జెండా పాతాలంటే 40 లక్షలు

  కేంద్రప్రభుత్వం పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ జాతీయ జెండాను నెలకొల్పాలని ఇటీవల ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే! విద్యార్థులలో దేశభక్తిని పాదుకొల్పేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఇదేమంత తేలికైన విషయంగా కనిపించడం లేదు. అంతత్తున ఉండే విశ్వవిద్యాలయ భవనాల దగ్గర జెండా కనిపించాలంటే జెండా స్తంభం కనీసం 200 అడుగుల ఎత్తున ఉండాలి.   సదరు స్తంభం తుపాను గాలులకీ, పిడుగులకీ తట్టుకునేలా ఉండాలి. అందుకోసం కనీసం 40 లక్షలు ఖర్చువుతుందని తేలింది. ఇంతేకాదు! ఆ జెండా రాత్రిపూట అందరికీ కనిపించేందుకు అవసరమయ్యే విద్యుత్తు, జెండాని నిరంతరం కాపలా కాసేందుకు బందోబస్తు ఖర్చూ... వంటి నెలవారీ ఖర్చులు వేలకివేలు అవుతాయట. ఇలా 46 విశ్వవిద్యాలయాల వద్ద జెండాని నెలకొల్పవలసి ఉంటుంది. అంటే ఒకో జెండాకీ 40 లక్షలు చొప్పున దాదాపు 18 కోట్ల ఖర్చన్నమాట. దేశభక్తి చాలా ఖరీదే సుమా!

అలీఘడ్‌ యూనివర్సిటీలో ఆవుమాంసం!

  ఆవుమాంసం (బీఫ్‌) గురించి గొడవలు దేశవ్యాప్తంగా ఎక్కడో అక్కడ చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రతిష్టత్మక అలీఘడ్‌ విశ్వవిద్యాలయం కూడా ఈ వివాదంలో చిక్కుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీలోని మెడికల్‌ క్యాంటీన్లో ఆవుమాంసాన్ని విక్రయిస్తున్నారంటూ వచ్చిన పుకార్లు స్థానికంగా ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ వార్త విన్నవెంటనే బీజేపీ తదితర పార్టీలన్నీ కూడా విద్యాలయం ముందర ధర్నాకు దిగాయి.   విశ్వవిద్యాలయం తరఫున ప్రతినిధి అయిన రాహత్‌ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశారు. తమనీ, తమ క్యాంటీన్నీ అప్రతిష్ట పాలు చేసేందుకు ఎవరో పన్నిన కుట్రగా ఆయన దీన్ని అభివర్ణించారు. 132 సంవత్సరాల క్రితమే తమ విశ్వవిద్యాలయంలో ఆవుమాంసాన్నీ, గోవధనీ నిషేధించామని ఆయన పేర్కొన్నారు. కానీ ఈ గొడవ మాత్రం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.  

జాట్‌ ఉద్యమం వెనుక ఉన్న వ్యక్తి ఇతనే!

  కొద్ది రోజుల క్రితం వరకూ యశ్‌పాల్‌ మాలిక్‌ అంటే ఎవరో చాలామందికి తెలియదు. కానీ ఈ వారం హర్యానాలో పతాకస్థాయిని చేరుకున్న జాట్‌ ఉద్యమం గురించి వార్తలను వింటున్నవారికి అడపాదడపా ఆయన పేరు వినిపించడం మొదలుపెట్టింది. జాట్‌ వర్గం తనకు రిజర్వేషన్ల కోసం హర్యానాలో చేపడుతున్న ఆందోళనలకు కర్త, కర్మ ఆయనే. అఖిలభారత జాట్‌ ఆరక్షణ్‌ సంఘర్ష్‌ సమితి (AIJASS) తరఫున ఆయన 2010 నుంచీ జాట్ వర్గానికి తగిన రిజర్వేషన్లను కల్పించాలంటూ పోరాడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యశ్‌పాల్‌ ఘజియాబాద్‌, నోయిడా వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేసి బాగానే మూటలు కట్టుకున్నారు.   హఠాత్తుగా ఏమనిపించిందో ఏమో కానీ గత కొద్ది సంవత్సరాలుగా జాట్ రిజర్వేషన్ల కోసం తన సమయాన్ని కేటాయించడం మొదలుపెట్టారు. ఉత్తరభారతదేశంలో నడిచే కులపంచాయితీలు (ఖాప్‌) అన్నా యశ్‌పాల్‌కు వల్లమాలిన అభిమానం. వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఓసారి ఆమీర్‌ఖాన్‌ మీద కూడా ఆయన మండి పడిపోయారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఉన్న జాట్‌లను కేంద్ర ప్రభుత్వం తన OBC జాబితాలో చేర్చేంతవరకూ ఈ ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు యశ్‌పాల్‌!

యాపిల్ ఫోన్లను బహిష్కరించండి- ట్రంప్‌!

