ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తం కాకపోతే... ప్రై'వేటు' తప్పదు!
posted on Mar 1, 2017 @ 5:25PM
మరో ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టింది. మరోసారి ప్రాణాలు గాల్లో కలిశాయి. అయితే, దివాకర్ ట్రావెల్స్ టీడీపీ నేతలు దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సోదరులది కావటంతో చర్చంతా రాజకీయ రంగు పులుముకుంది. జగన్ ఎంట్రీతో వ్వవహారం మరింత హీటెక్కింది. అయితే, చనిపోయిన వారి కుటుంబాలకి ఎవరు నష్టం పూడుస్తారు? అది పూడ్చలేనిది. ఎక్స్ గ్రేషియాలు సరిపెట్టలేనిది. వాళ్ల కుటుంబాలు శాశ్వతంగా మనో వేదనకు గురవుతూనే వుంటాయి. అందుకే, ఇప్పుడు జరగాల్సింది రాజకీయ చర్చ కాదు అర్థవంతమైన చర్చ జరగాలి...
మనం సరిగ్గా గమనిస్తే విదేశాల్లో కన్నా మన దగ్గర యాక్సిడెంట్లు ఇబ్బడి ముబ్బడిగా అవుతుంటాయి. అందుకే, ప్రభుత్వాల అలసత్వం ఒక కారణమైతే, వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం మరో కారణం. అంతే కాదు, హైవేలపై జరిగే దారుణమైన యాక్సిడెంట్లలో చాలా వరకూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే మృత్యు శకటాలుగా మారుతుంటాయి. ఆర్టీసీ బస్సులు తక్కువగా ప్రాణాలు తీస్తుంటాయి. ఇక్కడే చాలా సందేశం వుంది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఇద్దరూ చాలా గ్రహించాలి.
గవర్నమెంట్ ప్రైవేట్ బస్సుల మీద ఎలాంటి నియంత్రణ వుంచదనేది మన దగ్గర అందరూ అంగీకరించే నిత్య సత్యం. అధికారంలో వున్నది ఎవరైనా ప్రవేట్ బస్సుల వ్యవహారంలో అందరూ చూసి చూడనట్టే వ్యవహరిస్తారు. అందువల్లే ప్రవేట్ ట్రావెల్స్ తమ ఇష్టానుసారం జనం ప్రాణాలతో ఆటలాడుకుంటాయి. వాటిలో ఎంత ఎక్కుతున్నారు, ఎంత రేటుకు టికెట్స్ అమ్ముకుంటున్నారు, అసలు ఒకే నెంబర్ ప్లేట్ పై ఎక్కువ బస్సులు తిరుగుతున్నాయా... ఇలాంటి బోలెడు ప్రశ్నలు సమాధానాలు లేకుండానే వుండిపోతుంటాయి. ఇప్పటిలా యాక్సిడెంట్స్ జరగగానే ఆర్టీఏ వారి దాడులు కొన్నాళ్లు న్యూస్ పేపర్ల మెయిన్ ఎడిషన్స్ లో, తరువాత జిల్లా ఎడిషన్స్ లో కనిపిస్తాయి. క్రమంగా దాడులన్నీ ఆగిపోతాయి. మళ్లీ ఏదో ఒక బస్సు మరికొన్ని ప్రాణాలు గాల్లో కలిపిస్తేగాని హడావిడి మొదలవదు. దీనికంతటికీ కారణం ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహారాలపై, బస్సులు, డ్రైవర్లపై ఏ గవర్నమెంటూ నిరంతర శ్రద్ధ పెట్టకపోవటం! ఒక నియంత్రణ , నిఘా వ్యవస్థ లేకపోవటం!
ప్రభుత్వాలు చాలా అంశాల్ని పట్టించుకోకపోవటం మన దేశంలో సర్వ సాధారణం. కాని, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులన్నా తమ భద్రతని పట్టించుకోవటం... కనీస ధర్మం. కాని, అలా జరుగుతున్న దాఖలాలు లేవు. శని, ఆదివారాలు వస్తే చాలు ఆర్టీస్ బస్సుల కొరత, సీట్ల లేమి వల్ల చాలా మంది ప్రైవేట్ బస్సులు ఎక్కేస్తుంటారు. అవ్వి తళతళ మెరిసిపోతూ కనిపిస్తున్నాయన్నదే చూస్తారు తప్పా... మిగతా భద్రతా అంశాల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇద్దరు డ్రైవర్స్ వున్నారా లేదా? సదరు ట్రావెల్స్ వాహనాలు గతంలో ఏమైనా యాక్సిడెంట్లకు గురయ్యాయా? ఇలాంటివి ఆలోచించుకునే ఓపికా, తీరికా ఎవ్వరికీ లేదు. అక్కడే ప్రైవేట్ ట్రావెల్స్ వారి ఆటలు హాయిగా నడిచిపోతున్నాయి. ప్రజలు, ప్రభుత్వం రెండు వైపుల నుంచి స్వేచ్ఛగా వదిలేయటంతో హైవేలపై కక్కుర్తి సంపాదన చేస్తున్నారు. అందరూ అలాంటి వారే కాదని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న ప్రవేట్ ట్రావెల్స్ బోలెడు వున్నాయి. వాటి కంటే అధికంగా జనాల ప్రాణాల్ని పణంగా పెట్టి డబ్బులు సంపాదించే ట్రావెల్స్ లు ఎక్కువైపోవటం ఆందోళనకరం!
ఆ మధ్య పాలెంలో తగలబడ్డ బస్సు. ఇప్పుడు వంతెన మీద నుంచి బోల్తా కొట్టిన బస్సు. రేపు మరొకటి. తరువాత ఇంకొకటి. పాలకులు, ప్రయాణికులు ఇద్దరూ అప్రమత్తమైతే తప్ప వీటికి అంతం లేదు.