English | Telugu
రజనీని పీడించిన భూతం
Updated : May 26, 2014
చిత్రపరిశ్రమను వేధిస్తున్న పైరసీ భూతం రజనీకాంత్ విక్రమసింహా చిత్రాన్ని కూడా వెన్నాడింది. పైరసీ తమిళనాడులో మరీ విపరీతంగా సాగుతోంది. ఎంత పెద్ద స్టార్ చిత్రానికైనా పెద్ద విలన్‌గా తయారైంది పైరసీ. ఎంత జాగ్రత్త వహించినా, చట్టాలు ఎన్ని వచ్చినా పైరసీనీ, పైరసీదారులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఎన్నాళ్ల నుంచో రజనీ అభిమానులను ఊరిస్తున్న విక్రమసింహ చిత్రం శుక్రవారం విడుదలయిన సంగతి తెలిసిందే. ఆరు భాషలలో విడుదలైన ఈ చిత్రం తమిళంలో కొచ్చడయాన్ పేరుతో విడుదలైంది.
ఈ చిత్రం అక్కడి థియేటర్ తెరల మీద ప్రదర్శితమై ఒక్క రోజు కూడా పూర్తవకముందే పైరసీ సీడీలు దుకాణాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయం తెలిసిన రజనీ కాంత్ అభిమానులు పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీలు చేపట్టిన పోలీసులు దాదాపు రెండు వేల వరకు పైరసీ సీడీలు స్వాధీనం చేసుకున్నారు. సీడీలు విక్రయిస్తున్న కార్తిక్, మోహన్‌రాజ్ అనే ఇద్దురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. భారీ వ్యయంతో, ఎంతో కష్టపడి నిర్మించిన చిత్రాలకు శాపంలా తయారైన పైరసీని ఎలా ఆపాలో తెలియక దర్శక, నిర్మాతలు తలలు బాదుకుంటున్నారు.