  అమెరికా అధ్యక్ష పదవి కోసం ముందంజలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా న్యాయవ్యవవస్థకు సహకరించనందుకుగాను, యాపిల్‌కి సంబంధించిన ఉత్పత్తులన్నింటినీ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక ముస్లిం జంట తమ తుపాకులతో విధ్వంసాన్ని సృష్టించిన వార్త గుర్తుండే ఉంటుంది. ఈ కాల్పులలో 14మంది చనిపోయారు. నేరస్తుల గురించి పరిశోధనలో భాగంగా వారికి సంబంధించిన యాపిల్‌ ఐఫోన్‌ పోలీసుల చేతికి చిక్కింది. అయితే అందులో నిక్షిప్తం అయి ఉన్న సమాచారాన్ని వెలికితీయడంలో పోలీసులు విఫలమయ్యారు.   ఇందుకోసం యాపిల్ సంస్థను సంప్రదించగా, తమ ఫోన్లను డీకోడ్‌ చేసేందుకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సాయం చేయమంటూ ఆ సంస్థ చేతులు ఎత్తేసింది. ఇలా చేయడమంటూ మొదలుపెడితే, తమ ఐఫోన్లను దుర్వినియోగపరిచే సందర్భాలు పెరిగిపోతాయనీ... తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఇకమీదట రహస్యంగా ఉండలేదనీ యాపిల్ వాదన. యాపిల్‌ వాదన విన్న ట్రంప్‌కు మహా కోపం వచ్చేసింది. యాపిల్‌ సంస్థ దిగివచ్చి పరిశోధకులకు సహకరించేదాకా, ఆ ఫోన్‌ను తాను వాడబోనననీ... తన మద్దతుదారులు కూడా ఐఫోన్లను వాడరాదనీ పిలుపునిచ్చారు. మరి ట్రంప్‌ మాటలను ప్రజలు సీరియస్‌గా తీసుకుంటారా లేకపోతే ‘ఇలాంటి ప్రేలాపనలు ఈయనకి కొత్తకాదు కదా!’ అని ఊరుకుంటారా వేచిచూడాలి.  

శాసనసభ్యుడు- అత్యాచారం చేసి పారిపోయాడు!

  నాయకుడంటే తండ్రి తరువాత తండ్రిలాంటి వాడంటారు. కానీ బీహార్లోని ఓ శాసనసభ్యుడు ఉచ్ఛనీచాలను మర్చిపోయాడు. రాజ్‌వల్లభ్‌ యాదవ్‌ అనే ఆ RJD శాసనసభ్యుడు ఒక మైనర్‌ బాలిక మీద అత్యాచారం చేశాడు. ఆ విషయం బయటపడటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రాజ్‌వల్లభ్‌కి స్థానిక పోలీసుల అండ కూడా పుష్కలంగా ఉందని తెలియడంతో గ్రామస్తులంతా తిరగబడ్డారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ దృష్టికి ఈ నేరాన్ని తీసుకువెళ్లారు. అంతేకాదు, రాజ్‌వల్లభ్‌ బలవంతుడు కాబట్టి అతను తిరిగివచ్చాక హాయిగా బెయిలుని పొందుతాడని వారికి తెలుసు. అందుకే వారంతా కలిసి బాధితురాలి తండ్రికి న్యాయపోరాటం చేసేందుకు అవసరమయ్యే ధనసహాయం కోసం విరాళాలను సేకరిచారు. గ్రామస్తుల పట్టుదలకు ప్రభుత్వం సైతం తల ఒగ్గక తప్పలేదు. ఎమ్మెల్యేని వీలైనంత తొందరగా అరెస్టు చేసేందుకు ఘటన జరిగిన నలంద జిల్లాకు ఒక కొత్త ఎస్పీని నియమించింది.

కన్నయాకుమార్‌- ఒకో వీడియోలో ఒకో మాట!

  జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశానికి సంబంధించి రోజుకో చిత్రం బయటపడుతోంది. అఫ్జల్‌గురుకి అనుకూలంగా సాగిన ఈ సమావేశంలో ‘కన్నయా కుమార్‌’ అనే విద్యార్థి నాయకుడు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ అభియోగం మీదే ప్రస్తుతం కన్నయా దేశద్రోహం కేసుని ఎదుర్కొంటున్నాడు. అందుకు సాక్ష్యంగా గతవారం ఒక వీడియోను కూడా దేశవ్యాప్తంగా ఉన్న వార్తా ఛానళ్లు ప్రసారం చేసేశాయి. అందులో కన్నయా కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కావాలని నినాదాలు చేస్తున్నట్లుగా వినిపించింది కూడా.   కానీ కన్నయా కోరుకుంది కశ్మీర్‌కి కాదనీ పేదరికం నుంచీ, ఆకలి నుంచీ, అవిద్య నుంచీ... స్వతంత్ర్యాన్ని కోరుతూ నినాదాలు చేశాడనీ రుజువు చేస్తూ మరో వీడియో బయటపడింది. దాంతో తమ తొందరపాటుకి పోలీసులు నాలుక కరుచుకుంటున్నారు. అసలు నిందితులను వదిలి వేసి కొసరు నాయకుడిని పట్టుకుని, ఇప్పుడు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. వార్తా ఛానళ్లు కూడా కన్నయా గురించి వచ్చిన తప్పుడు వీడియోను ప్రసారం చేసి, దాని మీద వేడివేడి చర్చలు జరిపి, విద్యార్థి నాయకులను నానా తిట్లూ తిట్టి... ఇప్పుడు అది నకిలీ వీడియో అని తేలడంతో గమ్మున ఉండిపోయాయి.

