English | Telugu
'ఆదిపురుష్'లో హనుమంతుడిగా నటించిన దేవ్‌దత్త గురించి మీకేమైనా తెలుసా?
Updated : Jun 13, 2023
హనుమంతుడు.. రామాయణ గాథలో అత్యంత కీలక పాత్ర పోషించిన యోధుడు. రామనామ జపంతోటే జీవితాన్నంతా గడిపిన పరమ రామభక్తుడు. సీతారాములతో పాటు అత్యధికులు పూజించే దేవుడు. మనదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం లేని ఊళ్లు ఉండవు కదా! త్రేతాయుగం నాటి హనుమంతుడు ఈ కలియుగంలోనూ జీవించి ఉన్నాడనేది హిందువుల ప్రగాఢ నమ్మకం. ఆయనకు మరణం అనేది లేదనేది వారి విశ్వాసం. అలాంటి ఆంజనేయుడి పాత్రను ప్రభాస్ సినిమా 'ఆదిపురుష్'లో చేసిన దేవ్‌దత్త గజానన్ నాగే అనే నటుడి గురించి అందరూ ఆరా తీస్తున్నారు. 'ఆదిపురుష్' చేసే దాకా మనం ఆ యాక్టర్ పేరు వినివుండలేదు. హిందీ సినిమాల్లోనూ అతను పాపులర్ కాదు. అలాంటి నటుడ్ని ఏరికోరి హనుమంతుడి పాత్రకు డైరెక్టర్ ఓం రౌత్ ఎందుకు తీసుకున్నాడు?
దేవ్‌దత్త నాగే ఒక మరాఠీ నటుడు. మహారాష్ట్రలోని అలీబాగ్‌లో 1981 ఫిబ్రవరి 5న పుట్టాడు. అంటే ఇప్పుడతని వయసు 42 సంవత్సరాలు. బీయస్సీతో పాటు ఎల్ఎల్‌బీ కూడా కంప్లీట్ చేసిన అతను 2010లో కంచన్‌ను పెళ్లిచేసుకున్నాడు. ఆ జంటకు నిహార్ అనే కొడుకున్నాడు. ప్రస్తుతం అతని నివాసం ముంబై. 2011లో హిందీ సీరియల్ 'వీర్ శివాజీ'లో తానాజీ పాత్ర పోషించడం ద్వారా అతను తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించడం గమనార్హం. తర్వాత కాలంలో ఓం రౌత్ తీసిన 'తానాజీ' మూవీలో మరాఠా యోధుడు సూర్యాజీ పాత్రను పోషించడం విధి ఆడిన నాటకం. శివాజీ సైన్యంలో వీరయోధునిగా పేరుపొందిన సూర్యాజీ.. సింహగఢ్ యుద్ధంలో కల్యాణ ద్వారం దగ్గర ముసల్మానులతో వీరోచితంగా పోరాడి వారిని అక్కడే నిలువరించాడు. అలాంటి వీరుని పాత్రను దేవ్‌దత్త నాగే పోషించిన విధానం ప్రేక్షకులతో పాటు విమర్శకుల్నీ ఆకట్టుకుంది.
అదివరకే 'జై మల్హర్', 'డాక్టర్ డాన్' అనే మరాఠీ టీవీ సీరియల్స్‌తో మహరాష్ట్రీయుల హృదయాలకు అతను చేరువయ్యాడు. అజయ్ దేవ్‌గణ్ మూవీ 'వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. 'తానాజీ' మూవీలో సూర్యాజీగా అతడి పర్ఫార్మెన్స్‌కు ఇంప్రెస్ అయిన ఓం రౌత్.. 'ఆదిపురుష్'లో అత్యంత కీలకమైన హనుమాన్ రోల్‌కు ఎంచుకున్నాడు. దాంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే, ప్రపంచవ్యాప్తంగా సినీగోయర్స్ దృష్టిలో పడ్డాడు దేవ్‌దత్త.
హనుమంతుడి పాత్ర చేయడం కోసం శారీరకంగా అతను చాలా కష్టపడ్డాడు. మామూలుగానే అతడిది ఎక్సర్‌సైజ్ బాడీ అయినప్పటికీ చక్కని శరీరాకృతి కోసం బాగా శ్రమించాడు. కండలు పెంచాడు. 2011 నాటికీ, ఇప్పటికీ తన శరీరాకృతిలో వచ్చిన మార్పుల్ని ఫోటోల ద్వారా ఇటీవల అతను బయటపెట్టాడు. ఆసక్తికరమైన నిజమేమంటే 17 సంవత్సరాల వయసులో తొలిసారి అతను వ్యాయామంలో ట్రైనింగ్ తీసుకున్న జిం పేరు హనుమాన్ వ్యాయామశాల. అట్లా హనుమంతుడి పేరుతో అప్పుడే అతనికి అనుబంధం ఏర్పడిందన్న మాట. 'ఆదిపురుష్' మూవీలో లంకా దహనం సన్నివేశంలో కానీ, రామ రావణ యుద్ధంలో కానీ చేసిన పోరాట సన్నివేశాల్ని అతను బాగా ఆస్వాదించాడు.
శ్రీరామ పాత్రధారి ప్రభాస్, సీత పాత్రధారి కృతి సనన్‌తో కలిసి నటించడం దేవ్‌దత్తకు ఇదే తొలిసారి. రావణాసురునిగా చేసిన సైఫ్ అలీ ఖాన్‌తో ఇదివరకే 'తానాజీ' చిత్రంలో కలిసి నటించాడు. 'ఆదిపురుష్' సెట్స్‌పై ప్రతిరోజూ షూటింగ్ మొదలుపెట్టేటప్పుడు యూనిట్ మెంబర్స్ అందరూ 'జై శ్రీరాం' అంటూ జపించేవాళ్లమని అతను చెప్పాడు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమా రిలీజవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఆ రోజునుంచీ హనుమాన్‌గా ప్రేక్షకులు దేవ్‌దత్తకు తమ హృదయాల్లో చెరిగిపోని స్థానం ఇస్తారని చెప్పవచ్చు.