తిరుపతిలో మళ్లీ వేయి కాళ్ల మండపం!
తిరుపతిలోని వేయి కాళ్ల మండపాన్ని పునర్నింమించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లను ఆహ్వానించింది. తిరుమల మాడవీధులను వెడల్పు చేసేందుకుగాను, శ్రీవారి ఆలయం వెలుపల ఉండే అతిపురాతనమైన ఈ వేయి కాళ్ల మండపాన్ని ఒకప్పుడు కూల్చివేసిన సంగతి తెలిసిందే. వేయి కాళ్ల మండపాన్ని కూల్చివేసినందుకు రాజకీయ, ఆధ్మాత్మిక వర్గాల నుంచి తితిదే అనేక విమర్శలను ఎదుర్కొంది.
అయితే ఆ కట్టడాన్ని తిరిగి నిర్మిస్తామని తితిదే చెబుతూ వచ్చింది. తన హామీకి అనుగుణంగా ఇప్పుడు దేవస్థానం, వేయి కాళ్లని పునర్మించేందుకు టెండర్లను ఆహ్వానించింది. శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న నారాయణ ఉద్యానవనంలో ఈ వేయికాళ్ల మండపాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం 18 కోట్ల రూపాయలు ఖర్చవుతుందనీ, పాత స్తంభాలలో వీలైనన్ని స్తంభాలను వీటిలో వాడనున్నామనీ, మండపం మధ్యలో కనీసం 3,000 కూర్చునేందుకు వీలుగా విశాలంగా దీన్ని నిర్మించనున్నామనీ... తితిదే అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణం కనుక పూర్తయితే నారాయణ ఉద్యానవనం తిరుమలలోని మరో గొప్ప పర్యాటక స్థలంగా మారిపోతుందనడంలో సందేహం లేదు!