సెల్ఫీ మోజులో చంపేశారు

  అవి ఒక అరుదైన జాతికి చెందిన డాల్ఫిన్‌లు. అర్జంటీనా తీరంలో మాత్రమే కనిపించే జీవులు. ఆ అరుదైన జీవులు కాస్తా మనుషుల కంట్లో పడ్డాయి. అంతే! సముద్ర స్నానానికి వచ్చినవారంతా వాటిని తమ చేతుల్లోకి తీసుకుని సెల్ఫీలకు పోజులివ్వడం మొదలుపెట్టారు. చూస్తూ చూస్తుండగానే పదులకొద్దీ జనం వాటిని ఒకరి చేతుల్లోంచి ఒకరు లాక్కొని మరీ ఫొటోలు దిగారు. వాళ్ల చేతుల్లో డాల్ఫిన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ఎవరికీ జాలి కలగలేదు సరికదా సెల్ఫీల తాపత్రయంలో ఇంకాస్త గట్టిగా పట్టుకుని దాని ఊపిరికి అడ్డుపడ్డారు.   చివరికి అది చనిపోవడంతో ఏమీ ఎరుగనట్లు ఒడ్డున పడేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అర్జెంటీనాలోని శాంటా టెరెసిటా అనే నగరంలో జరిగిన ఈ సంఘటన పలువురు జంతుప్రేమికుల ఆగ్రహానికి కారణమైంది. ఆ డాల్ఫిన్‌ చావుకి కారణమైనవారి మీద కఠిన చర్యలను తీసుకోవాలంటూ అధికారులను కోరుతున్నారు. స్థానిక అధికారులు కూడా మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ హామీ ఇస్తున్నారు. ఒకవేళ ఎవరికన్నా డాల్ఫిన్‌ కనిపిస్తే వాటిని తిరిగి సురక్షితంగా నీటిలో విడిచిపెట్టమంటూ ప్రకటనలను గుప్పిస్తున్నారు. సరే!

ఆ జైల్లో వందలాది శవాలు!

  కొలంబియాలోని బొగొటా అనే జైలు అది. ఖూనీకోరులకీ, మత్తుమందు వ్యాపారస్తులకీ ఆ జైలు పెట్టింది పేరు. కానీ తమ దేశంలో అలాంటి వాళ్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో కొలంబియా పది మంది నేరస్తులని ఉంచాల్సిన చోట 20మందిని నిర్బంధించింది. ఇలాంటి జైళ్లలో కొట్లాడుకోవడం, దొమ్మీలు జరగడం సర్వసాధారణం. కానీ ఇటీవల బొగొటా జైలులో వెలికి చూస్తున్న వాస్తవాలు చూస్తుంటే కరుడుగట్టిన నేరస్తులకి సైతం గుండె కరిగిపోతోంది. బొగొటా జైలు మురుగుకాల్వలలో ఒకటి కాదు, పది కాదు వందకి పైగా శవాలు బయటపడుతున్నాయి.     పోనీ వారంతా జైళ్లోనివారా అంటే అదీ కాదు. జైళ్లో ఉన్న తమ బంధువులను చూడటానికి వచ్చినవారు కూడా శవాలుగా తేలుతున్నారు. ఇవన్నీ కేవలం 1990-2001 మధ్యలో జరిగిన హత్యలుగా భావిస్తున్నారు అధికారులు. జైలు అధికారులు, కొందరు పైశాచికమైన నేరస్తులు కలిసి చేసిన ఘోరంగా వీటిని భావిస్తున్నారు. కొలంబియాలో ఉన్న ప్రభుత్వానికి స్థిరత్వం లేకపోవడంతో ఏం చేసినా ఎవరూ పట్టించుకోరనుకుని ఇలాంటి అకృత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బయటపడిన మృతదేహాలను గుర్తుపట్టే పరిస్థితి లేదు. కనీసం ఆ హత్యలకు కారణం అయినవారినన్నా గుర్తించేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది.

ఫ్రీడం 251/- ఫోను.... అంతా ఉత్తుత్తేనా!

