ఒక అమరావతి : 6 ప్రపంచ మహానగరాల సమాహారం!
posted on Mar 2, 2017 @ 1:23PM
మరికొన్ని సంవత్సరాల్లో ఇండియా మ్యాప్ కి సరికొత్త హైలైట్ యాడ్ అవ్వబోతోందా? ఖఛ్చితంగా అవుననే చెప్పుకోవాలి! ఎందుకంటే, ఆంధ్రుల నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఎన్నో విశేషణాలతో తయారవుతోంది! ఇప్పటిదాకా ఇండియన్ సిటీస్ అంటే ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైద్రాబాద్... ఇవే చెప్పుకునే వారు! వీటి తరువాత అనేక చిన్న నగరాలు, పట్టణాలు మన దేశంలో వు్న్నాయి. కాని, ఇప్పుడు తెలుగు వారి అమరావతి అద్భుతమే సృష్టించబోతోంది! జరుగుతోన్న ప్రక్రియ గమనిస్తే ప్రపంచ పటంలో భారత్ కు మరో గుర్తింపు చిహ్నం రావటం గ్యారెంటీగా కనిపిస్తోంది....
హైద్రాబాద్ నుంచి అసెంబ్లీ, సచివాలయం మొత్తానికి మొత్తంగా తరలించిన చంద్రబాబు ఇప్పుడు అమరావతి ఆవిష్కరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అత్యాధునిక హంగులతో తయారైన ఏపీ అంసెబ్లీ ఆల్రెడీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాగా త్వరలో రాజధాని అమరావతిని అలంకరించనున్న భారీ నిర్మాణాలు ఆంధ్రుల ఖ్యాతి మరింత పెంచనున్నాయి. ఇందుకోసం అమరావతి నిర్మాణాల్ని డిజైన్ చేయాల్సిందిగా ఆంధ్ర సర్కార్ ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్ నర్స్ ను కోరిన విషయం తెలిసిందే. అందులోని ఆర్కిటెక్ట్స్ ఎంతో శ్రద్ధగా డిజైన్ చేసిన ప్లాన్స్ ఇప్పుడు సీఎం ముందుకు చేరాయి. క్యాబినేట్ లో మంత్రులు కూడా ఆమోదించాక నిర్మాణాలు మొదలవుతాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, అమరావతి నిర్మాణాలు ప్రపంచపు అత్యుత్తమ నగరాల్లోని అతి శ్రేష్ఠమైన అంశాలు పుణికిపుచ్చుకోవటమే!
అమరావతిలో నిర్మించబోయే వాల్డ్ క్లాస్ స్ట్రక్చర్స్ కజక్ స్థాన్ లోని ఆస్తానా నగరంలో వున్న నిర్మాణాల్ని పోలి వుంటాయి. అంతే కాదు, మలేషియాలోని పుత్రజయ నగరం, బ్రెజిల్ లోని బ్రసిలియా నగరం, అమెరికాలోని వాషింగ్టన్ నగరం, బ్రిటన్లోని లండన్, మన న్యూ ఢిల్లీ నగరం... వీటన్నిటిలోని విశేషాలు కూడా అమరావతిలో తొణికిసలాడనున్నాయి! ఇలా ప్రపంచపు అత్యుత్తమ ఆరు నగరాల లక్షణాలు అమరావతిలో అలరించనున్నాయి!
ఇండియాలోని ఆధునిక నగరాలు చాలా తక్కువ. మన మహానగరాలన్నీ వందల ఏళ్ల పురాతనమైనవీ. కొన్నైతే వేల ఏళ్ల చరిత్ర కలిగినవి. కాని, అమరావతి మోడ్రన్ ఇండియాకు సంకేతంగా మోడ్రన్ మెట్రోపోలిస్ గా నిలవనుంది!