బల్దియా బాద్ షా కేసీఆర్.. ప్రజల తీర్పు
posted on Feb 5, 2016 @ 6:39PM
ఆఖరికి గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు మేయర్ స్థానాన్ని దక్కించుకుంటారా.. ప్రజలు ఎవరికి పట్టం కట్టారా? అని ఎదురుచూస్తున్న అందరి ఉత్కంఠకు తెర దిగింది. అందరూ ఊహించినట్టే ఈ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ తమ ప్రభంజనాన్ని చాటుకుంది. సొంతగా బరిలో దిగిన టీఆర్ఎస్ పార్టీ బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ గ్రేటర్ ఎన్నికలు మొత్తం 150 డివిజన్లలో పోటీ జరగగా.. ఈ స్థానాలకు మొత్తం 31333 మంది అభ్యర్ధులు బరిలో దిగారు. ఈ 150 డివిజన్లలో కూడా వందకు పైగా స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకొని మరోసారి తన సత్తా చూపించింది.ఇదిలా ఉండగా ఇక మిగిలిన పార్టీలు నామరూపాలు లేకుండా పోయినట్టు తెలుస్తోంది. విపక్షాలు అయితే కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీడీ పార్టీ ఆశలు పెట్టుకున్న ఎరియాలు కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టంకట్టాయి. అంతేకాదు మొత్తం ఎన్నికల నేపథ్యంలో కేవలం 45 శాతం మాత్రమే పోలింగ్ శాతం జరిగింది. అంటే ఒక్క డివిజన్లో సుమారు యాభైవేల మంది ఓటర్లు ఉన్నా.. పోలింగ్ జరిగింది 45 శాతం కాబట్టి అందులో ఇరవై వేల మందికి పైగా తమ ఓటును వినియోగించుకున్నారు. అయితే ఈ ఇరవై వేలలో దాదాపు పదిహేను వేల మందికి పైగా ఓటర్లు టీఆర్ఎస్ కే ఓటు వేసినట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
గెలిచిన కేటీఆర్
ఈ గ్రేటర్ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం కేసీఆర్ తనయుడు.. మంత్రి కేటీఆర్ గురించి చెప్పుకోవాలి. ఈ ఎన్నికలను తను వ్యక్తిగతంగా తీసుకొని.. ఎన్నికల బాధ్యతను తన భుజాలపై వేసుకొని చాలా కష్టపడ్డారు. తన వాక్చాతుర్యంతో గ్రేటర్ ప్రజలను బాగా ఆకట్టుకొని.. ఎన్నికల గెలుపుకు ప్రధాన కారణమయ్యారు. అంతేకాదు ఈ గ్రేటర్ ఎన్నికలు కేటీఆర్ కి కూడా చాలా ముఖ్యం. ఈ ఎన్నికలపైనే దాదాపు తన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. కేసీఆర్ కూడా తన కొడుకు సామర్థ్యాన్ని చూసుకోవడానికే ఈ ఎన్నికల బాధ్యతను కేటీఆర్ పై మోపారు. అందుకే కేటీఆర్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికల గెలుపుకు కష్టపడ్డారు. కానీ ఎట్టకేలకు టీఆర్ఎస్ గెలిసింది. టీఆర్ఎస్ గెలిచిందంటే కేటీఆర్ కూడా గెలిచినట్టే..
సెటిలర్లు టీడీపీని నమ్మలేదా..?
గ్రేటర్ ఎన్నిల్లో పార్టీలన్నీ నువ్వా.. నేనా అంటూ పోటా పోటీగా ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు అందరికి తలెత్తే ప్రశ్న ఏంటంటే.. సెటిలర్లు కూడా టీడీపీని నమ్మలేదా.. సెటిలర్లు ఉన్న ఏరియాలు కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టం గట్టాయి. ఎందుకు..? ఇలా ప్రశ్నలెన్నో తలెత్తుతన్నాయి. ఎందుకంటే.. ఇద్దరు సీఎంల కొడుకులు సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీగా ప్రచారం చేశారు. ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారం చేశారు. మరి ఆయన ప్రచారానికి కూడా ప్రజలు ఇంప్రెస్ అవ్వలేదా..?. అయితే కేటీఆర్ మాత్రం సీమాంధ్రులను ఆకట్టుకునే విధంగా మాట్లాడారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇక సీమాంధ్రులు కూడా కేటీఆర్ మాటలకు పడిపోయారేమేకాని టీఆర్ఎస్ పార్టీకే ఓటేశారు. అంతేకాదు ఎప్పుడూ సీమాంధ్రులకు ఒక్క సీటు కూడా ఇవ్వని కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం దాదాపు 20 స్థానాలను సీమాంధ్రులకు ఇచ్చారు. ఇది కూడా ఒక కారణం అయి ఉండచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఎక్కడో సెటిలర్లు ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే.. అది కూడా చాలా తక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు.
ఓటమికి కారణాలు ఏంటి..?
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే మిగిలిన పార్టీలను చెత్తగా ఓడించి టీఆర్ఎస్ పార్టీకే పట్టంగట్టారు నగర ప్రజలు. మిగిలిన పార్టీలను ఓడించి టీఆర్ఎస్ పార్టీనే గెలిపించడానికి గల కారణాలు ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్న టీఆర్ఎస్ పాలన ప్రజలకు నచ్చిందా..? టీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వా పథకాలు ప్రజలకు నచ్చాయా..? లేకపోతే.. ఈసారి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో చూద్దామని గెలిపించారా..? ఇలా ఎన్నో కారణాలు కావచ్చు. ఇక తెలంగాణలో మిగిలిన పార్టీల సంగతి అంతంత మాత్రమే ఉంది.. ఇది కూడా టీఆర్ఎస్ గెలుపుకు ఒక కారణం కావచ్చు. మొత్తానికి కారణాలు ఏదైనా కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ ను గెలిపించారు.