ఆ కాలేజీల్లోకి.. పెళ్లైన అమ్మాయిలకు నో ఎంట్రీ!
posted on Mar 2, 2017 @ 4:55PM
మీరు తెలంగాణలోని మహిళా విద్యార్థా? ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో చదువుకోవాలని భావిస్తున్నారా? అయితే, మీకు వుండాల్సిన ప్రధాన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? పెళ్లి కాకుండా సింగిల్ గా వుండటం! అవును, తెలంగాణలోని ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలల్లో సీటు సంపాదించాలంటే అమ్మాయిలకు మూడు ముళ్లు పడకూడదు! సీటు సంపాదించేంత తెలివితేటలు వున్నా అవన్నీ ఎందుకు పనికిరావు. పెళ్లైతే నో ఛాన్స్ .... అంతే!
తెలంగాణలో మొత్తం 23 రెసిడెన్షియల్ కాలేజీలు వున్నాయి. వీటిల్లో అర్హత సంపాదించిన వారికి ప్రభుత్వమే ఆహారం, ఆవాసం కల్పించి డిగ్రీ పూర్తి చేసే సౌకర్యం కల్పిస్తుంది. ఇలా ఏటా వందల మంది తమ ప్రతిభతో సీటు సంపాదించి గ్రాడ్యుయేట్స్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా, ఇప్పటికీ ఆడపిల్లల చదువుపై డబ్బులు ఖర్చు చేయటానికి ఇష్టపడని మన సమాజంలో తెలివైన పేద అమ్మాయిలు ఈ సౌకర్యాన్ని బాగా ఉపయోగించుకుంటూ వుంటారు. అయితే, ప్రభుత్వ అధికారులు పెట్టిన విచిత్ర నిబంధన చాలా మందిని కాలేజ్ వైపు కన్నెత్తి చూడకుండా చేసేస్తోంది!
రెసిడెన్షియల్ కాలేజీలో డిగ్రీ చదవటానికి చాలా వరకూ పెళ్లైన అమ్మాయిలు వచ్చే అవకాశాలు తక్కువ. కాకపోతే, కొందరైనా మారుమూల పల్లెల్లోంచి వచ్చి చదువుకోరని అనలేం కదా. కాని, విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ సంక్షేమ కళాశాలల్లో పెళ్లైన స్త్రీలు చేరటానికి అనర్హలు అని చెప్పేశారు. కారణం ఏంటని ఆరా తీసిన వారికి వినిపిస్తోన్న జవాబు... పెళ్లైన ఆడవాళ్లు కళాశాలలో వుంటే వారి భర్తలు, బంధువులు పదే పదే వచ్చి వెళుతుంటారట! అది మొత్తం వ్యవస్థకే డిస్టబెన్స్ అట! ఇందులో ఏమంత లాజిక్ వుందో రూల్ పెట్టిన వారికే తెలియాలి! రెసిడెన్షియల్ కళాశాలలో వున్న విద్యార్థుల కోసం బంధువులు ఎలాగూ వస్తారు. పెళ్లైన స్త్రీ చదువుకుంటూ వుంటే... ఆమె భర్త వస్తాడు. దాని వల్ల జరిగే నష్టం, కలిగే ఉపద్రవం ఏంటో అధికారులకే తెలియాలి!
డిగ్రీ స్థాయి రెసిడెన్షియల్ కళాశాలలో పెళ్లైన అమ్మాయిలకు నో ఎంట్రీ అనటం పెద్ద దుమారం ఏం అవ్వకపోవచ్చు. ఎందుకంటే, వివాహితలు కుటుంబ బాధ్యతలకు దూరంగా వుంటూ హాస్టల్స్ లో డిగ్రీ చదవటం అరుదు. కాని, ఏ ఒక్కరో , ఇద్దరో చదవాలనీ అనుకున్నా... వాళ్ల అర్హతలు, తెలివితేటలు పట్టించుకోకుండా... అధికారులు కేవలం వారి మ్యారిటల్ స్టేటస్ చూసి రిజెక్ట్ చేయటం విషాదం! అసంబద్ధం! దీని పై ప్రభుత్వం పునరాలోచించాలి...