    251 రూపాయలకే పేద్ద ఫోను. అందులో లేని ఫీచర్‌ అంటూ లేదు. స్క్రీన్‌ కూడా పెద్దదే! ఫిబ్రవరి 18 ఉదయం 6 గంటల నుంచి ఈ ఫోనుని ఆన్‌లైన్లో బుక్‌ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రకటనలు విన్న భారతదేశంలోని లక్షలాది మంది యువత జీవితంలో ఎప్పుడూ లేనిది నిన్న ఉదయం ఐదుగంటలకే లేచి కూర్చున్నారు. కానీ ఏ ఒక్కరికీ ఫోన్ దక్కినట్లు లేదు. ఫోన్‌ని అమ్ముతున్న సైట్ కాస్తా క్రాష్‌ అయిపోయింది. ఒక వేళ ఎవరన్నా ఫోన్‌ బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తే సైట్‌లో అడుగడుగునా అడ్డంకులు కనిపిస్తూనే ఉన్నాయి. వెరసి ఇంతవరకూ ఏ ఒక్క వినియోగదారుడి చేతికీ ఫ్రీడం 251 ఫోను అందలేదు. నోయిడాకి చెందిన రింగింగ్‌ బెల్స్‌ అనే సంస్థ చౌకబారు ప్రచారం కోసమే ఇదంతా చేసింది అన్న అపవాదులూ వినిపిస్తున్నాయి.   - ఫ్రీడం 251 ఫోను యాపిల్ ఫోనుకి నకలుగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే యాపిల్ కంపెనీ నుంచి కాపీరైటు కేసుని ఎదుర్కోవలసి ఉంటుంది.   - ఈ ఫోను ఉత్పత్తిదారులు చెబుతున్నట్లు ఇదేమీ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఫోను కాదని తేలిపోయింది. ఇందులో పరికరాలన్నీ తైవాన్ నుంచి దిగుమతి అయ్యాయట.   - ఫోనుని ఇంత చవగ్గా ఎలా అమ్మగలుగుతున్నారంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు నేడు రింగింగ్‌ బెల్స్ అధికారులని ప్రశ్నించారు.   - ఈ ఫోను మీద ‘ADCOM’ అనే ముద్ర ఉంది. కానీ అదే పేరుతో ఉన్న కంపెనీ తనకీ ఈ ఫోన్లకీ ఏమాత్రం సంబంధం లేదని చెబుతోంది.   - తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఈ ధరకు ఇలాంటి ఫోన్లను తయారుచేయలేరు, ఇందులో ఏదో మోసం ఉంది అంటూ ‘ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్’ నిన్న ప్రభుత్వాన్ని ఒక ఫిర్యాదు చేసింది.

కాలు తొక్కినందుకు- పొడిచి పారేశారు!

  ఈ నెల 14వ తేదీన దేశవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ అదే వేడుకలలో చోటుచేసుకున్న ఓ అపశృతి వల్ల  వెంకటేశ్ అనే కుర్రవాడి జీవితాన్ని అంతం చేసింది. బెంగళూరు దగ్గరలోని అడగోడి అనే ప్రాంతంలో జరుగుతున్న రథసప్తమి వేడుకలలో వెంకటేశ్‌ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా స్థానిక దేవాలయంలో జరుగుతున్న ఉత్సవంలో నలుగురితో పాటు కలిసి ఆటాపాటా మొదలుపెట్టాడు.   ఆ సమయంలో ఎవరి కాలో తొక్కడంతో చిన్నపాటి గొడవ మొదలైంది. గొడవ కాస్తా చిలికిచిలికి అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ఆరుగురు యువకులు కలిసి వెంకటేశ్‌ను దారుణంగా పొడిచిపొడిచి చంపేశారు. ప్రస్తుతం ఆ ఆరుగురు నిందితులనూ పోలీసులు అరెస్టు చేయడంతో వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎవరో ఒకరు సర్దుకుపోవలసిన చోట గొడవ జరిగితే... చివరికి అదెంతటి పరిమాణాలకైనా దారి తీస్తుందని మరోసారి తెలిసివచ్చింది.

జాట్‌ ఉద్యమం- హర్యానాలో హల్‌చల్‌!

  తమకు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాలంటూ హర్యానాలో జాట్ వర్గం వారు సాగిస్తున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. రాహ్‌తక్‌, జజ్జర్‌ జిల్లాలలో ఆందోళనలు ఉధృతంగా సాగడంతో రైళ్లతో సహా రవాణా మొత్తం స్తంభించిపోయింది. ఆ రెండు జిల్లాల మధ్యా ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులు సైతం మూసుకుపోయాయి. ఉద్యమం ఒకోసారి హింసాత్మకంగా సాగుతూ ఉండటంతో ఆ రెండు జిల్లాలలో ఉన్న మొబైల్‌ ఫోన్లకి ఇంటర్నెట్‌ సేవలని నిలిపివేశారు. ఎస్‌.ఎం.ఎస్‌ సేవలు సైతం నిలిచిపోయాయి. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని నిలువరించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.   జాట్‌ వర్గం ఆందోళనను శాంతింపచేసేందుకు ప్రభుత్వం వారికి స్పష్టమైన హామీలను ఇచ్చినప్పటికీ, ఆ హామీలను చట్టబద్ధం చేసేంతవరకూ తాము ఉద్యమాన్ని సాగిస్తామని జాట్‌ నేతలు చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికి వీరి ఆందోళనల వల్ల జనజీవనానికి మాత్రం తీవ్ర విఘాతం ఏర్పడింది. బాధిత జిల్లాలలో కూరగాయలు, పెట్రోలు, పాలు వంటి నిత్యావసర వస్తువులు లభించని స్థితి ఉంది. ఆ విషయం ఉద్యమకారులకు పట్టదు కదా!

