్కీ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రష్యా కోరుతోంది. కానీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఇర్డోగాన్ ప్రకటించడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదీమీర్ పుతీన్ మండిపడ్డారు. తప్పు చేసిన టర్కీకి అమెరికా మద్దతు పలకుతుండటాన్ని కూడా ఆయన తప్పు పట్టారు.   పుతీన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ “మా యుద్ద విమానం టర్కీ గగనతలంలో ప్రవేశించినందునే కూల్చివేశామని ప్రకటించింది. కానీ ఇప్పుడు మా యుద్ద విమానాన్ని సరిగ్గా గుర్తించలేకపోయినందునే కూల్చివేశామని చెపుతున్నారు. మా యుద్ద విమానంపై చాలా స్పష్టమయిన చిహ్నాలు ఉన్న సంగతి వారికీ తెలుసు. అది చేసిన తప్పుకి బేషరతుగా క్షమాపణలు చెప్పకపోగా ఇటువంటి వితండవాదనలు చేయడం మాకు ఇంకా బాధ కలిగిస్తోంది. మా విమానం ఆ సమయంలో ఏ దిశలో, ఎంత ఎత్తులో ప్రయానిస్తోందో అన్ని వివరాలు టర్కీకి మద్దతు ఇస్తున్న అమెరికాకి కూడా తెలుసు. అయినా కూడా టర్కీకి మద్దతు ఇస్తోందంటే దానర్ధం ఏమిటి?” అనిపుతీన్ ప్రశ్నించారు.   టర్కీపై పుతీన్ తీవ్ర ఆరోపణలు చేసారు. “సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న చమురు బావుల నుండి టర్కీ చాలా భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. సిరియా నుండి కొనుగోలు చేస్తున్న చమురును టర్కీ వాహనాలు తీసుకువెళ్ళడం పైనుండి మా యుద్ద విమానాలలో పైలట్లు గమనిస్తూనే ఉన్నారు. ఐసిస్ ఉగ్రవాదుల వద్ద నుండి టర్కీ చమురు కొనుగోలు చేస్తుండటం వలననే ఉగ్రవాదులకు భారీ ఆదాయం, దానితో మారణాయుధాలు సమకూర్చుకొని మా దేశాల మీద దాడులు చేస్తున్నారు. టర్కీ కొంటున్నది కేవలం చమురు మాత్రమే కాదు మా దేశాల రక్తాన్ని కూడా. అది ఉగ్రవాదులకు ఈవిధంగా ఆర్ధిక సహాయం అందిస్తూ ప్రపంచ దేశాల ప్రజల జీవితాలను పణంగా పెడుతోంది. మేము ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులపై పోరాడుతుంటే టర్కీ వారికి ఈవిధంగా సహాయపడటం చాలా దారుణం,” అని అన్నారు.

రాజయ్య కోడలిది ఆత్మహత్యే

  వరంగల్‌ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యేనని దృవీకరిస్తూ హైదరాబాద్ లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ వరంగల్ పోలీసులకు ఒక నివేదిక పంపింది. ఈనెల 4వ తేదీన రాజయ్య ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు అభినవ్‌(7), ఆయాన్(3), శ్రీయాన్(3)లు సజీవ దహనమయ్యారు. సారిక తన మరణానికి ముందు చాలాసార్లు తన న్యాయవాదిని కలిసి తనను తన భర్త అనిల్, మావగారు రాజయ్య, ఆయన భార్య మాధవీలత వేధిస్తున్నారని తెలిపింది. రెండు మూడుసార్లు వారిపై పోలీసులకు పిర్యాదు కూడా చేసింది. వాళ్ళు తనను ఆత్మహత్య చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు కూడా తెలిపింది. కనుక రాజయ్య కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేసి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.   ఘటాన స్థలం నుండి పోలీసులు సేకరించిన ఆధారాలను, పోస్ట్ మార్టం నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత సారికది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ నిపుణులు అధికారికంగా దృవీకరించారు. గ్యాస్ లీకయి మంటలు వ్యాపించడంతో అందులో వారు సజీవ దహనమయినట్లు తమ నివేదికలో దృవీకరించారు. ఈ నివేదిక వలన సారిక భర్త అనిల్, రాజయ్య అతని భార్య మాధవీలతపై హత్యారోపణలు కొట్టివేయబడవచ్చును. కానీ సారికను మానసికంగా, శారీరికంగా వేధించినందుకు, ఆమెను ఆత్మహత్య చేసుకొనేందుకు ఉసిగొల్పినందుకు, ఆ కారణంగా ఆమె మరణానికి, అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారుల మరణానికి కారణమయినందుకు వారికి శిక్షలు పడటం ఖాయం. వారు నేరుగా ఆమెను హత్య చేయకపోయినా వారి మరణాలకి కారకులు మాత్రం వారే. అది హత్య కంటే చాలా హేయమయిన ఘాతుకం అని చెప్పకతప్పదు.

కేసీఆర్ కి జానా సవాలు విసిరారు సరే కానీ...

  కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక సవాలు విసిరారు. కేసీఆర్ చెపుతున్నట్లుగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో పంటలకు వచ్చే ఏడాది నుండి వరుసగా మూడేళ్ళపాటు నీళ్ళు ఇచ్చినట్లయితే తను స్వయంగా తెరాస ప్రభుత్వ గొప్పదనం గురించి ఊరూరు తిరిగి ప్రచారం చేస్తానని అన్నారు. మూడేళ్ళు కాదు...వచ్చే ఐదేళ్ళలో అయినా పంటలకు నీళ్ళు ఇవ్వగలమని ఏదయినా ఒక అంతర్జాతీయ సంస్థతో చెప్పించినా తను మాటకి కట్టుబడి తెరాస కార్యకర్తలా తెరాస తరపున ప్రచారం చేయడానికి సిద్దమని జానారెడ్డి అన్నారు.   జానారెడ్డి తెరాసకు చాలా గొప్ప సవాలే విసిరానని ఆయన భావిస్తుండవచ్చును. కానీ గత పదేళ్లుగా సమైక్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో ఆ మూడు జిల్లాలలో సాగునీటి సౌకర్యం కల్పించడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వలననే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించినదని ఆయనే స్వయంగా చాటి చెప్పుకొన్నట్లయింది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత కష్టపడినా మరో ఐదేళ్ళ వరకు ఆ మూడు జిల్లాలలో పంటలకు నీళ్ళు అందించడం సాధ్యం కాదని ఆయన అంత ఖచ్చితం చెపుతున్నారంటే ఆ మూడు జిల్లాలలో వ్యవసాయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం అవుతోంది.   దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆ మూడు జిల్లాలలో పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయని తెలిసి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ సమస్యను పరిష్కరించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయనప్పటికీ, ఇప్పుడు తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే, జానారెడ్డి దానికి సహకరించవలసింది పోయి ఈవిధంగా సవాళ్ళు విసరడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. కానీ తెరాస పార్టీలో చేరాలని ఆయన చాలా కాలంగా తహతహలాడుతున్నారు కనుక కేసీఆర్ పట్టుదల గురించి బాగా తెలిసిన ఆయన ఈ విధంగానయినా తెరాసలో చేరాలని ప్రయత్నిస్తున్నారేమో? అనే అనుమానం కలుగుతోంది.