ఈ ఏటి ఉత్తమ ఫొటో ఇదే... ఎందుకంటే!

    వెన్నెల రాత్రిని చూసి కవులు ఎన్నో ప్రేమకవితలను రాయవచ్చుగాక! కానీ వారు భావోద్వేగంతో కవితలు రాసే సమయంలో ఎన్నో జీవితాలు తారుమారైపోతుంటాయి. వేలాది బతుకులు ఛిద్రమైపోతుంటాయి. అక్కడక్కడా చిన్నిచిన్న ఆశలు మాత్రమే మిగిలి రగులుతుంటాయి. అలాంటి ఓ బతుకు చిత్రం ఒకటి ఈ ఏటి ఉత్తమ ఫొటోగా నిలిచింది. హంగేరీ-సెర్బియాల మధ్య ఉన్న కంచె వద్ద తీసిన ఈ ఫొటోతో ముడిపడిన భావోద్వేగాలు ఎన్నో ఉన్నాయి. యురోపియన్‌ యూనియన్‌లో భాగస్వామిగా ఉన్న హంగెరీలోకి ప్రవేశించేందుకు సెర్బియా తరఫు నుంచి లక్షలాది శరణార్ధులు సదా సిద్ధంగా ఉంటారు. ఒక్కసారి వారు కనుక హంగెరీలోకి ప్రవేశించగలిగితే దాంతోపాటు, యూరోపియన్‌ యూనియన్లో ఉండే 28 దేశాలలో ఎక్కడైనా తలదాచుకోవచ్చన్నది వారి ఆశ.   అలా ఆశగా ప్రవేశించేవారిని నిలువరించేందుకు హంగెరీ సరిహద్దు పొడవునా కంచెని నిర్మించింది. ఈ కంచె ఎంత పదునుగా ఉంటుందంటే... దాన్ని పట్టుకుంటే వేలు తెగిపోవాల్సిందే! అలాంటి చోట ఒక పిల్లవాడిని సెర్బియా వైపు నుంచి హంగెరీలోకి అందించడమే ఈ ఫొటోలో గమనించవచ్చు. మరి ఆ పిల్లవాడు ఎవరు? అతని భవిష్యత్తు ఏమిటి? అతడితో పాటు వచ్చిన వ్యక్తి సరిహద్దు దాటగలిగాడా? అన్న ప్రశ్నలకి ఫొటోగ్రాఫర్ రిచర్డసన్‌ వద్ద స్పష్టమైన జవాబులు లేవు. అలాంటి జవాబు తెలియకపోవడమే మనల్ని ప్రశాంతంగా ఉంచుతుందేమో!

భోజనం అడిగితే... కొట్టి చంపేశారు!

  రోజూ ఆ పాప బుద్ధిగా బడికి వెళ్తుంది. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం కింద కాస్త కడుపు నింపుకుంటుంది. ఆ రోజు ఆకలేసిందో ఏమో.. మరో రెండు ముద్దలు పెట్టమని వంటవారిని అడిగింది. అంతే గరిటెతో ఒక్కటిచ్చి తరిమేశారు. ‘భోజనం ప్రతి పిల్లవాడి హక్కూ, అంతమాత్రానికే పాపని కొట్టి తరిమేస్తారా?’ అంటూ పాప తండ్రి షాగిర్‌ పాఠశాలకి వచ్చాడు. షాగిర్‌ మాటలకి పాఠశాల ఉపాధ్యాయులకు అహం దెబ్బతిన్నది. అక్కడాఇక్కడా అని చూడకుండా విచక్షణారహితంగా అతణ్ని కొట్టారు. ఆ దెబ్బలకి తాళలేక షాగిర్‌ చనిపోయాడు! ఇదేదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, భోజనం గురించి ప్రశ్నిస్తే చావబాదడం ఆ ఉపాధ్యాయులకు కొత్తకాదనీ చెబుతున్నారు గ్రామస్తులు. బీహార్‌లోని గోక్లాపూర్‌లో జరిగిన ఈ సంఘటన అక్కడి పాఠశాలలు ఎంత అధ్వాన్నంగా నడుస్తున్నాయో చెప్పకనే చెబుతోంది.     కానీ ఉపాధ్యాయ సంఘాల వాదన మాత్రం వేరేగా ఉంది. ప్రభుత్వం తన ఆర్భాటం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందే కానీ అందుకోసం తగిన నిధులను ఇవ్వదనీ, అందుకే ప్రతి అన్నంమెతుకునీ కొలుచుకోవలసి వస్తోందని చెబుతున్నారు. నిధుల లేమి వల్ల ఆకలి తీరేంత భోజనాన్ని అందించలేకపోతున్నామనీ, ఒకోసారి నాణ్యతలో కూడా తీవ్రమైన లోపాలు తలెత్తుతున్నాయనీ ఆరోపిస్తున్నారు. ఇలా ఖర్చు తగ్గించుకునేందుకు ఏ ఆహారం పడితే ఆ ఆహారాన్ని వండటంతో పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా బీహార్‌లో ఉన్నాయి. 2013లో బీహార్లోని ఛాప్రాలో ఇలా 23 మంది పిల్లలు విషాహారాన్ని తిని చనిపోయారు. ఈ ఘటన జరిగి ఇంకా మూడేళ్లు గడిచినా కూడా ప్రభుత్వం ఇంకా మేల్కొన్నట్లు లేదు!

మరో ప్రపంచ యుద్ధం!

  1945లో కొరియా దేశం ఉత్తర, దక్షిణ కొరియాలంటూ రెండు దేశాలుగా విడిపోయినప్పటికీ... ఆ రెండు దేశాల మధ్యా సంబంధాలు ఉప్పునిప్పుగా సాగుతున్నాయి. ఒక సందర్భంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాని పూర్తిగా ఆక్రమించుకోగా ఐక్యరాజ్యసమితి బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పడు మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరకొరియా తమ మీద యుద్ధం చేసేందుకు సర్వ సన్నాహాలన్నీ చేసుకుందని నిన్న దక్షిణకొరియా ఆరోపించింది. అందుకోసమే గత నెల ఆ దేశం హైడ్రోజన్‌ బాంబుని సైతం పరీక్షించిందనీ, ఖండాంతర క్షిపణులను సైతం సిద్ధం చేసుకుంటోందనీ దక్షిణ కొరియా వాదిస్తోంది.   ఈ రోజులలో యుద్ధమన్నది పెద్ద మాటే అయినప్పటికీ, దక్షిణ కొరియా భయాలను కొట్టిపారేసేందుకు కూడా లేదు. పైగా ప్రస్తుతం ఉత్తర కొరియాను ఏలుతున్న ‘కిమ్ జోంగ్‌’ దుండుకుతనానికి పెట్టింది పేరు. దాంతో దక్షిణకొరియాకు అనుకూలంగా ఇప్పటికే అమెరికా తన యుద్ధవిమానాలను ఆ దేశానికి మళ్లిస్తోంది. మరోవైపు ఉత్తర కొరియాకు మద్దతుగా నిలిచేందుకు ఎప్పటిలాగానే చైనా సిద్ధంగా ఉంది. ఈ యుద్ధం కనుక వాస్తవ రూపం ధరిస్తే అటు చైనా, ఇటు అమెరికాలతో అది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఈసారి హైడ్రోజన్‌ బాంబులు కూడా ఉన్నాయి మరి!

రాహుల్‌గాంధి ట్విట్టర్‌లో ఘోరమైన తిట్లు

  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడైన రాహుల్‌గాంధి నేడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి జేఎన్‌యూ గురించి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. జేఎన్‌యూలో జరుగుతున్న పరిణామాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందనీ, బీజేపీ పాలనా విధానాన్ని తామంతా నిరసిస్తున్నామనీ ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ పత్రం నకలు ఒకటి రాహుల్‌గాంధి కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో ఉంచడంతో, నెటిజన్లు తమదైన శైలిలో దానికి సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. రాహుల్‌గాంధి కార్యాలయం గాంధిగారి మూడు కోతులకీ చిహ్నమని ఒక నెటిజన్ తన స్పందనలో పేర్కొంటే... ఇంతకీ ఆ పత్రం మీద మీ సంతకం లేదు, మీరు వేలిముద్రగానీ వేశారా అంటూ మరొకరు ఎగతాళి చేశారు. వెళ్లి ఛోటాభీం చూసుకోండి అని ఒకరంటే మీకంటే ఔరంగజేబు నయం అని వేరొకరు ట్వీటారు. 'అయితే ఇంతకీ భారతదేశాన్ని నాశనం చేయాలనే నినాదాలను మీరు సమర్థిస్తున్నారా?’ అంటూ మరో నెటిజన్ రాహుల్‌ని ప్రశ్నించారు. ఆయన బుర్ర రైల్వే పట్టా అనీ, సాయం లేకుండా ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాయలేరనీ మరి కొందరు పేలారు. ఇక రాయడానికి కూడా వీల్లేని తిట్లకీ ఆయనకి అందిన జవాబులలో కొదవ లేకుండా పోయింది. పాపం రాహుల్‌. ఇవన్నీ ఆయన చూడకుండా ఉంటే బాగుండు!

అఫ్జల్‌గురువు కోసం18 విశ్వవిద్యాలయాలలో ప్రదర్శన

  దిల్లీలోని జవహర్‌లాల్ విశ్వవిద్యాలయంలో తీవ్రవాది అఫ్జల్‌గురుకి అనుకూలంగా జరిగిన ప్రదర్శన అనుకోకుండా ఏర్పాటు చేసింది కాదని తెలుస్తోంది. ఆ సంస్థలో పీ.హెచ్.డీ చేస్తున్న ఉమర్‌ ఖాలిద్ అనే విద్యార్థి దేశవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాలలో ఇలాంటి ప్రదర్శనని ఏర్పాటు చేయాలనుకున్నాడట. అందులో భాగంగానే అక్కడ అఫ్జల్‌గురుని అమరుడిగా కీర్తిస్తూ ఒక కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కానీ ఆ కార్యక్రమం వివాదాస్పదం కావడంతో ఉమర్‌ ఖాలిద్‌ పప్పులు ఉడకలేదు. పోలీసులు కనుక తొందరపడకుండా నిదానంగా విచారించి ఉంటే... ఈ కేసులో అసలు ముద్దాయి ఉమర్‌ ఖాలిద్ అని తేలిపోయేది అంటున్నారు కొందరు పరిశోధకులు. ఎందుకంటే ప్రస్తుతం ఉమర్ రొమ్ము విరుచుకుని తిరుగుతుండగా, మరో విద్యార్థి నాయకుడైన కన్నయా కుమార్ జైల్లో మగ్గుతున్నాడు. DSU అనే విద్యార్థి సంఘ నాయకుడైన ఉమరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించినట్లు ఇప్పుడిప్పుడే తేల్తోంది. ‘న్యాయవ్యవస్థ చేతిలో చనిపోయిన అఫ్జల్‌గురుకి మద్దతుగా, భారతీయ సైనికులు చేస్తున్న దుర్మార్గాలకి వ్యతిరేకంగా, కశ్మీర్‌లోని ప్రజలని హత్య చేస్తున్నందుకు నిరసనగా’ తాము ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉమర్‌ ఖాలిద్ కరపత్రాలను పంచి విద్యార్థులందరినీ చేరదీసినట్లు తెలుస్తోంది. సహజంగానే అవేశపూరితంగానే ఉండే విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల వైపు ఆకర్షితులైతే?

ఫేస్‌బుక్‌లో పోస్టు- మంత్రిపదవి ఊష్టు

  అసలే కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీగారు సోలార్ కుంభకోణంలో పీకల్లోతు మునిగిపోయి ఉన్నారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న మంత్రివర్గానికి ఇప్పుడు మరో దెబ్బ ఖాయంగా ఉంది. ఆ రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి జోసెఫ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు పెను దుమారాన్నే రేపుతున్నాయి. సాధారణంగా మనకి ఎవరిమీదన్నా ఒళ్లు మండితే వారి మీద ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేయడం సహజం. జోసెఫ్‌కి అలగ్జాండర్‌ అనే న్యాయమూర్తి మీద ఏదో సందర్భంలో కోపం వచ్చింది. దాంతో అవతలి మనిషి ఎవరు ఏమిటి అని కూడా మర్చిపోయి ఫేస్‌బుక్‌లో ఆయనని ‘ఊళలు వేసే నక్క’ అంటూ ఏకిపారేశాడు. ‘నక్క ఎంత రంగుని పులుముకున్నా, దాని నిజస్వరూపాన్ని మార్చుకోలేదు. మిగతా నక్కలు ఊళలు వేసినప్పుడు, అది కూడా ఊళ వేసి తీరుతుంది’ అంటూ పంచతంత్ర కథను కూడా ఉట్టంకించారు. దీంతో ఆయన మీద కోర్టు ధిక్కారం కేసుని మోపారు న్యాయమూర్తులు. ‘అబ్బే! నేనేదో ఉత్తుత్తినే అన్నాను కానీ, నాకు న్యాయవ్యవస్థ అంటే చాలా గౌరవం!’ అని మంత్రిగారు ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నా ఉపయోగం లేకపోయింది. ‘ఆ ఇచ్చే సంజాయిషీలు ఏవో మా కోర్టు బోనులో నిల్చొని ఇవ్వండి. ఆ తరువాత మీ మీద మోపిన కేసుని ఉంచాలో కొట్టేయాలో ఆలోచిస్తాం!’ అని కబురు పంపారు న్యాయమూర్తులు. సాక్షాత్తూ న్యాయవ్యవవస్థ మీదే అపవాదు వేసిన జోసెఫ్‌ని తక్షణమే మంత్రిపదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్‌ చేయడం మొదలుపెట్టాయి.

హోంమంత్రిగారు మరోసారి లెక్క తప్పారు!

  కేంద్ర హోంమంత్రి అంటే అందరి చూపులు ఆయన వైపే ఉంటాయి. ఆయన చెప్పే ప్రతి చిన్న మాటనీ శిరసావహించడానికి అధికార పక్షం, దానిని రాద్ధాంతం చేయడానిక ప్రతిపక్షం సిద్ధంగా ఉంటాయి. మరి అలాంటి హోం మంత్రిగారు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. గత వారం కేంద్ర హోంశాఖవర్యులు రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ... జేఎన్‌యూలో జరిగిన అల్లర్ల వెనుక ప్రముఖ తీవ్రవాది హఫీజ్ సయీద్‌ హస్తం ఉందని బాంబు పేల్చారు. దానికి సాక్ష్యంగా హఫీజ్‌ సయీద్‌ పేరుతో వచ్చిన ఒక ట్విట్టర్‌ మెసేజిని చూపారు. తరువాత ఆ ట్విట్టర్‌ ఖాతా హఫీజ్‌ది కాదని తేలడంతో నాలుక కరుచుకున్నారు. ఇంతలో జరగాల్సిన నష్టం కాస్తా జరిగిపోయింది.   అసలైన హఫీజ్‌ సయీద్‌ కూడా లైన్లోకి వచ్చి మన ప్రభుత్వాన్ని ఏకిపారేశాడు.ఇలాంటి భంగపాట్లు రాజ్‌నాథ్‌కు కొత్త కాదు. ఈ ఏడాది మొదట్లో పఠాన్‌కోట్ మీద జరిగిన ఉగ్రవాదుల దాడిని ఎవరు మర్చిపోగలరు. ఆ సందర్భంలో కూడా రాజ్‌నాథ్‌ సంచలన ప్రకటనలు చేసేందుకు తొందరపడ్డారు. తీవ్రవాదులు ఇంకా పఠాన్‌కోట స్థావరంలో ఉండగానే... వారిని తుదముట్టించేశామని జనవరి 2న ట్వీటారు. అంతేకాదు! ఈ దాడిలో అయిదుగురు తీవ్రవాదులు పాల్గొన్నారని మరోమారు ట్వీటారు. జనవరి 3న పఠాన్‌కోటలో తాజా కాల్పులు వినిపించడంతో తన పాత ట్వీట్లన్నీ డిలీట్‌ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా పాకిస్తాన్లో ఉన్న జైష్‌-ఎ-మహమ్మద్ తీవ్రవాద సంస్థ ముఖ్యుడు మసూద్ అజార్ ‘అసలు తీవ్రవాదులు ఎందరో కూడా తెలుసుకోలేని అయోమయంలో వారున్నారు’ అంటూ రాజ్‌నాథ్‌ను పరోక్షంగా వెక్కిరించారు. ఇప్పటికైనా మంత్రివర్యులు ఏదన్నా ప్రకటన చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు. మరీ తీవ్రవాదులు కూడా మన హోంమంత్రిన ఎద్దేవా చేస్తుంటే వినడానికి బాగోదు కదా!

అఫ్జల్‌గురు అమరుడైతే మరి హనుమంతప్ప ఎవరు?

  ఒలింపిక్స్‌ సహా భారతదేశం కోసం ఎన్నో పతకాలను గెలుచుకున్న యోగేశ్వర్‌ దత్‌ రాసిన ఒక పద్యం ఇప్పడు ఇంటర్నెట్లో హల్‌చల్‌ చేస్తోంది. మల్లయుద్ధంలో యోధుడిగా పేరుతెచ్చుకున్న ఈ హర్యానా క్రీడాకారుడు ఇప్పడు అందరి నాలుకలలోనూ నిలుస్తున్నాడు. దేశం తరఫున అనేక ప్రతిష్టాత్మక పోటీలలో పాల్గొన్న యోగేశ్వర్‌కి జేఎన్‌యూ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సంఘటనలని చూసి బాధ కలిగినట్లుంది. 19 పంక్తులలో తన భావాలను ఒక పద్యరూపంలో రాశాడు. ఇందులో అఫ్జల్ గురు వంటి తీవ్రవాదులని ఆరాధించేవారు గజనీ వంటి వారని పేర్కొన్నాడు. దేశానికి ద్రోహం చేసిన అఫ్జల్‌గురు అమరుడైతే మరి సియాచిన్లో ప్రాణాలర్పించిన హనుమంతప్ప ఎవరు అంటూ సూటిగా ప్రశ్నించాడు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడే భావస్వేచ్ఛ గురించి కూడా యోగేశ్వర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు యోగేశ్వర్‌. జన్మనిచ్చిన భూమిని శత్రువుగా భావిస్తున్నారంటూ ఆవేదన చెందాడు. దేశమాతను అవమానించిన, దేశం పరువుతీసే నినాదాలను భావస్వేచ్ఛగా ఎలా భావించగలం అంటూ ప్రశ్నించాడు. యోగేశ్వర్‌ దత్‌ రాసిన ఈ పద్యం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో ఇప్పుడు కార్చిచ్చులా వ్యాపిస్తోంది. ప్రస్తుతానికి ఈ పద్యాన్ని దాదాపు లక్షమందికి పైగా చదివినట్లు అంచనా! మరి అసలైనవారు చదివారో లేదో!